Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితం ఓ ప్రయాణం-16

[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]

~

K.. K.. K.. కూ.. ఛుక్..ఛుక్..:

మొదటి K.. కె. రాఘవేంద్ర రావుగారిది. రెండో K. కె. కృష్ణ మోహన్ గారిది. మూడవ K.. కీరవాణిగారిది.. అదీ MMK.. మరకత మణి కీరవాణిగారిది. కీరవాణిగారి తొలి పరిచయం ప్రకాష్ స్టూడియోలో, RK అసోసియోష్స్ నిర్మించిన ‘అల్లరి మొగడు’ మ్యూజిక్ సిటింగ్‍లో జరిగింది. రాఘవేంద్ర రావుగారిని అంతకుముందు ‘రౌడీ అల్లుడు’ సమయంలో కలిసినా, అది పరిచయమూ, సాంగ్స్ వినిపించడం దగ్గరే ఆగింది. R.K.వారి పిలుపు అందుకుని ప్రకాష్ స్టూడియోస్‌లో అడుగు పెట్టడం మాత్రం మరచిపోలేని మధుర జ్ఞాపకం.

రాఘవేంద్రరావుగారు అప్పటికే సినీ వినీలాకాశంలో దర్శక ధృవతార. దర్శకేంద్రుడని అందరి నోటా కీర్తింపబడిన వారు. ఇక కీరవాణి గారి సంగతి సరేసరి. మెలోడీకి మారు పేరుగా దూసుకొస్తున్న యువ సంగీత దర్శకుడు.

“టిఫిన్ చెయ్యండి.. తర్వాత మాట్లాడుకుందాం” అన్నారు రాఘవేంద్రరావుగారు. కానిచ్చాం. సిచ్యుయేషన్ చెప్పారు. కీరవాణిగారు ట్యూన్ వినిపించారు.

“అబ్బా ననుగన్న అమ్మా బాబూ గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ” అని మొదటి లైన్‌తో ఏవో ట్యూన్ వినిపించారు. అలాగే చరణాలు. ఎక్కువగా అప్పుడు ట్యూన్లు చెయ్యడానికి హార్మోనియంనే ఉపయోగించే వారు సంగీత దర్శకులు.

ఇళయరాజా, చక్రవర్తి, విద్యాసాగర్, కృష్ణతేజ, అందరూ హార్మోనియంనే ఉపయోగిస్తే, వాసూరావు, కోటి గిటార్ ఉపయోగించేవారు. అఫ్‍కోర్స్ హార్మోనియంలో notes పలికించడానికి అసిస్టెంట్స్ ఉండే వారనుకోండీ.

“ఓ పాతిక పల్లవులు వ్రాసి తీసుకురండి కవిగారూ” అన్నారు రాఘవేంద్రరావుగారు.

“సార్.. ఫస్ట్ లైన్ అద్భుతంగా వుంది. కీరవాణి గారి ఆ లైన్‌నే పల్లవి మొదటి లైనుగా వాడుకుంటా. రెండో విషయం ఏమంటే పాతిక పల్లవులంటే నా మనసు చెదరి ఏకాగ్రత వుండదు సార్. ఒకటి రాస్తా. బాగోలేకపోతే మరోటి.. ఈ పద్దతే నాకు అలవాటు సార్” అని వినయంగా చెప్పాను.

“సరే.. నాకు నచ్చాలి మరి” నవ్వి అన్నారు. ఆ రోజు సాయంత్రానికే పాట రెడీ అయింది. OK కూడా అయింది.

‘అల్లరి మొగుడు’ సినిమాలో హీరో మోహన్ బాబుగారు, హీరోయిన్లు రమ్యకృష్ణ, మీనా.

