Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితమొక పయనం-21

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[హైదరాబాదు విద్యానికేతన్‍లో రాఘవకు 6, 7 తరగతులకు తెలుగు, అలాగే 6 నుండి 9 వ తరగతి వరకు సంస్కృతం క్లాసులను కేటాయిస్తారు. సీనియర్ సంస్కృత ఉపాధ్యాయుడి వద్ద రాఘవ బాగా తర్ఫీదు పొందుతాడు. అతనికి ఆవాసం బాధ్యత కూడా అప్పజెప్పడంతో, తీరిక లేకుండా అయిపోతుంది. పిల్లలకి బాగా దగ్గరవుతాడు. రాత్రి పూట వాళ్ళకి కథలు చెప్తాడు. మూడు నెలలు గడుస్తాయి. ఓ రాత్రి పూట గోడ కదిలినట్టుగా అనిపిస్తుంది. కుక్కలు గోడలని ఏమైనా గీరుతూ చప్పుడు చేస్తున్నాయోమోనని బయటకు వచ్చి చూస్తాడు. కానీ అక్కడ కుక్కులు ఉండవు. ఇంతలో ప్రధానాచార్యులు కూడా బయటకు వచ్చి, చూసి అది భూకంపమేమో అని అనుమానం వ్యక్తం చేస్తాడు. కాసేపటికి ఆయన రేడియోలో వార్తలు విని వచ్చి అది భూకంపమేననీ, మహరాష్ట్రలోని లాతూర్‌ కేంద్రంగా చాలా తీవ్ర స్థాయిలోనే వచ్చిందని చెప్తాడు. ఇంతలో మరికొందరు ఆచార్యులు కూడా తమ తమ గదుల్లోంచి బయటకు వచ్చి విషయం తెల్సుకుని మాటల్లో పడతారు. ఓ రోజున 6వ తరగతి పిల్లలకు తెలుగు పాఠం చెబుతూండగా, గుమాస్తా వచ్చి, ప్రధానాచార్యులు పిలుస్తున్నారని చెప్తాడు. వెళ్ళి ఆయనను కలిస్తే, ఆయన ఒక టెలిగ్రామ్ అందిస్తారు. రాఘవ తండ్రి మరణించాడన్న సమాచారం ఉంటుంది దాంట్లో. వెంటనే బయల్దేరి మర్నాడు మధ్యాహ్నానికి ఊరు చేరతాడు. ఆ సాయంత్రం తండ్రికి తలకొరివి పెడతాడు. పదిహేను రోజులు సెలవు మంజూరు చేయమని ప్రధానాచార్యులకి ఉత్తరం రాస్తాడు. పది రోజులయ్యాకా, ఓ రోజు రాఘవ వీధిలో వెడుతుంటే, రాఘవ తండ్రి స్నేహితుడు సంపత్ కనబడి పిలుస్తాడు. రాఘవ అంటే వాళ్ళ నాన్నకి ఎంతో ప్రేమనీ, రాఘవ కోసం ఎన్నో చేయాలనుకున్నాడనీ సంపత్ రాఘవకి చెప్తాడు. రాఘవ సొంతూరులోనే ఉద్యోగం చేసుకోవడం రాఘవ తండ్రి కోరిక అంటూ, హైదరాబాదు నుంచి వచ్చేయమని చెప్తాడు సంపత్. తండ్రికి తన మీద ఉన్న ప్రేమను తలచుకుని బాధపడతాడు రాఘవ. 15వ రోజు తండ్రికి చెయ్యాల్సిన కార్యాలు పూర్తిచేస్తాడు. – ఇక చదవండి.]

41. అనుకోని అతిథి

న ఉద్యోగం విషయంలో సంపత్‌ గారు సూచించిన సలహాను వెంటనే అమలు చెయ్యలేకపొయ్యాడు రాఘవ.

సెలవులు పూర్తికావటంతో హైదరాబాద్‌ బయలుదేరాడు.

“రాఘవా, నా మాట విను. ఇక్కడే ఏదైనా ఉద్యోగం చూసుకో. అంత దూరం వెళ్లటం నాకిష్టం లేదు.” స్థిరంగా అంది అతని తల్లి వనజమ్మ. మౌనం వహించాడు రాఘవ.

“మీ నాయనా వెళ్లి చేరిపొయ్యాడు. నేను ఒంటరిదాన్నయిపోయాను. రేపు ఎటుపోయి ఎటు వస్తుందో చెప్పలేం. నా ప్రాణం నీ సమక్షంలో పోవాలన్నదే నా చివరి కోరిక రా!” అంది కళ్లల్లో నీళ్లు కుక్కుకుంటూ.

“అమ్మా, ఏంటా మాటలు? అలాగంతా మాట్లాడకు.” గొంతు పెగల్చుకుని అన్నాడు రాఘవ.

“లేదురా, నాకూ వయసైపోతోందిగా. ఏ క్షణంలో ఏమవుతుందో, ఎవరు చెప్పగలరు?” అంది.

మళ్లీ మౌనం వహించాడు రాఘవ.

“ఏమంటావురా? నామాట వినవా?”

“ఇప్పటికిప్పుడు ఉన్నపళంగా ఉద్యోగాన్ని వదిలి వచ్చేయటం ఏం బాగుంటుందమ్మా? ఇంతకాలమూ మనల్ని పోషించినవాళ్ల పట్ల మనం చూపించే కృతజ్ఞత ఇదేనా? ఈ ఒక్క యేడాదైనా పూర్తికానీ. తర్వాత నువ్వు చెప్పినట్టే చేస్తాను.” చివరికెలాగో అన్నాడు రాఘవ.

