Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జీవితమొక పయనం-25

[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]

[నీరజకు గర్భస్రావమైన విషయం తెలుసుకుని ఆమె తల్లిదండ్రులు కూతుర్ని చూడటానికి వస్తారు. తల్లిని హత్తుకుని నీరజ రోదిస్తుంది. రెండు రోజులు కూతురికి ధైర్యాన్ని కలిగిస్తూ, జరిగిన సంఘటనని మరిపించేందుకు ప్రయత్నిస్తుంది నీరజ  తల్లి. మూడవరోజు కూతురిని తీసుకుని తమ ఇంటికి బయల్దేరుతారు.  వారం తరువాత వెళ్ళి నీరజని ఇంటికి తీసుకొస్తాడు రాఘవ. అతని ఒక్క జీతంలో ఇల్లు గడవటం కష్టంగా ఉందనీ, చిత్తూరు ఇల్లు అమ్ముడు కానందువల్ల ఆర్థికంగా వస్తున్న ఇబ్బందులని ఎదుర్కునేందు తానూ ఉద్యోగం చేస్తానంటుంది నీరజ. రాఘవ పనిచేసే స్కూల్లోనే చిన్న తరగతులకు టీచర్‍గా ఉద్యోగం ఉంటుందేమో అడగమంటుంది. గర్భశోకం నుంచి దృష్టి మళ్ళించుకోడాని ఉద్యోగం బావుంటుందని అనిపించి, కరెస్పాండెంటును అడుగుతాడు. ఆయన సమ్మతించి ఉద్యోగం ఇస్తాడు. కొన్ని రోజులు గడిచాకా, చిత్తూరులోని ఇల్లు కొనడానికి ఒకాయన వస్తాడు. చిత్తూరు లోని ఇల్లు అమ్మేస్తే, ఆ ఇంట్లోని సామాన్లు కూడా ఉంటాయి కాబట్టి మరో పెద్ద ఇంట్లోకి మారుదామని చెప్తుంది నీరజ. సరేనంటాడు రాఘవ. కొత్త ఇంట్లోకి మారిన పదిహేను రోజులకి చిత్తూరులో రిజిస్ట్రేషన్ కోసం కబురు చేస్తాడు ఇల్లు కొనుక్కున్నాయన. అక్కడి వ్యవహారాలన్నీ ముగించుకుని, వచ్చిన డబ్బులో కొంత బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ వేస్తాడు రాఘవ. నీరజ మళ్ళీ గర్భవతై కొడుకుని ప్రసవిస్తుంది. తన వద్ద ఉన్న మిగతా సొమ్ముతో వడ్డీ వ్యాపారం మొదలుపెడతాడు రాఘవ. కొందరు తీసుకున్న అసలు, వడ్డీ సకాలంలో చెల్లించగా, మరికొందరు ఎగ్గొడతారు. హేమాద్రి అనే బ్యాంకు ఉద్యోగి అప్పు ఎగ్గొట్టడమే కాకుండా, లాయర్ ద్వారా ఐపి నోటీస్ పంపించి, ఒకవేళ తాను ఆత్మహత్య చేసుకుంటే, దానికి బాధ్యులు అంటూ కొంతమంది పేర్లు పేర్కొంటాడు. ఆ జాబితాలో తన పేరు కూడా ఉండటం చూసి షాక్ అవుతాడు రాఘవ. – ఇక చదవండి.]

49. మీరయ్య ఆవు

రాఘవ తన దగ్గరున్న డబ్బంతా వడ్డీకి తిప్పి మోసపొయ్యాడు. పై ఆదాయం మొత్తం ఆగిపోయింది. ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులో పదిహేను వేలు రూపాయలను మాత్రం మిగుల్చుకోగలిగాడు. పైగా అతని ఒక్క జీతంతోనే కుటుంబాన్ని పోషించాల్సి రావటం దుర్భరమైంది.

“ఏమండీ, నేనూ ఉద్యోగానికి వస్తానండి, నా జాబ్‌ ఉందేమో కరస్పాండెంట్‌ను అడగండి.” అంది నీరజ ఒక రోజు.