(‘అబ్బా ననుగన్న అమ్మా బాబూ గుర్తొచ్చారోయబ్బా ఈ మగాడి దెబ్బ’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=kPjSNGZWZUI)

రాఘవేంద్రరావుగారి దర్శకత్వంలో నేను పని చేసిన సినిమాలు వేళ్ళ మీద లెక్కబెట్టొచ్చు. కానీ అవన్నీ సూపర్ డూపర్ హిట్స్. అలాగే కీరవాణి గారితో కొంచెం ఎక్కువ సినిమాలే చేశాను. కీరవాణి గారి శ్రీమతి శ్రీవల్లి నాకు కూతురులాంటిది. అందుకే కీరవాణి గార్ని అప్పుడప్పుడూ, ఆ వరసలో పిల్చేవాణ్ని. ఎప్పుడు AVM ‘G’ కి వెళ్ళినా ఓ చాక్లెట్ శ్రీవల్లి గారికి ఇచ్చేవాడ్ని. చాలా చాలా మంచి వ్యక్తే గాదు, మనసున్న మనిషి కీరవాణిగారు. “అందరూ పెరగాలి” అనుకునే మనస్తత్వం. ఏది చెప్పినా స్పష్టంగా నిర్మోహమాటంగా చెబుతారు. జీవితాన్ని అన్ని కోణాల్నీ చూసిన అనుభవశాలి.

కీరవాణిగారి దగ్గరే మణిశర్మగారు, రిక్కీ సుప్రసిద్ధ కీబోర్డ్ ప్లేయర్స్‌గా పని చేశారు. తరవాత వారు సుప్రసిద్ధ సంగీత దర్శకులయ్యారు. అక్కడే తబలా జెమినీ రావునీ, KD విన్సెంట్ నీ కలిగింది. ఇప్పటికీ వారందరూ నా స్నేహితులే. కల్యాణి మాలిక్, MM శ్రీలేఖ, అందర్నీ అక్కడే కలిశా. శ్రీలేఖ, కల్యాణీ మాలిక్ ల సంగీత దర్శకత్వంలో చాలా పాటలు వ్రాశాను.

రాఘవేంద్రరావుగారు చాలా జోవియల్. మాట్లాడేది తక్కువయినా హాయిగా ఆహ్లాదం కలిగించేలా వుంటుంది. పాటకి ఏం కావాలో, ఎలా వ్రాయించుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ఏం తియ్యబోతున్నారో కూడా అతి స్పష్టమైన అవగాహన కలిగిన దర్శకులాయన. తెలుగు పాటని అద్భుతమైన శిల్పంగా వెండి తెర మీద మలిచే కలల శిల్పి ఆయన. “చెప్పీ చెప్పకుండా, కప్పీ కప్పకుండా, విప్పీ విప్పకుండా” శృంగారాన్ని అద్భుతంగా తెరకెక్కించే ప్రజ్ఞ ఆయన స్వంతం.

రౌడీ అల్లుడు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, ఘరానా మొగుడు, సాహాస వీరుడు సాగర కన్య, రాజసింహం.. ఇలా చాలా కొద్ది సినిమాలే రాఘవేంద్రరావు గారితో చేసినా, ఆయన పని తీసుకునే విధానం మాత్రం నాకు బాగా నచ్చేది. ఎందుకంటే, పాట వ్రాయడం అనేది సున్నితమైన వ్యవహారం. దాన్నో ‘పరిశ్రమ’ కింద చెయ్యకుండా వుండాలంటే రచయితకి తగినంత సమయమూ స్వేచ్ఛా ఇవ్వాలి. అవి పుష్కలంగా ఇచ్చే వారు K.R.R.

***

మంచి అవగాహన ఒకరి మీద ఒకరికున్న నిర్మాత దర్శకుల్లో V. బాలాజీరావు, Y. నాగేశ్వరరావుగార్ల జంట ఒకటి. చాలా జోవియల్‌గా కథనీ కథనాన్ని ట్రీట్ చెయ్యడం Y. నాగేశ్వరరావుగారి ప్రత్యేకత. ఓ గంట ఆయనతో కలసి తిరిగిన వాడు ఆయనకి ఆజన్మాంతం స్నేహితుడుగానే వుంటాడు. ఆ పరిస్థితికి నేనూ ఎగ్జెంప్షనమీ కాదు. అంతటి స్నేహశీలి Y.N.R.

