Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం లిఫ్ట్ కాదు

[శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి రచించిన ‘జీవితం లిఫ్ట్ కాదు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఒకటీ, రెండూ, మూడు, నాలుగు అబ్బా ఇంకా ఆరు.. ఉష్ అమ్మా.. హమ్మయ్య ఎక్కేసా.”

పైకి ఎక్కి రైలింగ్ పట్టుకుని, ఆఖరి మెట్టు మీద ఒక కాలు, బాల్కనీ గచ్చు మీద ఒక కాలు ఆనించి వెనక్కి తలతిప్పి చూసాను.

ఇన్ని మెట్లు ఎక్కడమా! ఒక అంతస్తుకి రావడానికి పది మెట్లు ఎక్కితే ఎనిమిది అంతస్తులు ఎక్కడానికి ఎన్ని మెట్లు ఎక్కాలి? నలభై.. ఈ అంతస్తుకి ఇది ఆఖరి మెట్టు అయితే, నాలుగో అంతస్తుకి!..

అవసరమా! కింద పోర్షన్ తీసుకుని ఉంటే గేటు దాటి ఇంట్లోకేగా వెళ్ళేది.

అమ్మ మొత్తుకుంది “రెండో అంతస్తో, మూడో అంతస్తులోనో తీసుకోవచ్చు కదే. మరీ ఎనిమిదో అంతస్తేమిటి? బాల్కనీలో నుంచి చూస్తే కళ్ళు తిరగవూ!” అంటూ. వింటేనే. అసలు ఎదుటివాళ్ళు చెప్పేది వినే గుణం ఉండి ఉంటే బతుకిలా అయేదా ?

కింద ఉంటే వచ్చే, పోయే వాళ్ళ బండి చప్పుడు, చెప్పులు, షూస్ చప్పుడు వినిపిస్తుందని, ప్రతి వాళ్ళు ఎవరి అడ్రస్ కావాలన్నా, కాలింగ్ బెల్ కొట్టి డిస్టర్బ్ చేస్తారని, ఆమెజాన్ వాడు, ఫ్లిప్ కార్ట్ వాడు, zepto వాడు, big basket వాడు, వరసగా బెల్లు కొట్టి, సుబ్బారావెక్కడ? మల్లమ్మ ఎక్కడ? పుల్లమ్మ ఎక్కడ అని అడుగుతారనేగా వద్దని, ఎనిమిదో అంతస్తు బాల్కనీ లో నుంచి వ్యూ బాగా కనిపిస్తుందని కోరి, కోరి ఎనిమిదో అంతస్తులో తీసుకుంది. చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవ అన్నారు. తప్పదు అనుభవించాలి. ఆ సమస్యలని మించిన పెద్ద సమస్య తరచూ లిఫ్ట్ problem వస్తోంది. ఒకసారి కరెంటు ఉండదు. ఒకసారి పని చేయదు, ఒకసారి స్టక్ అవుతుంది. ఎన్నో ఆశలు పెట్టి, భూమ్మీద స్వర్గం చూపించి ఆ ఫ్లాట్స్ అమ్మేసిన builder మళ్ళీ కనిపించడు.

లిఫ్ట్ పని చేస్తే బానే ఉంటుంది జీవితం.. లిఫ్ట్ పాడైతే తెలుస్తోంది.

జీవితం కూడా అంతేగా! వయసు ఉన్నన్నాళ్ళు మెట్టు, మీద మెట్టు ఎక్కి ఉన్నత స్థానంలోకి వెళ్లాలని ఆరాటపడింది.

“చదివింది చాల్లేవే! వయసు ముదిరిపోతోంది పెళ్ళికి ఒప్పుకో ఆ మూడు ముళ్ళు వేయించి, నా బాధ్యత తీర్చుకుంటా, అమలాపురం అబ్బాయి బాగా చదువుకున్నాడుట, బోలెడు ఆస్తి ఉందిట, అందగాడు కూడా నువ్వంటే ఇష్టపడుతున్నాడు. ఒప్పుకోకూడదూ!” అమ్మ ప్రపోజల్స్ అన్నీ ఆవిడ నసగా కొట్టిపారేసింది.

