Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితాన్ని మలచిన ఉన్నత పాఠశాల గురువులు

[‘నన్ను ప్రభావితం చేసిన నా గురువు’ అనే శీర్షిక కోసం తమ ఉన్నత పాఠశాల గురువుల గురించి వివరిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి.]

రవ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణురాలినయ్యి మా ఊరి హైస్కూల్‌లో చేరాను. మా ఊరిలోని హైస్కూల్ ఒక ఎయిడెడ్ పాఠశాల. పాఠశాల పేరు శ్రీ కోగంటి వారి హైస్కూల్. కోగంటి ఇంటి పేరు గలవారు ఎక్కుక ఆర్థిక సహాయం చేశారు కాబట్టి, పాఠశాలకు ఆ పేరు పెట్టటం జరిగింది. ఎయిడెడ్ పాఠశాల కాబట్టి సమర్థవంతమై హైస్కూల్ కమిటీ వుంటుంది. గవర్నమెంట్ గ్రాంట్‌తో స్కూల్ పనిచేస్తున్నా ఉపాధ్యాయుల ఎంపిక లాంటి పెత్తనం కమిటీ వారి చేతిలోనే వుంటుంది.

చాలా పెద్ద స్థలాంటి పాఠశాల వుండటమే కాక, అన్ని హంగులతోనూ అలరారుతున్నది. ఎన్నో వేలమంది అక్కడ విద్యాభ్యాసం చేసి దేశ విదేశాల్లో రాణిస్తున్నారు. మా నాన్నగారే కాక తర్వాత తరం వారమైన మేమూ, మా అమ్మాయి కూడా అదే పాఠశాలలో చదివాము. స్కూల్ ఆవరణకు నాలుగు వైపులా భవనాలూ, మధ్యలు ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఆ ఖాళీ ప్రదేశంలో నాలుగు వైపులా క్రోటన్ మొక్కలు, మొక్కల అంచున వరండాలలో కూడిన తరగతి గదులు ఏర్పాటు చేయబడి వున్నవి. 6, 7, 8 తరగతులు ఒకవైపునుంటే మరో వైపున 9, 10, 11 తరగతులలో విద్యాభ్యాసం జరుగుతున్నది. ప్రతి తరగతినీ A, B, C లుగా మూడు సెక్షన్లు; సెక్షనుకు 50, 60 మంది బాల బాలికలు వుండేవాళ్లం. మంచి కార్యాలయ గదే కాక, పెద్ద గ్రంథాలయం, విశాలమైన లేబరేటరీ, ఉపాధ్యాయుల విశ్రాంతి గదీ ఇలా అన్నీ క్రమపద్ధతిలో అమరి వున్నాయి.

పాఠశాలలోకి ప్రవేశించేవారికి ఒక ఆర్చీకి అల్లుకుని కౌరవపాండవుల తీగ నీలం, తెలుపూ కలగలిపిన పూలు నిరంతరం పూస్తూ, లేత సువాసనలు అందిస్తూ స్వాగతం పలుకుతూ వుండేది. మా రోజుల్లో ఉపాధ్యాయులకు, విద్యార్థులకూ ముధ్య చక్కని అనుబంధం వుండేది. అలాగే విద్యాబోధనలో మా పాఠశాలకు మంచి పేరున్న కారణంగా సమీప గ్రామాలైన కూచిపూడి, పెదరావూరు, మండూరు, పరిమి, మూల్పూరు, పెదపూడి, చిన గాదెలవర్రు,, పెద గాదెలవర్రు మొదలగు గ్రామాలనుండి రోజూ విద్యార్థులు వచ్చి ఇక్కడ చదువుకునేవారు. ఇంకా ఇక్కడే చుట్టాలిళ్లలోనూ, అద్దెలకూ వుండి మరికొంతమంది చదివేవారు. అలాంటి వారిచే కొంతమంది స్నేహితులు ఇప్పటికీ కలుస్తూనే వుంటారు.

సబ్జెక్టు బోధించిన ఉపాధ్యాయులే కాక మా వీవింగ్ మాస్టారు, డ్రాయింగ్ మాస్టారు, వ్యాయామ ఉపాధ్యాయులు వీరంతా కూడా ఇప్పటికీ నా రచనలు ఇష్టంగా చదువుతూ వుంటారు. వీవింగ్ పిరియడ్, డ్రాయింగ్ పిరియడ్, గ్రంథాలయ పిరియడ్‌లు కూడా వుండేవి. వీవింగ్‌లో చెక్క పనిముట్లు, నవ్వారు అల్లిక, గ్రాఫ్ పుస్తకాల్లో రంగురంగుల డిజైన్లు వేయటం లాంటివి నేర్పేవారు. గ్రంథాలయ పిరియడ్ నాకు బాగా ఇష్టంగా వుండేది. చందమామ, బాలమిత్రలతో పాటు ఎన్నో కథల పుస్తకాలను చదివేదాన్ని. ఇంకా M. I. క్లాసు అంటూ ఒకటుండేది. ఆ క్లాసు లోనూ, ఎవరైనా ఉపాధ్యాయులు పాఠశాలకు శెలవు పెట్టిన రోజు కూడ ఆ పిరియడ్ లో మాకు చక్కని కథలు, ముఖ్యంగా నీతి కథలు చెప్పేవారు. అవన్నీ వింటూ కథల పుస్తకాలు చదువుతూ నాకు తెలియకుండానే నాలో సాహిత్యం పట్ల అభిరుచి పెరిగిపోయింది.

