[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]
~
“భువన చంద్రగారూ.. ‘మహాజనానికి మరదలు పిల్ల’ అనే టైటిల్ ఎంపిక చేశాం. హీరో రాజేంద్రప్రసాద్.. హీరోయిన్ నిరోషా. కన్నడ సినిమా. కర్నాటకలో అయిదు వందల రోజులకి పైగా ఆడింది. మ్యూజిక్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ ‘ఉపేంద్ర కుమార్’ గారే. బయలుదేరి వచ్చేయ్యండి. కారు పంపుతున్నా” అన్నారు విజయబాపినీడుగారు. బేనర్ రాశీ మూవీ క్రియేషన్స్. నిర్మాత రాశీ నరసింహరావుగారు. చాలా జోవియల్ పర్సన్. వారి ఆఫీసు నేనుండే రూమ్‌కి దగ్గరగానే వుండేది.
ఉపేంద్ర కుమార్ గారిని చూడటం మొదటిసారి. సిట్టింగ్స్ జరిగింది బాపినీడుగారి ఆఫీసులోనే.
నిజంగా చెబితే అసలు సిటింగ్ అక్కరలేదు. కన్నడ కేసెట్ చేతికిచ్చి “బాబూ.. ఈ ట్యూన్స్ ఫాలో అయిపోండి” అంటే చాలు. కానీ, కొంత మార్పులూ చేర్పులు చెయ్యాలన్నది బాపినీడు గారి ఆలోచన.
ఇంతకు ముందు చెప్పినట్టు, ట్యూన్ ok అయిన అరగంటలోపే బాపినీడుగారు అడిగేవారు “ఏమండీ ఎంత వరకూ వచ్చారు?” అని. అలా తొందరపెట్టబట్టే ఫాస్ట్‌గా వ్రాయడం నాకూ అలవాటైంది.
మొదటి పాట “ఒక రామ కథ ఒక సీత కథ” అక్కడికక్కడే కూర్చుని వ్రాశాను. సాక్షాత్ శివభక్తుడూ శివస్వరూపులూ, ఎం.పి., కళాబంధు శ్రీ టి. సుబ్బిరామరెడ్డి గారు అవ్వాళ అదే టైమ్‍కి వచ్చారు. మరో గంటో గంటన్నరో అక్కడ వుండగానే పాట పూర్తయింది. జోవియల్ సిచ్యుయేషన్. కష్టపడాల్సింది ఏముందీ.. లిరిక్‌లో హాస్యాన్ని కూర్పుడం తప్ప. పల్లవి రెడీ. హీరోయిన్ పేరు సినిమాలో ‘దేవి’. పల్లవిలో ఆ పేరు వచ్చేట్టు రాశా.
పల్లవి:
“ఒక రామ కథ ఒక సీత కథ నడిమధ్యన
తకథిమి తాళం..
ఈ గడబిడలో మొదలెడతా.. దేవీ పురాణం” ॥ఒక రామ॥
ఉపేంద్రగారు హార్మోనియం మీద ఇచ్చిన ట్యూన్‌కి రాసిందే ఈ పల్లవి.
వెంటనే లోపలికి వెళ్ళి బాపినీడుగారికి పాడి వినిపించా. “భేష్.. చరణాల పని పట్టండి” అన్నారు. సుబ్బిరామిరెడ్డి గారు నా వంక చూస్తూంటే, నన్ను వారికి పరిచయం చేశారు. చరణాలు ఏం రాయాలీ? కలిపి కొడితే కావేటిరంగా అనుకున్నాను.