“చిన్నపిల్లాణ్ణి పెట్టుకుని నువ్వు డ్యూటీ చెయ్యలేవు నీరజా!” అన్నాడు రాఘవ.

“ఎలాగో మేనేజ్‌ చేద్దామండీ.”

“నువ్వు చేస్తానన్నా స్కూలు మేనేజ్‌మెంటు ఒప్పుకోవద్దూ.. అయినా అడిగి చూస్తాలే.” అన్నాడు. కానీ ఖాళీ లేదని చెప్పేసాడు కరస్పాండెంట్‌. ఈ విషయాన్ని భార్యతో చెప్తే ఎంతగానో నిరుత్సాహపడింది.

దాంతో.. తన దగ్గర అప్పు తీసుకున్నవాళ్లను మళ్లీ మళ్లీ కలిసి అడగటం తప్ప మరో మార్గం లేదని గ్రహించాడు.

రాఘవ నుండి అప్పు తీసుకున్న వాళ్లల్లో మీరయ్య కూడా ఒకడు.

అతను ఒక పత్రికాఫీసులో విలేకరిగా పనిచేస్తున్నాడు. రాఘవ ఇంటి పక్కనే అద్దెకుంటున్నాడు. ఆ పరిచయంతోనే ఐదువేల రూపాయలను అప్పుగా ఇచ్చాడు.

అప్పును తీర్చకుండా ఎగ్గొట్టినవాళ్ల జాబితాలో మీరయ్య ఉన్నప్పటికీ అతనిలో ఎంతో నిజాయితీ ఉందని రాఘవ నమ్ముతున్నాడు. అంత మంచి మనిషి మీరయ్య.

మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రాబోతుందనగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక దినపత్రికను ప్రారంభించాడు.

మరో పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న మీరయ్య, ఎమ్మెల్యే నడిపే పత్రికలో చేరి, అప్పటికే ఆర్థికంగా దివాలా తీసిన రాఘవకూ అక్కడ ఉద్యోగం వచ్చేలా చేశాడు.

స్కూల్లో ఇచ్చే జీతంకన్నా ఎక్కువ ఇస్తారన్న కారణంగా ఆ పత్రికలో పనిచెయ్యటానికి ఆసక్తి కనబరిచాడు రాఘవ.

విలేకరులు రాసుకొచ్చిన వార్తలను భాషాదోషాలు లేకుండా సరిచేసి డిటిపి ఆపరేటర్‌కు ఇవ్వటం, అతను టైప్‌ చేశాక వాటిని ప్రూఫ్‌ చూడటం ప్రస్తుతం రాఘవ చెయ్యాల్సిన పనులు.

అయితే అందులో చేరాక రాఘవ అనుభవానికొచ్చిన విషయమేమిటంటే, అందరూ నిద్రపోతున్నప్పుడు అతను మేల్కోవాలి, అందరూ మేల్కొన్నప్పుడు అతను నిద్రపోవాల్సి రావటం కొంత ఇబ్బందిగానే అనిపించింది రాఘవకు. అయినా సర్దుకుపోయి ఆ ఉద్యోగాన్ని కొనసాగించసాగాడు.

ఒకట్రెండు నెలల తర్వాత ఒకరోజు రాఘవ, “ఏం మీరయ్యా, నెలనెలా నీ జీతంలోంచి కొద్ది కొద్దిగానైనా నా అప్పును తీర్చొచ్చు కదా?” అని అడిగాడు.

“సార్‌, నా జీతం ఎంతో మీకు తెలియనిది కాదు. వచ్చే జీతంతో కుటుంబాన్ని నడపటం నాకూ కష్టంగానే ఉంది. ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి సార్‌, తర్వాత ఖచ్చితంగా మీ అప్పును తీర్చేస్తాను.” అన్నాడు మీరయ్య.

మరేమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపొయ్యాడు రాఘవ.

ఈలోపు రాఘవ వైట్‌ రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా అది శాంక్షన్‌ కావటంతో కొంత స్థిమితపడ్డాడు.

