Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవిత చిత్రము

సూర్యుడితో పాటు పరుగు పెట్టడం వల్ల మనిషి జీవితము ఉన్నతంగా ఎదుగుతుంది కానీ మనిషి సోమరితనం వల్ల సమస్యలు వస్తాయి. ఎంత తెలివి ఉన్నా సమయస్ఫూర్తి ఉండాలి. అదే మనిషికి శ్రీ రామ రక్ష. అందుకే చిన్నప్పటీ నుంచి పద్ధతిగా పెంచాలి.

మనిషి నిరంతరం శ్రద్ధగా జీవిత చిత్రాన్ని చిత్రించగల్గినప్పుడే ఉన్నతి సాధించగలడు. దానికి ఎన్నో అడ్డంకులు వస్తాయి. కావాల్సిన వారే విమర్శించి సమస్యలు తెస్తారు. వాటిని ఎదుర్కోవడం మహా కష్టము. బయటి వాళ్ళకి సమాధానం చెపుతాము, కానీ ఇంట్లో మనుష్యులు విశ్లేషణలు వ్యంగ చిత్రాలు భరించడం మహా కష్టం. ఇదే ఊళ్ళో ఎంతో కీర్తి, ఇంట్లో క్షణం క్షణం సమస్యలు. అటువంటి జీవిత చిత్రంలో ముఖ్య వ్యక్తి యశస్వి కిరణ్.

మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి కలిగి ప్రతి పని చాలా చాకచక్యంగా చేస్తాడు. అందుకే ఇంటర్ కాగానే, పెద్ద పత్రికలో సబ్ ఎడిటర్ పోస్ట్‌కి వాళ్ళే పిలిచి అవకాశం ఇచ్చారు. కవితలు అద్భుతంగా రాసేవాడు, చెప్పేవాడు. ప్రతి మాట పద్య రూపంలో రాగ యుక్త పాట రూపంలో చెప్పేవాడు. నోరు విప్పితే అంతా హాస్య పేరడీ రూపంలో ఉండేవి. అతనితో మాట్లాడాలంటే ఎంతో ఆనందం. ఇంకెంతో నాలెడ్జ్ వచ్చేది. అయితే అతను దొరకడం మాట్లాడటం మహా కష్టం. ఖాళీ అసలు ఉండదు.

ఎంతో బిజీ వర్క్. కథ రాయాలన్నా, నవల రాయాలన్నా, ఎంతో ఆనందం. చాలా సబ్జెక్ట్స్ అతని సొంతము. పాండిత్యం, వినయం కలగలిపి ఉంటాయి. ఎంతో మంచితనం, దేశోద్ధారకుడు అని ఇంట్లో వాళ్ళు ముద్దుగా పిలుస్తారు. ఎంతటి సమస్య అయినా ఇట్టే పరిష్కారం చేసి, మంచి సలహా ఇస్తాడు. అంత గొప్ప వ్యక్తి మన యశస్వి కిరణ్.

ఎంతో పెద్ద చదువు చదవ వలసిన యశస్వి సంపాదనలో పడ్డాడు. తండ్రి కూడా “ఎంత చదివినా ఉద్యోగమో, ఉపాధో తప్పదు కనుక నువ్వు ఉద్యోగంలో ఉండి చదువు కొనసాగించి ప్రమోషన్స్ తెచ్చుకో” అని సలహా చెప్పారు.

మగ పిల్లాడు ప్రయోజకుడు అవ్వాలి, ఆడపిల్ల ఎంత చదివినా అత్త ఇంట వెలుగు దీపం అవ్వాలి అంటూ మగ పిల్లాడిని సంపాదనలో పెట్టారు రమణయ్య గారు. ఒక్క కొడుకు, నలుగురు కూతుళ్ళు. ఒక పిల్లని వదినగారి పెంపకానికి ఇచ్చారు. ఆవిడ భర్త మిలట్రీ డాక్టర్. ముగ్గురు కొడుకులు ఉన్నా సరే ఆడపిల్ల కోసం వెంపర్లాట. తల్లికోసం ఆడపిల్ల ఎంతో ప్రేమ చూపుతుంది అంటూ బాధ పడితే రమణయ్య గారు వదిన గారికి ఆఖరు బిడ్డ ఇరవై ఒకటికి ఇచ్చి బారసాల వారినే చెయ్యమన్నారు. ఆయన విశాల హృదయానికి అంతా సంతోషించారు.

రమణయ్య గారు ఒక ప్రయివేట్ కంపెనీలో మేనేజర్. డబ్బుకి లోటు లేదు. ఏదో పెద్దలు ఇచ్చిన ఇల్లు, పొలం ఉన్నది. అయినా ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కదా. ఆయన భార్య అన్నపూర్ణ కొంచెం భాధ పడింది. ఒక్కగానొక్క పిల్లాడు పెద్ద చదువు, పెద్ద ఉద్యోగం చెయ్యాలని కోరిక. అక్క పిల్లలు పెద్ద చదువులు చదువుతారు అని అనుకునేది. కానీ రమణయ్య అంతా. పెద్ద పేపర్ వాళ్ళు పిలిచి ఉద్యోగం ఇచ్చినప్పుడు వద్దనకూడదు అని భార్యను వారించి ఉద్యోగంలో పెట్టాడు.