చరణం 1:
ఏదీ తనంత తానై నీ దరికి రాదూ అన్నారు శ్రీశ్రీ
నీ దరికి రాకపోతే.. నిన్నే వెళ్ళమన్నారూ.. మా కృష్ణశాస్త్రీ
ఓ.. రెండూ.. ఒకటే గదా ఇంకా
సందేహమేలా.. ॥ఒక రామ॥
చరణం 2:
నే నవ్వితేనె లోకం ఏడ్చింది అన్నారూ ఆత్రేయగారు
ఏడ్చేటి లోకాన్నైనా.. నవ్వించమన్నారూ.. మా తాతగారూ
ఓ.. బోలో మై క్యా కరూఁ అబ్
తూ హీ బతాదే ॥ఒక రామ॥
~
లోపలికి వెళ్ళి వినిపించగానే పకపకా నవ్వి, “భలే వుందండీ పాట.. ఏమిటీ.. మీ తాతగారు నవ్వించమన్నారా?” భోళాశంకరుడిలా మళ్ళీ మళ్ళీ నవ్వి అన్నారు టి.సుబ్బిరామిరెడ్డిగారు. బాపినీడుగారు నవ్వేసి, “మహా కిలాడీ అండీ.. శ్రీశ్రీగార్నీ, కృష్ణశాస్త్రినీ, ఆత్రయగార్నీ ముగ్గుర్నీ పాటలోకి తెస్తే సాంగ్ నచ్చలేదని ఎలా అనగలం? అయినా.. సన్నివేశానికి అతికినట్టు సరిపోతుంది” అన్నారు.
ఎయిర్‌ఫోర్స్‌లో ఉన్న రోజులనాటి ఫోటో
ఇప్పుడా రోజులేవీ? ట్యూన్ వాట్సప్ లోనో, జీమెయిల్ లోనో వస్తుంది. లిరిక్‌ని కూడా పాడో, పాడకుండానో స్కాన్ చేసి మెయిల్ లోనో, ఫోటో తీసి వాట్సప్ లోనో పంపాలి. వాళ్ళు అక్కడ మన ఎకౌంట్ నంబర్‌లో డబ్బు వేస్తే, ఇక్కడ మనం డ్రా చేసుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టరూ, అసిస్టెంట్, రచయిత, నిర్మాత దర్శకుడూ ఒకే చోట కూర్చుని చర్చించుకునే అవకాశమేదీ అసలు? పాడే గాయనీ గాయకుల పేర్లు C.D. మీదో, వెండి తెర మీదో, చూడాలి అంతే!
రెండో పాట టీజింగ్ సాంగ్ మాత్రమే కాక ‘టైటిల్’ కూడా వచ్చే సాంగ్. ఆవిడ టెక్కునీ, సొగసిచ్చే కిక్కునీ వర్ణిస్తూ వెంటపడి అల్లరి చేసే పాట. హేపీగా రాసేశా.
మూడోది కూడా కాస్త టీజింగ్ పాటే.
“ఇస్పేట్ పాపా ఈతాకు చాపా” అంటూ మొదలైన ఆ పాటా ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా పూర్తి అయింది.
ఆ తరవాతొచ్చింది.. నాకిష్టమైన సిచ్యుయేషన్. వాన పాట వినడమన్నా, వ్రాయడమన్నా నాకు చాలా ఇష్టం. వానలో తడిసిన మరుక్షణమే నాకు జలుబో జ్వరమో పట్టుకుంటుందని తెలుసు. అయినా వర్షంలో మాత్రం తడిసి తీరతా. ఎందుకంటే, వర్షాలు ఎప్పుడు బడితే అప్పుడు రావుగా. వాన పాట గ్యాంగ్ లీడర్ లోని ‘వానా వానా వెల్లువాయే’ కంటే ముందు రాసిన పాట. ‘వానా వానా’ కి ఒక విధంగా ఇది బేస్.
~
పల్లవి:
ఆమె: కోక తాడిపిన కోణంగి చినుకే
కన్నెపరువూ తీసేలే.. తడిపి.. తడిపీ
తనువునంతా తడిమి.. చూచెనులే..
అతడు: కోక తడిపిన కోణంగి చినుకే
కన్నె పరువూ తీసేలే.. తడిపి తడిపే
తనువులోనీ.. తళుకు.. చూపెనులే ॥కోక॥
ఉపేంద్ర కుమార్ గారికి హిందుస్తానీ అంటే ఇష్టం. నాకూ అంతే. ప్యూర్ మెలోడీ ఇస్తారు. దాంతో నాకే కాదు.. ఏ రచయితకైనా నల్లేరు మీద నడకే.
