[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]
~
రికార్డింగ్ పూర్తయ్యాక కోటిగారన్నారు.. “ఎవార్డ్ అంటే దీనికివ్వాలి..!” అని.. ఆ మాట నిజమైంది. జేసుదాస్ గారికి ఈ పాటకి నంది అవార్డొచ్చింది.
జేసుదాస్ గారంటే నాకు IAFలో ఉన్నప్పటి నించీ అత్యంత అభిమానం. వారు పాడిన కనీసం ఓ 30, 40 మళయాళం పాటలు అర్ధరాత్రి అడిగినా నేను పాడగలను. ఇక ఆయన హిందీలో పాడిన పాటలు నార్త్‌లో చరిత్ర సృష్టించాయి.
ఆయన నా పాట పాడటమా..! ఒకేసారి రెండు మూడు ఏనుగులెక్కినట్టు అనిపించింది.
అదయిపోయాక ‘ప్రియతమా’ పాట ట్యూన్ ఇచ్చారు. ఆ పాట కథలోకి వెళ్ళేముందు ‘ఇదేలే తరతరాల చరితం’ పాటని చిత్తగించండి.
~
చిత్రం: పెద్దరికం
బేనర్: సూర్యచిత్ర,
నిర్మాత, దర్శకత్వం: A.M.రత్నం
సంగీతం: రాజ్ కోటి
రచన: భువనచంద్ర
నటీనటులు: భానుమతి, పిళ్ళై, చంద్రమోహన్, జగపతిబాబు, సుకన్య, రామిరెడ్డి, విజయకుమార్, కవిత, మొదలైనవారు.
~
పల్లవి:
ఇదేలే తరతరాల చరితం.. జ్వలించే జీవితాల కథనం
పగేమో ప్రాణమయ్యేనా.. ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా.. ఆశలే రాలిపోయేనా ॥ఇదేలే॥
చరణం1:
ఒడిలో పెరిగిన చిన్నారినే
ఎరగా చేసినదా, ద్వేషమూ
కథ మారదా?.. ఈ బలి ఆగదా..
మనిషే పశువుగ మారితే
కసిగా శిశువుని కుమ్మితే
అభమూ శుభమూ తెలియని
వలపులు ఓడిపోయేనే.. ॥ఇదేలే॥
చరణం 2:
విరిసీ విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లారవా
ఆపేదేలా.. ఓదార్చేదెలా..
నీరే నిప్పుగ మారితే
వెలుగే చీకటి రువ్వితే..
సెగలో పొగలో మవుతల పూవులు
కాలిపోయేనా.. ॥ఇదేలే॥
***
ఇప్పుడైతే AM రత్నంగారు వలసరవాకంలో నేనుండే వీధికి అవతల రెండో వీధిలో ప్రొడక్షన్ ఆఫీసు పెట్టుకున్నారు గానీ, ‘పెద్దరికం’ టైమ్‌లో వారి ఆఫీసు బోగ్ రోడ్లో వుండేది.
పెద్ద చెయ్యి.. పెద్ద మనసు.. అందుకే ఆయన నిర్మించే చిత్రాలు అతి భారీవి. ‘నాయక్’ నిర్మించినప్పుడు ఇండియాలోనే కాస్ట్లీయస్ట్ సినిమా అది. ఆఫీసు పెద్దదే.
ఇప్పుడు ఆయన ఆఫీసే ఓ గుడిగా మారింది. అంటే ఓ పక్క ఆఫీసూ.. ఇవతలి పక్క శ్రీ శిరిడీ సాయిబాబా గుడి. ఆ గుడి వార్షికోత్సవానికి అప్పటి తమిళనాడు గవర్నర్ మాన్యులు శ్రీ కొణిజేటి రోశయ్యగారు వచ్చారు. ఈ చుట్టు పక్కల ఎక్కడా శిరిడీ బాబ గుడి లేకపోవటం, స్థాపించిన ముహూర్త బలం + స్థాన బలం వల్ల ‘గుడి’ రద్దీ చెప్పనక్కర లేదు. గురు, శని, ఆదివారాల్లో జనాన్ని కంట్రోల్ చేయటానికి సెక్యూరిటీ జవాన్లు తప్పనిసరి. నిత్యం మూడు పూట్లా ప్రసాద వితరణ జరుగుతుంది. చెన్నైలోనే అతి గొప్పగా అయ్యప్ప పూజ జరిపించేవారు రత్నంగారు. ఏనుగులూ గుర్రాలూ తప్పెట్లూ తాళాలతో ఊరేగింపులో పూజ ప్రారంభమయ్యేది. ఇహ భోజనాలు ఎంత మంది చేస్తారనేది లెక్క తేలీదు.