ప్రతి శనివారం అన్ని తరగతుల వారికి మాస్ డ్రిల్, మధ్యలో కూడా చివరి పిరియడ్ వ్యాయామ ఉపాధ్యాయులు డ్రిల్లు నేర్పించేవారు. N.D.S. మాస్టారు కూడా వుండేవారు, వీరు ముగ్గురూ కలిసి మగపిల్లలకు కబడ్డీ, సాఫ్ట్‌బాల్, ఫుట్ బాల్ లాంటి ఆటలు; ఆడపిల్లలకు ఖోఖో, రింగ్ ఆట, టెన్నిన్ లాంటి ఆటలు నేర్చించేవారు. లాబరేటరీలో కూడా ఎన్నో నమూనాలు వున్నాయి. మానవుని అస్థిపంజరం ఒక బీరువాలో పదిలంగా వుండేది. మైక్రోస్కోప్, సున్నితపు త్రాసు లాంటి వాటిలో పెద్ద క్లాసుల కొచ్చాక ప్రయోగాలు చేశాం. ఆ లాబ్‌కు వెళ్లేటప్పుడు దాని ముందర విశాలమైన ద్రాక్ష పందిరి పచ్చని ఆకులతో పిందెలతో కళకళలాడుతూ వుండేది.

మా పాఠశాలలో నేను ఆరవ క్లాసులో చేరేటప్పటికి నా వయస్సు ఎనిమిదేళ్ళే కావటంలో మొదట్లో చాలా బిడియంగా వుండేదాన్ని. చదువు మీద వయస్సు ప్రభావం కూడా వుంటుంది కాబట్టి ఎవరైనా చిన్న వయస్సులో చిన్న క్లాసుల్లో వుంటేనే మంచిది. మా ఆరవ తరగతి ఉపాధ్యాయులే ఏడవ తరగతికి కూడా వచ్చేవాళ్ళు. ఎయిడెడ్ పాఠశాల కాబట్టి ఉపాధ్యాయులకు బదిలీలు అంటూ వుండవు, ప్రధానోపాధ్యాయులు మాత్రం తమ సర్వీసు చివర్లో వుండేవారు కాబట్టి త్వరగా పదవీ విరమణ చేస్తూ వుండేవారు. మా 6, 7వ తరగతి ఉపాధ్యాయులు సుబ్బారావుగారు, బ్రహ్మయ్యగారు, వెంకట్రావు గారు, మల్లికార్జున రావు గారు, నరసింహారావు గారు, ఆచారిగారు. వారు చెప్పిన వర్కంతా చేసే దాన్ని కాబట్టి నేనంటే వారంతా అభిమానంగా వుండేవారు. ఇప్పుడు గూడా ఒకరిద్దరు ఆరోగ్యం గానే వుంటే ఫోన్ చేసి నమస్కారాలు చెప్తూ వుంటాను. ఎనిమిదో తరగతిలో తెలుగుకు నాగయ్యగారు, లెక్కలకు రత్తయ్య గారు వచ్చేవారు. నాగయ్య గారికి కోపమెక్కువ. అప్పట్లో లేడీ టీచర్లు మా పాఠశాలలో లేరు. ప్రధానోపాధ్యాయులు తరచూ వరండాలలో తిరుగుతో తరగతులను పర్యవేక్షిస్తూ వుండేవారు. వారానికోసారి తెలుగు, ఇంగ్లీషు కాంపోజిషన్ వర్క్ చేసేవారం. ఏడాదికోసారి జిల్లా విద్యా శాఖాధికారి గారి తనిఖీ వుండేది. కొత్త బట్టలు కట్టుకుని, నోట్సులు, కాంపోజిషన్లు అన్నీ జాగ్రత్తగా స్కూల్‍కు తీసుకెళ్లేవాళ్లం. ఉపాధ్యాయులు తాము తరచూ రాసే లెసన్ ప్లాను, తమ సర్టిఫికెట్లూ తెచ్చి ముద్ర వేయించి తమ సర్వీసు రిజిస్టర్లు తనిఖీ సంతకాలు చేయంచుకునేవారు. అప్పట్లో మా ఉపాధ్యాయులు ఎక్కువగా పంచే షర్టులలో స్కూల్‍కు వచ్చేవారు. వారిని చూస్తుంటే మాకు ఎనలేని గౌరవం కలిగేది. అలా నా ఎనిమిదవ తరగతి పూర్తయింది.

