[ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, శ్రీ భువనచంద్ర తమ సినీ జీవన ప్రస్థానాన్ని ‘జీవితం ఓ ప్రయాణం’ అనే పేరుతో సంచిక పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నారు.]
1987లో నేను చేసిన సినిమాలు రెండు మాత్రమే (రిలీజైనవి). 1. ‘నాకూ పెళ్ళాం కావాలి’ (100 days), 2. మా ఇంటి మహారాజు (75 days). నా ఇన్‌కం తక్కువే. అయినా నా మాట మీద నేను నిలబడ్డాను (ఏర్‌ఫోర్స్ మనీ.. అంటే పెన్షన్ మనీ వాడకూడదనీ, కష్టపడి సంపాయించిందే, అంటే పనో పాటో చేసి సంపాయించింది మాత్రమే వాడుకోవాలనీ).
డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి గనక అంతకు ముందు నాకు రాని పనులు నేనే చేసుకోవడం మొదలుపెట్టా. ఉదాహరణ – బట్టలు ఉతుక్కోవడం, రూమ్ ఊడవడం లాంటివి..
పొద్దున్నే రెండిడ్లీ, రాత్రి రెండిడ్లీ, మధ్యాహ్నం భోజనం. ఒక్కోసారి మధ్యాహ్న భోజనం కూడా skip చేసేవాడ్ని. మొత్తం నేను రాసింది అయిదు డిటెక్టివ్ నావెల్స్. పేజీలు మాత్రం చాలా ట్రాన్స్‌లేట్ చేశాను.. మూర్తిగారి సహకారంతో. వీలున్నంత మటుకూ బస్సు (సిటీ) లో ప్రయాణమే. ఆ సమయంలోనే నన్ను బాపినీడు గారికి పరిచయం చేసిన రామ్ సురేష్ గారు ఓ సినిమా మొదలెట్టారు. సినిమా పేరు ‘బడి’. దర్శకత్వం బడి సాంబశివరావుగారూ, బడి రామ్ సురేష్ గారూ.
బడి సాంబశివరావు గారు Ex IAF. విశ్వనాథ్ గారి దగ్గర పని చేసేవారు. General Duty Pilot గా IAFలో వర్క్ చేశారు. ‘సాగర సంగమం’లో మిశ్రోగారు గీతనీ కమలహాసన్నీ ‘వేవేల గోపెమ్మల’ పాటకి Dance composition చూపమన్నప్పుడు సినిమా ప్రొడ్యూసర్‌తో పాటు act చేసింది సాంబశివరావుగారే. ఎందుకు చెబుతున్నానంటే ఆయన మంచి ఆర్టిస్టు కూడా. జి. రామ్ సురేష్ గారు బాగా బాగా చదివేవారు. హీ హేజ్ టేస్ట్. ఆ ‘బడి’ సినిమాకి సంగీతం ఇచ్చింది కృష్ణతేజగారు. నన్ను ‘అన్నగారూ’ అని ఎంతో ఆప్యాయంగా పిలిచే వ్యక్తి. సంగీత దర్శకుడు కాకముందు చాలా sought after track singer మాత్రమే కాక రమేష్ నాయుడి గారి దగ్గర మ్యూజిక్ అసిస్టెంట్.
‘దండాలు దండాలు యములోరికి
నల్ల దున్నపోతెక్కెచ్చే ప్రభువోరికీ’
అనే స్వాగత గీతాన్ని (యమధర్మరాజు గార్ని స్వాగతిస్తూ సాగే గీతాన్ని) ‘బడి’ సినిమాలో నేను రాశా. పిక్చర్ చాలా మంచి సినిమా. ‘బడి’ని నిర్మించిన వారిలో ‘రామారావుగారు’ కూడా వున్నారు. తరవాత వారు ‘తేనెటీగ’ సినిమాని నిర్మించారు. అది తరవాతి విషయం అనుకోండి.