“అతనికి ఇష్టం అయితే చాలా నాకిష్టం ఉండక్కరలేదా! ఇప్పుడప్పుడే నా పెళ్లి మాట ఎత్తవద్దని లక్షసార్లు చెప్పాను. ఒక ఫ్లాట్, బ్యాంకు బాలన్సు, ఆడి కారు ఇవన్నీ నా కంటూ, నా స్వంతంగా సమకూర్చుకున్నాక అప్పుడు చేసుకుంటా. అందాకా నో పెళ్లి, నో బాదరబందీ..”

“ఏడిసినట్టు ఉంది. నువ్వు రమ్మన్నప్పుడు వస్తాడా పెళ్లి కొడుకు..” చిరాకు పడింది తల్లి.

“రాక చస్తాడా! నేను కావాలి అనుకుంటే రావాలి.”

ఎంత అహంకారం! ఆ అహంకారంతోటే జై ని కాదనుకుంది.

నాలుగేళ్ళు ఎంత సహనంతో ఎదురుచూశాడు తన అంగీకారం కోసం.

“ఇంకా ఎంతకాలం చదువుకుంటావు ధన్యా? ఏం చేస్తావు ఆ చదువంతా” విసుగ్గా అడిగాడు ఓసారి.

“అంత డబ్బు ఏం చేసుకుంటావు అన్నట్టు చదువు ఏం చేసుకుంటావు అని ప్రశ్నిస్తావేంటి జై. జ్ఞానం అనేది తరిగేది కాదు, చిన్నప్పుడు పాట వినలేదూ దొంగల చేతికి దొరకనిది, దానము చేసిన తరగనిది.. పదుగురి లోనా పరువును పెంచి పేరు తెచ్చే పెన్నిధది”.

“ఊ.. మంచిదే ఇప్పటికే చాంతాడంత పొడుగు డిగ్రీలున్నాయి. మంచి ఉద్యోగం ఉంది. బోలెడంత జ్ఞానం ఉంది. లేనిది కుటుంబం. అది ప్లాన్ చేసుకుందాం ధన్యా!” ఆశగా అన్నాడు.

ఎందుకో అంగీకరించడానికి నా మనసు సహకరించలేదు. ఇంకా ఏదో సాధించాలని, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏం బి. ఏ. పి.హెచ్ డి . ఇంకా దాహం తీరడం లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ నా చుట్టూ పుస్తకాలు.

ఇంటికి వచ్చి సోఫాలో నా చుట్టూ సిపాయిల్లా కాపలా కాస్తున్నట్టు ఉండే పుస్తకాలు అన్నీ ఒక దగ్గర బొత్తిగా పెట్టి, పక్కన కూర్చుని, “ఇంటికి వచ్చిన వాళ్ళకి కూర్చోడానికి చోటు లేకుండా ఈ పుస్తకాలు పేర్చేస్తావేంటి? రావడం ఇష్టం లేకపోతే చెప్పచ్చు కదా!” విసుక్కునేవాడు.

“రిఫరెన్స్ కోసం ఇవన్నీ చూస్తున్నాను. అవునూ నువ్వు పుస్తకాలు చదవ్వా?” అడిగాను.

“ఏమి చదవకుండానే ఏం బి.ఏ పూర్తీ చేసి, కంపనీ డైరెక్టర్ అయ్యానా! కాకపోతే ఎంత అవసరమో అంత చదువుతా. నీలాగా తినేయను” అన్నాడు.

“నేను పురుగులా కనిపిస్తున్నానా పుస్తకాలు తినడానికి?”

“తినడం ఏంటి? నమిలి మింగేస్తున్నావు. సరేలే ఇదంతా వదిలేయ్. పెళ్ళెప్పుడు చేసుకుందాం?” నిలదీశాడు.