ప్రతి నెలా బియ్యమూ, చక్కెర, కిరోసిన్‌ తక్కువ ధరకు వస్తుండటంతో కొంత ఊరట చెందారు ఆ దంపతులు.

మరో నెలరోజులు ఆగి, మళ్లీ మీరయ్యను తన అప్పు తీర్చమని అడిగాడు రాఘవ.

“సార్‌, బ్యాంకులో లోను కోసం అప్లై చేసున్నాను. అది శాంక్షనైతే మీ అప్పు కొంత తీరుస్తాను. లేదంటే మా  ఇంటి ఆవును మీకు తోలించేస్తాను.” అన్నాడు.

“ఆవా? దాన్ని నేనేం చేసుకోను?” అన్నాడు రాఘవ.

“మంచి పలమనేరు నాటు ఆవు సార్‌ అది. జర్సీ ఆవులకు ఏమాత్రం తీసిపోదు. రోజుకు పన్నెండు లీటర్లకు పైగానే పాలు ఇస్తోంది. కాదని మీరు దాన్ని అమ్మినా పదిహేను వేలకు ఏమాత్రం తగ్గదు.” చెప్పాడు మీరయ్య.

“అయితే నువ్వే దాన్ని అమ్మి నా అప్పు తీర్చొచ్చు కదా మీరయ్యా?” అన్నాడు రాఘవ.

“సార్‌, అది బేషుగ్గా పాలిస్తున్న ఆవు. అది ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి నట్టింట ఉన్నట్టే. మా ఇంటి అదృష్టం సార్‌ అది. దాన్ని చూస్తూ చూస్తూ ఒకరికి అమ్మటం నాకిష్టం లేదు సార్‌.” అన్నాడు అనునయంగా.

“మరి దాన్ని నాకు తోలిస్తే నేనూ అమ్ముకోవాల్సిందేగా?”

“వద్దు సార్‌, పాల వ్యాపారం చెయ్యండి. మంచి లాభాలొస్తాయి. అంతేకానీ దయచేసి అమ్మకండి.”

“ఆలోచిద్దాం లే.” అన్నాడు రాఘవ.

ఈలోపు రెండవసారి గర్భం దాల్చింది నీరజ. మొదటిబిడ్డ పుట్టి రెండేళ్లు కాకుండానే భార్య మళ్లీ నెల తప్పటం ఇబ్బందిగానే తోచింది రాఘవకు. అబార్షన్‌ చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. నీరజతో చెప్పాడు. ఆమె అయిష్టంగానే అందుకు అంగీకరించింది. డాక్టరు దగ్గరకు తీసుకెళ్లాడు. కానీ డాక్టరమ్మ అబార్షన్‌కు ససేమిరా అంగీకరించనంది. నీరజ ఆరోగ్య రీత్యా అదంత క్షేమకరం కాదని తెలిపింది. దాంతో చేసేదేమీ లేక భార్యను జాగ్రత్తగా చూసుకోసాగాడు.

రోజులు గడిచేకొద్దీ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించటం కష్టంగా తోచసాగింది రాఘవకు.

విషయం తెలుసుకుని రాఘవ పెద్దక్క కొంత డబ్బు సాయం చేసింది. కొంత కాలానికి అదీ ఖర్చయిపొయ్యింది.

ఓ రోజు రాఘవ చిన్నక్క తమ్ముణ్ణి చూడ్డానికి వచ్చి అతని పరిస్థితిని చూసి ఎంతగానో బాధపడిరది.

“రాఘవా మీరు పీలేరుకు వచ్చెయ్యండిరా, అక్కడ మీ బావ మీకేదైనా మార్గం చూపించక పోడు.” అంది.

నిజానికి రాఘవకు చిన్నక్క ఊరికి వెళ్లాలని లేదు. కానీ ప్రస్తుతం తమకు ఎవరో ఒకరి ఆసరా దొరికితే వాళ్ల సాయంతో ఎలాగైనా ముందుకు వెళ్లాలనుకుంటున్నాడు.