అయ్యప్ప పూజ అంటే నిండుగా గుర్తుకొచ్చేది బజుల్లా రోడ్డు లోని దాసరి గారి ఇల్లు. అఖండ భజన అనగానే అందరికీ అహ్వానాలు అందేవి. తెలుగు తమిళ కన్నడ మళయాళ నటులు, నటీమణులూ, దర్శకులూ నిర్మాతలు, సాంకేతిక నిపుణులూ – ఓహ్.. దాసరి నారాయణరావుగారి ఇల్లంతా సెలబ్రిటీస్ తోటి నిండిపోయేది. పదుల సంఖ్యలో వుండే వారి అసిస్టెంట్స్, అసోసియేట్స్ ఆహ్వానితులకు సకల మర్యాదలూ అందేట్టు చూసేవారు. వచ్చిన వారందరూ భోంచేసి వెళ్ళాల్సిందే.
‘ప్రియతమా’ ట్యూన్ ఇచ్చిందీ, నేను పాట పూర్తి చేసిందీ వారి బోగ్ రోడ్ ఆఫీసులోనే. ఆయనకీ సాహిత్యం మీద మక్కువ ఎక్కువే. చాలా ఉత్సాహంగా కుతూహలంగానూ గమనించేవారు.
~
అతడు:
ప్రియతమా.. ప్రియతమా.. తరగనీ.. పరువమా
తరలిరా.. తరలిరా.. కన్నెగోదారిలా..
కొంటె కావేరిలా.. నిండు కౌగిళ్ళతో చేరరావే..
ఆమె:
ప్రియతమా.. ప్రియతమా.. తరగనీ విరహమా
తరలిరా.. తరలిరా.. మాఘమాసానివై.. మల్లె పూమాలవై
నిండు నా గుండెలో.. ఊయలూగా.. ॥ప్రియతమా॥
~
కొన్ని పాటలు వ్రాశాక మనసుకి హాయి కలుగుతుంది.
‘పెద్దరికం’ నాకు మనో తృప్తిని కలిగించిన సినిమా. జాబ్ శాటిస్ఫేక్షన్ అంటాం కదా.. అదన్నమాట. ‘ప్రియతమా’ పాట అయిన మరుసటి రోజున పిలిచి, ‘నీ నవ్వే చాలు చామంతీ’ పాట ఇచ్చారు. అదీ మెలోడీనే.
~
పల్లవి:
అతడు:
నీ నవ్వే చాలు చామంతీ.. పూబంతీ..
ఆమె:
ఆ మాటే చాలు నెలవంకా రా ఇకా
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక..
అతడు:
విలాసాల దారి కాశా.. సరాగాల గాలమేశా
ఆమె:
కులాసాల పూలకోశా.. వయారాల మాల వేశా
అతడు:
మరో నవ్వు.. రువ్వ.. రాదటే ॥నీ నవ్వే॥
***
ఇది లవ్ డ్యూయెట్ కాదు. లవ్ చేస్తున్నట్టు నటిస్తూ ముగ్గులో దించే పాట. అప్పటికి హీరో హీరోయిన్ల మధ్య వున్నది ‘పగ’ మాత్రమే. అయితే అది బయటికి కనపడకూడదు.
‘పెద్దరికం’ వంద రోజులాడింది. అదో అద్భుత విజయం. తొలి సినిమాలోనే సెంచరీ కొట్టడం తేలిక కాదు. కానీ రత్నంగారు సెంచరీ సాధించారు.. దిగ్విజయంగా.
