Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవిత సత్యం

[వానపామల శ్వేత తుళ్ళూరు గారు రచించిన ‘జీవిత సత్యం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

రోజు నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు అవుతుంది అని ఎన్నడూ ఊహించలేదు. ఎక్కడో చిన్న భయం, పట్టలేనంత సంతోషం ఆడిటోరియంలో ఇంతమంది కరతాళధ్వనుల మధ్య ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డ్ తీసుకోవటానికి నా పేరు పిలుస్తుంటే నోట మాటలు రావట్లేదు.

సభను ఉద్దేశించి మాట్లాడమని “మిస్టర్ రఘురామ్” అని నా పేరు పిలవగానే పది సంవత్సరాల సొంత వ్యాపారం చేయాలి అన్న నా కల నెరవేరింది అని ఆనందబాష్పాలను ఆపుకోలేకపోయాను.

“ఈ రోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం వ్యాపారంలో నా లాభమో, నష్టమో కాదు. నా కష్టమో, విజయమో అంతకంటే కాదు. నా జీవితాన్ని అందంగా మలిచిన ఒక శిల్పకారుడు, ఆయన గురించి మీకు చెప్పాలి.

అందరికీ మెరుగైన ఆహారం అందించాలి అనే ఆలోచనతో మొదలైందే నా ఫుడ్ బిజినెస్, నలుగురు స్నేహితులం మొదలుపెట్టాం, దళారీ వ్యాపారం కాకుండా నేరుగా రైతుల నుండి కూరలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలను అమ్మే లాగా వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళం, చాలా బాగా ఆదరణ లభించింది.

రైతులు కూడా చాలా సంతోషంగా వారి పంటను అందిస్తూ మాకు బిజినెస్‌లో సహకరించే వారు. మెల్లగా వ్యాపారంలో లాభాలు మొదలైయ్యాయి. అపుడే నా స్నేహితుడు ఒకడికి ఆశ కూడా మొదలై ఎక్కువ ధరకి దళారీలకు అమ్మితే లాభాలు పెరుగుతాయని ఆశించి నన్ను మోసం చేసి మిగతా స్నేహితులను కలుపుని ఆహారాన్ని కల్తీ చేయటం మొదలు పెట్టారు. నాకు తెలియకుండా దళారీలకు అమ్మటం, వచ్చిన లాభాలు గుట్టుగా పంచుకోవటం జరిగింది.

కల్తీ ఆహారం వల్ల చాలా నష్టం జరిగింది. ఆ నష్టం మొత్తం నా మీద వదిలేసి వెళ్ళిపోయారు, పెట్టుబడిదారులకు నేను ఒక దోషిగా మిగిలాను, ఏం చేయాలో తెలీక, అప్పులు కట్టలేక, సొంత స్నేహితులే మోసం చేశారన్న బాధతో ఆత్మహత్యే పరిష్కారమని, కొండ ప్రాంతానికి వెళ్ళాను. చావటానికి సిద్ధమై కొండ ఎక్కుతుంటే అక్కడ ఒక శిల్పి సుమారుగా 80 సంవత్సరాలు పైన ఉండచ్చు చాలా కష్టపడి ఒక కొండ రాతిని శిల్పంలా చెక్కుతున్నాడు, హఠాత్తుగా పై నుండి కొండ రాయిపడి ఆ శిల్పం సగానికి విరిగిపోయింది. అయ్యో అతను ఎంత కష్టపడ్డాడో కష్టమంతా వృథా అయిపోయింది. ఎంత బాధను అనుభవిస్తాడో అనుకుంటూ ఓదారుద్దామని అతని దగ్గరికి వెళ్ళసాగాను. అతను రెండు నిమిషాలు పక్కన కూర్చుని తిరిగి తన పని మొదలుపెట్టి మళ్ళీ ఇంకొక శిల్పం చెక్కుతున్నాడు, చాలా ఆశ్చర్యం వేసింది!

నాకు అసలు ఏమి అర్థంకాలేదు, ‘అలా ఎలా? కష్టం అంత మర్చిపోయి మళ్ళీ ఇంకో శిల్పం చెక్కుతున్నావ్ తాతా’ అని అడిగాను.

తాత చిరునవ్వు నవ్వి, ‘బాబు, పగిలిపోయింది రాయి మాత్రమే కదా’ అన్నాడు.

‘అదేంటి తాత నీకు బాధగా లేదా’ అని అడిగాను.