‘పీలేరుకు వెళ్లినా బావ సాయం తీసుకోకూడదు. ఉన్న డబ్బుతో ఒక షామియానా షాపును పెట్టుకోవాలి. అలాగే మీరయ్య ఆవును పెట్టుకుని పాల వ్యాపారం ద్వారా కూడా కొంత సంపాదించవచ్చు.’ అని భావించాడు.

ఆ విషయమై నీరజతో చర్చించాడు. ఆమెకూ అది సమంజసంగానే తోచింది.

తన ఆలోచనను చిన్నక్క శాంతకు చెప్పి అక్కడ తమకోసం ఓ మోస్తరు పెరడు ఉన్న ఇంటిని అద్దెకు చూడమని చెప్పాడు. కొన్నాళ్లకు ఆమె వీళ్ల కోసం ఓ అద్దె ఇంటిని చూసి పెట్టింది.

రాఘవ పీలేరుకు వెళ్లేందుకు నిర్ణయించుకుని, మీరయ్యతో ఇలా అన్నాడు: “మీరయ్యా, నా జీవితం ఇలాగంతా అవుతుందనుకోలేదు. చాలామందికి సాయం చేసి నేను బాగా నష్టపోయాను. ఇక ఈ తిరుపతిలో బతకటం నాకు కష్టంగా తోస్తోంది. మా చిన్నక్క ఉంటున్న పీలేరుకు వెళ్లిపోదామనుకుంటున్నాను. నువ్వు ఇవ్వాల్సిన బాకీకి నీ ఆవును ఇస్తానన్నావు. దాన్ని నాకు తోలియ్యి. నువ్వు చెప్పినట్టుగా నేను పాలవ్యాపారం చేసుకుంటాను. తర్వాత దేవుడెలా పెడితే అలా జరుగుతుంది.”

“సార్‌! ఈ వూరు వదిలిపెట్టి నిజంగా వెళ్లిపోతున్నారా? ఎంత కష్టకాలం వచ్చింది సార్‌ మీకు. మీరు పీలేరులో కాపురం పెట్టాక మా ఇంటికి రండి. ఆవును మీతో పంపుతాను.”

“ఆవును మాత్రమేనా? దూడను పంపవా?” అనుమానంగా అడిగాడు రాఘవ.

“ఈ మధ్యే దూడ చనిపోయింది సార్‌!” అన్నాడతను ఎంతో బాధతో.

“మరి దూడ లేకుండా ఆవు పాలెలా ఇస్తుంది?”

“అదే మా ఆవు ప్రత్యేకత. దూడ లేకపోయినా పాలిస్తోంది.”

“ఆశ్యర్యమే? మరి దాన్నెలా నేను తీసుకెళ్లగలను మీరయ్యా?” అన్నాడు.

“మీరు దాన్ని నడిపించుకుని పీలేరుకు తీసుకెళ్లొచ్చు. కానీ మీరు ఆ పని చెయ్యలేరు. అంత దూరం నడవలేరు. లేదూ ట్రాక్టరులోనో, మినీ లారీలోనో తీసుకెళ్లొచ్చు. కానీ దానికి బండి బాడుగ ఎక్కువవుతుంది. అందుకనీ, ముందు మీరు వెళ్లి అక్కడ కాపురం పెట్టండి. మీ చిరునామా ఇవ్వండి. పదిరోజుల్లో నేను మనిషిని పెట్టి మీకు ఆవును పంపుతాను. ఆవును మీ దగ్గరికి చేర్చాక వచ్చిన మనిషికి భోజనం పెట్టి ఎంతో కొంత ఇచ్చి పంపించండి.” అన్నాడు చివరకు మీరయ్య.

అంగీకరించాడు రాఘవ.

అంతకు ముందే ఇల్లును ఖాళీ చేస్తున్నట్టు ఇంటివాళ్లకు చెప్పినా, రాఘవ వాళ్లు వెళ్తున్నప్పుడు ఆ దంపతులు  ఎంతగానో బాధపడ్డారు.

తన కుటుంబాన్ని పీలేరుకు మార్చాడు రాఘవ.

