[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]
~
పిల్లల పాట ఎలా వుండాలీ?
సినిమా పేరు ‘నాని’. కథా రచయిత కొమ్మనాపల్లి గణపతిరావుగారు. దర్శకత్వం కృష్ణమోహన్ రెడ్డిగారు. నిర్మాతలు PVK రెడ్డి, జి. ఉపేందర్ రెడ్డి. సంగీతం చక్రవర్తి. ఓ చిన్న పిల్ల తల్లిని చూడాలని వుంది అని ఏడుస్తూ పాట పాడాలి. అసలు అయిదారేళ్ళ పిల్ల పాటలు పాడుతుందా? అదీ పెర్ఫెక్టుగా, అపస్వరం అపశృతి లేకుండా పాడుతుందా? ఒక వేళ పాడితే ఆ పాటకి సాహిత్యం ఎలా వుండాలి? పోయెటిక్ గా వుండాలా.. లేక పిల్లల మాటలు ఎలా వుంటాయో అటు వంటి మాటలు ఏర్చి కూర్చి వ్రాయాలా? ఇదో చర్చకీ దారితీసింది. చక్రవర్తిగారు ట్యూన్ ఇస్తూ “ఏ నీలి గగనాలలో.. తనినానినానా” అని తాత్కారంతో పాటు మొదటి పదం ఇచ్చారు.
అది వరకు ఓసారి చెప్పినట్టు చాలా మంది మన సంగీత దర్శకులకి సాహిత్యంతో చాలా పరిచయం వుంది. అందుకే ట్యూన్ ఇచ్చేప్పుడు డమ్మీ పదాలు కాక, సన్నివేశానికి తగిన పదాలనే ట్యూన్లో తొలి పదాలుగా ఇస్తారు. కోటి, కీరవాణి, ఇళయరాజా, వందేమాతరమ్, మాధవపెద్ది, MM శ్రీలేఖ, అనూప్ రూబెన్స్, చక్రి, వేద, ఇలా ఎంతోమంది చక్కని పదాలు ఇస్తారు. అవి పుట్టడమే ట్యూన్‌తో పుట్టాయి కనక పెర్ఫెక్ట్గా సిచ్యుయేషన్‌కి match అవుతాయి. ఒక్కోసారి మేము మార్చేసుకుంటాం.. ట్యూన్ మూడ్‌కి తగినట్టు. కృష్ణమోహన్ రెడ్డిగారూ, చక్రవర్తిగారూ నేను కూర్చున్నాం. విన్న వెంటనే ట్యూన్ ok. ఎటొచ్చీ ప్రాబ్లం పల్లవి+చరణాలతోనే.
~
పల్లవి:
ఏ నీలి గగనాలలో.. నడయాడినావో
ఏ గాలి కెరాటాలలో.. నిదురించినావో
ఓసారి కనిపించవా.. అమ్మా.. అమ్మా.. అమ్మా.. అమ్మా.. ॥ఏ నీలి॥
~
పల్లవి వినగానే మీకు వినగానే మీకు “నీలి గగనాలలో గాలి కెరటాలలో నీవు పాడే పాట వినిపించు యీ వేళా” గుర్తుకొచ్చి వుండాలి కదు. గుర్తుకు రావాలనే చక్రవర్తి గారు ఆ పదాన్ని ఇచ్చానని చెప్పారు. ‘ద్వితీయ విఘ్నం’ లేకుండా ‘ఏ గాలి కెరటాలలో’ అని నేను కంటిన్యూ చేశా. అందరూ పాట ఫస్టు క్లాసుగా ఉందన్నారు. కానీ, చక్రవర్తిగారికీ డౌటు వచ్చింది. పాటకి ఉపయోగించ వలసిన భాష ఎలా వుండాలీ అని. రకరకాల పాటల్ని రిఫరెన్స్ గా తీసుకున్నాం. వాటిల్లో “చూడాలని వుంది.. అమ్మా.. చూడాలని వుంది.. పొరబాటు పనులిక చేయబోనని నీతో చెప్పాలి” వంటివి బోలెడొచ్చాయి. అయితే, వారందరికంటే చిన్నది యీ సినిమాలో పాప కేరెక్టర్. ఓ రోజున్నర చర్చలలో, రకరకాల పల్లవులతో గడిచాక MVVS బాబురావుగారు ఏదో పని మీద AVM ‘G’ కి వచ్చి మా డిస్కషన్‌ని విని, “అసలు పాట వుండేది దేనికీ? మనోభావాల్ని తెలియజేయడానికేగా! ఆ అమ్మాయి మనోభావాల్ని తెలియజేయడం మన ముఖ్య వుద్దేశ్యం గానీ, ఆ పిల్ల వొకాబ్యులరీ గురించి కాదు గదా.. హాయిగా వుంది పల్లవి.. అలాగే కానీండి. అయినా, పిల్లల సంగతి వదలండి.. ప్రేమించుకున్న వాళ్ళు పాటల్లో ఎగురుతా పాటలు పాడటం సహజమా?” అని చక్కాబోయారు. మొదటి పల్లవే OK అయింది.
