[తాటికోల పద్మావతి గారు రచించిన ‘జీవితమే పూబాట’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మందార మకరంద మాధుర్యమును బ్రోలేటి
మల్లెలు గులాబీలు, మరువంపు జాజులు
సుమధుర పరిమళాలు పంచి పెడతాయి.
పూలు అందంగా నవ్వుతాయి.
సుతి మెత్తని హృదయం లాగా
సున్నితమైన రేకులతో మురిపిస్తాయి.
రంగురంగుల అందాలతో అలరిస్తాయి.
సూర్యోదయం తోనే విచ్చుకొని
పరిమళభరితమై ఆ ఒక్క రోజుకే
జీవితాన్ని సార్థకం చేసుకుంటాయి.
నిన్నటి పూలు బాధగా
రేకులు రాలిపోయినా
ఆదర్శాలకు ఆనందాలకు
నిలయాలవుతాయి.
ఈరోజు విరబూసిన ప్రతి పువ్వు
రేపటికి వాడిపోతుందని తెలిసినా
హాయిగా నవ్వుతూ బ్రతికేస్తాయి.
దేవుని మెడలో హారంగా నిలవాలని
పాదాలపై వ్రాలి ప్రణమిల్లాలని
మగువ కురులలో ముడవాలని
పోటీపడి గుసగుసలాడుతాయి.
కల్మషం తెలియనివి, కార్పన్యం ఎరగనివి,
కన్నీళ్ళకు చోటే లేనివి పూలు ప్రకృతి సౌందర్యాలు.
మనిషి కూడా పువ్వులాగా బ్రతకాలంటే
పూరేకుల వంటి హృదయం ఉండాలి.
పువ్వు లాగా అందంగా ఉంటే సరిపోదు.
తడి మనసులో ఆర్తిగా అందంగా నవ్వాలి.
జ్ఞాపకాల బంధాలతో ఎగిరిపోని గంధంలా
కాల గమనమంతా సాగిపోతూ
స్నేహ పరిమళాలు వెదజల్లాలి.
స్వార్థం, అసూయ, ద్వేషాలు లేకుండా
రేపటి కోసం స్వచ్ఛంగా విరబూయాలి.
జీవితం అందంగా ఉండాలంటే
పువ్వుల సందేశాలు తెలుసుకోవాలి.
పువ్వు లాగా ఒక్కరోజు బ్రతికినా చాలు.
అప్పుడే జీవితం పూలబాటవుతుంది.