దాంతో మౌనం వహించిన తల్లికి ఎలాగో నచ్చచెప్పి హైదరాబాద్‌ చేరుకున్నాడు.

అతని రాకకు ఎంతగానో సంతోషించారు మిత్రులు. ప్రధానోపాధ్యాయులు కూడా రాఘవ త్వరగా కోలుకున్నందుకు ఆత్మీయంగా అతని భుజం తట్టాడు.

మరుసటిదినం నుండి ఉద్యోగ విధిలో లీనమైపొయ్యాడు రాఘవ. తండ్రిని మరిచిపోవటానికి పిల్లలతోటి లోకం అతనికి ఎంతగానో ఉపయోగపడిరది.

ఇంతలో వారాంతపు పరీక్షలు వచ్చాయి. పిల్లల్ని పరీక్షలకు సిద్ధంచేసే పనిలో పడ్డాడు రాఘవ.

ఆరోజు మధ్యాహ్న భోజనం చెయ్యటానికి పళ్లెం తీసుకుని భోజనశాలకు వెళ్తుంటే అటెండర్‌ వచ్చి.. “మీకోసం ఎవరో వచ్చారు. మిమ్మల్ని ప్రధానాచార్యులు రమ్మంటున్నారు.” అనేసరికి ఆశ్చర్యపొయ్యాడు రాఘవ.

‘ఈ హైదరాబాద్‌లో తనకోసం వచ్చేవాళ్లు ఎవరబ్బా?’ అన్న ఆశ్చర్యంతో తన పళ్లేన్ని ఓ విద్యార్థి చేతికిచ్చి కార్యాలయం వైపు బయలుదేరాడు.

రాఘవ కార్యాలయంలోకి అడుగుపెడుతుంటే లేచి నిలబడుతున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపొయ్యాడు.

“ఎలా ఉన్నారు రాఘవగారూ?..” అంటున్న ఆ వ్యక్తి మరెవరో కాదు మాధవరెడ్డి వాళ్లమ్మాయి సురేఖ.

“బాగున్నాను. బాబాయ్‌ ఎలా ఉన్నారు?” అని అడిగాడు.

“అడిగింది నేనైతే, నాన్న గురించి అడుగుతున్నారే?” అంటూ బుంగమూతి పెట్టింది సురేఖ.

“ఆ ఆ.. మీరెలా ఉన్నారు?”

“ఇద్దరమూ బాగున్నాము.” అంది నవ్వుతూ.

“ఏంటిలా వచ్చారు?”

“ఏం రాకూడదా?”

“అబ్బే, అలా అనేం కాదు.” అంటూ నసిగాడు రాఘవ.

“మీతో పనుండే వచ్చాను. ఇవ్వాళ అర్ధరోజు సెలవుపెట్టి మీరు నాతో సిటీకి రాగలరా?” వినయంగా అడిగింది.

“నేనా?”

“ఆ మీరే. ఏం మీకేమైనా పనులున్నాయా? అయితే వద్దులెండి. నా తిప్పలేవో నేను పడ్తాను.”

“అలా అని కాదు. సిటీలో పనేంటో చెబితే..”

“ఏం పనో చెప్తేకానీ రారన్నమాట. అలాగే! ఇక నేను వెళ్లొస్తానండీ.” అంటూ అక్కణ్ణిండి లేచి వెళ్లబోయింది.

“ఆ ఆ.. ఏంటా తొందర? ఒక్క నిమిషం అలా కూర్చోండి.”

ఆ అమ్మాయి కుర్చీలో కూర్చున్నాక ఒక కాగితంలో అర్ధరోజు సెలవును మంజూరు చెయ్యమని కోరుతూ.. ఓ సెలవు చీటీ రాసి అక్కడున్న గుమస్తాకిచ్చి ఇద్దరూ బయటికొచ్చారు.

“మీరు భోంచేశారా? రండి భోంచేద్దురు.” అంటూ సురేఖను పిలిచాడు మర్యాదపూర్వకంగా.

“భోజనం తర్వాత, ముందు మీరెళ్లి బట్టలు మార్చుకుని రండి. నేను ఎంట్రెన్స్‌లోని మెయిన్‌ గేటు దగ్గరుంటాను.” అంటూ అతణ్ణి తొందరపెట్టింది.

రాఘవ బట్టలు మార్చుకుని వచ్చేసరికి మెయిన్‌ గేటు బయట ఒక కారు కనిపించింది. సురేఖ కనిపించలేదు. ఆమె కోసం అటుఇటు చూస్తుంటే కార్లో నుండి తలబైట పెట్టి “ఇటు ఇటు..” అంటూ రాఘవను పిలిచింది సురేఖ.

కారు దగ్గరికెళితే వెనక సీట్లో సురేఖతో పాటు మరో అమ్మాయి కూడా కూర్చొని ఉంది.

డోరు తీసి “ఎక్కండి!” అంటూ అతణ్ణి లోపలికి ఆహ్వానించింది సురేఖ.

ముందు సీట్లో కూర్చుందామని చూస్తే అక్కడ ఒక పదేళ్ల పిల్లవాడు కూర్చుని కనిపించాడు. మరో దారిలేక రాఘవ కారు వెనకసీట్లో కూర్చున్నాడు.