‘బడి’ సినిమాకి ఖచ్చితంగా ఎవార్డులు వస్తాయని అనుకున్నాం. అందులో ‘హీరో’గా వేసింది సురేష్. అతను కెమేరామెన్‌గా work చేసేవాడు. పరిచయం అయ్యాక తెలిసింది, ఆయన మన నటభూషణ శోభన్ బాబుగారి మేనల్లుడని. ఆ తరువాత ఎప్పుడు కనిపించినా నేను ‘హీరోగారూ’ అనే పిలిచేవాడ్ని. నిష్కల్మషమైన నవ్వు.. స్నేహంతో చిప్పిల్లే చూపులూ అతనికి స్వంతం. అన్నట్టు ఆ సినిమా అంతా విజయవాడ దగ్గరున్న కంకిపాడులోనే తీశారు. ‘బడి’ చిన్న బడ్జెట్ సినిమా కావొచ్చు.. కానీ, అందుబాటులో వున్న మామూలు వారితోనే తీసిన గొప్ప సందేశమిచ్చే సినిమా. విద్య యొక్క అవసరాన్ని బోధించే సినిమా.
మరో విషయం ఏమంటే, ‘బడి’ సినిమాలో హీరో తల్లిగా నటింటిన ‘ఫణి’ అద్భుతంగా చేశారు.
సినిమాలు రావట్లేదనే బాధ మాత్రం లేదు. గుండెల్లో ఓ నమ్మకం మాత్రం వుండేది. డాక్టరు గారి దగ్గరికి వచ్చే పేషెంట్లుతోనూ, ఇతర ప్రముఖుల తోనూ పరిచయం బాగా పెరిగింది. వారిలో సూరి శ్రీ విలాస్ ఒకరు. ఒక్కోసారి పార్క్ లోకి వెళ్ళి కూర్చునేవాడిని. ఘంటసాల బెంచీని, మల్లాది వారి బెంచీనీ తడిమేవాడిని. అప్పడుప్పుడూ బాపినీడు గారు పిలిపించేవారు. కాసేపు పిచ్చాపాటీ. ఎప్పుడు పిలిపించినా ‘డబ్బుకి మాత్రం ఇబ్బంది పడవద్దు.. ఎంత కావాలన్నా తీసుకు వెళ్ళండి. నేను ఒకవేళ బయటకి వెళ్ళినా మన ఎకౌంటెంట్ సరోజినిగారిని అడిగి తీసుకువెళ్ళండి.’ అని తప్పకుండా చెప్పేవారు.
1988 నా జీవితంలో పెద్ద మలుపే అయింది. కారణం జూన్‌లో రిలీజైన ‘ఖైదీ నంబర్ 786’.
- ఆ సినిమాలో 3 పాటలు వ్రాశాను. 1. గువ్వా.. గోరింకతో 2. గుండమ్మా.. బండి దిగి రావమ్మా 3. అటు అమలాపురం ఇటు పెద్దాపురం.. మధ్య గోదావరీ – అనే పాటలు.
- మొదటి సారి రాజ్ – కోటి సారథ్యంలో పాటలు వ్రాయడం.
- వేటూరి గారితో పాటు నేనూ టైటిల్ కార్డ్ పంచుకున్న మొదటి సినిమా కావడం.
- నా మొదటి సినిమా హీరోయిన్ తొలి పరిచయం నిషాంతి (శాంతిప్రియ) అక్కగారు భానుప్రియ యీ సినిమా హీరోయిన్ కావడం. మొదటిసారి చిరంజీవికి విలన్‌గా కోట శ్రీనివాసరావుగారు నటించడం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు యీ సినిమాకి నా పరంగా వున్నాయి.
ముఖ్యంగా చెప్పుకోవలసిన ఓ విశేషం చెబుతాను. ఈ సినిమా కంపోజింగ్ విజయ గార్డెన్స్ లోనే జరిగింది. కంపోజింగ్‌కి నన్ను తీసికెళ్ళారు బాడినీడుగారు. రవీంద్రబాబు కోడైరెక్టరయితే, నరేష్ కృష్ణ చౌదరి అసోసియేట్ డైరెక్టర్. ‘గువ్వా గోరింకా’ tune compose చేశారు రాజ్-కోటి. ఆ ట్యూన్ నాకు అద్భుతంగా నచ్చింది. బాపినీడుగారికి అంతగా నచ్చలేదు. కానీ నా మీద వున్న నమ్మకంతో సైలెంట్‌గా వూరుకుని, “నాకు నచ్చినట్టుగా యీ పాట రాకపోతే పక్కన పడేస్తా” అన్నారు.