అందరికీ నాడు మరో surprise ఇచ్చారు. అప్పటి వరకూ ఇండస్ట్రీ ఎరుగని అత్యంత బరువైన మొమెంటో ‘పెద్దరికం’ది. రెండు కోడి పుంజులు.. కత్తులు కట్టుకుని పందానికి రెడీగా వున్నట్టు వుంటాయి. కంచుతో చేసిన కోడి పుంజులు. పాలరాతి బేస్.
జ్ఞాపికలు అందుకున్నవారే గాదు, ఆ విజయోత్సవానికి వచ్చిన వారంతా కూడా ఆ జ్ఞాపికల గురించి ఆశ్చర్యంగా మాట్లాడుకున్నారు.
‘పెద్దరికం’ తరవాత ఎన్నో సినిమాలు రత్నంగారి బేనర్లో చెయ్యడం జరిగింది. ముఖ్యంగా, ‘ప్రేమలేఖ’, ‘భారతీయుడు’ వంటివి. అన్ని సూపర్ హిట్స్. అన్నీ వంద రోజుల పండగ చేసుకున్నవే. మా కాంబినేషన్ అలా కుదిరింది.. ఆ రోజుల్లో ఓ గొప్ప అనుభవం.. ‘పెద్దరికం’ పాటలు వ్రాయడం.
***
ఎట్టకేలకు –
“సార్.. బి. గోపాల్ గారు మిమ్మల్ని అడిగారు. కారు పంపమంటారా?” ఫోన్ చేసింది ఆ తరవాత ఎంతో ప్రేమగా నన్ను “బావా” అని పిలిచిన తోట రామకృష్ణగారు. నాకు కన్ఫ్యూజన్. బి. గోపాల్ గారి పేరు చాలా చాలా సుపరిచితం. వారు అప్పటికే సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టరు.
“తప్పకుండా కలుస్తాను సార్!” అన్నాను. పది నిముషాల్లో కారు వచ్చింది. ఆ కారు నన్ను తీసికెళ్ళింది తాజ్ కోరమాండల్ హోటల్‌కి. మద్రాస్ వచ్చినప్పుడల్లా బప్పీ లహరి అక్కడే దిగుతారు.
లోపలికెళ్తే బప్పీదానే నవ్వుతూ, “మైనే బుల్వాయా” (నేనే పిలిపించాను) అన్నారు. అప్పటికి కానీ బల్బు వెలగాలా. బి.గోపాల్ గారికి నన్ను, నాకు గోపాల్ గారికీ పరిచయం చేసింది బప్పీ దానే. బి. గోపాల్ గారిని చూడంగానే నాకు అనిపించింది, అంత సౌమ్యుడ్నీ, అంత కూల్ పర్సన్నీ నేను అప్పటి వరకూ చూడలేదని. చాలా ప్లీజింగ్ స్మైల్ అయినది.
“అన్ని పాటలూ అయిపోయినై సార్.. ఒక్క పాట తప్ప. ఆ పాట మీరు రాస్తే బాగుంటుందని పిలిపించాము.” పరిచయం అయ్యాక అన్నారు బి. గోపాల్. “అలాగే సార్, చాలా చాలా సంతోషం” అన్నాను. వస్తూ వుండగానే రామకృష్ణ చెప్పారు హీరో హీరోయిన్లు బాలకృష్ణ, విజయశాంతి అని.
“ట్యూన్ ఇంకా సెట్ కాలేదు. ముందు మనం కూర్చుందాం” అన్నారు బప్పీ. ఇక్కడో సరదా విషయం చెప్పాలి. బప్పీదాతో ఆల్రెడీ పని చేశా గనక నాకు తెలుసు. “అచ్ఛా చాయ్ లే ఆవ్.. గరమ్ హోనా చాహీయే.” (మాంఛి టీ తీసుకురా.. బాగా వేడిగా వుండాలి) అని టీ ఆర్డరు చేస్తారు బప్పీదా. అయితే అది మూడు ముప్పాతిక వంతు చల్లబడేదాకా కప్పు కూడా ముట్టకోరు. ఓ సారి అడిగాను, “వేడిగా కావాలని ఇంత చల్లగా తాగుతారేం?” అని.