కారు బయలుదేరింది. రాఘవకు కార్లో ప్రయాణించటం అదే మొదటిసారి. ఏదో బిడియంగా, వింతగా అనిపించింది. సంతోషంగానూ, సంకోచంగానూ కూడా ఉంది అతనికి.

“ఏంటలా ముడుచుకుపోయి కూర్చున్నారు? ఫ్రీగా కూర్చోండి.” అంది సురేఖ స్నేహితురాలు.

“ఆ చెప్పటం మరిచాను. ఇది నా ప్రాణ స్నేహితురాలు పేరు మాధవి. ముందు కూర్చున్నవాడు దీని తమ్ముడు చంటి.” మాధవికి చేతులు జోడించి నమస్కరించాడు రాఘవ.

కొంతసేపటికి కారు మాధవి వాళ్లింటి ముందుకొచ్చి ఆగింది.

అందరూ దిగి లోపలికెళ్లారు. ఆ ఇల్లు ఎంతో రిచ్‌గా వుంది. ఇల్లు అనకూడదేమో దాన్ని బంగళా అనాలేమో. అందరూ మేడపైకి వెళ్లారు. అక్కడ అరేంజ్‌మెంట్సు చూసి ఆశ్చర్యపొయ్యాడు రాఘవ. టేబుల్‌ పైన ఓ పెద్ద కేక్‌ వుంది. ఎవరిదో పుట్టినరోజు కాబోలు అనుకున్నాడు. కొంతసేపటికి చంటి కొత్తబట్టలు వేసుకొచ్చాడు.

వాళ్ల కుటుంబ సభ్యులు, ఒకళ్లిద్దరు తెలిసినవాళ్లు, ఇరుగుపొరుగు వ్యక్తుల మధ్య చంటి కేక్‌ కట్‌చేశాడు. అందరూ అతనికి విషెస్‌ చెప్పి తాము తెచ్చిన బహుమతులు ఇచ్చారు.

రాఘవకు చాలా చిన్నతనంగా అనిపించింది. ఒఠి చేతులతో వచ్చిన వ్యక్తి తానొక్కడినే? సురేఖ తనకు మాట మాత్రంగానైనా ముందు చెప్పలేదు. చెప్పి వుంటే తానూ ఏదో ఒక బహుమతి తీసుకొచ్చి వుండేవాడు.

ఇంతలో సురేఖ చంటితో, “ఇది నా బహుమతి, ఇది రాఘవగారిది.” అంటూ రెండు బహుమతుల్నీ తనే ప్రేమపూర్వకంగా అతని చేతికిచ్చింది.

తర్వాత అందరూ భోజనాలకు కూర్చున్నారు.

భోజనాలు పూర్తయ్యాక అందరూ మళ్లీ కార్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళుతున్నామో తెలియలేదు రాఘవకు.

“రాఘవ గారూ మీరు సినిమాలు గట్రా చూస్తారు కదా?” అడిగింది మాధవి.

“ఓ..చూస్తాను.” అన్నాడు తల ఊపుతూ.

“తెలుగేనా, హిందీ, ఇంగ్లీషు కూడా చూస్తారా?” అడిగింది సురేఖ.

“హిందీ తక్కువ చూస్తాను. ఇంగ్లీషు అప్పుడప్పుడూ చూస్తాను.”

“అయితే ఓకే!”

“అక్కా, ఇంకేం ప్రాబ్లెమ్‌ లేనట్టే కదా?” సురేఖను అడిగాడు చంటి.

ఇంతలో కారు ఒక సినిమా థియేటర్‌ ముందు ఆగింది.

బయట భారీ కటౌట్‌ మీద ‘ప్రిడేటర్‌’ అన్న పెద్దపెద్ద అక్షరాలు కనిపించాయి. ఎవరో ఒక బలిష్టమైన వ్యక్తి చేతిలో ఒక పెద్ద మెషీన్‌గన్‌ ఉంది. చంటి ఆ హీరో పేరు చదివేందుకు ఇబ్బంది పడ్డాడు. రాఘవకూడా మనసులోనే ప్రయత్నించినా నోరు తిరగలేదు. చివరకు సరిదిద్దింది సురేఖ. ఆ హీరో పేరు స్క్రూవిజ్‌నెగ్గర్‌ అట.

‘ఇంగ్లీషు హీరోల పేర్లు ఇలాగే అర్థంపర్థంలేనివిగా ఉంటాయి కాబోలు’ మనసులో అనుకున్నాడు రాఘవ.

టికెట్లు తీసుకుని హాల్లోకి వెళ్లి కూర్చున్నారు. ప్రేక్షకులు ఎక్కువమంది లేరు. హాలు నిండలేదు. సినిమా వచ్చి చాలా రోజులు కావటంతో తక్కువ మంది ప్రేక్షకులు వచ్చినట్టు చెప్పింది మాధవి.

సినిమా మొదలైంది. ప్రారంభమే ఎంతో ఆసక్తికరంగా ఉంది. సినిమా ముందుకు వెళుతున్నకొద్దీ మనుషుల్ని వరుసబెట్టి చంపుతున్నది మనిషో, జంతువో, ఏలియనో ఏమీ అర్థం కావటం లేదు. సినిమా ముందుకెళుతున్నకొద్దీ టెన్షన్‌ అంతకంతకూ పెరిగిపోసాగింది.

ఇంతలో చమక్కుమని హాల్లో లైట్లు వెలిగాయి. ఇంటర్వెల్‌ టైమ్‌!

మాధవి, చంటి బయటికెళ్లారు.

“ఎలా ఉంది సినిమా?” రాఘవను అడిగింది సురేఖ.