రెండు రోజులు తన్నుకున్నా పల్లవి కాదు కదా.. పల్లవి బిగినింగ్ ‘తా.. నా.. తనాననా’ అన్న తత్కారానికి పదాలు దొరకలేదు. ఓ పక్క టెన్షను. బాపినీడు గారు రోజుకి పది సార్లు అడిగేవారు.. నేను అంత లేటు చేస్తానని ఆయనా వూహించలేదు. లక్ ఏమంటే మిగతా పాటల కంపోజింగ్ జరుగుతూ వుండటం. మూడో రోజు ఉదయం చచ్చే టెన్షన్ పడుతుంటే రబ్బీ, “ఎందుకూ టెన్షన్ పడటం.. అదే వస్తుంది” అని ఊరడించారు. “టెన్షన్లో పాటలు రావండి.. తలనెప్పి వస్తుంది” అని కాస్త నవ్వించారు కూడా. ఆయన కాఫీ తాగటానికి క్రిందకి వెళ్ళారు. మా మూడో అంతస్తుకి ఆనుకుని ఓ కొబ్బరి చెట్టుంది. దాని మీదకో ‘గువ్వ’ పిట్ట వచ్చి వాలింది. ‘అబ్బ.. గువ్వల్ని చూసి ఎన్నేళ్ళయిందో’ అని మురిసిపోయా. మా చింతలపూడి అటు టౌనూ కాదు ఇటు పల్లెటూరు కాదు. నా దృష్టిలో మాత్రం పల్లెటూరే. పల్లెటూరి వాళ్ళకి తెలిసినన్ని పక్షి జాతులు పట్నం వారికేం తెలుస్తాయి? ‘గువ్వా గువ్వా రావే గువ్వా’ అంటూ దాన్ని నాలుగేదుసార్లు సరదాగా పలకరించా.. అప్పుడు తట్టింది. పల్లవిలోని మొదటి తత్కారం. తా.. నా కి పదం.. ఆటోమేటిక్‌గా రెండో పదం గోరింక అని పడింది. హేపీగా ‘గువ్వా.. గోరింకతో ఆడిందిలే బొమ్మలాటా’ అని అర్జంటుగా పేపరు మీదకి ఎక్కించా. తరవాతమో కొట్టిన పిండే. చిరంజీవి గారి సినిమాలు అప్పటికి నేనేం పెద్దగా చూళ్ళేదు. చూసిన సినిమా.. ‘కోతలరాయుడు’. అదీ బెంగుళూరు IAF లో వుండగా చూసింది.
‘ఖైదీ నంబర్ 786’ సినిమా టైమ్‌కి ఆయన స్టామినా ఏమిటో నాకు నిజంగా తెలీదు. చాలా పాపులర్ హీరో అని మాత్రం తెలుసు. అన్నట్టు ‘మన ఊరి పాండవులు’ కూడా చూశా. హిందీ సినిమాలు ఎక్కువ చూసేవాడ్ని ఆ రోజుల్లో. ఆ భాష మీద ‘పట్టు’ కోసం. పాట రికార్డింగ్‌కి హరిప్రసాద్ (చిరంజీవి గారి ఫ్రెండ్) వచ్చారట. ఆయనతోనే గాదు, చాలామంది సినీ స్టార్స్‌తో పరిచయమే లేదు. ‘నాకూ పెళ్ళం కావాలి’ టైమ్‌లో కూడా ఒక్క చంద్రమోహన్ గారు మాత్రమే పరిచయం. సరే, కృష్ణంరాజుగారూ ‘మా ఇంటి మహారాజు’లో పరిచయమయ్యారు. జస్ట్ పరిచయం.. అంతే. వారు నన్ను గుర్తుంచుకునేంత పరిచయం కాదు.