“టీ ఎప్పుడూ వేడిగా వుండాలి. అప్పుడే సువాసన వుంటుంది. కానీ, తాగేది మాత్రం గోరు వెచ్చగానే తాగాలి, వోకల్ కార్ట్స్ చెడిపోతాయి లేకపోతే” అని జవాబిచ్చారు.
నా వల్ల మాత్రం అంత చల్లగా తాగడం ఈ జన్మలో సాధ్యం కాదు. ఒక్కక్కరిదీ ఒక్కో అలవాటు.
ఓ అరగంట ట్యూన్లు కట్టటం.. బి. గోపాల్ గారికీ, త్రివిక్రమమరావుగారికీ ‘సో.. సో..’ అనిపించిడం జరిగింది. అప్పుడు గుర్తుకొచ్చింది.. బప్పీదా ఎప్పుడో వినిపించిన ఓ ట్యూన్. ఆయన ఏ ట్యూన్ ‘గున్ గునాయించినా’ నేను వెంటనే ఆ ట్యూన్‌కి తగిన లిరిక్స్ రాసేసుకునేవాడిని. నేను నా మెమొరీకి పదును పెట్టి ఆ ట్యూన్ ని బప్పీదాకి గుర్తు చేశా.
“ఏ అచ్ఛా హై. హమ్ క్యూం యాజ్ నహీ కియా?” అని గోపాల్ గారినీ త్రివిక్రమరావుగార్ని పిలిచి ఆ ట్యూన్ వినిపించారు. అంతకు ముందే సన్నివేశానికి తగ్గట్టుగా నేను లిరిక్‌ని గబగబా రాశాను.
~
పల్లవి:
అతడు:
నీలాలా నింగి నీడల్లో.. వయ్యారం..
అందాల మబ్బు డొంకల్లో.. ఉల్లాసం..
నీలోనే చూశానమ్మో.. నీ కోసం వేచానమ్మో
గుండెల్లో దాచానమ్మో ప్రేమా.. తకధిం తన్నానా
తకధి తన్నానా (R) తకధిం తన్నానా హోయ్ తన్నానా..
ఆమె:
నీలాలా నింగి నీడల్లో.. అరాటం
అందాల మబ్బు డొంకల్లో.. పోరాటం
నీలోనే చూశానయ్యో.. నీ కోసం వేచానయ్యో
కౌగిట్లో చేరానయ్యో రామా.. ॥తకధిం॥
~
సాయంత్రానికల్లా పాట పూర్తయింది. పల్లవి తప్ప మిగతా పాటంతా రాసింది త్రివిత్రమరావుగారి ఆఫీసులోనే. పాట పూర్తయినా, బోలెడు మార్పులూ చేర్పులు మరుసటి రోజంతా చెయ్యాల్సి వచ్చింది. కానీ ఫైనల్ గా ok అయింది ఫస్టు వెర్షనే.
బి. గోపాల్ గారూ, టి.త్రివిక్రమరావుగారూ, బప్పీలహరీగారు కూడా నేను బాంబేకి వచ్చి తీరాలన్నారు. మర్రోజునే బాంబే వెళ్ళాం ముగ్గురం. దిగింది సన్ & శాండ్ సూట్ రూమ్‌లో. అది ఓ ప్రత్యేక సూట్. దాదాపు 20 ఏళ్ళ పాటు దేవ్ ఆనంద్ అదే సూట్లో ఉన్నారట. సన్ &శాండ్ వున్నది జూహూ బీచ్‌లో.
ఒకప్పటి స్టైల్ & చార్మింగ్ ఐకాన్ ‘సాధన’ ఓ స్విమ్ సూట్లో పూర్తి song లో కనిపించింది sun & sand స్విమ్మింగ్ ఫూల్ లోనే. ఆనాటి చాలా చిత్రాల్లో sun & sand హోటలు, స్విమ్మింగ్ పూలూ, sun & sand గోడని ఆనుకుని వున్న జూహూ బీచీ మనం చూడొచ్చు. సాధన స్విమ్ సూట్లో act చేసిన సాంగ్ “సూరత్ హసీ, లగ్తా హై దివానా, ఐసీ నౌజవాఁ సే క్యా దిల్ ఇక్ లగానా” అనేది. చిత్రం పేరు ‘బద్ తమీజ్’ (BUDTAMEEJ). హీరో షమ్మి కపూర్.