~

మ్యూజిక్ సిటింగ్‌కి పిలుపొచ్చింది. కీరవాణి గారితో ఆల్రెడీ పరిచయం వుంది గనక కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాను (అన్నట్టు యీ సినిమాకి కీరవాణి గారు ఇచ్చిన ట్యూన్స్ ఇంకా నా దగ్గర పదిలంగానే వున్నాయి.).

నాగేశ్వరరావుగారు సిచ్యుయేషన్ చెప్పడం, కీరవాణిగారు ట్యూన్ ఇవ్వడం ఫటఫటా జరిగిపోయాయి.

కీరవాణి గారు అలవాటు ప్రకారం పల్లవి ఫస్ట్ లైన్ ఆయనే ఇచ్చారు – “చలిగా వుంటే.. సలహా ఇస్తా” అని

“సలహా ఇస్తే.. యమహో వస్తా” అని దానికి జతగా నేను రాశాను.

ఆ తరవాత –

“వెచ్చంగా పక్కలేశా నీ దిండు తెచ్చుకో..
ఆ పైన సుబ్బరంగా దుప్పట్లో దూరిపో”

ఇలా హాయిహాయిగా పాట పూర్తయింది.

ఆ తరవాతి పాట

“అద్దరాతిరేళ హరిలో రంగా..
మొదలెడదాం వయ్యారంగా
సద్దురేగుతోంది భజగోవిందా
సిగ్గు తియ్యమాక వినరా రంగా”

ఇలా సెక్సీగా సాగిపోతూ రెండో పాటా గమ్యం చేరింది.

ఒక మాట మాత్రం నిజం.. ఆ సినిమా సూపర్ హిట్ కావడానికి అందులో సాహితి రాసిన “లాలూ దర్వాజ లష్కర్ బోనాల్ పండగకి వస్తనని రాకపోతివి” పాట ముఖ్య కారణం.

సాహితిగారి అసలు పేరు చెరుకుపల్లి శ్రీరామ చంద్రమూర్తి. చదివినది MSC అయినా చేసింది మాత్రం సాహితీ వ్యవసాయం. అదింకా నిర్విఘ్నంగా, నిరాఘంటంగా సాగుతూనే వుంది. చాలా చాల మంచి మనిషి. సూర్యగమనం లాగా అతను నిరంతరం నడుస్తూనే వుంటారు.. ఎన్ని మైళ్ళు రోజుకి నడుస్తోరో లెక్కకట్టడం కష్టమే.

మాండలికాల మీద అంటే తెలంగాణా, కళింగాంద్రా, రాయలసీమ లాంటి మాండలికాల మీద అద్భుతమైన పరిశోధన చేశారు. అందువల్ల భాష మీద అపారమైన ‘పట్టు’ వుంది. పుట్టింది కృష్ణా జిల్లా మైలవరం మడలంలోని ‘వెల్పడం’ గ్రామంలోనైనా వృత్తి రీత్యా ప్రవృత్తి రీత్యా అతను తిరగని గ్రామం లేదు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళం, ఈ నాలుగు భాషలూ సాహితికి కొట్టిన పిండే. ఓ సినిమాకి దర్శకత్వం కూడా వహించిన సాహితి ఓ అరుదైన రికార్డు కూడా స్థాపించారు. “చిక్ పక్ బకు” అని అతను రాసిన ప్రయివేట్ సాంగ్స్ (సంగీతం రాజ్-కోటి) 160 లక్షలకి పైగా అమ్ముడుబోయి పాతికేళ్ళ క్రిందట రికార్డు సృష్టించాయి. అంతే కాదు. అతను ‘గబ్బర్ సింగ్’ సినిమాకి రాసిన “కె..వ్వు.. కేక” సాంగ్ ఇంకా సంచలనాలని సృష్టిస్తూనే ఉంది.