యశస్వి ఇరువది ఏళ్లకే ఒక ప్రత్యేక పద్ధతిలో రచనలు చేసి ఉన్నత స్థాయికి చేరాడు. ఎందరో మేధావులు అతని రచనలు చూసి ఆనందపడ్డారు. అంతే కాదు కొందరు అతని రచనలు చిత్రాలకు తీసుకున్నారు. మంచి కథలు అని కొన్ని సినిమా సంస్థలు అతన్ని ఆహ్వానించాయి కానీ తండ్రి ఒప్పుకోలేదు. అతని ప్రజ్ఞకు ఎన్నో అవకాశాలు వచ్చినా అవి మెరుపులా మెరిసి, మంచులా కరిగిపోయాయి. మనసులో మబ్బులు మిగిలిపోయాయి కారణం అతని తండ్రి  తల్లి మాత్రం కొడుకు ప్రజ్ఞ చూసి మురిసి పోయేది. అక్కలు ముగ్గురు కూడా తమ్ముడిని ఎంతో ప్రేమగా చూసేవారు.

వాళ్ళు డిగ్రీ కాగానే ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా చేస్తూ పై చదువులు చదివి పీజీలు చేశారు. ఆ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగాలు నచ్చవు. బదిలీ ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది. జీవితమే ఉద్యోగం కాదు జీవితంలో ఉద్యోగం ఒక భాగము అని. ఇంటి పనులు వంట పనులు అన్ని కూడా చక్కగా నేర్చుకోవాలి, మంచి పేరు కళలో తెచ్చుకోవాలి, ఆడపిల్లలు కూడా చక్కగా చదువుకుని మంచి భవిష్యత్ ఏర్పరచుకున్నారు.

పెద్ద పిల్ల కావ్య లహరి మేనత్త కొడుకుని పెళ్లి చేసుకుంది. ఒక విధంగా రెండు కుటుంబాలు ఇష్టపడి చేసుకున్నారు. ఆడపిల్ల ఎంత చదివినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, పెళ్లి తప్పదు. అత్త ఇంట మాట పడ్డం తప్పదు. ఇది తరతరాల ఆచారంగా మిగిలిపోయింది.

రమణయ్య ఉద్యోగ రీత్యా తల్లిని అక్క దగ్గర ఉంచి మద్రాస్, హైదరాబాద్, విజయవాడ, కలకత్తాలలో ఉండేవాడు. మధ్యలో క్యాంపులు. దానితో అన్నపూర్ణకి పిల్లల పెంపకం సరిపోయేది. ఇంకా నయం పిల్లలు కొంచెం జ్ఞానం వచ్చాక తల్లి వెనకాల చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండేవారు.

దానితో రమణయ్య క్యాంపులు మానేసి ఉన్న చోటే చేస్తాను, లేదంటే రిజైన్ చేస్తాను అనేవాడు. అన్నపూర్ణ మాత్రం ఉద్యోగం వదలద్దు అనేది. ఎలాగో పిల్లలు గట్టెక్కిపోయారు. అందరూ పిజిలు చేశారు.

రెండో పిల్ల పెళ్లికి మహా తంటాలు పడ్డారు. అప్పటికే పిజి చేసి ప్రైవేట్ కాలేజిలో లెక్కలు అధ్యాపకురాలిగా చేస్తోంది. తెల్లగా పిల్ల బాగానే ఉంటుంది. అంతెందుకు ఇంట్లో అందరూ రూపసులే అని చెప్పాలి. అయితే పెద్ద ఉద్యోగస్తులకు భార్య ఉద్యోగం అవసరం లేదు. చిన్న ఉద్యోగస్తులు వ్యాపారులను చేసేందుకు ఇష్టత లేదు. అలా రెండో పిల్ల కౌసల్య పెళ్లి పోస్ట్‌పోన్ అవుతోంది. జాతకాలు, గ్రహాలు అన్ని చూసి మరీ చేస్తారు. కొంచెం సంఖ్య శాస్త్రం, జాతక శాస్త్రంలో ప్రవేశం ఉన్న రమణయ్య గారికి అన్ని లోపలే కనిపిస్తాయి. అయితే మంచి జాతకులు రావడం లేదు అని బాధ పడేవారు. ఇంకా పెద్ద జాతకుల దగ్గరికి వెళ్లి చూపించి సలహాలు తీసుకునేవారు. ఇది ఇంట్లో నచ్చేది కాదు, ఎందుకంటే సంపూర్ణ జాతకం ఎవరూ చెప్పలేరు. ఏదో గ్రహ మైత్రి, మరీ నైధన తార, విపత్తు తార కాకపోతే చేసేయ్య వచ్చును.

యశస్వి కూడా కొంత అలవాటు చేసుకున్నాడు, తారాబలం చూడటం వచ్చు. ప్రెస్‌కి వచ్చిన పంచాంగంలో అన్ని చూసి పరిశీలించి ఓకే చెయ్యడంలో కూడా బాగా ప్రవేశం వచ్చింది. అందుకు కొన్ని సంబంధాలు తనే ఒప్పుకోడం లేదు.