(‘కోక తడిపిన కోణంగి చినుకే’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=OmKXuvehdRU)
సామాన్యంగా ‘తాగి’ పాడేది మగవాళ్లు. కొన్ని సినిమాల్లో ఆడాళ్ళు కూడా తాగి పాడి వుండొచ్చు. కానీ, ఒక రచయితగా నాకు మొదటిసారి అలాంటి పాట రాసే అవకాశం వచ్చింది. హీరోయిన్‌కి మొండితనం ఎక్కువే. ఆత్మాభిమానమూ వుంది. ఏమయితేనేం.. హీరోతో పెళ్ళయ్యాక తెలిసింది పెళ్ళకి ముందు కొన్ని నిజాలు దాచారని. కోపంతో, ఫ్రస్టేషన్‍తో తాగేస్తుంది. తాగి ఘోరంగా నిందించేంత సీను కాదు. I don’t care type లోనే పాట వుండాలి. అలాగే వ్రాశా. ఇదిగో చిత్తగించండి.
పల్లవి:
తప్పతాగిందే తప్పు.. తాగి వాగితే ముప్పు
ఐనా సరే నే లాడతా.. నేతాగే వాగేస్తా (R)
ఓహోహోహో ॥తప్ప॥
చరణం 1:
ప్రేమించి ఆనాడూ.. తాగాడు దేవదాసు
తాగేసి మైకంలో.. మరిచాడు ప్రేమ వూసూ
తాగాకే తెలిసిందీ.. ప్రేమే.. మధువుకి బానిసనీ (R)
తెలిసుంటే.. ఆ పారూ.. తాగే దానాడే..
ఓహోహోహో ॥తప్ప॥
చరణం 2:
తల ఎత్తి నీవుంటే – తెగనాడుతుంది లోకం
తల దించి కూర్చుంటే.. దరి చేరుతుంది శోకం
లోకానికి భయపడకూ. ఆవేదనతో తడబడకూ(R)
చక్కగా.. చుక్కేసి.. టాటా చెప్పేసేయ్.. ॥తప్ప॥
~
పాడింది కన్నడ మంజులగారు. అద్భుతంగా పాడారు.
(‘తప్పతాగిందే తప్పు’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=_1uRt5LCjrc)
~
మొదటి సినిమా ‘నాకు పెళ్ళాం కావాలి’ మెమెంటో మీద పెట్టిన ఫోటో
ఈ సినిమాలోనే మరో పాట వుంది. పాటలు కొన్ని పల్లవులు మాత్రమే ఇచ్చి కొన్ని పూర్తిగా ఎందుకు రాస్తున్నానంటే, హిట్ పాటల సంగతి వేరు. కొన్ని సన్నివేశాలకి వ్రాయడం చాలా క్లిష్టమైన వ్యవహారం. కొన్ని కొన్ని untold బేరియర్స్ మనకెదురవుతాయి. ఎలా హేండిల్ చెయ్యాలో తెలీదు. ఫర్ ఎగ్జాంపుల్,పై పాట పల్లవిని గమనిస్తే “తాగితే తప్పు.. తాగాక వాగడం ఇంకా తప్పు.. అయితే నే తాగుతా.. వాగుతా” అన్న డిక్లరేషనిస్తుంది హీరోయిన్. తాను చేసేది తప్పని తెలిసా, పంతం తలకెక్కినప్పుడు జరిగేది ఇదే. ఇక చరణంలో 1లో దేవదాసు పార్వతుల ప్రస్తావన + ప్రేమ ప్రస్తావన. రెండో చరణంలో ‘లోకానికి భయపడకూ అవేదనతో తడబడకూ.. అని చెబుతూ.. భయానికి టాటా చెప్పమం’టుంది. చెప్పేదేమంటే తాగుడు పాటంటే పూర్తిగా డ్రింక్ గురించే రాయక్కర్లేదు. మెల్లగా మిగతా వాటి నించి కూడా ‘మేటర్’ తయారు చెయ్యవచ్చని. వ్రాయడానికి కేవలం అరగటం పట్టినా మూడు రోజులు పట్టినా, ఆలోచనా ప్రయాణం ఓ స్పష్టమైన ఒడ్డుకి చేరేవరకూ పాట పేపరు మీదకి ఎక్కదు. పాట ఎప్పుడూ self-narrative గా వుండాలి. సామాన్యుడికి అర్థం కావడం అన్నింటికంటే ముఖ్యం. చివరి పాట ఈ తాగుడు పాట తరవాత వచ్చేది.