మరి హరిప్రసాద్ గారు ఏం చెప్పారో ఏమో కానీ, చిరంజీవి గారికి ‘నచ్చలేదుట’ అన్న కబురు రికార్డింగ్ థియేటర్‌కి చేరింది. అసలు పాట ఇంకా కేసెట్లో ఎక్కించలేదు.
ఆ వార్తకి ముందే మరో కాంట్రవర్సీ. “‘చిలకా.. గోరింకా’ అనేది సంప్రదాయం. గువ్వా గోరింకా ఏమిటి?” అని ఒకరు బాపినీడుగారి ఎదుట సందేహాన్ని లేవదీశారు.
“యస్.. నేనూ అదే అడుగుతామనుకున్నా.. కానీ బాగోదని వూరుకున్నా” అన్నారు మరొకరు.
“పోయిందేముందీ, బాలూ గార్ని పిలిపించి, గువ్వా గోరింకతో ప్లేస్‌లో చిలకా గోరింకాతో’ అని పాడించండి” అన్నారు ఇంకొకరు.
“మీరేమంటారూ?” అడిగారు విజయబాపినీడు గారు నన్ను.
‘సార్.. చిలకలు వేరు గోరింకలు వేరు. చిలకల్లో మగా ఆడా ఎలా వుంటాయో గోరింకల్లోనూ మగా ఆడా వున్నాయి. అసలు చెట్లు, పక్షులు ఇవన్నీ మన గ్రామర్ ప్రకారం న్యూట్రల్ జండర్ కిందకి వస్తాయి.. భాషలో పలకడానికి. ఆడదాన్నైనా, మగదాన్నైనా పిల్లిని పిల్లి అనీ, బాతుని బాతు అనే అంటాం కానీ పిల్లుడు, బాతుడు అనం కదా. వేరు వేరు జాతులైన చిలకలకీ గోరింకలకీ దోస్తీ కట్టించినప్పుడు – గువ్వలు గోరింకలతో చెలిమి ఎందుకు చేసుకోకూడదు? అంతే కాదు, సార్, తత్కారం ప్రకారం ‘గువ్వా – గోరింకతో’ ప్లేస్‌లో ‘గోరింకతో’ పదాన్ని యథాతథంగా ఉంచవచ్చు గానీ, ‘గు.. వ్వా’ ప్లేస్‌లో చిలక పడదు.” అన్నాను.
“అతనన్నది కరెక్టే” అన్నారో ఆజానుబాహుడు. ఆయనే వేటూరి సుందరరామమూర్తిగారని MVVS బాబురావుగారూ, బాపినీడుగారూ పరిచయం చేసే దాకా నిజంగా నాకు తెలీదు. అప్పటి దాకా వారి ఫోటో కూడా చూడకపోవడం నా దౌర్భాగ్యం.
“వేటూరి గారన్న తరవాత తిరుగేముంటుందీ. అలాగే వుంచుదాం” అన్నారు బాపినీడుగారు. వేటూరి గార్ని చూడకపోయినా వారి పేరు ఎన్నోసార్లు వినడమే గాక వారి పాటలు కూడా నాకు వచ్చివుండటంతో, ఠక్కున వొంగి వారి పాదాలకి నమస్కరించాను. ఆ రోజున, అప్పుడు నేనున్న టెన్షన్ వేటూరి గారి మాట నా పాలిట అదృష్టమయింది. వారు ‘గువ్వా – గోరింకల’ చెలిమికి తన రాజముద్ర వేయ్యకపోతే ‘భువనచంద్ర’ పేరు ఆ పాటతో మారుమ్రోగేది కాదని మాత్రం వినయంగా మనవి చేస్తున్నా.
ఆ గొడవ సద్దుమణిగే లోగానే, చిరంజీవిగారికి నచ్చలేదన్న కబురు. ఆ వార్త వినగానే అందరూ సైలెంటయ్యారు. బాపినీడు గారు ఓ క్షణం ఆగి “కోటిగారూ, పాటని కేసెట్ లోకి ఎక్కించి ఇవ్వండి. నేనే తీసి కెళ్ళి చిరంజీవిగారికి వినిపిస్తా” అన్నారు.