‘వక్త్’ లో కూడా ఓ సీను వుంది. అయితే అది కలర్ సినిమా. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, sun & sand కి వెళ్ళగానే ఇవన్నీ నా మనసులో మెదిలాయి. పక్కనే, the sands, sea side అనేవి కూడా వున్నాయి. పక్కనే వుండే అపార్ట్మెంట్స్ లోనే KC బొకాడియా, పరీక్షిత్ సహానీ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు వున్నరని తెలియడమే కాదు, బీచ్‌లో ‘వాక్’ చేయ్యడం కూడా చూశాను.
మేం బాంబే వెళ్ళిన మూహూర్తం ఎటు వంటిదో కానీ, రోజుకో పాట నన్ను వ్రాయమన్నారు గోపాల్ గారూ, త్రివిక్రమరావుగారూ. అలా 3 పాటలు రాశాను. దాంతో 4 పాటలయ్యాయి.
అన్ని రికార్డు అయింది ‘సన్ & సాండ్స్’ లోనే. పవార్ సౌండ్ ఇంజనీరు. పైన ‘కతూలియా’ గారే చీఫ్ సౌండ్ రికార్డిస్ట్. మరో పాటకి ట్యూన్ ఇచ్చారు బప్పీ.
“సార్.. ఒక్క పాటైనా నా కోరిక మీద ‘మోహబూబ్’ స్టూడియోలో రికార్డు చేయించరు!” అని అడిగాను అందర్నీ. బి. గోపాల్ గారూ, త్రివిక్రమరావుగారూ OK అన్నారు. బప్పీ కూడా హేపీ. ట్యూన్ ఇవ్వడమే రాత్రి 11 గంటలకి ఇచ్చారు. అలిసిపోయి పడుకున్నాను. ఒక్క ముక్క కూడా పలకలేదు.. మెదడు.
Next day ముగ్గురం 10 గంటలకల్లా ‘మోహబూబ్’ స్టూడియోస్కి వెళ్ళాం. అవే చెక్క మెట్లు.
ఎన్ని సినిమాలు.. కాగజ్ కే ఫూల్, హమ్ దోనో, గైడ్, జానీ మేరానామ్.. ఇవన్నీ తీసినవి ఆ స్టూడియోలోనే. దేవానంద్ 22 ఏళ్ళ పాటు తన ‘నవకేతన్’ ఆఫీసుని ‘మోహబూబ్’ స్టూడియోలోనే నడిపారు. ఆమ్రపాలి అనే అద్భుత చిత్రం పురుడు పోసుకుంది కూడా అక్కడే.
‘మోహబూబ్’ అనగానే ఓ సినీ చక్రవర్తి గుర్తొస్తాడు. ‘మదర్ ఇండియా’ని లోకంలో ఎవరైనా మరువగలరా? ఇప్పటికీ విజయవంతంగా నడుస్తోంది. ఆ స్టూడియో. మోహబూబ్ ఖాన్ చనిపోయింది కేవలం 56 ఏళ్ళ వయసులోనే. కానీ హిందీ, భారతీయ చలన చిత్ర పరిశ్రమ వున్నంత కాలం ఆయనని ఎవరూ విస్మరించలేరు.
