[శ్రీమతి కనకదుర్గా లక్ష్మీరత్న గారి ‘జీవితంలో ఎదగాలంటే?’ అనే రచనని అందిస్తున్నాము.]
మనిషి జీవితంలో ఎదగాలి అంటే ప్రతిభ ఉండాలి. కొందరిలో ప్రజ్ఞా పాటవాలు, సామర్థ్యం, నైపుణ్యం అన్నీ ఉన్నప్పటికినీ ఆత్మవిశ్వాసం కొరవడటం చేత తమలో ప్రతిభ ఉన్నట్లే గుర్తించరు. అలాంటివారికి, వారిలోని ప్రతిభని గుర్తించి, వారి సామర్థ్యాన్ని వెలికి తీసే ఒక ప్రేరణా శక్తి అవసరమవుతుంది. ఒకసారి వారు తమలోని సామర్థ్యం, దక్షతను ఎరిగి, వెలికి తీసాక వారి ప్రతిభ విరాజమానమవుతుంది. ఆ ప్రతిభకు వినయం తోడైతే మరింత శోభాయమానమవుతుంది. దీనికి గొప్ప ఉదాహరణ స్వామి హనుమ.
శతయోజనముల వారధి దాటి లంకకు పోయి రాగల ధీరుడు ఎవరు అని ప్రశ్న తలెత్తినప్పుడు, హనుమ శక్తి సామర్థ్యములను ఎరిగిన జాంబవంతుడు, ఆయన వలనే ఈ కార్యం సాధ్యం కాగలదని “ఆంజనేయా! నీవు తేజస్సు నందు రామలక్ష్మణులకు, సుగ్రీవునకు, వేగ గమనమునందు గరుత్మంతునికి ఏ మాత్రం తీసిపోవు. నీలో ధైర్య సాహస పరాక్రమాది గుణాలు పరిపూర్ణంగా ఉన్నవి. వామనావతారమున తన పాదత్రయముచే ముల్లోకములను ఆక్రమించిన శ్రీ మహావిష్ణువు వలే విజృంభించి నీ శౌర్యపరాక్రములతో ఈ మహత్కార్యమునకు పూనుకొనుము” అని ఉత్తేజపరిచాడు. జాంబవంతుని మాటలతో ప్రేరణ పొందిన హనుమ శ్రీరామచంద్రమూర్తి కార్యాన్ని సఫలీకృతం చేయడంలో కృతకృత్యుడయ్యాడు. అంత మహోత్కృష్టకార్యమును చేసినప్పటికినీ ఆయన వినయమును వీడలేదు. అహంకారమును ఆశ్రయించలేదు. “దాసోహం కోసలేంద్రస్య” అనే పరిచయంతోనే సార్థకుడయ్యాడు. తను చేసిన ఉపకారానికి రాముని నుండి ఏ ప్రత్యుపకారము, మెప్పును ఆశించలేదు. ఇక్కడ హనుమ ప్రతిభకు వినయము, ప్రతిఫలాపేక్ష రాహిత్యము తోడవడం చేత ఆయన ఆదర్శప్రాయుడు అయ్యాడు.
కురుక్షేత్ర సమరంలో యుద్ధభూమిలో స్వజనసమూహముతో యుద్ధము చేయుటకు అర్జునుడు వేదనకు లోనైనప్పుడు, కృష్ణపరమాత్మ అతనికి గీతోపదేశంతో ఉత్తేజపరచి రణరంగానికి ఆయత్తం చేసాడు.
ప్రతి మనిషికి ఒక ప్రేరణా శక్తి అవసరం. ప్రధానంగా పిల్లలకి తమ యందు నమ్మకం, విశ్వాసం పటిష్టం కావడానికి తల్లిదండ్రులు, గురువులనుండి ప్రేరణ, చేయూత లభిస్తే వారి అభివృద్ధికి దోహద పడినవారవుతారు. బరిలోకి దిగిన ఆటగాడికి ఉత్సాహము,ఆత్మవిశ్వాసం క్షీణిస్తున్న దశలో తమకి తర్ఫీదు ఇచ్చే కోచ్ నుండి, తోటి ఆటగాళ్ల నుండి ప్రేరణ, ప్రోత్సాహం లభిస్తే నిర్భయంగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించగలడు.
మరికొందరు ప్రతిభ వలన మితిమీరిన ఆత్మవిశ్వాసము కలిగివుంటారు. వారిలో అహంకారం పొడసూపి తమను మించిన వారు లేరని, తమకు తిరుగే లేదని గర్వంతో వ్యవహరిస్తుంటారు. అహంకారంతో కూడిన ప్రతిభ రాణించదు సరికదా, అది వారి పతనానికి, భంగపాటుకి కారణమవుతుంది. ఇందుకు రావణాసురుడే నిదర్శనం. తన పరాక్రమము,శక్తి సామర్థ్యాలు, బ్రహ్మనుండి పొందిన వరాల వలన అహంకరించి, సీతా దేవిని అపహరించి,చివరికి రామ బాణానికి నిహతుడయ్యాడు. తన పతనాన్ని తానే మూట గట్టుకున్నాడు.
ఎంత ప్రతిభ ఉన్నా అహంకారం ఆవహిస్తే అది మనిషి ఎదుగుదలకు అవరోధంగా మారి వైఫల్యానికి దారి తీస్తుంది. అందుకే ‘వినయం లేని విద్య రాణించదు’ అని అంటారు పెద్దలు. ఫలాలు ఇచ్చే వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎలా అయితే కిందకు వంగి వుంటుందో, మనిషి కూడా ఎంత కీర్తి ప్రతిష్ఠలు సంపాదించినప్పటికినీ వినయము, విధేయతను కలిగి, సాటి వారితో గౌరవప్రదంగా మెలుగుతూ, పాత విలువలను మరువకుండా నడుచుకుంటే అదే మనిషిలోని ప్రతిభకి వన్నె తెస్తుంది. నిజమైన ప్రతిభ జ్ఞానానికి, సంస్కారానికి, అణకువకి బాట వేయాలి గానీ, అహంకారానికి, గర్వానికి తావు ఇవ్వకూడదు.