ఓ అరంగట తరవాత చింరజీవిగారు షూటింగ్లో వున్న ఓ స్టూడియోకి నన్ను కూడా బాపినీడు గారు తీసుకెళ్ళారు. పది నిముషాల తరవాత చకచకా చింరజీవి గారు రావడం, వారి కారు స్పీకర్స్ లోనే పాట వినడం జరిగింది. ‘బాపినీడుగారూ, హరిని పాట ఎలా వుందంటే, ఏదో గువ్వా, గువ్వా గువ్వా అని గొణిగాడు. ఆ గొణుగుడులో జడ్జిమెంట్ తెలీలేదు. ఇప్పుడు వింటే చాలా బాగుంది’ అన్నారని నాకు తెలిసింది. కారణం నేను కారు బయట కొంచెం దూరంలో నా టెన్షన్లో నేను నిలబడి వుండటమే.
ఏమైతేనేం.. కథ సుఖాంతం. చిత్రం ఏమంటే పాట వినేసి చిరంజీవిగారూ షూటింగ్‌కి మళ్ళీ వెళ్ళిపోయారు కానీ, వారితో నాకు పరిచయం జరగలేదు.
‘గువ్వా గోరింకా’ పాట షూటింగ్ పూర్తిగా అటెండ్ అయ్యా. కానీ వారి పరిచయం చిత్రంగా అప్పుడు నాకు కలగలేదు. ‘ఇటు అమలాపురం’ పాట ఫస్ట్ వెర్షన్ OK అయింది. ఆ పాట షూటింగ్ లోనూ నేనున్నా. మోహన్ బాబు గారి తోనూ, కోట గారితోనూ, సత్యనారాయణగారితోనూ, (డాన్స్ డైరెక్టర్) ముక్కరాజుగారితోనూ పరిచయాలయ్యాయి. కానీ వారు నన్ను గుర్తించి పలకరించేంత కాదు.
ఇహ ‘గుండమ్మా బండి దిగి రావమ్మా’ షూటింగ్ ఔట్‌డోర్‌కి వెళ్తూ బాపినీడుగారు నన్నూ వెంట పెట్టుకెళ్ళారు. ఒక్కరోజుతో షూటింగ్ కంప్లీట్ అయింది. ‘ఖైదీ నంబర్ 786’ నా జీవితంలో ఓ అద్భుతం. భువనచంద్ర అనే పాటల రచయితని రచయితగా నిలబెట్టినది అందులోని ‘గువ్వా గోరింకతో’ పాట. ఇప్పటకీ చాలామంది ఆ పాట నా మొదటి పాట అనుకుంటారు.
నాది కాస్త ఒంటరి స్వభావం. సిగ్గరిని కూడా. పరిచయం పెరిగితే తప్ప పెద్దగా మాట్లాడలేను. కారణం మిలటరీలో వుండటమే కాదు.. నార్త్‌లో ముఖ్యంగా ఎడారుల్లో ఉండడం.. మౌనాన్ని ప్రేమించడం. బాగా పరిచయమైతే మాత్రం కబుర్లకి అంతు వుండదు. ఈ స్వభావం వల్ల సినిమా పరిశ్రమలో ఎక్కువ సినిమాలకి పాటలు వ్రాయలేకపోయాను అనుకుంటా. ‘టచ్’లో వుండటం ఈనాటికీ నాకు రాదు. పిలిస్తే పాట వ్రాయడం, ఆ తర్వాత నా మానాన నేను వుండటం తప్ప అంతగా కలివిడిగా వుండలేను.
‘ఖైదీ నంబర్ 786’ విజయ దుందుభి మ్రోగించింది. నా రెండో షీల్డు (100 రోజుల జ్ఞాపిక) అదే. విజయోత్సాహాన్ని అద్భుతంగా నిర్వహించారు విజయబాపినీడుగారు. వారు చివరిలో అందరికీ ఇచ్చిన పేకెట్ పైన అంటించిన ‘ఇది మీకు కాదు.. మీ ఇంటికి’ అన్న కార్డ్ ఇంకా నా దగ్గరుంది. ఆ పేకెట్లో వున్నది నోరూరించే పులిహోర. డైలాగ్స్ రాసిన సత్యమూర్తి గారూ, రచనా సహకారం, అందిచిన MVVS బాబూరావూగారూ యీ సినిమాలో నాకు అత్యంత సన్నిహితులయ్యారు. ‘రఫ్ఫాడిస్తా’ అనే పదాన్ని కనిపెట్టింది MVVS బాబురావుగారే. ఆ పదాన్ని ఈ మధ్య కూడా ఓ సినిమాలో విన్నా.