అక్క పెళ్లి అయితే గాని పెళ్లి వద్దు అనుకున్నాడు. పెళ్ళీడు పిల్లలు ఇంట్లో ఉంటే వచ్చిన పిల్లకి వంకలు పెడతారు. జీవితం సజావుగా సాగనివ్వరు. తను ఎన్ని సీరియల్స్‌లో, స్క్రీన్ ప్లే రాశాడు, అన్ని తెలిసి తన భార్యను తన ఇంటిలో సమస్యలకి బానిస చెయ్యకూడదు అని విశాల దృక్పథంతో ఆలోచించాడు.

రెండో పిల్ల జాతకం ఆర్థికంగా బాగుంది, పిల్లలు ఉండరు అని ఒక జ్యోతిష్కుడు చెప్పాడు. పోనీలే మంచి భర్త అయితే చాలు, ఈ రోజుల్లో ఒన్ ఆర్ నన్ అనే సామెత వచ్చింది కదా, హాయిగా పెద్ద ఉద్యోగస్థుడుని చేస్తే చాలు అంటూ పట్టు పట్టి ఒక సంబంధం ఆరు ఏళ్ళు పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగి రైలు పట్టాలు అరిగి పోయేలా చేసి పెళ్లి కుదుర్చుకోవడం జరిగింది.

డెబ్బయి యోగాల పెళ్లి చేశారు. వాళ్ళ స్నేహితుల పిల్లలకి, ఆడబాగుచుల పిల్లలకి కూడా వేయ్యేసి ఖరీదు బట్టలు పెట్టారు, పెడుతున్నారు కదా అని మరి లేకిగా అంతా ఖరీదు కావాలి ఇంత ఖరీదు కావాలని మగ పెళ్లి వారు అడగటం కూడా పద్దతి కాదు. పిల్ల పదేళ్ల నుంచి ఉద్యోగం చేస్తోంది బాగానే సంపాదించింది అంటూ కొన్ని అక్కరలేని లాంఛనాలు కూడా అడిగి మరీ పుచ్చుకున్నారు.

ఇంకా ఏడాది పోతే కానీ మూడో అక్క పెళ్లి విషయం ఎత్త లేదు. మూడో అమ్మాయి కోమలి నిజంగానే కోమలంగా ఉంటుంది. అతి సున్నితం. చిన్న విషయానికి కూడా ఆకులా అల్లాడిపోతుంది. హోమ్ సైన్స్ బిఎస్‌సి చదివింది. మంచి వంటలు, గృహ అలంకరణలు అన్ని వచ్చు. కానీ ఏ పని చెయ్యదు. మహా బద్దకం. కబుర్లు చెపుతుంది. వంకలు ఎదుటివారికి బాగా పెడుతుంది. ఆత్మస్తుతి, పరనింద ఎక్కువ. అయినా ఉన్న వాళ్ళల్లో ఆఖరి పిల్ల కదా. సమయం అంతా ఏదో పని ఉన్నట్లు బిజీ బిజీగా గడుపుతుంది. ఫోన్ లోనే ఎక్కువ సమయం గడుపుతుంది. ఇంట్లో ఎవరూ ఏమీ అనరు. తల్లి తండ్రి తమ్ముడు అంతా అక్క పెత్తనం ఎవరూ ఎదురు చెప్పకూడదు. చెప్పారా, ఆ రోజు ఇంట్లో కురుక్షేత్రం జరుగుతుంది.

ఆమె శ్రీ కృష్ణుడి వారసురాలు. ఇంట్లో అంతా అర్జునుని మాదిరిగా విని తీరాలి. అందుకే ఈ తిక్క అక్క పెళ్లి అయ్యేదాకా తను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు యశస్వి. చేసుకున్నాడా, మూడో నెలకే ఆ పిల్లని పంపిస్తుంది. వద్దు అంటే తల్లి మాట కూడా వినదు. ఇంట్లో పువ్వులు, కూరలు అన్ని తన ఇష్ట ప్రకారమే జరగాలి. అమె ఒక రూపాయి ఇంట్లోకి తెస్తే పది రూపాయలు తల్లి దగ్గర పుచ్చుకుంటూ ఉంటుంది. అందుకు తల్లి ఈ పిల్లకి సరి అయిన సంబంధం చెయ్యాలి, లేకపోతే, మూడో రోజే అత్తింటి నుండి వచ్చి కూర్చుంటుంది అనేది. ఒక ప్రైవేట్ స్కూల్‌లో చేరి జాబ్ చేస్తోంది. కుట్లు అల్లికలు నేర్పిస్తుంది. ఏదో ఇంట్లో ఖాళీగా ఉండి వేధించకుండా ఉద్యోగానికి వెడుతుంది. పోని ఇంటిపని సవ్యంగా చేస్తుందా అంటే అదీ లేదు, అందుకని బయటి ఉద్యోగం నయం అనుకున్నారు.