~
చరణం 1:
నీవున్న చోటు.. చూపించమంటూ.. ఏ నీలి మబ్బుల్ని అడగాలీ..
నీలాగ నన్ను లాలించమంటూ.. ఏ లేత కొమ్మల్ని పిలవాలీ..
నిను చూడాలమ్మా.. నువు కావాలమ్మా.. నీతోటి నన్ను..
తీసుకుపోవమ్మా.. పడలేనిక.. యీ బాధలు.. నీ
ఒడి చేర్చి ఒకసారి ముద్దాడవా.. ॥ఏ నీలి॥
~
రెండో చరణం అమ్మ ‘కూతురికి’ నింగిలో నించి ధైర్యం చెప్పడం.. ఈ పాటని ఉదహరించడంలో నా ఉద్దేశ్యం వేరు. ఒక పాట “స్వతంత్రించి” రాసుకున్నప్పుడు అదో పద్ధతి ప్రకారం చాలా సహజంగా వెళ్ళిపోతుంది. ఒక సందేహంతో వ్రాయడం మొదలైనప్పుడు ఆ పాటని ఎంత మంది ok చేసినా, రచయిత మనసులో ఏదో లోటు ‘తొలుస్తూనే’ వుంటుంది.
అసలు చిన్న పిల్లల మీద ‘షూట్’ చేసే పాటలు ఎలా వుండాలనేది ఈనాటికీ నా మనసులో శేషప్రశ్నగానే మిగిలి వుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చాయి. పిల్లలు పాడిన పాటలు (పాత్రలు) సూపర్ హిట్ అయ్యాయి. కానీ, నాకు మాత్రం ఇప్పటికీ ఆనాడు నేను రాసిన ఈ పాటకి సరైన న్యాయం చెయ్యలేదేమో అన్న బాధ మనసు మరో మూలల్లో మిగిలేవుంది.. చక్రవర్తిగారు “బాగుందబ్బాయ్.. పాటా పిక్చరైజేషనూ” అని R.R. లో అన్నా కూడా.
***
చిత్రగారితో చిలిపి పాట మళ్ళీ పాడించాల్సి వచ్చింది.
“సరసాని కొచ్చింది రాణీ..
సరిగంగ స్నానాలు కానీ” అంటూ.
అదృష్టం ఏమంటే చిత్రగారు lyric meaning అడగలేదు.
అలాగే SP శైలజగారు పాడిన..
“పిట్ట కూత కొచ్చింది అత్త కొడకా
పిల్ల పైట జారింది చెయ్యి పడక” అనే పాట కూడా కాస్త శృంగారం (లేక అల్లరి) పాలు ఎక్కువున్నదే.
***
‘నాని’ సినిమాలో నాకు అత్యంత ఇష్టమైన పాట ఒకటుంది. కృష్ణాష్టమి రోజున బుల్లి బుల్లి కృష్ణ పాదముద్రలు వేసి, ముచ్చటగా పిల్లకి కృష్ణుడి వేషం వేసి, మురిపెంగా పాడే పాట. దక్షిణకోయిల, పద్మభూషణ్ పి.సుశీలగారు పాడటం, ఆ పాటకే అందాన్ని అర్ధాన్ని తెచ్చింది. నా బుర్ర పని చెయ్యనప్పుడీ పాట వింటా.. శ్రీకృష్ణుని లీలలు మనసుని ఆహ్లాదపరుస్తాయి. చక్రవర్తిగారు ఓ అద్భుతమైన, అరుదైన సంగీత దర్శకుడు. ఆయన తెలుగు వాడు కావడం తెలుగు జాతికి గర్వకారణం. ఆ పాటని చిత్తగించండి.