‘ఖైదీ నంబర్ 786’ రిలీజయ్యాక నేను చింతలపూడి వెళ్ళాల్సి వచ్చింది. కారణం ‘లైవ్ సర్టిఫికెట్’ ఇవ్వాలిగా మరి (నేను వాలంటరీ రిటైర్మెంటు తిసుకున్న వాడ్ని కదా). డాక్టరుగారి దగ్గరికో సాయంత్రం వెళ్ళాను. “ఎవడోనండీ, గువ్వా గోరింకతో’ అనే పాటతో దూసుకొచ్చాడు.. కొత్త రైటరట” అన్నారు, అప్పటికే డాక్టరుగారి దగ్గర కూర్చుని వున్న జాలాదిగారు. వారు నెలా రెండు నెలల పాటు వారి వూరికి వెళ్ళారు. అందువల్ల కలవడం పడలేదు. అప్పటి వరకూ నా ఇంటర్వ్యూ కూడా రాలేదు.
“నిజంగా అతనెవరో మీకు తెలీదా?” నవ్వి అన్నారు డాక్టరుగారు.
“తెలీదే.. ఎవరూ?” ఆశ్చర్యంగా అన్నారు జాలాది గారు.
“ఇతనే.. మన రాజావారే” అన్నారు డాక్టరుగారు.
“నువ్వా” లేచి కౌగిలించుకుని, “దొంగా, ఇంత మంచి వార్త చెప్పవేం?” అని బుగ్గలు పుణికారు జాలాది.
“సార్.. అసలు నాకు అవకాశం వస్తుందో లేదో, వచ్చినా నిలబడతానే లేదో అనే సంశయంలో ఎవరికీ చెప్పలేదండి” అని నేను అప్పటికే వ్రాసిన సినిమాల గురించి కూడా జాలాది గారికి చెప్పాను. జాలాదిగారి ఆత్మ చల్లగా ఉండుగాక. ఆ రోజు నించీ మంచీ చెడూ చెప్పుకోవడానికీ, సరైన నిర్ణయాలు తీసుకోవడానికీ డాక్టర్ గారితో బాటు జాలాది గారూ నాకు తోడయ్యారు.
***
చింతలపూడి చేరాను. నేను బయిల్దేరిన రోజునే విడుదలైన ‘సితార’లో నా పరిచయమూ, బుల్లి ఇంటర్వ్యూ కూడా వచ్చాయి. పొద్దున్నే మెలకువ వచ్చింది. కారణం సినిమా బండి. ఓ రిక్షాలో లౌడ్ స్పీకర్ పెట్టి మైకులో అరుస్తున్నాడు ఎనౌన్సరు. “మంచి తరుణం మించి పోవును.. నేడే చూడండి.. మన సుప్రీమ్ హీరో చిరంజీవి సినిమా.. ‘ఖైదీ నంబర్ 786’. దర్శకులు మన జిల్లా విజయ బాపినీడుగారే.. రండి.. చూడండి.. ఆనందించండి” అంటూ ఆ ఎనౌన్స్మెంట్ అయిన మరుక్షణం ‘అటు అమలాపురం’ పాట ప్లే అవడంతో నాకు మెలకువ వచ్చింది.
