[ప్రముఖ కథా రచయిత, అనువాదకులు జిల్లేళ్ళ బాలాజీ గారి తొలి నవల ‘జీవితమొక పయనం’ను ధారావాహికంగా అందిస్తున్నాము.]
[రాఘవ కన్యాకుమారికి వచ్చి నాలుగు రోజులు గడుస్తాయి. అక్కడి క్రమానికి అలవాటు పడతాడు. అందరూ సమయసారణిని పాటిస్తారు. ప్రొ. ప్రభాకరంగారు, ప్రొ. రాజేంద్రన్గారు, ప్రొ. యామినీగారు, ప్రొ. బెన్నెట్గారు ఆంగ్లంలో చక్కటి విషయాలను అందిస్తున్నారు. రాఘవ వాళ్ల ఉపన్యాసాలకు బాగా అలవాటుపడతాడు. అనుమానాలు కలిగితే మాధవరెడ్డితో చర్చించి సందేహాలు తీర్చుకుంటాడు. ఒకరోజు డైనింగ్ హాల్లో టిఫిన్‌కి బాబాయ్ రాకపోతే ఆశ్చర్యపోయి ఆయన కోసం గణపతి కోవెలలో, గ్రంథాలయంలో, తోటలో వెతుకుతాడు. ఎక్కడా కనబడకపోవడంతో, ఆయనుండే హాలుకు వెళ్లి చూస్తే, అయన జ్వరంతో పడుకుని ఉంటాడు. ఆయనను లేపి, పలకరిస్తాడు. కానీ ఆయన మాట్లాడలేకపోతుంటే, కిచెన్ లోకి వెళ్ళి ఒక గ్లాసు వేడినీళ్ళు, ఇడ్లీ సాంబార్ తెస్తాడు. మాధవరెడ్డి లేచి కూర్చుంటాడు. వాంతి అవుతుంది. గబుక్కున రాఘవ తన రెండు చేతులను ఆయన నోటి ముందుంచి, ఆయన కాస్త ఉపశమించాకా, చేతులు శుభ్రం చేసుకుని వస్తాడు. కంగారు పడద్దని, సాధారణ జ్వరమేనని ఆయన చెప్పి, ఆయన తను నిన్న తాను రాక్ మెమోరియల్ వద్దకు వెళ్ళి సూర్యాస్తమయం చూశాననీ, తర్వాత సముద్ర స్నానం చేశానని, అందువల్ల జ్వరం వచ్చి ఉండవచ్చని అంటాడు. తాను రోగానికి భయపడనని అంటాడు. ఆదివారం నాడు రాఘవ, మాధవరెడ్డి ఇద్దరూ సముద్ర తీరానికి వెళ్తారు. మాటల సందర్భంలో తాను ఆత్మకథ రాస్తున్నానని, అది కేవలం తనకోసమేనని రాఘవకి చెప్తాడాయన. మీ కోసమని రాయకుండా, ఇతరుల కోసమని కూడా అనుకుని రాయమని చెప్తాడు రాఘవ. అద్భుతమైన సూర్యోదయాన్ని తిలకించి ఇద్దరూ తమ కేంద్రానికి తిరిగి వస్తారు. – ఇక చదవండి.]
10. శిలా స్మారక సందర్శనం
“అందరికీ నమస్కారం, మీకొక శుభవార్త చెబుతున్నాను. రేపు మనం వివేకానంద రాక్ మెమోరియల్‌ను చూడ్డానికి వెళుతున్నాం. రేపు ఉదయం 9.30 గంటలకు ఇక్కణ్ణించి బస్సుల్లో బయలుదేరుతున్నాం. ఆ సమయానికల్లా మీరందరూ అల్పాహారాన్ని ముగించుకుని తయారుగా ఉండాలి.” అన్న ప్రకటన తర్వాత యోగా శిక్షణకొచ్చిన వాళ్లందరిలోనూ ఒక కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది.
పక్కనున్నవాళ్లతో గలగలమంటూ ఏంటేంటో మాట్లాడేసుకుంటున్నారు.
కొంతమంది అప్పటికే మెమోరియల్‌ను చూసినవాళ్లు అక్కడి ప్రత్యేకతను పక్కనున్న వాళ్లతో గొప్పగా చెబుతున్నారు.
రాఘవకు కూడా ఉత్సాహం పుట్టుకొచ్చింది.