“చాలా బాగుంది.” చెప్పాడు రాఘవ.

“ఇంటర్వెల్‌ పైన ఇంకా బాగుంటుంది.” నవ్వుతూ చెప్పింది సురేఖ.

“ఔనా?” ఆసక్తిని కనబరిచాడు రాఘవ.

“తెలుగు సినిమాల్లోలా పాటలు, కామెడీ ఇవేవీ లేకపోయినా సస్పెన్స్‌తో సినిమాని చివరిదాకా చూసేలా తియ్యటం హాలివుడ్‌ దర్శకులకే చెల్లు!” మెచ్చుకోలుగా అంది సురేఖ.

ఏం చెప్పాలో తెలియక “ఔనౌను.” అని ముక్తసరిగా జవాబిచ్చినా ఆమె చెప్పింది నిజమేననిపించింది అతనికి.

ఇంతలో మాధవి, చంటి వస్తూ వస్తూ పాప్‌కార్న్‌ ప్యాకెట్లు, కోక్‌ టిన్స్‌ పట్టుకొచ్చారు.

రాఘవ వద్దంటున్నా బలవంతంగా అతని ఒళ్లో అతని భాగాన్ని పెట్టింది మాధవి. చాలా మొహమాటపడ్డాడు. ‘మరేం పర్వాలేదు’ అన్నట్టుగా అతనికేసి నవ్వుతూ తలూపింది సురేఖ.

‘ఇలాగంతా జరుగుతుందని ముందే తెలిసుంటే తనూ కొంత డబ్బు తీసుకొచ్చి ఉండేవాడు. ఇప్పుడన్నీ వాళ్లే ఖర్చు పెడ్తుంటే అదోలా ఉంది’ మనసులో అనుకున్నాడు రాఘవ.

ఇంతలో ఠక్కున లైట్లు ఆరిపోయాయి. సినిమా మళ్లీ మొదలైంది.

ఒక దశలో హీరోపై ఆ జంతువు దాడి చేసి చంపాలని చూస్తుంది, కానీ ఎలాగో దాన్నుండి తప్పించుకునే క్రమంలో ఊహించని విధంగా ఒక విషయాన్ని గ్రహిస్తాడు హీరో. అదేంటంటే అతని ఒంటికి బురద అంటుకుని ఉండటంతో ఆ జంతువు హీరోని గుర్తించలేకపోతుంది. దాంతో చివరలో.. ఒంటి నిండా బురద పూసుకుని ఆ జంతువుతో ప్రాణాలొడ్డి పోరాడుతాడు హీరో. చివరలో అది అతని నుండి తప్పించుకుని పారిపోయినట్టుగా చూపించాడు దర్శకుడు. అంటే దాని రెండో భాగం కూడా ఉంటుందేమోనని ప్రేక్షకులు ఊహించుకుంటూ హాలు నుండి బయటపడతారు.

సినిమా ఆద్యంతం ఎంతో ఆసక్తినీ భయాన్నీ కలిగించింది రాఘవకు. మొత్తానికి ఆ రోజు వాళ్లతో అలా సరదాగా గడపటం ఎంతో ఆనందాన్ని కలిగించింది అతనికి.

అయితే పాఠశాలకు వచ్చాక ప్రధానాచార్యులు “ఆ అమ్మాయి ఎవరు?” అన్న ప్రశ్నకు.. మాధవరెడ్డి కుమార్తె అని చెప్పి, మాధవరెడ్డి దేశభక్తి గురించీ, ఆయన శారీరక దృఢత్వం గురించీ, ఆయనకూ తనకూ మధ్యా ఉన్న బాబాయి, అబ్బాయిల అనుబంధం గురించీ ఎంతో గొప్పగా చెప్పాడు రాఘవ. తనకు ఈ సరస్వతీ విద్యానికేతనంలో ఉద్యోగం రావటానికి ఆయనే కారకులనీ ఆయనపట్ల ఎంతో కృతజ్ఞతా భావాన్ని ప్రదర్శించాడు.

రాఘవ మాటలకు ప్రధానాచార్యులు కూడా ఎంతగానో సంతోషించారు.

“ఇప్పుడు ఆయన కూతురుతో కలిసి ఎక్కడికెళ్లారు?” అన్న ప్రశ్నకు “ఆ అమ్మాయి తమ్ముడికి పుట్టినరోజు వేడుకకు తమ బంధువుల ఇంటికి తీసుకెళ్లింది. పుట్టినరోజు వేడుకను ఎంతో గ్రాండ్‌గా చేశారు. అక్కడికి మాధవరెడ్డిగారు కూడా వచ్చారు.” అని ఓ చిన్న అబద్దమాడటమే కాక తాము సినిమాకు వెళ్లిన విషయాన్నీ దాచిపెట్టాడు రాఘవ.

42. బుద్ధుని పాదాల చెంత..

ఆరోజు పాఠశాల పూర్తయ్యాక మంచం మీద విశ్రాంతిగా పడుకుని ఏవో ఆలోచనల్లో ఉన్నాడు రాఘవ.

అంతలో హిందీ ఆచార్జీ కుమారు అతని గదిలోకి వచ్చాడు. అతని రాకను కూడా గమనించకుండా తన ఆలోచనల్లో మునిగిపోయి ఉన్నాడు రాఘవ.

“ఏంటి రాఘవగారూ ఈ లోకాన్నే మరిచిపోయి, ఊహల్లో విహరిస్తునట్టున్నారు.” చలోక్తిగా అంటూ అతని ఎదుట కూర్చున్నాడు కుమారు.