సాష్టాంగపడి ఆ మెట్లకి నా నుదుటిని ఆనించాను. ఎంతమంది రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాద్యకారులు నటీనటులు ఆ మెట్లు మీదుగా నడుస్తూ వెళ్ళారో. వారి పాద రేణువు తగిలినా జీవితం ధన్యమే కదా. ఆ క్షణంలోనే కళ్ళ వెంట బొట బొటా కన్నీళ్ళు. ఎందుకుంటే, ఎక్కడో గుళ్ళపూడిలో పుట్టి, చింతలపూడిలో పెరిగి, ఓ సిపాయిగా జీవించి, రచయితగా మారబట్టే గదా యీ అదృష్టానికి నోచుకుంది. లేక పోతే ‘మోహబూబ్’ స్టూడియోలో నా పాట ఎలా ‘రికార్డ్’ కాగలదూ? ఓ అరగంట పాట మాటా పెగల్లేదు. తరవాత స్టూడియో బైట, మెట్లెక్కాక అవతలి వరండాలాంటి చోట్లో కూర్చుని పాట గురించి ఆలోచించా, ఏ రచయిత ఆత్మ అనుగ్రహించిందో చాలా త్వరగానే పల్లవి పూర్తి అయింది. టైలర్ మేడ్ song ఫర్ బాలయ్య.
పల్లవి:
ఆమె:
అరే ఓ సాంబా.. అయిరే రంభా..
అతడు:
అరే ఓ రంభా.. ఆయారే రేంబో..
అతడు:
బందరు లడ్డూ తినిపిస్తాను.. బిస్తరు వేస్తావా
చీర సారే కొనిపెడతాను.. చేలోకొస్తావా
వయసూ వుందీ వాడీ వుందీ.. తాజా తాజా మోజు వుందీ
లవ్వాడదాం చల్ రే రాణీ..
ఆమె:
అరే ఓ సాంబా.. ఆయారే రంభా..
అందరి లాగా ఐసైపోయే దానిని కానయ్యో
మస్కాకొడితే గిస్కా ఇస్తా రౌడీ ఎస్సయ్యో
వయసూ వుందీ వాడీ వుందీ తాజా తాజా మోజూ వుందీ
అయినా సరే లొంగను జా.. జా.. ॥అరే ఓ సాంబా॥
***
మెహబూబ్ స్టూడియోస్ సౌండ్ ఇంజినీర్ గారి పేరు ఠాకూర్. చాలా సీనియర్ సౌండ్ ఇంజినీర్. కేతూరియాగారి లాగా మంఛి సౌడ్ ఎక్స్పర్ట్. పాట రికార్డైనంత సేపు వారి అనుభవాల్ని వారు పని చేసిన ‘మహాన్’ సంగీత దర్శకులు గురించి అడిగి అడిగి మరీ చెవులు నింపుకున్నాను.
అదో అద్భుతమైన అనుభవం. ఓ కల నిజమైన రోజు. ఆ తరవాత పాట ఇచ్చి, “భువన చంద్రగారూ, ఒక్క పాట కోసం మిమ్మల్ని తీసుకొచ్చాం. మీ తపన, పాట మీద మీరు పెట్టే శ్రద్ధ చూసి మరో నాలుగు పాటలు వ్రాయించాం. ఇదిగో, ఈ ట్రైను song కూడా రాసేసి సింగిల్ కార్డు కొట్టెయ్యండి. వాస్తవానికి మొదట మీకు ఇచ్చిన పాట తప్ప అన్ని పాటలూ వేరే రచయితల చేత వ్రాయించి డబ్బు కూడా ఇచ్చేశాం. అసలు మీరెలా రాస్తారో ట్రైల్ వేసి చూద్దామని ఒక్కో పాటనీ ఇస్తే, ఆ పాటల్నీ ఎక్కడికో తీసికెళ్ళారు. మాకు కావాల్సింది ఫక్తు మాస్. అందులో పాటలో చిన్న చిలిపితనం కావాలి. మేము అనుకున్నది 100% ఫుల్‌ఫిల్ అయింది. అందరికీ డబ్బు ఇచ్చేశాం గనక నో ప్రోబ్లమ్. ఈ సాంగ్ కూడా రాసెయ్యండి.” అన్నారు.
మొదటి పాట – నీలాల నింగి నీడల్లో.. SPB, చిత్ర.
రెండవ పాట – ఇది చాలా కాంట్రవర్షియల్ సాంగ్ అయింది. NTR అప్పుడు ముఖ్యమంత్రి. పాట “శృతి” మించిందనే విమర్శ కేసెట్ రిలీజ్ అయ్యేకా వచ్చినా, పిక్చర్ రిలీజయ్యాక అన్ని సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. ఈ పాటని మరి వినిపించాలిగా.