***

‘మొండి మొగడు.. పెంకి పెళ్ళాం’ గొప్ప విజయాన్ని సాధించింది. సుమన్ – విజయశాంతి జంట సూపర్ హిట్టయింది. ఓ హిట్ ఫిలిమ్‌లో భాగస్వామి కావడం ఎప్పుడూ ఆనందకరమే. అన్నట్టు ఈ రెండు పాటలు పాడింది కూడా SPB – చిత్రలే. ‘లాలూ దర్వాజ’ పాట పాడింది SP శైలజ.

(‘లాలూ దర్వాజ లష్కర్ బోనాల్ పండగకి వస్తనని రాకపోతివి” పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=KsKBGsX8m9U)

“నాంపల్లి టేసను కాడా రాజాలింగో.. రాజా లింగా” పాట గుర్తే వుండే వుంటుంది మీకు. అంతే కాదు సాగర సంగమంలో జయప్రద కూతురిగా SP శైలజ గారి నటన ఎవరూ మర్చిపోలేదు. సింగర్, డాన్సర్ అన్నిటికీ మించి చాలా చాలా ఎత్తుకెదిగిన ఆధ్యాత్మికవేత్త. అత్యంత నిగ్రహంతో మెలగడం, సుఖదుఃఖాలకు అతీతంగా ఉండటం శైలజగారిలోని గొప్పగుణాలు. అద్భుతమైన వ్యక్తిత్వం. చిత్రం ఏమంటే, నిజంగా ఆమెకి దక్కాల్సిన, దక్కి తిరాల్సిన స్థాయి ఆమెకి దక్కలేదు. కారణాలు బోలెడు. అవన్నీ గాలికి కొట్టుకుపోయే కారణాలే గానీ, నిలబడేవి కావు. ఒకటి మాత్రం నిజం. మనకి వున్న గొప్ప గాయనీమణుల్లో SP శైలజ ఒకరు.

***

‘ఛాంపియన్’ – ఇది సినిమా పేరు. D.V.S. ప్రొడక్షన్స్ వారిది. DVS రాజు గారి గురించి చాలా విన్నాను. నేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (NFDC) కి వారు ఛైర్మన్. రాఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత. పద్మశ్రీ బిరుదాన్ని పొందారు భారత ప్రభుత్వం నించి.

‘మంగమ్మ శపథం’ సినిమా గురించి ఎన్నడూ మరిచిపోలేదు. ఆ సినిమానే గాక పాతిక సినిమాలకి పైగా నిర్మాత. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అజాతశత్రువే కాదు.. ఏ సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించే భీష్మాచార్యులవారు కూడా .

వారి ఆఫీసు నించి పిలుపు రావడం అంటే, అప్పుడప్పుడే పైకొస్తున్న నాకు వంద మెట్లు ఒక్క గంతులో ఎక్కినట్లు అనిపించడం అసహజం ఏమీ కాదు గదా.

వారి ఆఫీసుకు వెళ్ళగానే ఆనందం కలిగింది. కారణం సంగీతం విద్యాసాగర్, దర్శకత్వం Y. నాగేశ్వరరావుగార్లది కావడం. ఇక DVS రాజుగారైతే చాలా ఆప్యాయత నిండిన స్వరంతో పలుకరించి, కాఫీ, వగైరాలు ఇప్పించి, నా ప్రొగ్రెస్ గురించి చక్కగా అడిగి తెలుసుకుని, నా ‘బెరుకు’ తగ్గించారు.