చప్పున ఆలోచనల్లో నుండి బయటపడి, “అబ్బే అలాందేమీ లేదు. ఏవో పనికిమాలిన ఆలోచనలు.. అంతే!” అని చిన్నగా నవ్వాడు రాఘవ.

“అంతేనా? ఇంకేమీ లేదా?” అంటూ తనూ నవ్వాడు కుమారు.

“ఏంటిలా వచ్చారు, ఏదైనా చెప్పాల్సిన విశేషముందా?” ఆసక్తిగా అడిగాడు రాఘవ.

“ఔను, విశేషముండే వచ్చాను. మీకో గిఫ్ట్‌ తెచ్చాను. అదిస్తే మీరు నాకేమిస్తారు?” సరదాగా అడిగాడు కుమారు.

“ఏమిటో అది చూపించండి!” లేచి కూర్చుంటూ అన్నాడు రాఘవ.

“ఊహూ, ముందు నాకేమిస్తారో చెబితే, గిఫ్టేమిటో చూపిస్తాను.” ఉడికిస్తూ అన్నాడు కుమారు.

“ఊ.. ఈసారి మనం బయటికెళ్లినప్పుడు మీకు ఓ మాంచి ఇరానీ చాయ్‌ తాగిపిస్తాను.” మాటిచ్చాడు రాఘవ.

“అయితే ఓకే..” అంటూ తన చొక్కా జేబులో దాచిన ఇన్‌ల్యాండు లెటర్‌ను తీసి రాఘవ ముందుకు చాపాడు.

దాన్ని తీసుకుని ఎక్కడి నుండి వచ్చిందో ఫ్రం అడ్రసు చూశాడు. కానీ అది ఖాళీగా ఉండటంతో చిరునామా చేతిరాతను గమనించాడు. అది తనకు తెలిసిన వాళ్లెవరిదీ కాదు, ‘ఎవరై ఉంటారబ్బా..’ అనుకుంటూ కవరును చించి చదవటం మొదలుపెట్టాడు. రెండు లైన్లు చదివేసరికి అది ఎవరి నుండి వచ్చిందో గ్రహించి, దాన్ని కుమారు ముందు చదవటం ఇష్టంలేక మడిచి జేబులో పెట్టుకున్నాడు.

“అదేం, విశేషాలు పూర్తిగా చదవకనే మడిచి పెట్టేశారు?” అడిగాడు కుమారు.

“అప్పులాళ్లు రాసే ఉత్తరాల్లో ఏం విశేషాలుంటాయి. అప్పు వెంటనే తీర్చమని నిలదీసే విషయం తప్ప.” అంటూ చిన్నగా పెదాలు విరిచాడు రాఘవ. దాంతో మౌనంగా ఉండిపొయ్యాడు కుమారు.

తర్వాత కాసేపు ఆ విషయాలూ ఈ విషయాలూ మాట్లాడి వెళ్లిపోయాడు కుమారు.

వెంటనే జేబులో నుండి ఉత్తరం తీసి చదవసాగాడు రాఘవ.

రాఘవగారికి నమస్తే!

మీరు క్షేమమేనా? క్రితంసారి మనం గోల్కొండ కోటను సందర్శించిన దృశ్యాలు ఇంకా నా కళ్లముందు కదలాడుతున్నాయి. ఆ రోజు ఎంత సరదాగా గడిపామో. ఎంత ఆనందాన్ని పొందామో. ఏవేవో చిరుతిళ్లు తింటూ సమయం గడవటమే తెలియనంతగా మైమరచి గోల్కొండ అంతా తిరిగేశాం. మెట్లెక్కుతూ ఓ చెట్టునీడన కూర్చుని ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామనీ. నిజానికి ఎక్కువ మాట్లాడింది నేనే. మీరు చాలా తక్కువ మాట్లాడారు.

రామదాసు చెరశాల దగ్గర మీరు చెప్పిన ఎన్నో చారిత్రక అంశాలు ఎంతో ఉపయుక్తమైనవి. పక్కన నా స్నేహితురాలు మాధవి లేకపొయ్యుంటే మీరు ఆ విషయాలు కూడా చెప్పి ఉండరేమోననిపించింది. మొదటిసారి మనం ఇంగ్లీషు సినిమాకు వెళ్లినప్పటికన్నా బాగా మారి ఉంటారనుకున్నాను. కానీ మీరు మరీ బిడియస్తుల్లా ఉన్నారండీ. మొహమాటం కూడా చాలా ఎక్కువే. ఆడపిల్లల్తో కలివిడిగా మాట్లాడటం మీకు అస్సలు చేతకాదు. అయినా మీ సాన్నిహిత్యం మాకెంతో ఆనందాన్నిచ్చింది. మళ్లీ ఎప్పుడు మనం కలుసుకుందామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

కానీ, ఒక విషయం నాకు అర్థమైందేమిటంటే.. నేను అప్పుడప్పుడూ మీ విద్యానికేతన్‌ దగ్గరకొచ్చి మిమ్మల్ని బయటికి తీసుకెళ్లటం మీకు ఎన్నో ఇబ్బందుల్ని తెచ్చి పెడుతుందేమోనని భయపడుతున్నాను. అందుకనీ ఇక నేను మీ విద్యానికేతన్‌ దగ్గరికి రాను. మీకు ఇబ్బందిని కలిగించను.