యాక్షనూ రియాక్షనూ అన్నీ మౌనంగా జరిగిపోతూ వుంటాయి. ఆ మౌనంలోంచే హీరో హీరోయిన్ లిద్దరికీ ఒక రియలైజేషన్ రావాలి. ఇంతకు ముందున్న ‘అహం’ పోయి, ‘అండర్‌స్టాండింగ్’ రావాలి. అందుకే దీన్ని బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌గా వ్రాయడం జరిగింది. చిత్తగించండి.
పల్లవి:
మనువే.. మధురం.. మనసే.. ఒకటైతే
మనువే.. ఒక స్వప్నం.. మాటే.. ఒకటైతే..
మనువే.. ఒక స్వర్గం.. ప్రేమే తోడైతే.. ॥మనువే॥
చరణం1:
ఇల్లాలు జానకి.. ఇంటివాడు రాముడు
ఇల్లే అయోధ్యైతే.. ఎంతో వేడుక..
భర్తే కృష్ణుడై.. సతి సత్యభామతో
తెగమొరలెడుతుంటే.. అది ఒకవాడుక
అలకా కులుకుల సంబంధం..
భార్యాభర్తల అనుబంధం.. ॥మనువే॥
చరణం 2:
బొమ్మా.. బొరుసూలా.. భార్యభర్తలూ
ఎడపెడగా వుంటే.. ఫలమేముందటా
కంటికి పాపలా.. తోడూ నీడలా
ఒకరికి ఒకరంటే.. ఎంతో కలిమిలూ
కూడదు పంతం అధికారం
సృష్టికే మూలం, సంసారం. ॥మనువే॥
SPB గారే ఈ పాట పాడేరు. ఆసాంతం నేనూ థియేట్లర్లోనే వున్నాను. ఉపేంద్ర కుమార్ గారికి కొంత తెలుగు వచ్చు. అందరూ ఎవరిదారిన వాళ్ళ వెళ్ళిపోయాక ఉపేంద్ర కుమార్ గారు అన్నారు – “ఇక నించీ నేను ఏ తెలుగు సినిమా చేసినా, నేను కన్నడలో చేసిన ఏ సినిమా తెలుగులోకి డబ్బింగ్ అయినా.. తప్పకుండా మీ చేత పాటలు వ్రాయించుకుంటాను” అని. ఆయన లేకపోయినా ఆ మాట ఇప్పటికీ నా గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే వుంది. మృత్యోర్మా అమృతంగ మయ.
(‘మనువే.. మధురం..’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=SaY4aEj36jU)
***
‘కడప రెడ్డమ్మ’ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా. భరద్వాజగారితో ఇది నాకు మూడో సినిమా. విద్యాసాగర్‌తో రెండోది. ఈ సినిమాలో “హల్లో విజ్జీ” అన్న పాట ఒకటి మాత్రం వ్రాశాను. నిర్మాతలు రాధాకృష్ణగారు – చలపతిరావు (ఆర్టిస్టు) గారు. ‘అల్లరి’ ఫేమ్ రవిబాబుని చూసిన గుర్తు, చిన్నవాడుగా. బోగ్ రోడ్‌లో వున్న R.C.క్రియేషన్స్ ఆఫీసులో కంపోజింగ్ జరిగింది. అక్కడికక్కడే, అదే రోజున పాట పూర్తి చేయ్యడం జరిగింది.
ఈ పాటలో చాలా భాగం డైలాగ్స్ ఉంటాయి. చరణాల్లో కూడా “కరిచింది ఓణీ.. కాలేదు బోణీ/ఎన్నాళైనా ఎన్నేళ్ళైనా ఇంతే నా ఖర్మ” లాంటి సరదా లైన్స్ వుంటాయి. ‘రంజిత’ అనే ఓ కొత్త హీరోయిన్ యీ సినిమా ద్వారా పరిచయమైందని మాత్రం గుర్తుంది. భరద్వాజ, విద్యాసాగర్‌లతో పని చెయ్యడం నిజంగా పండగే.