***
పల్లవి:
ఆమె:
డిక్కీ డిక్కీ డీ ఢిక్కి.. డప్పులు వాయించెయ్ నక్కీ
ఎక్కీ ఎక్కీ కైపెక్కీ.. ఏదో లాగిస్తే లక్కీ
అతడు:
లంగా బాడీ లంబాడీ.. ఆడించేస్తా కబ్బాడీ
ఎక్కానంటే అమ్మాడీ.. అదరాలే ఆటో బాడీ
ఆమె:
ఐతే ఓకే.. అంతా నీకే.. చలో గురూ..
అతడు:
గుడివాడ గుండమ్మా.. ఒడిలోకి రావమ్మో
ఆమె:
బెజవాడ బాలయ్యో.. బరిలోకి దిగవయ్యో ॥డిక్కీ॥
***
ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరుగా అప్పుడు పని చేసిన స్వర్ణ సుబ్బారావుగారు యీ నెలలోనే (Dec 2017) హైదరాబాద్‌లో కూర్చొని యీ విషయాల నన్నింటినీ నెమరు వేసుకున్నాం. తరవాత సుబ్బారావుగారు డైరెక్టరవడమే కాక బాలయ్యతో ‘విజయేంద్రవర్మ’ సినిమా తీశారు (దర్శకత్వం).
మూడో పాట:
అతడు:
ఓ పాపాయ్.. ఆయొ.. ఆయొ.. అయొ.. అయో..
ఆమె:
ఏం దబ్బాయో.. ఆయొ.. ఆయొ.. ఆయొ.. ఆయో..
నాలుగో పాట:
ఆమె:
చిటపట చినుకులు తనువులు తడిపే వానలో
తడిసీ తడిసీ తపనలు రేపే వేళలో
హత్తుకుపోతేనే సుఖం.. హద్దులు చెరిపేయ్
ఈ క్షణం.. రా మరీ..
అతడు:
చిటపట చినుకా తకధిమి తాళం వెయ్యవే
తొలకరి మొలకా కథకళి నాట్యం చెయ్యవే
చలి చలి గాలులలో గిలి.. ఇచ్చెయ్ మన్నది
కౌగిలీ.. రా మరీ..
***
ఈ రైన్ సాంగ్ షూటింగ్ హైదరాబాదులో జరిగినప్పుడు ‘సెట్’కి వెళ్ళాను. కెమేరామన్ VSR స్వామిగారు అన్ని పాటల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ “మీరింకా పల్లెపదాల్ని విడవలేదండీ.. అందుకు నాకు చాలా సంతోషంగా వుంది. ‘సుబ్బరంగా’ అనే పదం వాడారు. అది వింటే మళ్ళీ మా వూరు వెళ్ళినట్టు అనిపించింది” అన్నారు. గ్రేట్ మ్యాన్.
అయిదో పాట మీకు వినిపించిదే.. ‘బందరులడ్డూ’ పాట. రాసిన చివరి పాట Train song. ఇది కూడా నూటికి నూరు పాళ్ళు మాస్ సాంగే.
పల్లవి:
అతడు:
టక్కు టమారం బండీ.. తప్పాలా బండీ..
పైలా పచ్చీసు బండీ.. పోదామాచండీ
అటెల్తే కాకినాడా.. సర్దికోపెట్టే బేడా..
ఇటెల్తే మీ గుడివాడా వెయ్యవే పాన్ బీడా..
ఛమా ఛమ్ డేరా వేద్దాం రావే అమ్మాడీ..
లవ్వు స్టేషనులో.. లవ్వు స్టేషనులో..
ఆమె:
టక్కు టమారం బండీ.. చమ్కీలా బండీ..
పైలాపచ్చీసు బండి పరువాల బండీ
అటెత్తే రాజమండ్రి.. భళారే చిట్టితండ్రీ..
ఇటెల్తే విజయవాడా చలోరే అందగాడా..
ఛమా ఛమ్ డేరా వేద్దాం రారా బుల్లోడా..
లవ్వు ష్టేషనులో.. లవ్వు స్టేషనులో..