విద్యా – నేను అక్కడికక్కడ కూర్చుని పాట వ్రాయడమే గానీ, ఇవ్వాళ ట్యూనిచ్చి వారం తరవాత మర్రోజు పాట వ్రాయడం జరగలా. ఆ రోజే DVS రాజుగారి ఆఫీసులోనే పాట పూర్తయింది.

“కొక్కొరోకో కోడి పలావూ” అనేది పల్లవి. హీరో సుమన్. టీజింగ్ సాంగ్. రాజుగారు కూడా పాట విని ఆనందించారు. డబ్బుని భద్రంగా కవర్లో పెట్టి అప్పటికప్పుడే ఇచ్చారు. సీనియర్ నిర్మాతల పద్ధతి అది. రచయితలకి వారిచ్చిన గౌరవం అది. రెమ్యూనరేషన్ కోసం అటువంటి నిర్మాతల ఆఫీసులకి ఏ కవీ తిరగలేదు. సినిమా నిర్మాణాన్ని ఆత్యంత గౌరవంగా, ప్రతిష్ఠాత్మకంగా భావించినవారు వారు.

ఆ తరం కాల గర్భంలో కలిసిపోయింది. లాభ నష్టాలు, హిట్లు ఫ్లాప్పులూ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఉన్నా, నేటి తరానికి సినిమా సినిమానే కానీ జీవితం కాదు. ఇది అందరి గురించీ నేననడం లేదు. ఈనాడూ సినిమా అంటే ప్రాణం పెట్టే నిర్మాతలూ దర్శకలూ రచయితలూ సాంకేతిక నిపుణులూ వున్నారు. కానీ వారి సంఖ్యాబలం తక్కువ. నిజానికి ఇప్పుడు చాలా చోట్ల నేను చూస్తున్నది ‘డిక్టేషన్’, ‘డిస్కషన్’ కాదు.

***

మేఘమా.. మరువకే..

EVV గారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మెలోడీ అంటే ప్రాణం. EVV & రాజ్ కోటి గార్లు సినిమా అంటే సంగీతం అద్భుతంగా అమరుతుందని అందరికీ తెలుసు. అలాగే నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ గారికి కూడా సంగీతం అంటే చాలా అభిరూచి. పాట మొదలు పెట్టిన దగ్గర్నించీ, చివరి దాకా దగ్గర కూచుని మరీ వ్రాయించుకునేవారు. ‘సీతారత్నంగారి అబ్బాయి’ సినిమానే అందుకు నిలువెత్తు ఉదాహరణ. వాణిశ్రీగారి నటన హైలైట్. వారితో సినిమాలో రచయితగా పని చేయడం నాకిదే మొదటి సారి. చాలా హాయిగా, జోవియల్‌గా, ఏ మాత్రం ‘అహంభావం’ లేకుండా అందరితో కలిసి పోయే వ్యక్తి వాణిశ్రీగారు. సత్యనారాయణగారి గురించి చెప్పడం అంటే ఆకాశాన్ని అద్దంలో చూపించడమే.

MVVS బాబురావుగారి రచనా సహకారం సినిమాకి కావలసినంత మసాలాని జోడించింది.

మరో మజా ఏమంటే, భోజనాల్లో ఈస్ట్ గోదావరి ఊరగాయల ఘుమ ఘుమ. బాబురావుగారు దగ్గరుండి మరి ‘కంద బచ్చలి’ లాంటి కాంబినేషన్స్ చేయించేవారు. జీళ్ళు,పూతరేకులు, వేరుశనగ, శనగపప్పు, మరమరాల వుండలు అప్పుడప్పడూ అరసెలు కాజాలూ అంతా పెళ్ళి విందులా, పెళ్ళి సందడీ.

నాకు అత్యంత ఇష్టమైన పాటల్లో ఒకటి ఈ ‘మేఘమా మరువకే’ పాట. పల్లవి అంతా ‘మ’కారమే.