‘ఉంది బాబు కానీ బాధ పడి ఇప్పుడు నేనేం చేయలేను కదా! ఆ శిల్పాన్ని అతికించినా దాని లోపం అలానే ఉంటుంది కానీ సరి చేయలేకపోయాను అనే వెలితి వెలితిగానే ఉండిపోతుంది కదా. మంచి శిల్పం చెక్కాను అనే సంతృప్తి రాదు కదా దానికంటే ఆ శిల్పాన్ని చెక్కిన అనుభవంతో నా నైపుణ్యం ఇంకొంచెం మెరుగుపడింది. కాబట్టి ఇప్పుడు ఇంకాస్త సులువైన పద్ధతిలో అటువంటి శిల్పాన్ని చేయగలను అనిపించింది, అందుకే కాస్త సమయం తీసుకుని మళ్ళీ మొదలుపెట్టాను.

నిజాయితీగా చేసే శ్రమ ఎప్పటికి వృథా కాదు, ఆ క్షణంలో ఫలితం రానట్టు అనిపించినా దాని అనుభవం మన నైపుణ్యాన్ని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. ఎప్పటికైనా ఏదోక రూపంలో దాని ప్రతిఫలం దక్కుతుంది బాబు.’ అన్నాడు.

ఆ మాటలు నా మనస్సును కదిలించాయి!

‘తాతా, నేను ప్రాణంగా నమ్మిన స్నేహితులే వ్యాపారంలో నన్ను మోసం చేశారు, నా పరిస్థితి దారుణంగా మారింది, చావే నాకు దిక్కు అనిపిస్తుంది’ అన్నాను.

అప్పుడు ఆ తాత ‘బాబూ, నీ సమస్య నాకు పూర్తిగా తెలీదు కానీ, ఒక విషయం చెబుతా విను. మన జీవితంలో ఏ సంఘటన అయినా, మంచి అయిన చెడు అయినా అది తాత్కాలికమే అని అర్థం చేస్కోవాలి. కాలం గడిచేకొద్ది, ఏ గాయమైన, కష్టమైన దాని తీవ్రతని కోల్పోయి, మనల్ని మరింత బలవంతుల్ని చేస్తుంది.

నీకు ఈ రోజు వచ్చిన సమస్య గురించి మనశ్శాంతిగా ఆలోచించు, పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది, అది నీ నూతన అధ్యాయానికి ఒక మంచి అనుభవాన్ని ఇస్తుంది. దైర్యంగా ముందడుగు వెయ్యి బాబు’ అన్నాడు.

నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని అప్పుడే తెలిసింది. ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందనే ఆశతో మళ్ళీ అప్పు తీసుకుని ఈ సారి చాలా విధాలుగా ఆలోచించి, నేర్చుకుని నాకున్న నైపుణ్యంతో సేంద్రీయ వ్యవసాయాన్ని చెయ్యాలి అనుకున్నాను. అప్పుడే తెలిసింది చాలా మంది రైతులు సేంద్రీయ వ్యవసాయం ఎలా చేయాలో, ఒకవేళ తెలిసిన, వచ్చిన పంటల్ని ఎలా అమ్ముకోవాలో తెలీక ఇబ్బంది పడుతున్నారని గమనించి వారికి సహాయం చేస్తూ, ఈ ఆర్గానిక్ ఫుడ్ బిజినెస్ మొదలుపెట్టాను.

మా వ్యాపారంలో పంట పండిస్తున్న ప్రతి రైతు భాగస్వామే, మొదలుపెట్టిన మూడు సంవత్సరాలకే దేశంలో అతిపెద్ద సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల సంస్థగా సంచలనం సృష్టించింది. మా కంపెనీ ద్వారా వేలమంది యువతి యువకులు సేంద్రీయ వ్యవసాయం నేర్చుకుని దాన్ని అమలు చేయటం చాలా సంతోషంగా అనిపిస్తుంది.

ఒక్కోసారి మన అనుకున్న వాళ్ళకంటే కూడా, మనకి తెలియని వ్యక్తుల ప్రభావం మన జీవితం పై చాలా ఉంటుంది. ఈ రోజు నాకు ఈ అవార్డు రావటానికి కారణమైన అంజయ్య తాతకి నేను ఖచ్చితంగా ఋణపడి ఉంటాను. అతనే గనుక ఆ రోజు నాకు కనపడకపోయి ఉంటే నేను ఉండేవాడిని కాను. అందుకే ఈ అవార్డుని నాకు స్ఫూర్తిని ఇచ్చిన తాతకి, నా తోడుగా ఉన్న రైతులందరికి అంకితం ఇస్తున్నాను.

జీవితంలో ఎంతటి కష్టం అయిన మనల్ని మరింత సమర్ధులుగా మారుస్తుంది అని తెలుసుకోవాలి. మన శ్రమకు ఎప్పటికైనా ఖచ్చితంగా ఏదో ఒక రోజు తగిన గుర్తింపు, ఫలితం లభిస్తాయి” అంటూ ముగించాను.

Exit mobile version