ఆలోచిస్తూ ఉండిపోయాను. పెళ్లి అయ్యాక నేనిలా చుట్టూ పుస్తకాలు పేర్చుకుని కూర్చుంటే సహించే సహనం ఈ మనిషికి లేదు. జై అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కరోజు తనతో మాట్లాడకపోయినా నాకు తోచదు. తన ప్రవర్తన, మాట, నడక, హుందాతనం, సంస్కారం అన్నీ బాగుంటాయి. అతన్ని ఇష్టపడని అమ్మాయి ఎవరన్నా ఉంటే అది పిచ్చిది అయినా అయి ఉండాలి. గుడ్డిది అయినా అయి ఉండాలి. కానీ ఇవి రెండూ కాని నేను అతన్ని ఇష్టపడుతున్నాను కానీ, ఎందుకో అతనితో సంసార జీవితం మాత్రం ఊహించలేకపోతున్నాను.

అలా అతను ప్రపోజ్ చేయడం, నేను ఆలోచనలతో అంగీకారం, అనంగీకారం అనే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో చూసి, చూసి, విసుగు పుట్టి హాయిగా పెద్దలు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ స్నేహం మాత్రం మొగలిపూవులా పరిమళిస్తూనే ఉంది ఇద్దరిమధ్యా.

తను ఈ ఫ్లాట్ కొనేముందు ఇక్కడికి తీసుకుని వచ్చి చూపించి ఎలా ఉంది అని అడిగింది.

“చాలా బాగుంది. కానీ ఎనిమిదో అంతస్తులో కొంటావేంటి? హాయిగా గ్రౌండ్ ఫ్లోర్ బాగుంటుందిగా.. పొరపాటున లిఫ్ట్ పాడైతే!”

“ఎందుకు పాడవుతుంది? ఒకవేళ అయితే రిపేర్ చేయిస్తారు.” అంది తను. ఎంత తేలిగ్గా అంది.

నిట్టూర్చింది.

లిఫ్ట్ రిపేర్ అవుతుంది. జీవితం అవుతుందా! యాభై దాటాయి. అనుకున్న వాటిలో కొన్ని సాధించింది. కొన్ని కోల్పోయింది. ఆ కోల్పోయిన వాటిలో జై.. తన యవ్వనం.. రెండూ లభించవు. పరాయివాడు అయిపోయిన జై.. ఎన్నటికీ రాని యవ్వనం.. ఈ రెంటితో మంచి జీవితాన్ని కూడా కోల్పోయింది.

జై ఇప్పుడు తన మీద జాలి కురిపిస్తాడు. “ఎందుకిలా చేసుకున్నావు జీవితం నాకర్థం అవడంలేదు. ఒక్కటే జీవితం ధన్యా! ఆశలు ఉండచ్చు. మనిషి అన్నాక ఆశ లేకుండా ఎవరూ జీవించరు. కానీ ఆ ఆశ సహేతుకంగా ఉండాలి. practicality ఉండాలి ధన్యా! నిన్నిలా చూస్తుంటే బాధగా ఉంది. పెళ్లి చేసుకో. ఇప్పటికీ మించిపోలేదు. నేను చూడనా సంబంధాలు?”

“నీలాంటి అబ్బాయిని చూస్తావా?” నవ్వాను.

“నాకన్నా మంచివాడు, అందగాడు, డబ్బున్నవాడు వస్తాడు”.

“కానీ అతను నువ్వు కాదుగా..”

జై మాట్లాడలేదు. మౌనంగా వీపు మీద చేత్తో నిమిరాడు. ఆ స్పర్శలో కొండత అభయం.

చాలు, నీకు ఏం కావాలన్నా నేనున్నాను అని అభయం ఇచ్చే స్నేహితుడి కన్నా ఏం కావాలి?

“మేడం! లిఫ్ట్ పని చేస్తోంది రండి..” తన పక్క ఫ్లాట్ కుర్రాడు రవి లిఫ్ట్ డోర్ ఓపెన్ చేసాడు. ఆయాసపడుతూ “థాంక్స్” చెప్పి లిఫ్ట్ లోకి నడిచింది.

లిఫ్ట్ అయినా, జీవితం అయినా రిపేర్ చేసుకోవచ్చు కదా. అనుకుంది నాలుగో అంతస్తులో దిగుతూ.

Exit mobile version