SPB గారు కూడా ఎన్నో “పాడుతా తీయిగా” కార్యక్రమాల్లో ఈ పాట గురించి నాలుగు మంచి ముక్కలు చెప్పారు. క్రెడిట్ అంతా అద్భుతమైన బాణీని అందించిన రాజ్-కోటిలకే.

పల్లవి:
అతడు: మేఘమా.. మరువకే
ఆమె: మోహమా విడువకే
అతడు: మాఘమాశ వేళలో మల్లెపూల మాలగా
ఆమె: మరుని కూడి మెల్లగా మరలి రావే చల్లగా
అతడు: మదిలో..
ఆమె: మెదిలే
అతడు: మధువై.. ఓ.. ॥మేఘమా॥

చరణం 1:
అతడు: నిదుర కాచిన కన్నె పానుపే రారా రమ్మంటుంటే
ఆమె: కురులు విప్పిన అగరు వొత్తులే అలకలు సాగిస్తుంటే
అతడు: సిగ్గే ఎరుగని రేయిలో.. తొలి హాయిలో.. అలివేణీ
ఆమె: రవికే తెలియని అందమూ.. అందించనా నెలరాజా
అతడు: కలలా..
ఆమె: అలలా
అతడు: మెరిసీ.. ॥మేఘమా॥

చరణం 2:
ఆమె: గడుసు ముడుపులే పరుపువిరుపులై గిచ్చే సందడిలోనా.
అతడు: తడవ తడవకీ పెరుగుతున్నదే ఏదో మైకం భామా..
ఆమె: మరుగే ఎరుగని కోనలో.. ఆ మోజులో మహారాజా
అతడు: నలిగే మల్లెల సవ్వడి వినిపించదా నెరజాణా
ఆమె: జతగా..
అతడు: కలిసీ..
ఆమె: అలసీ.. ఓ ॥మేఘమా॥

***

ట్యూన్‍లో మెలడీ ఉన్నప్పుడు పదాలు సింపుల్ గానూ, అర్థమయ్యేవి గానూ పడితే పాట ప్రజల హృదయాలను తాకుతుంది. ఎంత లలితమైన పదాలు వాడితే అంత సౌందర్యం సంతరించుకుంటుంది పాట.

పాట ఎంత గొప్పగా వున్నా, టేకింగ్ గనక సరిగ్గా లేకపోతే అదొక మైనస్ పాయింటవుతుంది సినిమాకి. EVV గారి టేకింగ్ అద్భుతం. సింపుల్‌గా తీస్తారు.. కానీ కన్నుల పండుగగా తీస్తారు. సింపుల్‌గా వుంటూనే బ్యాక్‌గ్రౌండ్ కొత్తగా వుంటుంది.

(‘మేఘమా.. మరువకే..’ పాటని యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=93MMqOJ35Sc)

పాటని అద్భుతంగా ప్రజంట్ చెయ్యడంలో కె.రాఘవేంద్రరావు గారూ, EVV గారూ, ఇద్దరూ ఇద్దరే.

నా అదృష్టం ఏమంటే, ఈ సినిమాలోని మిగతా రెండు పాటలూ కూడా మెలొడీసే.

“ఆ పాపి కొండల్లో.. ఈ పాప గుండెల్లో.. ఎన్నో ఊసులు..”

“మత్తుగా.. గమ్మత్తుగా.. చిత్తుగా.. చెంగొత్తగా”

పాడినది SPB గారూ, చిత్రగారూ.

ఇదే బ్యానర్‌లో (శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్ ఫిలిమ్స్) ఈ సినిమా తరవాత ‘ఏవండీ ఆవిడ వచ్చింది’, ‘కలిసుందాంరా’, ‘ఒక చిన్నమాట’ ఇలా వరసగా సినిమాలు చేశాను. ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ లో నాది సింగిల్ కార్డు. దానికీ డైరెక్టర్ EVV, మ్యూజిక్ రాజ్-కోటి గార్లు. అదో మజా.