మూడో పిల్ల పెళ్లి ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తున్నాడు. పిల్లాడికి పెళ్లి అంటే ఎన్ని సంబంధాలు చూసినా కోమలికి కుదరడం లేదు, యశస్వికి నచ్చడం లేదు. వీళ్ళు ఇద్దరు ఇలా ఉంటే ఎలా? ఏదో ఒకటి కుదిర్చి చెయ్యమని రెండో అక్క సంబంధాలు తెస్తోంది. తన కొలీగ్ తమ్ముడిని చూసి చెపితే అతను బ్యాంక్ మానేజర్. ఐదుగురు అక్కలకి పెళ్ళిళ్ళు చేశాడు. తల్లి తండ్రి వృద్ధులు. పెద్ద అన్నగారు విదేశీ పిల్లను పెళ్లి చేసుకుని ఏనాడో అక్కడే సెటిల్ అయ్యాడు.

పిల్లలు ఎదగడం అంటే తల్లి తండ్రులని కుటుంబాలని వదిలి వెళ్లి పోవడమే. మళ్లీ వెనుక చూపు ఉండదు. ఇది నేటి తరం పద్దతి. ఎవడో ఒకడు కుటుంబాన్ని పట్టించుకోవాలి.

ఈ సంబంధానికి అన్నపూర్ణ భయపడింది. తన కూతురు కాబోయే అత్తగారిని చూడటానికి ఆడపడుచుల కుటుంబాలు ఒక్కసారి వస్తే? కుటుంబానికి ఇద్దరు పిల్లలు భార్య భర్త కలిపి నలుగురు. ఈ లెక్క ఐదు నాలుగులు ఇరవై మందీ వస్తారు. వాళ్ళని ఆదరించ వద్దా? కనీసం వంట మనిషి కలిపిన కాఫీ టిఫిన్ అయినా తెచ్చి టేబుల్ పై పెట్టాలి. అమ్మో నా కూతురు చెయ్యలేదు, నేను మాట పడాలి. దీనికి పెళ్లి చేస్తే ఒక్క కొడుకు ఓ కూతురు ఉన్న వాళ్లకి చెయ్యాలి అనుకున్నది. ఇదే మాట కూతురు అల్లుడితో అంటే “భలే వారే. అత్తగారు మామగారు అలాంటి సంబంధం దొరకవద్దా?” అని నవ్వి, పెళ్లి రాసి ఉంటే అదే అవుతుంది అన్నారు. అలా ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో వంకతో వెళ్లి పోతున్నాయి.

***

యశస్వి తన జాబ్‌లో ఎంతో ఎదిగాడు. ఒక ఛానెల్ ఇంటర్వ్యూకి పిలిచారు. అందులో అతని సమాధానాలు విని ఆ సంస్థ వారు వల్ల ఛానెల్‌లో వేరే విభాగానికి సంబంధించి పెద్ద పోస్ట్ ఇచ్చారు. ఇందులో అనుభవం బట్టి సిఈఓగా రెండు ఏళ్లల్లో ప్రమోషన్ ఇస్తామన్నారు. ఇంక మన యశస్వి అదృష్టం.. బూరెల బుట్టలో పడిందని అక్కలు సంతోషించారు.

మేనమామ వచ్చి తన కూతురును చేసుకోమని పట్టుబట్టాడు. సంబంధాలు రాక మానలేదు; పిల్ల కోసం ఆగాము అన్నారు. “అది పెళ్లి చేసుకోదు, దాని కోసం నా కూతుర్ని ఎంత కాలంగా పెళ్లి చెయ్యకుండా ఉంచమంటావు?” అన్నాడు

“ఒరే నాపై నిష్ఠూరం వద్దు. వాడి కన్నా అది పదిహేనేళ్లు చిన్నది. నా మనుమరాలు ఉన్నది. దానికి పదహారేళ్లు, అమ్మాయి దెబ్బలాడుతుంది. వాడు ఎదిగాడు కనుక ఇవ్వాళ నా గుమ్మం తొక్కారు అంతా. లేకపోతే ఎవరు సంబంధం చెప్తారు వాడికి? పెద్ద చదువు, ఇంజినీర్, డాక్టర్ కాడని వాడికి ఈడు అయిన పిల్లలు ఇద్దరినీ బయట చేశావు” అని అన్నపూర్ణ తమ్ముడికి బాగా సర్ఫ్ వాష్ చేసింది. ఇంకా కోమలి అయితే సరేసరి మామయ్య పెళ్లి విషయం ఎత్త గానే అంతా ఎత్తు ఎగిరింది. “వాడికన్న పెద్ద దాన్ని పెళ్లికి ఉన్నాను. నీ కూతురు సహస్ర చిన్నది. సరి అయిన చదువు లేదు. పెళ్లి ఇప్పుడే ఎందుకు? చదువు పూర్తి కానియ్” అన్నది. “దానికి చదువు అంటదు, ఇప్పటికీ మూడు సార్లు ఇంటర్ తప్పింది. కుట్టు నేర్పిస్తాను, సంగీతం నేర్పిస్తాను” అన్నాడు. “సంగీతం కుట్లు కూడు గుడ్డ పెట్టవు, అవి ఎందుకు?” అన్నది.