రాఘవ వెళ్లిన మరునాడు.. పశువులు పెట్టుకుని పాల వ్యాపారం చేసే ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చింది చిన్నక్క.

“చూడన్నా, మాకు ఒక ఆవుంది. త్వరలో దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. నాకు పాలు పితకటం రాదు.

కొన్నాళ్లు నువ్వు పాలు పితకటం నేర్పిస్తే నేర్చుకుంటాను. నేర్పినందుకు నీ రుణం ఉంచుకోను.” అన్నాడు రాఘవ.

అతను అలాగే నేర్పిస్తానని మాటిచ్చాడు. తర్వాత తమ ఇంటికి దగ్గరగా పాల డిపో ఎక్కడుందో తెలుసుకున్నాడు.

మరో పది రోజులకంతా మీరయ్య పంపిన ఆవు రాఘవ ఇంటికి చేరుకుంది. తోలుకొచ్చిన వ్యక్తి రాత్రంతా అక్కడక్కడా కొంతసేపు ఆగుతూ ఆవును నడిపించుకుంటూ తీసుకొచ్చాడని తెలపగానే ఎంతో ఆశ్చర్యపొయ్యాడు. అతనికి చక్కని భోజనం పెట్టి, అతను సంతృప్తి పడేంత మొత్తం ఇచ్చి, బస్సు చార్జీలకు కూడా డబ్బిచ్చి పంపాడు.

మరునాడే పాల వ్యాపారి (పాలు పితకటం నేర్పే వ్యక్తి) రాఘవ ఇంటికొచ్చాడు.

దూడ లేని కారణంగా ఆవు పాలివ్వటం కష్టమని చెప్పాడు. అయినా అది ఇప్పటికీ పాలిస్తున్న ఆవేనని తెలిసి, ప్రయత్నించి చూద్దామని పొదుగును నీళ్లతో శుభ్రం చేస్తుండగానే పొదుగు మొత్తం పాలతో నిండిపొయ్యింది. అతను ఆశ్చర్యపోతూ ఆ పూటకు పాలు పిండాడు. ఆ ఆవు అతనికి ఎంతగానో సహకరించింది. దాంతో ఎంతో ధైర్యం వచ్చింది రాఘవకు.

రెండు రోజుల తర్వాత పాల వ్యాపారి, రాఘవను ఆవు పొదుగు దగ్గర కూర్చోబెట్టి పాలు పితికే సులువు నేర్పించటం మొదలుపెట్టాడు. అలవాటులేని కారణంగా మొదట్లో కష్టంగా తోచింది రాఘవకు. చెయ్యి నొప్పెట్టగానే వెనక్కు వచ్చేశాడు. పాల వ్యాపారి కొనసాగించినా ఆ ఆవు కదలకుండా సహకరించింది.

“ఈ ఆవు ఎంతో సాధుజీవిలా వుంది. ఎవరికీ ఏ హాని కలిగించేలా లేదు.” అన్నాడు ఆ రైతు. ఆ మాటతో నీరజకు ఆ ఆవుపైన ఎంతో ప్రేమను కలిగించింది.

అతను వెళ్లిపోయాక ఆ ఆవుకు ‘లక్ష్మి’ అని పేరు పెట్టింది నీరజ. అది కడుపు నిండుగా తినేందుకు దాని ముందు ఎండుగడ్డిని వేశాడు రాఘవ.

లక్ష్మి వచ్చిన మూడు నెలల కంతా నీరజ పురుటి నొప్పులతో బాధపడుతుంటే ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి తన చిన్నక్కకు తెలియజేశాడు. శాంత అన్ని పనులు మానుకుని ఆసుపత్రికొచ్చింది.

ఆ రోజు రాత్రి నీరజ ఆడపిల్లను ప్రసవించింది. మరునాడు నీరజను, పురిటి బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లి ఓ వారం రోజులుంచుకుని పంపిస్తానని రాఘవతో చెప్పింది శాంత.

రాఘవ కొడుకును వెంటబెట్టుకుని ఇంటికి చేరుకున్నాడు.

(ముగింపు వచ్చే వారం)

Exit mobile version