***
తేనెటీగ:
“సుధారా హోటల్లో సిటింగ్. వచ్చెయండి..” అని ఫోను. నిర్మాత ‘బడి’ రామారావుగారు. బేనర్ సుమప్రియా క్రియేషన్స్. దర్శకత్వం నందకుమార్.
నందకుమార్ గారంటే ‘నల్లబాబు’ నందకుమార్ గారు. గంభీరమైన గడ్డం. కానీ అందరితోనూ అవలీలగా కలిసిపోయే మనిషి.
సంగీతం విద్యాసాగర్. విద్యాతో ఇది నా మూడో సినిమా. ‘సుధారా’ హోటల్ గురించి తప్పక చెప్పాలి. మాంబళం బస్టాండు దగ్గరుంది ఇది. ‘శివావిష్ణు టెంపుల్’కి దగ్గరగా. ‘సుధారా’ అనగానే సినిమా వాళ్ళు ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే పేరు డా. సి.నా.రె. గారిది. ఆయన చెన్నై ఎప్పుడొచ్చినా అక్కడే దిగేవారు. నేను సి. నారాయణ రెడ్డి గార్ని మొదటిసారి చూచిందీ, కలుసుకున్నదీ కూడా అక్కడే. మంచీ చెడూ అడిగారు. సినిమాల్లోకి రావాలనుకుంటున్నానని చెప్పినప్పుడు “ఇదో ప్రవాహం.. ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తూనే వుంటుంది.. రావాలి కూడా.. రా!..” అని ఆశీర్వదించారు.
సి.నా.రె గారే మరో సందర్భంలో “రాగ ప్రాధాన్యమున్న పాటలు వ్రాసిన మా తరానికీ, తాళ ప్రాధాన్యమున్న పాటలు ప్రాధాన్యత సంతరించుకుంటున్న ఈ తరానికీ నువ్వు వారధిలాంటి వాడివయ్యా.. నీ బంగారు కోడిపెట్టల్ని గువ్వాగోరింగల్నీ గమనిస్తూనే వున్నాను” అన్నారు. ఇదంతా ఎందుకంటే ‘సుధారా’ అనంగానే నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తూన్నవి సి.నా.రె. పలుకులే!
సంగీత దర్శకుడు విద్యాసాగర్
నేను వెళ్ళడమే చాలా ఆలస్యంగా వెళ్ళాను. అప్పట్లో నేను ‘మహా బిజీ రైటర్’ని కాదు గానీ, మరీ పొద్దున్నే నిద్ర లేచే అలవాటు ఉండేది కాదు. (ఇప్పుడూ లేదు!..). వెళ్ళేసరికే సిటింగ్ అయిపోయింది. “భయ్యా.. ట్యూన్లు ఫాస్టుగా ఉండటంతో సిటింగ్ తొందరగా అయింది. రెండు సీతారామ శాస్త్రిగారూ, రెండు వెన్నెలకంటిగారూ సెలెక్టు చేసుకుని తీసుకున్నారు. వాళ్ళకి ‘ఛాయిస్’ ఇచ్చి మీకు ‘ఛాయిస్’ ఇవ్వకపోవడం ధర్మం కాదు. వారు తీసుకోగా మిగిలిన రెండు ట్యూన్లకీ మరో రెండు ట్యూన్స్ కలిపి రేపు ఇస్తాను” అన్నారు విద్యాసాగర్.
“లేదు భయ్యా.. కొత్తవి చెయ్యక్కర్లా.. ఉన్నవి నాకివ్వండి.. మీ ట్యూన్ ఏదైనా లిరిక్ వ్రాయడానికి అద్భుతంగా కుదురుతుంది” అని నేనన్నాను.
“అది ఓ.కే కానీ ఇద్దరు రచయితలు డిస్కార్డ్ చేసిన ట్యూన్లని మీకెలా ఇవ్వను” అని సిన్సియర్ గారి అన్నారు విద్యా.
“రాశాక గదా తెలిసేది.. ఏది బాగుందో లేదో.. ముందు సిచ్యుయేషన్ చెప్పండి.. రాసి చూస్తాను. రేపటి దాకా ఆగటం ఎందుకూ?” అన్నాను.