“ఆ సంపాదన అవసరం లేదు కనుక నీ తమ్ముడికి పెళ్లి చేస్తాను అన్నాను. నువ్వు చేసేది కుట్లు అల్లికలు జాబ్ కదా, అయినా నా కూతురు కచేరీలు ఏమి స్టేజ్ ఎక్కి చెయ్యదు. నీ తమ్ముడిని ఏమీ వాడి ఛానెల్‌లో కార్యక్రమాలు ఇప్పించమనదు. కాలక్షేపం కోసం చెప్పిస్తున్నాను. కావలసిన కట్నం ఇస్తాను. గుమ్మంలోకి వచ్చిన వరం కాశీ వెళ్ళినా దొరకదు” అని గట్టిగా చెప్పాడు. కానీ తల్లి, కూతురు ఒప్పుకోలేదు.

“బావగారు ఏమంటారు? ఒరే అల్లుడూ, నీ ఉద్దేశం ఇదేనా?” అన్నాడు

“మామయ్య నీకు తెలుసుగా, నేను అక్కల కోసం నా జీవితం అంకితం చేశాను. దాని పెళ్లి ఎప్పుడు అయితే అప్పుడు నా పెళ్లి. ఎవరు రాసి ఉంటే వాళ్ళు అవుతారు” అన్నాడు యశస్వి.

“ఒరే నీ కిప్పుడు పెళ్లి విలువ తెలియదు. వంట మనిషి వండుతుంది, మీ అమ్మ వడ్డిస్తుంది, పనిమనిషి పని చేసి వెడుతుంది. మీ నాన్నకి జాతకాలు కుదరవు. మీ అక్కకి సంబంధాలు నచ్చవు, మీ అమ్మ కూతురు వల్ల మాట పడాలని పెళ్లి సంబంధాలు వంకలు వెతుక్కుంటుంది. బయటి పిల్లలు ఎవరు నీ ఇంటి పద్ధతులకు ఉండలేరు, నా పిల్లను కనుక చేస్తానన్నాను. ఏమి మీ ఇంట్లో మాత్రం పదహారు కప్పులు కలపవద్దా? ఏ పిల్ల వచ్చినా ఇలా వాళ్ళు ఆలోచిస్తారు పెళ్లి కాని పిల్ల ఉంటే ఎవరూ పెళ్లి చెయ్యరు, బాధలు ఉంటాయి. భార్య భర్తను సమంగా ఉండనివ్వరు, ఏదో ఒక వంక పెడతారు” అంటూ విసుక్కుని వెళ్లిపోయాడు.

ఆ తరువాత రెండు నెలలకి ఉర్లోనే ఒక సంబంధం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగము. అతనికి అక్క ఒకామె ఉన్నది. తమ్ముడు పెళ్లి చెయ్యాలి కానీ ఆ సంబంధం కుదిర్చి చేశారు. మరిది వేరే ఊళ్ళో ఉద్యోగం. ఏదో వాడి పెళ్లి చేస్తే కూతురు బాధ్యత ఉండదు అనుకున్నది అన్నపూర్ణ. నిజానికి ఈ ప్రపంచంలో వారి ఆడపిల్లల గురించి ఆలోచిస్తారు, కానీ వచ్చే పిల్లకి వీళ్ళు అంతే అనుకోరు. మేము ఎంతో మంచి వాళ్ళం అంటూ పబ్లిసిటీ కబుర్లు చెపుతారు. ఆడపిల్లల పెళ్ళిళ్ళు అయ్యాయి, ఇంకా యశస్వికి లైన్ క్లియర్ అయ్యింది.

మళ్లీ మేనమామ వచ్చి పెళ్లి చేసుకోమని కూర్చున్నాడు. ఈ విషయం తెలిసిన అక్కయ్య కూడా తన పిల్లను చేసుకోమన్నది. తల్లి తండ్రి మాత్రం “ఆడపిల్లల కోసం నీ జీవితం అంతా త్యాగం అయ్యింది. మేమునిద్దరం బ్రతికి ఉండగా పెళ్లి చేసుకోరా” అంటూ మొదలు పెట్టారు. మళ్ళీ తండ్రి జాతకాలు ముహూర్తాలు అన్నాడు.

ఈసారి యశస్వి వారి మాటను పక్కను పెట్టాడు. తన ఫ్రెండ్ చెల్లెలు ఉన్నది, ఆమెను వాడు ఏనాడో చెప్పాడు. కానీ ఇంట్లో పెళ్లికాని అక్కలు ఉన్నారు, ఏమి సమస్యలు వస్తాయో అని ఆలోచించి ఊరుకున్నాడు. అప్పటికీ, “వేరే ఉండవచ్చును కదా నీ జీవితం వాళ్ళ కోసం  లంకె పెడితే ఎలా? మీ అమ్మ నాన్న చూసుకుంటారు” అన్నాడు కానీ తన ఇంటి మనుష్యుల పెంకితనం, పట్టుదల యశస్వికి తెలుసు. అంతెందుకు తను అపర చాణక్యుడే కదా, అందుకే చిన్నతనంలోనే పెద్దగా అలోచించి ఉద్యోగంలో ఎదిగాడు.