~
పల్లవి:
ఝుంతననం.. ఝుంతననం.. ఝుంతననమ్.. (R)
మా కళ్ళలో బృందావనం.. మా గుండెలో మురళీరవం..
చిలికే తీయని రాగం.. పలికే కమ్మని భావం.. కురిసే శ్రీకృష్ణామృతం
ఆలారే.. కన్హయ్యా.. గోపాలా.. కృష్ణాయ్యా (R)
చరణం 1:
చల్లగా.. మెల్లగా.. మంచులా.. మబ్బులా.. ఉల్లము.. ఝల్లన
గజ్జలు.. ఘల్లన.. చిరుగాలిలా తాకుతాడే..
సెలయేటిలా నవ్వుతాడే.. గారాల గోవిందుడమ్మా..
మారాము చేసేనోయమ్మా..
అల్లరి పిల్లడే వీడూ
అల్లరివాడే మా వాడూ
గోకుల అష్టమి ఈనాడు.
(కోరస్) ఆలారే.. కన్హయ్యా… గోపాల.. కృష్ణయ్యా..
(బిజిఎమ్).. శ్రీకృష్ణ చైతన్య హే గిరిధారీ..
యదునందన వనమాలీ రాసవిహారీ..
చరణం 2:
దేవకీ.. నందనా.. దేనికా.. శోధనా..
వెన్నెల.. కోసమా.. కన్నెల.. కోసమా
ఏడేడు లోకాలనన్నీ.. ఏలేటి ఓ నల్లనయ్యా..
మా పల్లె రేపల్లె కాదా.. నీ లీల చూపించరావా..
పరుగున రారా కన్నయ్యా
దరిశనమీరా కృష్ణయ్యా
తరగని ప్రేమే నీవయ్యా..
ఆలారే.. కృష్ణయ్యా.. గోపాలా.. కృష్ణయ్యా.. ॥శ్రీకృష్ణ చైతన్య॥
~
పి.సుశీలగారు పాడేశాక చక్రవర్తిగారూ నేనూ కృష్ణమోహన్ రెడ్డిగారూ అందరం మళ్ళీ మళ్ళీ పాట విన్నాం.
మహా రాజులూ మహా చక్రవర్తులూ తమతమ రాజ్యాలతో సహా కాలగర్బంలో కలసి పోయినట్లు చక్రవర్తిగారి లాంటి మహానుభావులూ వెళ్ళిపోయారు.. కాలగర్భంలోకి, కాల నియతిని అనుసరించి.
ఓ సాలూరి, ఓ వేటూరి, ఓ ఆరుద్ర, ఆత్రేయ, సముద్రాల (సీ&జూ) దేవులపల్లి కృష్ణశాస్త్రి, మైలవరపు గోపీ, రాజశ్రీ, వీటూరి, అప్పలాచార్య, విజయరత్నం, మోదుకూరి జాన్సన్, గణేష్ ప్రాతో, కొసరాజు, ఆఖరికి ఎన్నో ఏళ్ళు ప్రేమగా బిడ్డగా నన్ను చూసిన మా జాలాది.. ఏరీ.. ఎక్కడికి వెళ్ళపోయారూ.. తెలిసేది ఎవరికీ!!!
ఒక్కటి మాత్రం సత్యం. కరిగిపోయే, తరిగిపోయే ఆస్తుల్ని కాదు వారిచ్చింది. కాలపు తూఫానులను తట్టుకుని, తలెత్తి నిలబడే మహా గీతాలని, సంగీతరత్నాలని, సాహితీ ముత్యాలని. వారు లేకున్నా వారి పాటలు మన మధ్యే మన హృదయాల్లోనే చిరంజీవులుగా వున్నాయి. మృత్యోర్మా అమృతంగమయ.
***
పల్లవి:
కనరా.. వినరా..
జంబలకిడి పంబా అనరా.. కథ చెబుతాను వినరా..
బ్రహ్మంగారు ఎరుగని.. కలికాలపు కాలజ్ఞానమూ..