“మేఘమా మరువకే” పాట నాకు ఎంతో పేరు మాత్రమే కాదు, మనసుకి ఆనందాన్ని కూడా ఇచ్చిన పాట.

***

దాసరి నారాయణరావుగారు మంచి మాటలు (స్క్రీన్ ప్లే) కథ రచయితా దర్శకులే కాదు, మంచి పాటల రచయిత కూడా. కొన్ని పాటలు నా కళ్ళ ముందే ఆయన వ్రాయడం చూశాను. ట్యూన్‌కి పాటలు వ్రాయడం కాదు.. పాటలు వ్రాసి ట్యూన్ కట్టించడం.

అతి మామూలు పదాలలో కూడా పాట వ్రాయడం సులభ సాధ్యమేనని నిరూపించిన వారిలో ఆయన ఒకరు.

‘సుబ్బారాయుడి పెళ్ళి’ సినిమాకి పిలిపించారు. మ్యూజిక్ సిటింగ్స్ కోడంబాకం తారక ప్రభు ఆఫీస్ లోనే. సంగీతం వాసూ రావుగారు. హీరో రాజేంద్రప్రసాద్.

నన్ను చూసినప్పుడల్లా “చంద్రయ్యా” అని పిలుస్తారు రాజేంద్రప్రసాద్ గారు. జీవితపు లోటుపాట్లు ఎరిగిన మనిషాయన. స్వయంకృషితో నిలదొక్కుకున్న నటుడు. నా మొదటి సినిమా మరో హీరోగా చంద్రమోహన్‌తో నటించింది రాజేంద్ర ప్రసాదే. చాలా వెర్సటైల్ ఆర్టిస్టు. సెట్‍లో వుంటే సెట్టంతా నవ్వులే. ఈ పాట రికార్డింగ్ జరిగింది SPKP Audio Lab లో.. అంటే SP బాల సుబ్రమ్మణ్యంగారి రికార్డింగ్ థియేటర్‌లో.

SP గారికి కోదండపాణి గారంటే ఎంత గౌరవమంటే, వారి థియేటర్‌కి S.P.కోదండపాణి ఆడియో లాబ్ అని పేరు పెట్టారు. రాజ్-కోటి గార్లు, తరవాత కోటి అక్కడే మ్యూజిక్ కంపోజింగ్ రూమ్‌లో స్థిరంగా మ్యూజిక్ చేసేవారు. ఇక వాసురావు గారూ SPB గార్లయితే “బావా.. బావా” అని పిలుచుకుంటారు.

“అయ్యోరయ్యోరబ్బా.. అదిరిందయ్యా బుగ్గా.. మజాగా” అన్నది పల్లవి. దాసరి నారాయణరావుగారు చిన్న చిన్న మార్పులు చెబితే అక్కడికక్కడే మార్పు చేసిన సంగతి జ్ఞాపకం వున్నది.

బాలూ గారూ చిత్రగారు గాయనీ గాయకులు,

బ్యానర్ పేరు – గౌరీశంకర్ క్రియోషన్స్.

శ్రీ సిద్ధారెడ్డి – చంద్రారెడ్డి, మునికృష్ణగార్లు నిర్మాతలు.

నాకు బాగా గుర్తున్న సంగతేమంటే పాట పూర్తయ్యాక నన్ను మొదటిసారి వాసూరావుగారు ఆంధ్రా క్లబ్ (ఆంద్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ – ఆస్కా) కి తీసుకెళ్ళడం, అక్కడో గంట హయిగా డ్రింక్స్‌తో రిలాక్సవడం, ‘వాంటన్’ అనే మంచింగ్ అయిటమ్ (ప్యూర్ వెజ్) ని నేను ఇష్టంగా మెచ్చుకోవడం.. దాంతో వాసురావుగారు ఏకంగా 3 ప్లేట్లు తెప్పించడం.

(ఇంకా ఉంది)

Exit mobile version