ఒకసారి తన విజయవాడ ఫ్రెండ్ జ్ఞాపకం వచ్చాడు. వెంటనే నంబర్ తీసి “నీ చెల్లి పెళ్లి అయ్యిందా లేదా?” అన్నాడు. “ఏమిటిరా? ఇంతకాలం నేను పెళ్లి చెయ్యకుండా ఉంటానా? అన్నగా దాని పెళ్లి చేసి నా పెళ్లి చేసుకున్నా. ఇన్నాళ్ళకి పెళ్లి జ్ఞాపకం వచ్చిందా?” అని నవ్వాడు అతను. “మీ  అమ్మ నాన్న ఇప్పుడు పర్మిషన్ ఇచ్చారా?” అడిగాడు. “వాళ్ళు ఎప్పుడో చేసుకోమన్నారు, కానీ నేను ఇంటి పరిస్థితులను బట్టి ఇలా ఉండిపోయాను” అన్నాడు యశస్వి.

“సరే మంచి పిల్ల ఉంటే చెపుతాను. అయినా నా పిన్ని కూతురు రూపవల్లి ఉన్నది. అది ఆప్పట్లో కుటుంబ బాధ్యతలు చూసేది. ఆ పిల్ల లేకపోతే మా పిన్నికి గడవదు. వంట మనిషి, పని మనిషి అంతా ఉన్నా సరే, దానికి గడవదు. నేను ఎన్నో సార్లు సంబంధాలు తెచ్చాను. ఒరే అన్నయ్యా, అవతలి వాళ్ళు తల్లి బాధ్యత అంటే చేసుకోరు. నీతో పాటు నీ తల్లి సారే నీ తల్లిని చంకన పెట్టుకుని తిరుగుతావా పుట్టింటికి అత్తింటికి అని వ్యంగ్యంగా ఇద్దరు ముగ్గురు అన్నారు. అందుకే నా తల్లిని ఎవరూ చూస్తే వారిని చేసుకుంటాను అన్నది.” అంటూ ఆ మాట యశస్వితో చెప్పాడతను.

“సరే మా అమ్మ నాన్నకి తోడు ఆవిడ ఇంట్లో ఉంటుంది. ఆవిడ అస్తి ఆవిడకి ఉటుంది. నీ సొమ్ముతో పని లేదు అని కూడా అన్నారు” అని అన్నాడు

“ఒకసారి నువ్వు రా అన్ని చూసి మాట్లాడ వచ్చును” అన్నాడు

సరే అని యశస్వి ఆఫీస్ పని అంటూ బయలుదేరి వెళ్ళాడు. ఆ రోజు ఆదివారం ఫ్రెండ్ ఇంట్లో దిగాడు. చిన్ననాటి స్నేహితుడు భగవాన్ క్షేమ సమాచారాలు అడిగారు. అంతా బాగున్నారు, వాళ్ళ చెల్లెలు కెనడాలో ఉన్నదని ఆల్బమ్ చూపించాడు. చాలా చక్కగా చిన్నప్పటి అందంతోనే ఉన్నది, ఇంకా బాగుందని చెప్పాలి.

సరే పదిగంటల ప్రాంతంలో వాళ్ళ పిన్ని ఇంటికి కార్లో తీసుకు వెళ్ళాడు. తల్లి వృద్ధురాలు. పిల్ల అన్ని బాధ్యతలు చూస్తుంది అప్పుడప్పుడు వచ్చి తన ఫ్రెండ్ భగవాన్ చూస్తున్నాడు.

కాలింగ్ బెల్ నొక్కాడు. ఓ పాతికేళ్ళ అమ్మాయి వచ్చి తలుపు తీసింది. అమె కూర్చోమని చెప్పింది. లోపలికి వెళ్ళి ఇడ్లీ, వడ చెట్ని ఖర్జూరం హల్వా తెచ్చి టేబుల్ పై పెట్టే తినమన్నది.

“ఒరే తినరా” అంటూ భగవాన్ ప్లేటు అందించాడు. వాడింట్లో కాఫీ తాగి దుర్ముహూర్తం రాకుండా బయలు దేరారు. అందుకు టిఫిన్ ఇక్కడ ఏర్పాటు చేశారు.

టిఫిన్ పూర్తి అయ్యాక భగవాన్ “పిన్ని ఇలారా” అన్నాడు. లోపలి నుంచి ఒక డెబ్భై ఏళ్ల ఆవిడ ఖరీదైన షాల్ కప్పుకుని నెమ్మదిగా వచ్చింది. పెళ్ళికొడుకు అని చెప్పి చూడమని, మాట్లాడమని చెప్పాడు.

“నాకు సందేహం లేదు, నువ్వు తెచ్చావు. పిల్లని బాగా చూడాలి. నేను దానికి తప్పను. కానీ నాకు ఎక్కడ వాతావరణం పడదు. పెళ్లి అయినా పిల్ల నా దగ్గరే ఉండాలి. మీరు వచ్చి వెడుతూ ఉండాలి. ఇక్కడ వంట మనిషిని పెట్టుకుని ఉంటాను. మీ అమ్మ గారికి నాన్న గారికి ఇష్టం అయితే చేసుకోండి” అని చెప్పింది

ఇంతకీ పెళ్లి కూతురు ఎవరూ? అని సందేహంలో ఉన్నాడు యశస్వి.

ఇల్లంతా చాలా నీట్ గా ఉన్నది. అమె ఆర్టిస్ట్ కనుక ఇంటి నిండా మొమెంటోలు ఉన్నాయి. ఎక్కడి కక్కడ గృహ అలంకరణపై ఎన్నో అందాలు ఆరబోసిన రీతిలో అంశాలు రాసేది. అంతే కాదు జాతీయ స్థాయిలో బహుమతులు పొందింది.