జంబలకిడి పంబా అంటే.. పెట్ట కూత పెట్టేనయ్యో
పుంజు గుడ్డు పెట్టే వింత.. ఇదే చూడరా.. మహా మాయరా..
జంబలకిడి పంబా.. జంబలకిడి పంబా..
జంబలకిడి పంబా.. జంబలికిడి పంబా..
చరణం:
లంగాకొచ్చును లుంగీ బుద్దులు.. లుంగీ కొచ్చును లంగా సిగ్గులు..
రైకలకొచ్చును రేపుల పిచ్చీ.. మీసాల్ కొచ్చును ముద్దుల టచ్చీ..
అమ్మలక్కలకు బ్రాందీ విస్కీ.. అయ్యలన్నలకు చాపా చెంబూ
సతీమూర్తులకు చీట్ల పేకలూ.. పతిదేవుళ్ళకు.. చాకిరేవులూ..
రామాయణమే.. సీతాయణమై..
కృష్ణలీలలే.. రాధ లీలలై
ఒప్పెడు.. నప్పెడు.. గుప్పెడు.. వింతలు ॥కనరా॥
జంబలకిడి పంబా అంటే.. చీర గౌను అయ్యేనయ్యే
పేంటు నిక్కరయ్యే వింత.. ఇదే చూడరా మహా మాయరా..
జంబలకిడి పంబా.. జంబలకిడి పంబా..
జంబలకిడి పంబా.. జంబలికిడి పంబా..
~
గతంలో రేలంగిగారే వాడిన ఇలాంటి పదమే ‘జులకటకా’కి లిరిక్ వ్రాయడం అనుభవం వున్నది గనక హాయిగా బాపినీడు గారికి రచనా సహకారం అందించిన బాబూరావుగారే EVV గారికి రచనా సహకారం అందిస్తున్నారు. అదో పెద్ద ప్లస్ పాయింట్ నాకు.
విజయగార్డెన్ లోనే తిరుగుతూ మధ్యాహ్నానికి పాట పూర్తి చేశాను. ఈలోగా రాజ్-కోటి గార్లు మిగతా songs tune లని రెడీ చేస్తున్నారు. పల్లవి కాగానే వారికి వినిపించడం, “శభాష్ భువనన్న” అని కోటి ఉత్సాహపరచడంతో హాయిగా ఉల్లాసంగా పాట వ్రాశాను.
కోటిగారికి ఇంటినించి కేరేజీ వచ్చింది. ఆయన ఎప్పుడూ అందులోని ఐటమ్స్ అందరితో పంచుకుంటారు. “వంకాయ టమాటా పులుసుకూర, మాంఛి గోంగూర పచ్చడీ” నేను తీసుకున్నా.. లంచ్ కంపోజింగ్ రూమ్ లోనే (బయట) చేశాం. ఆ తరవాత హాయిగా ‘వేటూరి’ గారి విడిది (రాజ్-కోటి గార్ల పక్క రూమ్) లో ఫుల్‌గా నిద్దరేశా. సినిమా భోజనాలంటే మృష్టాన్న భోజనాలే. వాటితో పాటు రెండు ‘ఇంటి’ అయిటమ్స్ కూడా కలిస్తే భుక్తాయసం కాక ఏమొస్తుంది?
EVV గారు రాగానే విని, చాలా హ్యాపీ ఫీలయ్యారు. నరేష్, ఆమని, కోట, జయలలిత, ఎప్పుడూ బ్రాహ్మాణి లేక పేద పాత్రలలో కనిపించే డబ్బింగ్ జానకి మందు కొడుతూ, సిగరెట్ తాగే పాత్రలో కనిపించడం EVV మహిమే కదా!
అలాగే బ్రహ్మానందం ‘విధవ’గా, బాబూమోహన్ ఇన్స్పెక్టరుగా, కళ్ళు చిదంబరం శిష్యుడిగా.. ఓహ్.. సినిమా అంతా నవ్వులమయమే.. చిరునవ్వుల చిందే. ‘శ్రీ గోపీనాధ్ ఆచంట’ సారధ్యంలో, శ్రీ బాలాజీ క్రియేషన్స్ బేనర్ మీద నిర్మించబడిన ఈ సినిమాకి నిర్మాతలు డి. భగవాన్, DVV. దానయ్య, సరస్వతీకుమారి.