మొన్న సూర్యోదయాన్ని చూడ్డానికి వెళ్లినప్పుడు దూరంగా కనిపించిన మెమోరియల్‌ను గురించి బాబాయ్‌ను అడగటం జరిగింది. కొన్ని వివరాలు చెప్పాడు బాబాయ్. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూడబోతున్నామనే ఆనందం అతనిలో అణువణువునా నిండిపోయింది.
మరుసటిరోజు 8.30 కల్లా అల్పాహారాన్ని ముగించుకుని తయారుగా ఉన్నాడు రాఘవ.
అతని ఉత్సాహాన్ని చూసి చిన్నగా నవ్వాడు మాధవరెడ్డి.
‘ఒక క్రమ పద్ధతికి అలవాటైన జీవితంలో ఒక చిన్నమార్పు మనిషిలో ఎంతటి సంతోషాన్ని, సంబరాన్ని కలిగిస్తుందో కదా!’ అని మనసులో అనుకుంటూ.. రాఘవ దగ్గరికి నడిచాడు మాధవరెడ్డి.
“బాబాయ్, రండి! అల్పాహారం అయ్యిందిగా?” అడిగాడు రాఘవ.
“అయ్యింది, మరి నీదీ?”
“ఆ..ఆ..” అంటూ అయ్యిందీ కానిదీకి మధ్యస్థంగా తల ఊపాడు రాఘవ.
“అర్థమైంది. నీలో ఇంకా బాల్యావస్థ పోనట్టుంది.” అన్నాడు మాధవరెడ్డి.
“ఎందుకలా అంటున్నారు బాబాయ్?”
“కాక, చిన్నపిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళతామని పెద్దలు చెప్పారనుకో, వెళ్లేంతవరకూ వాళ్లకు నిద్ర పట్టదు, ఆకలెయ్యదు. అసలు తిండే ఆఖ్ఖర్లేదంటారు. నువ్వూ అలాగే ఉన్నావు కదా?”
“లేదు బాబాయ్, కొద్దిగా ఉప్మా తిన్నానుగా.”
“నీ మాటల్లోనే నాకు జవాబు దొరికిందిగా. కొద్దిగా ఎందుకు తిన్నావు? కడుపు నిండుగా తినొచ్చుగా!”
“ఆ అదీ.. అదీ.. టిఫిన్ కడుపు నిండుగా తినకూడదు బాబాయ్. దాని పేరే అల్పాహారం. అల్పంగా అంటే కొద్దిగా తినాలంతే..” అన్నాడు రాఘవ.
“హ్హ..హ్హ..హ్హ..” అంటూ మాధవరెడ్డి గట్టిగా మనసారా నవ్వుతూ.. “ఓరి నీ సమర్థింపు పాడుగానూ. మాటలు బాగానే నేర్చావే. నువ్వు చెప్పింది నిజమే! అల్పాహారాన్ని కొద్దిగానే తినాలి. కానీ అందరూ దాన్ని పాటిస్తున్నారా? లేదు కదా! సరే, ఏమీలేదు, మధ్యలో నీకు ఆకలేస్తే ఇబ్బందేమో?!.” అన్నాడు.
“అదేం లేదు బాబాయ్..” అని అంటుండగానే వాళ్లను తీసుకెళ్లటం కోసం బస్సొచ్చి ఆగింది.
అందరూ బిలబిలమంటూ బస్సెక్కటానికి ప్రయత్నించారు.
“ఆగండాగండి, అందరూ ఇందులోనే సరిపోరు. వెనక ఇంకో బస్సు కూడా వస్తుంది. అందులో కూడా రావచ్చు. మెల్లగా ఎక్కండి.” అన్నాడు అక్కడి మేనేజరు.
దాంతో తొందరపడ్డవాళ్లు త్వరత్వరగా బస్సెక్కారు. సీట్లలో కూర్చున్నవాళ్లు కూర్చోగా, మిగిలినవాళ్లు కిందికి దిగేశారు. ఈలోపు రెండవ బస్సుకూడా రానే వచ్చింది. మిగతావాళ్లు అందులోకి ఎక్కారు.
వాళ్లల్లో రాఘవ, మాధవరెడ్డికూడా ఉన్నారు. కొంతమంది కార్యాలయ సిబ్బంది కూడా ఎక్కాక రెండు బస్సులూ బయలుదేరాయి. అందరూ హాయిగా గలగలమంటూ మాట్లాడుకోసాగారు.
కొంతసేపటికి సముద్ర తీరం చేరుకున్నారు.