“ఈమె నా చెల్లెలు రూపవల్లి” అన్నాడు.  సన్నగా నాజూకుగా కళ ఉట్టి పడుతూ ఉన్నది

‘అబ్బ ఎప్పుడో పదిహేను ఏళ్ళ క్రితం ఫోటో చూశాను, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఆమెను చూడకుండానే అమె కళను అభినందించేవాడిని. కానీ అప్పుడు పెళ్లి చేసుకుంటే ఇలాంటి పిల్లను చేసుకుంటే మా అమ్మకి తగ్గ మంచి కోడలు అనుకున్నా, కానీ కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ పదవి ఉన్నతిలో కుటుంబ జీవితము మరుగున పడింది. కానీ విధిరాత, మరల ఆ పిల్ల దగ్గరికే వచ్చింది’ అనుకుని; “నాకు ఒకే అండీ. మా అమ్మ నాన్నని తెస్తాను” అని లేచాడు.

“మీ ఇల్లు చాలా బాగుంది. మీరు మంచి పేరున్న కళాకారిణి అని కూడా తెలుస్తోంది” అని తన అంగీకారం తెలిపాడు. చిన్నగా నవ్వి ఊరుకుంది. తను పెయింట్ చేసిన చిత్రాన్ని బహుమతిగా ఇచ్చింది. “మంచివాడు మా అన్నయ్య” అన్నది. అదే అమె మాట్లాడిన మాట. అంతకు మించి ఏమీ అడగలేదు.

ఆ తరువాత వారం ఇంటిల్లిపాదిని పెద్ద సుమోలో తెచ్చి హోటల్లో ఉండి పెళ్లి చూపులు చూసుకుని వచ్చారు. ముహూర్తం కుదర్చను తండ్రి అయితే ఒప్పుకోడని వేరే సిద్ధాంతిని పిలిచారు. అన్నపూర్ణకి అంతగా ఇష్టం లేదు. వియ్యపురాలిని చూడాలని బాధ! ఇల్లు అంతా చూసి “ఇది ఇల్లా స్టూడియోనా?” అన్నది. అందులో ‘ఈ పిల్ల ఇంటి పనులు ఏమి చేస్తుంది’ అనే వ్యంగం ధ్వనించింది. కానీ యశస్వి ఇష్టపడి తన పదిహేను ఏళ్ళ నాటి కల నిజమైనందుకు సంతోషించి పెళ్లికి ముహూర్తం పెట్టించాడు.

పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన వినిపిస్తోంది సెల్ ఫోన్ లోంచి. పెళ్లికి తాంబూలాలు మార్చుకున్నారు. అవతలి తరుపు నుంచి భగవాన్ ముఖ్య పాత్ర వహించి పెళ్లి చేశాడు. విధి చాలా చిత్రమైనది. ఎప్పుడు కళ్యాణ గడియ వస్తుందో ఎవరూ చెప్పలేరు. యశస్వి కిరణ్ అక్కలు మాత్రం నోటితో వద్దు అంటూ చేతితో లాంఛనాలు ఘనంగా అందుకున్నారు. మరి అంతే కదండీ, ఇంటి అడబడుచులని సంతృప్తి పరచాలి. అయితే మనింటీ ఆడపిల్ల ఎంతో ఎదురింటి ఆడపిల్ల అంతే అనే భావన అత్త ఇంట ఉండాలి. జీవిత చిత్రము అంతా ఆడపిల్లకి అత్త ఇంటే కదా!

ఈ ప్రపంచంలో కొందరు వృత్తికి ప్రాముఖ్యతనిస్తారు. వారికి ఎంత స్తోమత ఉన్నా ఆడామగా కష్టపడి తమకంటూ ఒక వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవాలి. కొందరు ఉద్యోగ బాధ్యతల వల్ల కుటుంబంలో వివాహాది శుభకార్యాలు సకాలంలో చెయ్యలేరు. దీన్ని విధి అనాలా, కుటుంబ పరిస్థితులు అనాలా? లేక వారికి నచ్చక అనాలా? జాతక గ్రహాలు అనాలా చెప్పండి.

ఎంతో ప్రతిభ ఉన్న యశస్వి లాంటి ఎందరో యువకులు కుటుంబాల కోసం తమ జీవితాన్ని అంకితం చేసి అక్కల చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తల్లి తండ్రులు వంకలు పెడుతూ శాఖలు గోత్రాలు జాతకాలు సంఖ్య శాస్త్రం అంటూ రాసి పెట్టనదేదో అదే అవుతుంది అంటూ వేదాంతం చెపుతారు. కొందరు పరుగులు పెట్టి అలసిపోయి విధి రాత అంటారు. మరి కొందరు అబ్బే మీకు తెలివి లేదు, సత్తా లేని మనుష్యులు అందుకే ఎవరూ నచ్చరని అంటారు. ఇంకొందరు కార్యశూరులు. వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావించి ముందుకు సాగిపోతారు. ఏది ఏమైనా అవకాశం గొప్పది. ఆ వచ్చిన అవకాశాన్ని అదృష్టంగా మలుచుకున్న వారే ఘనులు.