దర్శకత్వం ఇంకెవరూ? నవ్వుల రేరాజు, EVV కాక! టైటిల్ సాంగ్ పాడింది ‘మాల్గాడి శుభ’ క్రేజీ సింగర్. ఆమె పాట పాడితే చాలు, జనాల్లో ఓ క్రేజ్. ఆమె రిలేషనే తరువాతి తరపు హీరోయిన్ ‘ప్రియమణి’ అని విన్నాను. మాల్గాడి శుభగారు నన్ను ‘అన్నా’ అని పిలిచేది. ఇప్పటికీ అదే పిలుపు.
(‘కనరా.. వినరా..’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు.
https://www.youtube.com/watch?v=053zRBLyen0)
~
“మదనా.. తగునా..
మగువా.. తగునా..
అందరి ముందూ తొందర పడితే
తాపం తీరేనా”
“నేనే సూపర్ మేన్.. A-1 డాషింగ్ డాన్
లెఫ్టూ రైటూ ఆడించేస్తా”
“యమ్మా యమ్మా యమ్మా
గమ్మత్తు గుందో యమ్మా”
“నిలువరా వాలు కనుల వాడా.. వయారీ
హంస నడకలోడా..” ఇవి మిగతా పాటలు.
సినిమా దిగ్విజయంగా 100 రోజులూ ఆడింది. ఆ పండుగకి వాణిశ్రీగారు కూడా వచ్చినట్టు జ్ఞాపకం. మొత్తానికి ఓ చిన్న లైన్‌ని, శతదినోత్సవ చిత్రంగా మలిచిన ఘనత ముమ్మాటికీ EVV సత్యనారాయణగారిది.
***
రాజ్ కపూర్ నటన + చిత్రాలు + పాటలు అంటే నాకు చాలా ఇష్టం. కొన్ని చిరునవ్వులు+అద్భుతమైన సంగీతం+ మానవీయ దృక్పథం రాజ్ సాబ్ సినిమాలని, ఆకాశంలో నిలబెట్టాయి. ఓ శ్రీ420 సినిమా కోఆపరేటివ్ సంస్థల ఆవిష్కరణకు మూలమైతే, ఓ జిస్ దేశ్ మే గంగా బెహతీ హై అనే కల సినిమా రిలీజైన రెండు దశాబ్దాలకి సాకారమైంది. చంబల్ వేలీ బందిపోట్లు తమంత తాముగా లోక్ నాయిక్ జయప్రకాష్ నారాయణ ముందు లొంగిపోయి, జనబాహుళ్యంలో కలిశారు. ఓ మేరానామ్ జోకర్ జీవితాన్ని తెరమీద ఆవిష్కరిస్తే, ఓ రామ్ తెరీ గంగా మైలీ – భారత స్త్రీని ధృవతారగా మార్చింది.
ప్రతి పాటా ఓ సందేశమే. ప్రతి మాటా ఓ ఆలోచనని రేకెత్తించే వర్తమానమే.. అందుకీ ఆయన ‘ద షోమాన్’ అయ్యాడు. అటువంటి మహానుభావుడి సినిమాలోని పాటకి తెలుగులో ‘లిరిక్’ రాసే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. కానీ నేను మాత్రం సైలెంటయ్యాను.
“సర్.. ఆ పాటకి అసలు లిరిక్సే వద్దు సార్ ‘తననా’లతో పాడిచేద్దాం. ఎందుకంటే ఎన్ని వందల వెర్షన్లు రాసినా, ఒరిజినల్ పాటలోని సహస్రాంశం కూడా కొత్త దానికి రాదు. ఎందుకంటే అది గుండెలో నిలిచిపోయిన పాట సార్” అని బాపినీడుగార్ని బ్రతిమాలాడుకుని ‘తననా’ లతోనే పాడించాను.
శ్రీ420 లోని ‘ప్యార్ హువా ఇక్రార్ హువా’ పాట మాత్రమే కాదు, పాటకి ముందు వచ్చే సన్నివేశం కూడా నాకు ప్రాణమే. ఆ సన్నివేశాన్ని బాపినీడుగారికి చెప్పిందీ నేనే.