“అలా అయితే O.K” అని సన్నివేశాన్ని వివరించి ట్యూన్ ఇచ్చారు విద్యా. పాట రాగానే వెంటనే మొదలు పెట్టడం నా అలవాటు. అయినా వెంటనే మొదలు పెట్టలేదు. కారణం నిద్రా దేవి నన్ను వదలకపోవడమే. పడుకుని నిద్రపోయి మధ్యాహ్నం, అంటే రెండున్నరకి ఓ ‘మసాలా దోశ’ తిని అప్పుడు పాట మొదలెట్టాను. సన్నివేశం వినండి.
రాజేంద్రప్రసాద్ హీరో, భార్య కాకుండా ‘వేరే’ ఎవరితోనైనా ‘అనుభవం’ ఎలా ఉంటుందోనన్న ఉత్సుకత అతనిది. ఆయన నడవడికని కరెక్టుగా అంచనా వేసినా, అతని మీద ఓ కన్ను వేసుంచే జాగ్రత్త అతని భార్యది.
ఓ రోజు R.P. ఇంటికి రాగానే, “అది వరకు మీరు పిల్లల్ని కాస్తో కూస్తో చదివించేవారు. నా గురించీ, వాళ్ళ గురించీ కొద్దో గొప్పో పట్టించుకునే వారు. ఇప్పుడసలు పట్టించుకోవడం పూర్తిగా మానేశారు” అంటుంది.
“నేనా? నో.. నెవర్.. బిజీగా ఉంటూ కాస్త నెగ్లెక్టు చేశా.. గానీ, నా పంచప్రాణాలూ నీవే & పిల్లలవే డార్లింగ్” అన్నట్టు ఓ బిల్డప్ వైపుకి ఇచ్చి, “ఒరే.. బుక్స్ తెండిరా..” అంటాడు. “ఇప్పుడు నేను కొచ్చిన్లు అడుగుతానన్న మాట, మీరు ఆన్సర్లు ఇవ్వాలన్న మాట.. చెప్పు.. A ఫర్” అని అడగంగేనే బుడ్డోడు “అమల” అంటాడు. “యూ ఫూల్.. ఏఫర్ ఏపిల్ అని చెప్పాలి.. OK.?” అనగానే, “అసలు ఏ బీ సీ డీ లే రానివాడివి నువ్వేం చెబుతావు.. A ఫర్ ఏపిల్ నువ్వు చదువుకున్నది.. మాకు A అంటే అమలే” అంటాడు బుడ్డోడు. “ఓహో కొత్త అల్ఫాబెట్సన్న మాట.. కాస్కో” అని పాటని ఎత్తుకుంటాడు R.P. అదేమనగా.. చిత్తగించండి.
పల్లవి:
A అంటే అమల.. B అంటే భానుప్రియ..
C అంటే చిన్న పులుసూ D ఫర్ దీపికా..
E ఫర్ ఏకాతా.. పాఠాలే నేర్పిస్తా రారా నాన్నా.. ॥A॥
చరణం1:
F ఫాఱా.. G గీతా.. H.. హేమాజీ
I ఫర్ ఇందూపూరీ.. టేకిట్ ఈజీ (R)
J ఫర్ మిస్ జూహీ.. జర్కులిస్తే జామైపోనా..