కొందరు సంపాదన తక్కువ ఉన్నా పెళ్లి పిల్లలు అంటారు. ఎవరి పద్ధతి వారిది. కానీ జీవన చిత్రం అనేది మన ఆలోచనలో కాక పరిస్థితులకి అనుకూలంగా జీవిత చిత్రాన్ని మార్చుకోగలిగిన వారికి అదృష్టం అద్భుతంగా సహకరించి, ఉన్నత కీర్తి ప్రతిష్ఠలనిస్తుంది. దీనికి ఎందరో ప్రముఖుల జీవిత చిత్రాలు ఆదర్శం కూడా.

రూపవల్లి ఆనందంగా అత్తింటి అడుగు పెట్టింది. చుట్టు పట్ల వారిని పిలిచి అత్త గారు ఘనంగా స్వీట్స్ పంచి పెట్టంది. కోడలు గొప్ప చెప్పింది. అన్ని అయ్యాక ఆఖరు ఆడపడుచు కోమలి వచ్చి, “వదినా నువ్వు మీ పుట్టింటి పద్ధతులు కాక మా ఇంటి ఆచారాలు పాటించాలి” అని చెప్పింది. రూప నిశ్శబ్దంగా విన్నది. తరువాత పెద్ద ఆడపడుచు వచ్చి “నువ్వు పంజాబీ డ్రస్సులు, నైటీలు, జీన్ ప్యాంటులు, మోడరన్ బ్లౌజ్‌లు వేసుకోకూడదు” అన్నది. “అవును కదా” అంటూ రెండో అక్క, తల్లి వత్తాసు పలికారు. అంటే ఏమిటి? ఆడపిల్ల అత్తింటికి వారసురాలు, అందుకని ఆ ఇంటి పద్దతులు నేర్వాలి.

అదే విధంగా ఫ్యాషన్ చీరలు, పలుచని చీరలు కుదరవు అంటూ ఆ ఇంటి ఆడపిల్లలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా హిత బోధ చేశారు. “మా అమ్మ నిజంగా అన్నపూర్ణ. ఇంటికి ఎవరూ వచ్చినా ఏ టైమ్‌లో వచ్చినా లేదనకుండా భోజనం వండి పెట్టాలి. తెలిసిందా? మా ఇంట్లో అన్నదానం ఎప్పుడు ఉంటుంది” అన్నారు.

“పుట్టిన రోజులు పెళ్లి రోజులు అట్టహసంగా చెయ్యకూడదు. భారతీయ పద్ధతులు మాత్రమే పాటించాలి. న్యూ ఇయర్ వస్తోంది. మా వాడికి ఘనంగా కేక్‌లు శుభాకాంక్షలు వస్తాయి. అందరికీ నువ్వు పట్టుకెళ్ళి కాఫీలు ఇవ్వక్కర లేదు. వాడు పార్టీ ఆఫీస్‌లో చేసుకుంటాడు, తెలిసిందా? మా ఇంటి కోడలిగా నీ పేరు నిలబెట్టుకోవడం నీకు మాకు మంచిది. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో అత్త ఇంటి పద్దతులు అచరించి గౌరవ ప్రతిష్ఠలు నిలుపడం కోడలు బాధ్యతలు. మీ అమ్మ చెప్పిందో లేదో మా అమ్మ మాట విను” అన్నారు ఆడపడుచులు.

యశస్వికి ఈ విషయాలు తెలియవు. రూపవల్లి లాంటి స్త్రీలు పెద్దలకు అత్త ఇంటికి గౌరవం ఇస్తారు. అందుకే ఈ విషయమంతా సీరియస్‌గా తీసుకోలేదు, భర్తకి చెప్పలేదు. చెప్పినా ఏమనగలడు?

తల్లి మాటలకి ఎదురు చెప్పలేని వ్యక్తి. అందుకే కుటుంబంలో పరిస్థితులు చూసి చిన్న వయస్సులో పెళ్లి చేసుకోలేదు. పరాయి ఇంటి నుంచి వచ్చిన పిల్లను మనసు నొచ్చుకోకుండా చూడాలి. అయినా నాన్న అమ్మ అక్క చెల్లెళ్ళు సూక్తి ముక్తావళి చెపుతారని తెలుసు. అలాగని వాళ్ళని ఏమీ అనలేడు. రూపవల్లి తనను నమ్మి వచ్చింది. పెళ్లి రెండు కుటుంబాల వారధి, సారథి. కనుక తను అత్తగారికి న్యాయం చేయాలి. భార్యకు ఎంతో మంచి జీవితం ఇవ్వాలి అని అనుకున్నాడు యశస్వి.

ఇప్పటికే తన పెళ్లి గురించి ఇంట్లో ఎన్నో రకాల కథలు మొదలు. కథలు రాసే వారి కోసం మళ్లీ ఎన్నో కథలు.

మామయ్య, అక్క – రూపవల్లి అదృష్టానికి తెగ ఈర్ష్య పడుతున్నారు. కానీ ‘విధి ఎంతో మంచిది, గొప్పది. మనకు మేలు చేస్తుంది’ అని నమ్మిన వారికి విజయం తప్పక జీవిత చిత్రంలో వరిస్తుంది.

Exit mobile version