కానీ, ప్రతి నెలా రెండవ ఆదివారం ఎక్కడ కలుసుకోవాలో నేను ఉత్తరం ద్వారా మీకు తెలుపుతాను. సరాసరి మీరు అక్కడికి వచ్చెయ్యండి. మీకు ఏ ఇబ్బందీ ఉండదు. ఏమంటారు?

ఈ నెల రెండవ ఆదివారం సరిగ్గా పదకొండు గంటలకు ట్యాంకుబండ్‌ దగ్గరకు వచ్చేయండి. అక్కడ మీ కోసం ఎదురుచూస్తుంటాము. అంతవరకూ సెలవు. సురేఖ.

ఉత్తరం నుండి చూపు మరల్చి గోడకున్న క్యాలెండరు కేసి చూశాడు. రేపే రెండవ ఆదివారం.

తను రేపు ట్యాంకుబండ్‌కు తప్పక వెళ్లాలా అని ఆలోచనలో పడ్డాడు.

‘సురేఖను ఇలా తరచూ కలవటం ఎంతవరకూ సబబు? అదసలు మంచి పనేనా? కాలేజీ చదువుతున్న ఒక ఆడపిల్లను వాళ్ల పెద్దలకు తెలియకుండా కలుసుకోవటం సరైన పనేనా? ఈ విషయం బాబాయికి తెలిస్తే ఆయన ఏమనుకుంటారు? తనను జులాయి అనీ, నీచుడనీ, దుర్మార్గుడనీ అనుకోరూ? ఆయనతో ఉన్న పరిచయం కొద్దీ వాళ్లమ్మాయితో స్నేహంగా మసలటం మర్యాద అనిపించుకుంటుందా? ఇది ఊరు కాని ఊరు కాబట్టి సరిపోయింది, లేకుంటే ఆ అమ్మాయిపై ఎన్ని ఫిర్యాదులు వెళ్లేవో? ఎంత చెడుగా చెప్పేవారో? తనవల్ల ఆ అమ్మాయికి చెడ్డపేరు రావటం అంత మంచిది కాదు. అందుకే రేపు తను ట్యాంకుబండ్‌ దగ్గరకు వెళ్లకూడదు. ఇక్కడితో ఈ స్నేహానికి ముగింపు పలకాలి. ఇక ఏమాత్రం దాన్ని పెంచకుండా ఇక్కడితో ఆపెయ్యాలి. అందుకే రేపు తను అక్కడికీ వెళ్లకుండా విద్యానికేతన్‌లోనూ ఉండకుండా బయటికెళ్లిపోవాలి. ఇక్కడే ఉన్నానంటే.. తను ట్యాంకుబండ్‌కు రాలేదని ఆ అమ్మాయి సరాసరి ఇక్కడికి వచ్చినా రావచ్చు. కనుక ఉదయాన్నే సిటీకి వెళ్లిపోయి సాయంత్రం దాకా ఎలాగో టైము గడిపి రావాలి..’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు రాఘవ.

మరుసటి రోజు అల్పాహారం అయ్యాక పాఠశాల నుండి బయటపడి సిటీబస్సు ఎక్కి మెహిదీపట్నం బస్‌స్టాండులో దిగాడు. అక్కడ బస్టాండులో అర్దగంటకు పైగానే గడిపాడు. మళ్లీ ఏ బస్సూ ఎక్కలేదు. ఎక్కడికెళ్లాలో తెలియలేదు. సాయంత్రం దాకా ఎలా గడపాలో ముందుగా నిర్ణయించుకోలేదు.

విద్యానికేతన్‌లో ఉండకూడదు అని ఆలోచించాడే కానీ రోజంతా ఎలా గడపాలో ఏ ప్లానూ వేసుకోలేదు.

ఏదో ఆలోచిస్తూ వచ్చీపోయే సిటీబస్సుల్ని చూస్తూ కూర్చున్నాడు.

అంతలో ట్యాంకుబండ్‌ మీదుగా వెళ్లే సిటీబస్సు కనిపిస్తే యాంత్రికంగా ఆ బస్సులోకి ఎక్కేశాడు.

అప్రయత్నంగా ట్యాంకుబండ్‌కు టికెట్‌ తీసుకున్నాడు. ఆ స్టాపు రాగానే బస్సు దిగి మెల్లగా ముందుకు నడిచాడు. అక్కడక్కడా ఉన్న మనుషులను చూస్తూ నడవసాగాడు.

“ఇప్పుడా రావటం? టైమెంతైందో తెలుసా?” అన్న మాటతో ఆగి పక్కకు చూశాడు.

అక్కడున్న ఓ కుర్చీలో నుండి లేచి వస్తూ కోపంగా ప్రశ్నిస్తోంది సురేఖ.

“అర్ధగంట నుండి మీరెప్పుడొస్తారా అని కాచుక్చూచున్నాను. ఇంత ఆలస్యంగానా రావటం?”

సురేఖను చూసి నవ్వుతూ ఇంకెవరికోసమో వెదుకుతూ.. “క్షమించండి, ఆలస్యమైంది.” అన్నాడు.

“మాధవి కోసమేనా వెతుకుతున్నారు?”

ఔనన్నట్టుగా తలూపాడు రాఘవ.

“అది రాలేదు.. ఏదో పనుందట. ఇంకాసేపు మీకోసం చూసి నేను నేరుగా విద్యానికేతన్‌కే వచ్చి ఉండేదాన్ని.”

‘అమ్మో, తను ఊహించిందే సరైందన్నమాట.’ మనసులో అనుకున్నాడు రాఘవ.