K.. ఫర్ ఖుష్‌బూజీ.. కిస్సుకొడితే కరుసైపోనా
L.. అంటే లవ్‌లీనా.. లైను వెయ్యి గుంతలకా
M మాధురీ దీక్షితూ.. మిలో మిలో ఐసలకా (R)
అందుకే వచ్చారా పిచ్చి నాయనా.. ॥A॥
చరణం 2:
N అంటే నిరోషా.. మషా అల్లా
O ఫర్ ఓటేసేస్తా మళ్ళా మళ్ళా
P ఫర్ పర్వీన్.. ప్రేమలేక ఉండలేనూ
Q.. ఫర్ ఖుర్షీద్ ముసలిదైనా మరువలేనూ
R.. అంటే రాధా ఆంటీ రైటు కొట్టు గుంతలకా
S అంటే శ్రీదేవి సైటు కొట్టు ఐసలకా
T తులసి U ఉషా.. V విజయశాంతి
WXYZ జూలకటకా.. ॥A॥
(W..వహీదా రెహమాన్.. Z.. జీనత్.. Y.. యమున అప్పటికీ వున్నారు.. ‘X ‘ తప్ప.. కానీ వ్రాయడానికి ‘లెంగ్త్’ లేదు. అందువల్ల WXYZ లని కామన్‌గా జూలకటకాతో ఫినిష్ చెయ్యాల్సి వచ్చింది.. ముఖ్యం ఏమంటే పాటంతా హీరోయిన్ల పేర్లతో వ్రాయడం. అందుకే ఈ పాటలో తెలుగు హిందీ హీరోయిన్ల సంయుక్తంగా సహజీవనం చేశారు. దీనికీ ఓ స్ఫూర్తి ఉందని చెప్పక తప్పదు. ఓ సినిమాలో (పద్మనాభం గారి సినిమా) తెలుగు హీరో హీరోయిన్ల పేర్లతో ఓ పాట వుంటే హిందీ హీరో హీరోయిన్ల పాట ఓ హిందీ సినిమాలో ఉంది. కిషోర్ కుమార్ గారు పాడినది. “రాజ్ కపూరం దేవానందం.. దీలీప్ కుమారం.. అశోక్ కుమారం..” అంటూ. చాలా ఫాస్టుగా పూర్తి చేసిన పాటల్లో ఇదొకటి. కానీ ఇందులో ఓ క్లిష్టత కూడా ఉంది.
తా.. నానా తననా.. తానానా తనానా.. తనానా తానన ఇదీ తత్కారం.
బిగినింగ్ లోనే కరెక్టు పదం పడింది.. A అంటే అమల అని. అలాగే ట్యూన్‌కి సరిపోయేట్టు మాత్రమే గాక ట్యూన్‌లో పూర్తిగా ‘ఇమిడిపోయే’ విధంగా ‘కధానాయిక’ల పేర్లు ఎంచుకోవాలీ.. అదీ ఆ కాలంలో ఇంకా ప్రముఖులుగా వున్న వారి పేర్లు మాత్రమే ఎంచుకోవాలి. ఫేడ్ అవుట్ అయిన వారి పేర్లు మరి జనాలకి జీర్ణం కావుగదా.
Song No.2:
ఇదో సూపర్ ప్రయోగానికి తెలుగులో నాంది పలికింది. ‘ర్యాప్’ సిస్టమ్ హాలీవుడ్‌లో ప్రాముఖ్యత పొందినా తెలుగులోకి ఇంకా అడుగెట్టలా. ఆ టైమ్‌లో ఓ పుల్ పేజీ డైలాగ్స్‌తో పాట మొదలెట్టడం ఓ విదంగా గొప్ప ప్రయోగమే. అత్యంత విచిత్రమైన విశేషం ఏమంటే, ఈ డైలాగ్ ముందర అనుకున్నది కాదు. పాట పూర్తయ్యాక, ఇంకేదన్నా కొత్తగా చేస్తే బాగుటుదని విద్యాసాగర్ అనడమూ, బడి రామారావుగారి టెర్రెస్ మీది పాకలో అప్పటికప్పుడు పది నిమిషాల్లో డైలాగ్స్ రాసి జాయిన్ చెయ్యడం జరిగింది.
డైలాగ్స్ వ్రాశాక అది రాజేంద్ర ప్రసాద్ గారి చేతే పాడిస్తే ఇంకా బాగుంటుందనిపించింది. ఆ పాటా, ABCల పాటా ఎంత సూపర్ హిట్టంటే, పెద్ద హీరోల కేసెట్టు 10 వేల కేసెట్ల లోపులో అమ్ముడైతే, ‘తేనెటీగ’ కేసెట్లు 90 వేలకి పైగా అమ్ముడయ్యాయి. ఆఖరికి గణపతి నిమజ్జనం (హైదరాబాదులో) రోజున కూడా ఈ పాటలే! తరవాత విద్యా అన్నారు “ఇద్దరు రైటర్స్ వదిలేసిన ట్యూన్స్‌ని తీసుకుని super hit songs గా మలిచావు.. శభాష్ భూ” అని.
