[శ్రీ విడదల సాంబశివరావు రచించిన ‘జీవితం.. ఓ ప్రేమ గీతం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
జీవితాన్ని ఓ పాటగా గానం చెయ్యి నేస్తం!
నవరసాల సమ్మిళితం జీవితం..
బాల్యం మొదలు
మరణం వరకు..
జీవితాన్ని గానం చేయాల్సిందే!
జీవితం ఓ ప్రేమ గీతం..
ప్రతి హృదయము దీన్నిపాడాల్సిందే!
జీవితం శోక సాగరం కూడా!!
అయినా..
నవ్వుతూ ఆవలి తీరం దాటాల్సిందే కదా!
జీవితం ఓ అందమైన అనుభూతి
అదో విరిగిన హృదయపు ఆశ
అంతేనా..
జీవితం ఒక అరణ్యవాసం కూడా!
ఏది ఏమైనా..
పుట్టిన ప్రతి మనిషి
దానిని గడిపేసి వెళ్ళాల్సిందే!
ప్రేమంటే..
రెండు హృదయాలు ఒక్కటై పోవడమేగా!
ఒక్కటైన ఆ హృదయ ద్వయం
ప్రపంచంలోని మరేదానితోనూ
సంబంధం పెట్టుకోక
ఈ సమాజం తాలూకూ
సమస్త ప్రకంపనలు..
ప్రతిధ్వనులు..
అందులోనే ప్రతిధ్వనిస్తూ వుంటాయి!
అప్పుడే తెలివైన ప్రేమ జంట
వాటినన్నింటిని ఒకే రాగంతో కలిపేసి
మధురాతి మధురంగా గానం చేస్తాయి!
శిథిలాలకూ కోరిక లుంటాయి..
ఎప్పటికీ అలాగే వుండాలని అనుకోవు!
ఓ మహాసౌధంలా అవతరించాలని..
చరిత్రపుటలలో శాశ్వతంగా..
సుస్థిర స్థానం పొందాలని ఆశపడతాయి!
విరిగిన హృదయమైనా అంతే!!
ఏ చిన్న ఆతుకూ లేకుండా
నిండుతనాన్ని సంతరించుకోవాలని
కొండంత కోరికను..
గుండెల్లో దాచుకుంటుంది!
అప్పుడే..
జీవితం అరణ్యవాసంలా
దూరంగా విసిరి వేయబడిన భావన!
అయినప్పటికీ..
దానిని దాటి వేయడం అనివార్యమే!
జీవితం ప్రేమ వంచకి..
అయిన వాళ్ళు.. ఆత్మీయులు
ఒక్కరొక్కరుగా ఒదిలేసిపోతూ ఎవరికి వారే..
ఏదో ఒక కారణం చెబుతారు!
ఏవో లోపాల కారణంగా
విడిపోవాల్సి వస్తే..
ఈ లోకంలో..
ఎవరికి ఎవరూ మిగలరు నేస్తం!
అన్నింటికీ అతీతమైన
జీవన మాధుర్యంతో..
లోపాలెన్ని వున్నా
అందరినీ మన్నించి
కలుపుక పోవాల్సిందే!
జీవితం ఆనందాల హరివిల్లు కాదు!
ఒకింత ఆనందం
మరికొంత వేదన..
కలగలిసిన బాధల గీటు రాయి!
జీవితమంతా..
ప్రేమించిన ఈ లోకాన్ని..
ఎప్పుడో ఒకప్పుడు తప్పనిసరిగా
వదిలేసి వెళ్ళాల్సిందే కదా నేస్తం!
అందుకే..
జీవితాన్ని అందమైన ప్రేమ గీతంలా
గానం చేస్తూ ఆనందంగా సాగిపో!
శ్రీ విడదల సాంబశివరావు గారు 22 జనవరి 1952 న గుంటూరు జిల్లా, చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో ఉన్న పురుషోత్తమపట్నం గ్రామంలో ఓ మధ్య తరగతి ‘రైతు’ కుటుంబంలో జన్మించారు. శ్రీమతి సీతమ్మ, రాములు వీరి తల్లిదండ్రులు. స్వగ్రామంలో ప్రాథమిక విద్య, చిలకలూరిపేటలో ప్రాథమికోన్నత విద్య, తెనాలిలో బి.ఎస్.సి. పూర్తి చేశారు.
బాల్యం నుంచి నటనపై అభిరుచి ఉంది. అనేక నాటికలలోనూ, నాటకాలలోనూ నటించి ప్రశంసలందుకొన్నారు. వివిధ సంస్థల నుండి పతకాలు పొందారు. రాష్ట్రస్థాయిలో ఉత్తమ నటుడిగా బహుమతులు పొందారు. వీరు రచించిన ‘పుణ్యభూమి నా దేశం’ (నాటకం), ‘తలారి తీర్పు’ (నాటిక) ప్రసిద్ధమయ్యాయి. టివి ధారావాహికల్లోనూ, కొన్ని సినిమాల్లోనూ ముఖ్య పాత్రలు పోషించారు.
సాంబశివరావు గారు వెయ్యికి పైగా కవితలు రాశారు. వాస్తవిక జీవితాలని చిత్రిస్తూ అనేక కథలు రాశారు. కవితలు, నాటకాలు, కథలు కలిపి 14 పుస్తకాలు ప్రచురించారు. పలు పత్రికలలో ఫీచర్లు నిర్వహిస్తున్నారు.
నాటకరంగలోనూ, రచన రంగంలోనూ ఉత్తమ పురస్కారాలు అందుకొన్నారు. నీహారిక పౌండేషన్ అనే సంస్థని స్థాపించి సమాజ సేవ చేస్తున్నారు.