ఇంతలోనే మా అమ్మ బయటకెళ్ళి, ఆ రిక్షావాడ్ని “ఆపరా” అని ఆపి, “ఒరే అబ్బీ, పొద్దున్నే ఇటు వైపు రాకు. రాక రాక ఎన్నోడో వస్తాడు నా చిన్న కొడుకు. నిద్ర లేవకుండానే ఫ్రెండ్స్ అంటూ పరిగెడతాడు. నేను వాడ్ని చూసుకోగలిగేది పరుపు మీద వాడు నిద్రపోతున్నప్పుడే.. ఇదిగో యీ అయిదూ తీసుకో..” అనడం వినిపించింది. అంటే, వాడు మా వీధికి పొద్దున్నే రాకుండా ఓ అయిదు రూపాయలు చదివించి వుండాలి. నాకు నవ్వొచ్చింది. మా సందు చివరికెళ్ళి వాడు మళ్ళీ పాట పెట్టాడు ‘తోటకూర బచ్చలికూర కొత్తిమీర’ అంటూ. “ఛీ అన్నీ ఛండాలంగా నీచు కూరల గోలే” అంటూ కోపంగా విసుకున్నది మా అమ్మ. ఆ పాట నేను రాసిందేనని ఆవిడకి తెలీదు గదా.
కాసేపు అలా పడుకున్నట్టే యాక్ట్ చేసి లేచి, “అమ్మా ఆ పాట రాసింది ఎవరో తెలుసా? నేనే!” అన్నాను.
“నువ్వా!” అంది ఆశ్చర్యంగా మా అమ్మ. నేను స్నానం చేసి వచ్చేసరికి పక్కింటి అన్నపూర్ణమ్మగారితో, “చూసావా వొదినా, ఆ సినిమాలో ఇందాకా విన్న పాట రాసింది వీడేట! నయం.. ఇంకా తిట్టాను కాదు.. అయినా వీడు సినిమాలకి పాటలు రాస్తాడని ఏనాడూ అనుకోలేదమ్మా” అని మురుసుకుంటూ చెప్తోంది.
మా అమ్మతో కలిసి నేను చూసిన నా ఏకైక సినిమా ‘ఖైదీ నంబర్ 786’.
ఆ తర్వాత ఎన్నో సినిమాలకి హిట్ సాంగ్స్ వ్రాసినా, పత్రికల్లో ఇంటర్వ్యూలు ఇచ్చినా నోరారా మాత్రం మా అమ్మకి చెప్పుకోలేకపోయా. కారణం నేను వుండేది మద్రాసు. తను ఉండేది చింతలపూడి. “అమ్మా నాతో వచ్చెయ్యకూడదా.. హాయిగా వుందాం..” అని అడిగితే “లేదురా.. ఆస్తులన్నీ పొగొట్టుకున్నాక కడుపు కాల్చుకుని మీ నాన్నగారు మిగిల్చింది యీ ఇల్లూ కాస్త స్థలమూ. మనుషులు లేకపోతే రెండు రోజుల్లో అన్నీ పీక్కుపోతారు. మీలో ఎవరో ఒకరు ఇక్కడికొచ్చే వరకూ దీన్ని సంరక్షించాలి కదా నాయనా. అయినా నా ఆరోగ్యం బాగానే వుందిగా. ఒంటరిగా వున్నానని మాత్రం బాధపడకు ఏనాడు. బాబా నా తోడున్నారుగా” అని దీవించి మళ్ళీ మద్రాసు పంపింది. ఇప్పుడు అన్నీ వున్నై అమ్మ తప్ప. దేవుడా.
(‘అమ్మ’ పాట వ్రాయమని చాలా సినిమాలలో ఆఫర్ వచ్చినా ఏనాడూ నేను వ్రాయలేదు. ఎందుకంటే, పదాలతో లక్షో వంతు కూడా కొలవలేని బంధం మాతృబంధం. ఒకే ఒక్క సినిమాలో హీరో కరుణాకర్ స్వంత సినిమా ‘బేండ్ బాలూ’ కి మాత్రం అతని బలవంతం మీద ‘అమ్మ’ పాట వ్రాశాను.).
(ఇంకా ఉంది)
భువన చంద్ర సుప్రసిద్ధ సినీ గేయ రచయిత. కథకులు. పలు హిట్ పాటలు రచించారు. “భువనచంద్ర కథలు”, “వాళ్ళు”, “మహతి”, “పాండిబజార్ కథలు” అనే పుస్తకాలు వెలువరించారు.