కానీ నా దృష్టిలో క్రెడిట్ ట్యూన్స్‌దే. ట్యూన్స్‌లో ఓ చిలిపిదనం వుంది. ట్యూన్స్‌లో లిరిక్‍కి సున్నితంగా హాయిగా ఒదిగే గుణం వుంది. అన్నింటికీ మించి ట్యూన్స్‌లో ఏ కాంప్లికేషనూ (క్లిష్టత) లేకుండా సింపుల్‌గా ఒకసారి వింటే శ్రోతల బుర్రకి ఎక్కేలా వున్నాయి. తరువాత్తరువాతి కాలంలో నేను ట్యూన్స్ ఎన్నుకోవడానికి ఈ ట్యూన్లు ఓ పాఠంలా ఉపయోగపడ్డాయని కూడా ఖచ్చితంగా చెప్పగలను. కొన్ని ట్యూన్లు వినేప్పుడు బాగుంటాయి. కానీ అవి వినిపించినంత అద్భుతంగా లిరిక్‌ని తొడుక్కోలేవు. కొన్ని సామాన్యంగా ఉంటాయి. కానీ అద్భుతంగా ఒదుగుతాయి.
ఇంత చెప్పీ లిరిక్ ఇవ్వకపోతే ఎలా.. చిత్తగించండి.
She: అబ్బా.. స్టార్టయింది రా బాబూ.. కారు..
He: ఆ.. విప్పిందిరా.. నోరు.. ఎక్కడికెడదాం..
She: ఎక్కడికంటే అక్కడికెడదాం.. మీరంటే నాకెంతో ఇష్టం
He: బీచికి పోదామా?
She: ఊహూ.. ఇంకెక్కడికైనా.. మీరంటే నాకెంతో ఇష్టం
He: సినిమాకెళ్దామా?
She: ఊహూ.. ఇంకెక్కడికైనా.. మీరంటే నాకెంతో ఇష్టం
He: పోనీ హోటల్ కెల్దామా?
She: ఊహూ.. ఇంకెక్కడికైనా.. మీరంటే నాకెందో ఇష్టం..
He: ఇష్టం ఇష్టం అంటున్నావ్ మరి ఎక్కడికీరానంటున్నావ్..
She: ok.. మీ ఇంటికి పోదాం..
He: అయ్యో.. నా పెళ్ళాం వుందీ
She: ఐతే.. మా ఇంటికిపోదాం..
He: ఏం.. మీ ఆయన లేడా..
She: ఊహూ..
He: నీ బ్రదరూ లేడా?
She: ఊహూ..
He: ఇంకెవరూ లేరా
She: ఊహూ..
He: ఐతే సరే మీ ఇంటికొచ్చేస్తా.. నీ వెంట వచ్చేస్తా.. కోరింది కొట్టేస్తా..
She: వెంటవస్తే ఇంటికొస్తే.. లడ్డిస్తా.. లస్కిస్తా..
గంప కింద కోడిస్తా.. కోడిపెట్టిన గుడ్డిస్తా..
ఏం కావాలీ.. నీకేం కావాలీ.. ఇంకేం కావాలీ
~
పల్లవి:
ఆమె:
ముద్దుల్ కావలెనా.. మురిపాల్ కావలెనా
మొత్తం కావలెనా చిట్టినాయనా
ఆహూ.. ఆహూ..
అతడు:
ముద్దుల్ కావలెనే.. మురిపాల్ కావలెనే..
మొత్తం కావలెనే.. చిట్టి అమ్మడు
ఆహూ.. ఆహూ..
(‘ముద్దుల్ కావలెనా.. మురిపాల్ కావలెనా’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=FQiSUD-6BSc)
కావల్సినంత నవ్యత, వేగం, అద్భుతమైన సంగీత జ్ఞానం వున్న విద్యాసాగర్‌కి, ఆనాడే సూపర్ హిట్స్‌ని క్షణాల్లో ఇచ్చిన విద్యాసాగర్‌కి ఎందుకు అద్భుతమైన అవకాశాలు రాలేదో నాకిప్పటికీ అర్థం కాదు. ‘ముగ్గురు మొనగాళ్ళు’ లాంటి అద్భుతమైన హిట్ ఇచ్చినా మరి తెలుగువారు విద్యాని ఎందుకు ఉపయోగించుకోలేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు.
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు”, “మహతి”, “పాండిబజార్ కథలు” అనే పుస్తకాలు వెలువరించారు.