‘వాలుజడ తోలు బెల్టు’ సినిమాలో రాజేంద్రప్రసాద్, కనకలు రాజ్ కవుర్ నర్గీస్‌ల లాగా అదే డ్రెస్‌లో కనిపించి కనువిందు చేస్తారు. పాట బదులు ‘తననా’ లు వుంటాయి Full song. నిజంగా ఇదో ప్రయోగమే. కొన్ని లైన్లు స్వరాలలో వుండి ఆ తరవాత ‘లిరిక్’ రావడం చాలా పాటల్లో చూస్తాం. కానీ ఓ పూర్తి సాంగ్ ‘తననా’లలో రావడం నాకు తెలిసి ఇదే మొదటిసారి. పాడింది కూడా top singers బాలు & చిత్ర గార్లు. అందుకే నా కృతజ్ఞతలు మరోసారి శ్రీ విజయబాపినీడు గారికి తెలియజేసుకుంటూ ‘వాలుజడ తోలు బెల్టు’ సినిమాలోకి పోదాం.
శ్రీ విజయబాపినీడు గారు మొదట ప్రభత్వోద్యోగి. రచయిత దర్శకుడు, పత్రికాథిపతి, నిర్మాత. ఇక పబ్లిసిటీలో అయితే సరికొత్త ఒరవడి సృష్టించి మేధావి. అన్నిటికీ మించి, ఆయనది పసి పిల్లల మనస్తత్వం. ‘చిన్న’ దానికే ఎంతో సంతోషపడతారు. కోపం వచ్చినా అది తాత్కాలికమే. ఆయన చూసినన్ని సినిమాలు బహుశా ఏ దర్శకుడూ చూసి వుండడు. కనుకనే, ఎవరి దగ్గరా అసిస్టెంటుగా పని చేయకపోయినా, అద్భుత విజయాల్ని సాధించిన సినిమాల్ని తీశారు. ఎంతో మంది సాంకేతిక నిపుణుల్ని, రచయితల్ని, సంగీత దర్శకుల్నీ, ఎడిటర్లనీ సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.
‘వాలుజడ తోలు బెల్టు’ సినిమా సంగీత దర్శకులు శ్రీ ప్రసన్న కుమార్ సర్రాజు కూడా విజయబాపినీడుగారి ద్వారా పరిచయమైనవారే. అంతకు ముందు ఆయన చక్రవర్తిగారి దగ్గర అసిస్టెంట్‌గా వున్నారు.
ఇక హీరోయిన్ ‘కనక’ అయితే, అలనాటి హీరోయిన్ ‘దేవిక’ గారి అమ్మాయి. చిన్నప్పుడు ‘శాంతినివాసం’ సినిమా చూసి వదినంటే ‘దేవిక’ లాగా ఉండాలి అని కోరుకునే వాళ్ళం. బాపినీడుగారి పుణ్యమా అని దేవికగార్ని ‘వాలుజడ తోలు బెల్టు’ టైమ్ లో చూశాను. “వదిన అంటే మీలాగానే వుండాలి అనుకునే వాడ్ని” అనగానే చందమామలా చల్లగా నవ్విందావిడ.
తెర మీద తారల్ని నిజ జీవితంలో చూడటం కూడా ఓ అద్భుతమైన అనుభవమే కదా. చాలా సార్లు బాపినీడు గారి షూటింగ్ లకి హాజరయ్యాను. ఎంతోమంది నటులు నటీమణులు సాంకేతిక నిపుణులూ పరిచయమయ్యారు. కొందరైతే మంచి స్నేహితులయ్యారు. కెమేరామెన్ మహీధర్, లోక్‌సింగ్, రచయితలు జి.సత్యమూర్తి, MVVS బాబురావు, కాశీ విశ్వనాథ్, గౌరీ శంకర్ (ఒంగోలు కాలేజీ లెక్చరర్, రైటర్ & క్రిటిక్), MVS హరనాథరావుగారు, వారి తమ్ముడు నరేష్ కృష్ణ చౌదరి, సుగంధ రమేష్ రాజా, రవీంద్ర, ఇలా ఎంతో మంది నా మిత్రులూ శ్రేయోభిలాషులూ అయ్యారు. అందుకే నాకనిపిస్తుంది మానవ జీవితం ఎన్నడూ ‘వ్యక్తిది’ కాదు ‘వ్యవస్థది’ అని.
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు”, “మహతి”, “పాండిబజార్ కథలు” అనే పుస్తకాలు వెలువరించారు.