తీరాన వాళ్లకోసం రెండు లాంచీలు తయారుగా ఉన్నాయి. అందరినీ వెళ్లి లాంచీల్లోకి ఎక్కి కూర్చోమన్నారు. నిజానికి ప్రయాణీకుల కోసం ఒక లాంచీ తీరంనుండి బయలుదేరితే, మరొక లాంచీ రాక్ మెమోరియల్ నుండి బయలుదేరుతుంది. అలా రెండు లాంచీలు రోజంతా అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి.
కానీ, ఇప్పుడు వాళ్లకోసమే రెండిరటినీ తీరాన్నే ఉంచారు. బయటి ప్రయాణీకులనెవరినీ అందులోకి అనుమతించలేదు. అందరూ ఎక్కగానే సముద్ర జలాల్లోకి లాంచీలు కదిలాయి.
రాఘవ సీట్లో కూర్చుని సముద్రాన్నే ఆసక్తిగా చూడసాగాడు. అతను సముద్రంలో ప్రయాణించటం అదే మొదటిసారి. అలలను చీల్చుకుంటూ లాంచీ ముందుకు కదులుతుంటే అతని మనసు ఎంతగానో పరవశం చెందింది. సముద్రపు అలల మధ్య లాంచీ మెల్లగా ఊగిసలాడుతూ వెళుతుంటే అవ్యక్తమైన అనుభూతికి లోనయ్యాడు.
మాధవరెడ్డి రాఘవను చూసి మౌనం వహించాడు.
కాసేపటికంతా లాంచీ శిలాస్మారకం దగ్గరికి చేరుకుంది. ఒడ్డున దిగినవాళ్లు మెల్లగా నడుస్తూ మెట్లెక్కి పైకి చేరుకున్నారు.
అందరూ పైకి చేరుకున్నాక.. “మిత్రులారా, ఇవ్వాళ మీరే మాకు ప్రత్యేక అతిథులు. మీరు మాత్రమే ఈ రోజంతా ఇక్కడ సందర్శకులుగా ఉంటారు. బయటివాళ్లెవరినీ ఇవ్వాళ అనుమతించలేదు. ఇప్పటినుండి సాయంత్రం వరకూ మీరందరూ ఇక్కడ యథేచ్ఛగా తిరిగి చూడొచ్చు. విశ్రాంతి తీసుకోవచ్చు. ధ్యానం చేసుకోవచ్చు. మధ్యాహ్నం ఈ మంటపం దగ్గరే మీకోసం ఒంటిగంట నుండి రెండుగంటల మధ్య భోజనం ఏర్పాటు చెయ్యటం జరుగుతుంది. ఆ సమయంలో మీరిక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్లొచ్చు. అలాగే సాయంత్రం నాలుగ్గంటలకు మనం ఇక్కణ్ణించి తిరుగు ప్రయాణమవుతాం. ఆ సమయాన్ని గుర్తుంచుకోండి.” అని చెప్పాక అందరూ వాళ్ల వాళ్ల స్నేహితులతో జట్లు జట్లుగా విడిపోయి సందర్శనకు బయలుదేరారు.
రాఘవ బాబాయ్‌తో కలిసి నడుస్తూ వివేకానంద మంటపంలోకి అడుగుపెట్టబొయ్యాడు.
మాధవరెడ్డి అతని చేతిని పట్టుకుని ఆపి.. “నీకో ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను విను. ఈ కట్టడం పూర్తయ్యాక మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీగారు దీన్ని సందర్శించటానికి వచ్చారట. ఈ మంటపంలోకి అడుగుపెట్టబోతూ కిందున్న నీళ్లను చూసి.. తన రాక సందర్భంగా ఇక్కడంతా నీళ్లతో శుభ్రంగా కడిగారు కాబోలు అనుకుని, ఆమె తన పాదాల దగ్గరున్న చీర కుచ్చిళ్లను కాస్త పైకి పట్టుకుని లోపలికి కాలు పెట్టారట. రెండడుగులు వేశాక కానీ ఆమె అసలు విషయాన్ని గ్రహించలేకపోయారట. కాలికింద అస్సలు నీళ్లు లేనే లేవట. కానీ నీళ్లు ఉన్నట్టుగా భ్రమ కలిగించేటటువంటి గ్రానైట్ రాతిని పేర్చారట. ఇలాంటి గ్రానైట్ రాళ్లు కూడా ఉంటాయా అని ఆమె ఆశ్చర్యపోతూ తన చీర కుచ్చిళ్లను కిందికి జారవిడిచేసి ముందుకు నడిచారట. ఇప్పుడు మనమూ ఆ వింతను చూద్దాం పద!” అని ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు.
