[శ్రీ తోకల రాజేశం రచించిన ‘జీవితం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఎన్ని రాత్రుళ్లు లెక్క పెట్టినా
చుక్కల సంఖ్య నేటికీ తెగడం లేదు
వానాకాలం
మా ఊరి చెరువమ్మ నిర్వహించే
కప్పల బెకబెకల సంగీత కచేరీలా
నా మది నిండా ఎవరికీ వినిపించని రోదనలు
చీకటి గుండెల్లో భయం పుట్టిస్తూ
అవిచ్ఛిన్నం గా సాగే కీచురాళ్ళ రొదలా
బుర్రనిండా తెగిపోని అనంతమైన ఆలోచనలు
అందరూ వున్న ఏకాంతంలో
లోలోపటి శాంతి రెక్కలొచ్చిన పావురంలా ఎగిరిపోయాక
నా బతుకంతా
కారునలుపు చీకట్లు కమ్మినట్లనిపిస్తుంది
నెత్తిమీద దిగులు లాంటి చీకటి మబ్బులు
కమ్ముకున్న నడిజాము రాత్రిలో
తళుక్కున కళ్ళముందు మెరిసిందొక మిణుగురు పురుగు
నా దారికి కాగడాదీపమెత్తినట్లు
రాత్రికి పడమటి మంచం మీద
నిద్రపోయిన సూరీడు
చీకట్లను తరుముతూ వస్తాడు
అచ్చం నన్ను నా జీవితం తరిమినట్టే!
