Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవిత మజిలీలో..

[శ్రీమతి ఏ. అన్నపూర్ణ రచించిన ‘జీవిత మజిలీలో..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

సాయం సంధ్యలో
సాగరతీరసైకతాలలో
అడుగులు వేస్తుంటే
ఆనాటి బాల్యం నన్ను పలకరించింది
చిలిపితలపుల తలపులు తెరిచింది
పున్నమివెన్నెలలో
తుళ్ళిపడే అలలతో పోటీపడుతూ
చేయి చేయి కలిపి
పరుగులు తీసిన
రోజులు గుర్తుకువస్తున్నాయి
ఇంట్లో పెద్దవాళ్లకు చెప్పకుండా
క్లాసులు ఎగ్గొట్టి సినిమాలు చూసిన రోజులు
లంచిబాక్సులో తెచ్చుకున్న
తినుబండారాలు పంచుకుని తిన్న రోజులు
ఇసుకలో పిచ్చుకగూళ్లు కట్టి
వాటికీ చేసిన అలంకారాలు
మాటలో చెప్పలేని మూగబాసలు
కళ్ళతో చేసుకున్న సైగలు
మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి
పెరటిలో చెట్లపై ఊగిన
ఊయల సరాగాలు
ఆకాశంలో ఎగిరే పక్షుల్లా
నింగిని తాకాలని ఆశలు ఎన్నెన్నో
చిటపట చినుకుల ధారలతో
కాలువకట్టిన నీటిప్రవాహాల్లో
కాగితపు పడవలుచేసి
ఆడుకున్న ఆటలు
బాల్యస్మృతుల మధుర జ్ఞాపకాలే
అందరికి అపురూపాలు
నియమ నిబంధనలు వుండవు
ఆడామగా తేడాలుండవు
ఆంక్షలుండవు
కట్టుబాట్లు అసలు తెలియవు
ఆ రోజులు ఎన్నటికీ తిరిగిరానివే
కానీ కొన్ని అయినా
మన వారసుల్లో చూసుకుంటాము
నాటికి నేటికి ఎంతో తేడా అనుకుంటాము
చెదిరిపోని జ్ఞాపకాలే
జీవిత మజిలీలో ఆనంద వీచికలు!

Exit mobile version