“రండి వెళదాం.” అంటూ ముందుకు దారితీసింది సురేఖ. అనుసరించాడు రాఘవ.

ఎంట్రెన్సు దగ్గర వ్యానిటీబ్యాగులో నుండి రెండు లాంచీ టికెట్లు తీసి గేటుకీపరు ముందుకు చాపింది.

“నేను రాకపోయి ఉంటే ఈ టికెట్లను ఏం చేసి ఉండేవారు?” ఉడికిస్తున్నట్టుగా అడిగాడు రాఘవ.

“ముక్కలు ముక్కలుగా చించి సాగర్‌లో పడేసి ఉండేదాన్ని.” కోపం నటిస్తూ అంది సురేఖ.

ఇద్దరూ నవ్వుకుంటూ లాంచీలోకి దారితీశారు. ఓ చోట పక్కపక్కనే కూర్చున్నారు. జనాలు మెల్లగా నిండిపోవటంతో లాంచీ బయలుదేరింది.

హుస్సేన్‌సాగర్‌ అలలపై లాంచీ అటుఇటు ఊగుతూ మెల్లగా కదులుతుంటే.. రెండేళ్ల క్రితం కన్యాకుమారిలో తను మొదటిసారి లాంచీలో సముద్రంపై ప్రయాణించిన సంఘటన గుర్తొచ్చింది రాఘవకు.

ఆనాడు మాధవరెడ్డిగారితో ప్రయాణిస్తే ఇవ్వాళ వాళ్లమ్మాయితో ప్రయాణించటం ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించింది అతనికి.

“ఏంటీ ఆలోచనలో పడ్డారు. ఈమధ్యే బుద్ధ విగ్రహం సాగర్‌ మధ్యలో ఏర్పాటుచేశారు. చాలారోజులుగా చూడాలనుకుంటూ వాయిదా వేస్తూ వస్తున్నాను. ఇవ్వాళ మీతో ఇలా కుదిరింది.” అంది సురేఖ. చిన్నగా నవ్వాడు రాఘవ.

ఎదురుగా కనిపిస్తున్న ఎత్తైన బుద్ధ విగ్రహాన్ని చూస్తూ.. ఆనాడు సముద్రం మధ్యలోని వివేకానందుడి విగ్రహాన్ని చూడ్డానికి వెళితే, ఈరోజు సాగర్‌ మధ్యనున్న బుద్ధుడి విగ్రహాన్ని చూడటానికి వెళుతున్నాడు. భలే తమాషాగా అనిపించింది అతనికి.

లాంచీ, విగ్రహానికి దగ్గరయ్యేకొద్దీ.. సినిమాల్లో విష్ణువు విశ్వరూపాన్ని చూపినట్టుగా బుద్ధుడు క్రమక్రమంగా ఎంతో ఎత్తుకు ఎదిగిపోతున్నట్టుగా కనిపించసాగాడు అతని కళ్లకు.

లాంచీ ఆగింది. అందరూ దిగారు. దూరం నుండి తనివితీరా బుద్ధ విగ్రహాన్ని చూసిన వాళ్లందరూ సమీపం నుండి విగ్రహాన్ని తల పైకెత్తి చూడలేకపోతున్నారు.

విగ్రహం పక్కన నడుస్తూ బుద్ధుడి పాదాల చెంత చెక్కబడిన శిల్పసౌందర్యాన్ని తన్మయత్వంతో చూడసాగాడు రాఘవ. అబ్బురంగా చూడసాగింది సురేఖ.

అక్కడక్కడా ఆగి సాగర్‌పై గిరికీలు కొడ్తున్న పక్షుల్ని, దూరంగా రోడ్డుమీద వెళ్తున్న వాహనాలను, ఎత్తైన భవనాలను, స్టార్‌ హోటళ్లను ఆసక్తిగా చూశారు.

వాళ్లు అలా చూసుకుంటూ మళ్లీ బుద్ధుడి ముందు భాగానికి రాగానే, తన హ్యాండ్‌బ్యాగులో నుండి చిన్ని కెమెరాను బయటికి తీసింది సురేఖ.

ఒక యువతిని పిలిచి తామిద్దరనీ ఒక ఫోటో తియ్యమని అడిగింది. ఆ అమ్మాయి చక్కగా ఫోటో తీసింది. ఆ అమ్మాయికి కృతజ్ఞతలు తెలిపి కెమెరా తీసుకుని మళ్లీ బ్యాగులో పెట్టుకుని ఒకచోట మెట్లపై కూర్చున్నారు.

“ఒక మనిషి గొప్ప వ్యక్తిగా పరిణతి చెందటం మనం బుద్ధుని జీవితంలో చూడొచ్చు.” అన్నాడు రాఘవ.

“ఔనా..”

“ఒక రాజుగా ఉండి ఒకానొక రోజున అతనికి వీధిలో కనిపించిన దృశ్యాలు అతని గమనాన్నే మార్చివేసాయి. బోధివృక్షం కింద ప్రశాంతంగా కనులు మూసుకుని కూర్చుంటే.. అనంతమైన ఆలోచనల సుడిగుండంలో కొట్టుమిట్టాడాడు. చివరకు జ్ణానోదయమై అతను బుద్ధుడుగా మారాడు. రాజ్యం, పరిపాలన, అధికారం, సంసారం, భార్యాబిడ్డలు అన్నింటినీ పరిత్యజించాడు. చివరకు ఒక మత పునాదికి ఆద్యుడయ్యాడు..” చెప్పుకుపోతున్న రాఘవ తన మాటల్ని ఆపి సురేఖ ముఖంలోకి చూశాడు.