చరణం1:
అతడు:
అదిగో ఏలూరు.. కొంపే కొల్లేరు.. నీ గంప దించెయ్యి భామా..
ఆమె:
పోదాం నెల్లూరు.. సరసానికే పేరు.. జేగంట మ్రోగించు మామా
అతడు:
చల్ రే జనగామ.. చేద్దాం హంగామా.. చిత్తూరికీ చేరుదామా
ఆమె:
అదిగో బెల్గామూ.. నిండా మునిగాము.. తలకోనలో తేలుదామా
అతడు:
అటెల్తే అనకాపల్లీ కట్టవే కారా కిళ్ళీ
ఆమె:
జమాజమ్ జగ్గయ్య పేట.. వెయ్యరో ప్రేమకి పీట
అతడు:
ఛమా ఛమ్ ముద్దో గిద్దో లాగించేద్దామా.. లవ్వు స్టేషనులో (R)
చరణం 2:
ఆమె:
ఇదిగో వైజాగు.. సరిగా చెయ్ సాగు.. తీస్కో నా బేగ్ బావో
అతడు:
అదిగో గుంటూరు.. ఇదిగో మార్దేరు.. మార్చెయ్యనా నీ పేరు పో పో..
ఆమె:
హైవే నంద్యాల.. స్పీడే పెంచాల.. నీ దారి మళ్ళించవయ్యో
అతడు:
హైవే రోడ్డుంది.. హైదరాబాదుంది.. కంగారు పడమాకె బుల్లో
ఆమె:
అటెల్తే మా ఒంగోలు.. ఇటెల్తే మా కర్నూలు
అతడు:
ఫటా ఫటా కడపకి పోదాం.. లవ్వులో ఒడుపులు చూద్దాం
ఆమె:
జమాజమ్ ప్రేమించేసి ఢంకా మ్రోగిద్దాం.. లవ్వు స్టేషనులో (R)
***
త్రివిక్రమరావు గారిది వైజాగు. “మా వూరి పేరేదండీ?” అని అడిగి మరీ వైజాగు పేరు రాయించుకుంటే, బి.గోపాల్ గారిది ఒంగోలు దగ్గరి వూరు. అందుకనీ ఒంగోల్ని పాటలో పెట్టాను. పిక్చర్ విజయ ఢంకా మ్రోగించింది. పెద్ద హిట్. ఎవరి వూరి పేరంటే ఆ వూరి వారికి అంత ఇష్టం కదా మరి. కేసెట్ రిలీజయ్యాక “మా వూరి పేరెందుకు వ్రాయలేదండీ?” అని చాలామంది నిలదీశారు. 100 days function కి అందరం వైజాగ్ వెళ్ళాము. బాలకృష్ణగారి అన్నగారికి ఏక్సిడెంట్ జరగడం వల్ల అదో ఫంక్షన్‌గా మాత్రం జరిగింది. ఆ ఫంక్షన్ లోనే నేను బాలకృష్ణ గారిని మొదటిసారి కలిసింది. ఆ తర్వాత చాలా హిట్ సినిమాలు చేశాం.
సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు, విజయేంద్ర వర్మ ఇలా. అన్నట్టు, భలే వాడివి బాసూ, టాప్ హీరో ఇలా చాలా.. వంటి ముచ్చట అప్పుడు చెప్పుకుందాం.
అప్పటి దాకా top హీరోస్లో చిరంజీవిగారికి తప్ప మరి ఎవరికీ రాసే అవకాశం రాలేదు. కానీ, రౌడీ ఇన్స్పెక్టర్తో చాలా దారులు తెరుచుకుని అందరు హీరోలకూ రాసే అవకాశాలు రావడం మొదలైంది.
“ఫర్ ఎవ్వరీ బిగినింగ్.. దేరీజ్ యాన్ ఎండింగ్” అంతే కాదు..
“ఫర్ ఎవ్వరీ ఎండింగ్.. దేరీజ్ ఏ బిగినింగ్ వైటింగ్ ఫర్ యూ..”
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు”, “మహతి”, “పాండిబజార్ కథలు” అనే పుస్తకాలు వెలువరించారు.