మా ఇంట్లో కూడా సాహిత్యానికి సంబంధించిన చాలా పుస్తకాలు వుండేవి. శెలవుల్లో వాటన్నిటినీ కూడా చదివేదాన్ని. ఆ సంవత్సరం సెలవలు పూర్తయిు తొమ్మిదో తరగతికి వచ్చాను. కొత్త ఉపాధ్యాయులు, కొత్త పుస్తకాలు, కొత్త క్లాసు. మాకు తెలుగు జాస్తి శ్రీరాములు గారు బోధించేవారు. వారు మంచి తెలుగు పండితులు. ఒకటి రెండు పుస్తకాలు కూడా రాశారు. తెలుగు సినిమా నటుడు గుమ్మడి గారికి కూడా శ్రీరాములు మాస్టారు ఆరాధనీయులు. నేను తెలుగులో ఇంత బాగా ఉచ్చారణ చేస్తున్నానంటే మా శ్రీరాములు మాస్టారి శిష్యరికమే అని తరచూ చెప్పేవారు. గురజాల క్రిష్ణయ్య గారు హిందీ చెప్పేవారు. మా సైన్సు ఉపాధ్యాయులు బుచ్చి రాజారావు గారు. పిల్లలకు ఏదో ఒకటి నేర్పాలని తపన పడేవారు. నేను ఇప్పటికీ వారిని పలుకరిస్తూనే వుంటాను. ఇంకా కృష్ణమూర్తి గారు, వెంకట్రామయ్య గారు, ఆంజనేయులు గారు, నాగేశ్వర్రావు గారు ఇలా మాకు 9, 10, 11 తరగతులు చెప్పేవారు. మా సోషల్ + ఇంగ్లీషు మాస్టారు సజ్జ్జా వేంకటరత్నం గారు. పంచెకట్టుతో, జరీ అంచు పైపంచతో నిండుగా, హుందాగా వుండేవారు. నాకు అన్ని సబ్జెక్టుల కంటే సోషల్ స్టడీసే బాగా వచ్చేది. వారి ఇంగ్లీషు క్లాసన్నా చాలామందితో పాటు నాకూ ఇష్టంగా వుండేది. ఆంజనేయులు మాస్టారుగారు కూడా మాకు S.S.L.C లో ఇంగ్లీషు చెప్పేవారు. సజ్జా వేంకటరత్నం గారికి ఇంగ్లీషు భాష మీద బాగా పట్టుండేది, వ్యాకరణంలో బాగా దిట్ట. అది వారి శిష్యులకూ వంట బట్టింది. దానికి ఉదాహరణగా ఆ రోజుల్లో గుంటూరు జి.కె.సి కాలేజీ; విజయవాడలోని ఎ.సి. కాలేజీలో  పి.యూ.సి. చదివే విద్యార్థులు ఎవరైనా ఇంగ్లీషు వ్యాకరణంలో పూర్తి మార్కులు తెచ్చుకున్నట్లైతే అక్కడి ఇంగ్లీషు లెక్చరర్ల మాట ఏమిటంటే – “ఏమోమ్! నువ్వేమైనా కూచిపూడి హైస్కూలు లోని సజ్జా వేంకటరత్నం గారి శిష్యుడివా?” అని అడిగిన సందర్భాలు వున్నవి. ఆ మాస్టారికి తెలుగు సాహిత్యం పట్ల కూడా మంచి అవగాహన వున్నది. ఆ అవగాహన తోనే తెలుగు భాషలో ‘మా ఊరు’, ‘సూక్తి సుధాత్రిశతి’, ‘శ్రీమద్ భగవద్గీత’ లను ఆటవెలది, కంద పద్యాలలో రచించి, ప్రచురిరించారు. వీరు తదనంతర కాలంలో ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా కూడా పనిచేశారు, తమ ఉద్యోగ జీవితంలో నాలాంటి ఎందరో అభిమాన శిష్యులని సంపాదించుకున్నారు.

పాఠశాల మీద అభిమానంతో మేమొకసారి వెంకటరత్నం గారి నిర్వహణ లోనే ‘డెంటల్ కాంప్’ పెట్టించాము. ఆ తర్వాత నా బాల సాహిత్యమైన ‘ఆదివారం సందడి’ అనే పుస్తక ఆవిష్కరణ మా పాఠశాలలోనే ఉపాధ్యాయులు, పిల్లల సమక్షంలో చేశాం. ఆ పుస్తక పరిచయం కూడా వెంకటరత్నం గారే చేశారు. తర్వాత నేను వ్రాసిన ‘ఆమని’ అనే నవలను మాస్టారు దంపతులకే అంకితమిచ్చాను. వారిని ఆ రోజులలోనే అధికారులు ‘రిసోర్స్ పర్సన్’ గా వివిధ పాఠశాలలకు పంపేవారు, దేశవిదేశాలలో వారి అభిమాన శిష్యులున్నారు.

మా పాఠశాల ఇప్పటికే కొనసాగుతున్నది. 6 నుండి 10 తరగతులలో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నవారికి మేము వ్యక్తిగతంగా ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నాము. మా గురువులందరికీ నా నమోవాకములు. వెంకటరత్నం మాస్టారు దంపతులు ఇటీవలే కీర్తిశేషులయ్యారు. ఆరోగ్యంగా వున్నవారిని పోన్ లోనైనా పలకరిస్తూనే వుంటాను.

నా అభిమాన గురువు మా నాన్నగారే అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను.

Exit mobile version