ఆమె మౌనంగా తలదించుకుని ఉండటాన్ని చూసి ఆశ్యర్యపొయ్యాడు.

“ఏమిటీ, ఏమైందీ? ఎందుకలా ఉన్నారు?” ఆదుర్దాగా అడిగాడు రాఘవ. అయినా తల పైకెత్తలేదు సురేఖ.

ఆమె మౌనం ఎందుకో అర్థం కాలేదతనికి. తల వంచి ఆమె ముఖంలోకి చూసి నిర్ఘాంతపొయ్యాడు.

సురేఖ కళ్లల్లో నిండుకున్న కన్నీళ్లు జలజలమంటూ కిందికి రాలిపడ్డాయి.

ఆమె ఎందుకు అంతగా దుఃఖిస్తోందో అతనికి అర్థం కాలేదు. తాను అనకూడని మాట ఏదైనా అన్నాడా అని కలతపడ్డాడు. ఆమెను ఎలా ఓదార్చాలో తెలియక తికమక పడ్డాడు.

“ఎందుకు దుఃఖిస్తున్నారో దయచేసి చెప్పండి.” అన్నాడు అభ్యర్థిస్తున్నట్టుగా.

అయినా నోరు విప్పలేదు సురేఖ. ఒకళ్లిద్దరు వాళ్లవైపు అదోలా చూస్తూ ముందుకెళ్లటం గమనించి.. “ప్లీజ్‌ ఏడుపును కంట్రోల్‌ చేసుకుని ఎందుకు బాధపడుతున్నారో చెప్పండి. ఆరోగ్యం ఏమైనా బాగాలేదా, దయచేసి చెప్పండి. ఇక్కడ మనల్ని చూస్తున్నవాళ్లు అపార్థం చేసుకునేలా ఉన్నారు.” అన్నాడతను చివరకు.

కర్చీఫ్‌తో కళ్లు తుడుచుకుంటూ.. “అదేం లేదు, నేను బాగానే ఉన్నాను.” అంది తలపైకెత్తి అతనికేసి చూస్తూ.

రెండు నిమిషాలు మౌనం వహించాక, “సురేఖగారూ, దయచేసి ఏం జరిగిందో చెప్పండి, ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో చెప్పండి ప్లీజ్‌!” అన్నాడు దీనంగా రాఘవ.

“ఏం లేదు, ఓ రాజుకు జ్ఞానోదయమై ఆయన బుద్ధుడైన విషయాన్ని ఎంతో గొప్పగా చెప్పారు. ఆయన అన్నింటినీ పరిత్యజించి నిష్కామకర్ముడై జీవితాన్ని కొనసాగించినట్టుగా చెప్పారు. ఇంకా ఏంటేంటో బుద్ధుడు గురించిన విషయాలను ఆహా ఓహో అంటూ చెప్పారు. అంతా బాగానే ఉంది.

కానీ బుద్ధుని భార్యవైపు నుంచి కాస్తైనా ఆలోచించారా? అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భర్త అర్ధాంతరంగా కుటుంబ వ్యవస్థ నుండి తప్పుకుంటే ఆమె పరిస్థితి ఏం కావాలో ఆలోచించారా? అతణ్ణే సర్వస్వంగా భావించి నిశ్చింతగా బ్రతుకీడుస్తున్న ఆమె భవితవ్యం అంధకారమేనా? కష్టమైనా సుఖమైనా తనకు కడదాకా తోడుంటాడని మనసా వాచా కర్మణా అతణ్ణే నమ్ముకున్న ఆమె, అతను తీసుకున్న నిర్ణయానికి ఏమైపోవాలి. భర్త ప్రేమకు దూరమై ఒంటరిగా ఆమె ఎలా బ్రతుకీడ్చగలదు? ఒక్కగానొక్క కుమారుణ్ణి ఎలా పెంచగలదు, ఎలా పోషించగలదు?..” అంటూ మళ్లీ కన్నీళ్లు పొంగుకు రాగా తల దించుకుంది సురేఖ.

అతనికి చప్పున కన్యాకుమారిలో.. ఇంద్రుడు అహల్యను మోసం చేసిన సందర్భంలో గౌతముడు తన భార్యకు విధించిన శాపాన్ని గురించి ఆలోచించి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన గుర్తొచ్చింది.

ఆనాడు తాను మాధవరెడ్డి గారి ముందు విలపిస్తే ఈనాడు ఆయన కుమార్తె తన ముందు దుఃఖించటం ఆశ్యర్యమనిపించింది.

ఆనాడు మాధవరెడ్డిగారు తనను ఓదార్చినట్టే ఇప్పుడు సురేఖను తన సున్నితమైన మాటల ద్వారా ఓదార్చాలనుకున్నాడు రాఘవ.

“చూడండి సురేఖగారు, చరిత్రలో జరిగిపోయిన విషయాలను మనం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. అందులోని న్యాయాన్యాయాలను, తప్పొప్పులను ఎత్తి చూపకూడదు. జరిగిపోయినదాన్ని మరో విధంగానో, మరొకరి కోణం నుండో చూసి బాధపడకూడదు. తెలిసిందా? ఇక లేవండి వెళదాం!” అంటూ అతను పైకి లేచాడు.

సురేఖ నిట్టూరుస్తూ తనూ లేచి నిలబడింది.

(ఇంకా ఉంది)

Exit mobile version