నేలమీద పరిచిన గ్రానైట్ రాళ్లపై నీరు ఉన్నట్టుగా భ్రమను కలిగిస్తున్నాయి. కానీ అది నీటి తేమ కాదు.
అబ్బ! అవి కళ్లను ఎంతగా మోసపుచ్చుతున్నాయి.
ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ ఆశ్చర్యపోవటంలో వింతేమీ లేదని రాఘవ త్వరగానే గ్రహించాడు. తనే కాదు ఇక్కడికెవరు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిందే.. అనుకుంటూ అడగులు ముందుకు వేశాడు.
“నీలి మరియు జేవురు రంగు గ్రానైట్రాళ్లతో ఈ మొత్తం శిలా స్మారకాన్ని నిర్మించారు. ఈ రాక్ ఐలాండ్ శిఖరంపై సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తున 6 ఎకరాల విసీర్ణంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ మొత్తం నిర్మాణ పథకమంతా రామకృష్ణ మిషన్ చేపట్టటం జరిగింది. ఏక్నాథ్ రనడే గారి ఆలోచనతో ఇది 1970లో పూర్తయ్యింది..” అంటూ బాబాయ్ వివేకానంద మంటపంలోకి అడుగుపెట్టాడు.
నిలువెత్తు వివేకానందుని విగ్రహం చూసి పులకించిపొయ్యాడు మాధవరెడ్డి.
ఆ మహనీయుని తేజోమయ రూపానికి చేతులు జోడించి నమస్కరించాడు.
ఆయన్ను చూసి రాఘవ కూడా నమస్కరించాడు.
“ఆనాడు చికాగోలో జరిగిన విశ్వమత మహాసభలో ఈ మహానుభావుడు పాల్గొనటమే ఒక అదృష్టం అనుకుంటే, ఆ సభలో ప్రసంగించటానికి లేచి నిలబడి అందరినీ కలియచూస్తూ.. ‘నా అమెరికా దేశ సోదర సోదరీమణులారా..’ అని సంబోధించగానే అక్కడివాళ్లందరూ పులకించి పోయారట. ఆ పిలుపుకీ, అందరినీ తన తోబుట్టువులుగా భావించిన ఆ సన్యాస స్ఫూర్తికీ, మూర్తీభవించిన ఆ పవిత్రతకూ మైమరచిపోయి మహదానందంతో కరతాళధ్వనులు చేశారట. అది మూడు నిమిషాలపాటు కొనసాగిందంటే వాళ్లెంతగా ఆయనను తమ హృదయానికి హత్తుకున్నారో ఇట్టే అర్థమైపోతోంది. ఈ విశ్వాన్ని తన కుటుంబంగానూ, అందరినీ తన తోబుట్టువులుగానూ భావించిన ఆయన విశాల దృక్పథం అనుసరణీయం ఆచరణీయం..” కాస్త ఉద్వేగంతో అన్నాడు మాధవరెడ్డి.
“అవును బాబాయ్! అది చాలా గొప్ప భావన.” అంగీకరించాడు రాఘవ.
“అంతేకాదు, ఆనాటి సభలో ప్రసంగించిన వక్తలందరూ తమ తమ మతాలకు ప్రాతినిథ్యం వహిస్తే, స్వామీజీ మాత్రం భారతీయ ధర్మం అన్ని మతాలనూ అంగీకరిస్తుందనీ, గౌరవిస్తుందనీ, అన్ని మతాలూ సత్యాలేననీ, మతాలన్నీ భగవంతుని చేరుకోవటానికి మార్గాలనీ చెప్పారట.”
“అబ్బ! నిజమైన మత సామరస్యమంటే అదే కదు బాబాయ్. దాన్ని ఆనాడే అందరికీ తెలియజేశారన్నమాట.”
“ఔను. అంతేకాదు, ఎవరైతే తమ మతమే గొప్పదనీ, తమ మతమే శాశ్వతంగా ఈ భూమ్మీద నిలవాలనీ కోరుకునేవారు బావిలో కప్పలాంటి వారని కూడా తెలిపారట.”
“ఎంతటి సత్యం.” అన్నాడు రాఘవ.
ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ధ్యానమందిరంలోకి అడుగుపెట్టబోయారు.
మాధవరెడ్డి ఒక్కక్షణం ఆగి రాఘవ చేతిని పట్టుకుని ఆపి, “రాఘవా, ఆనాడు కన్య అయిన పార్వతి, శివుని కోసం తపస్సు చేసిన చోటు అట ఇది. సరిగ్గా ఇక్కడే స్వామి వివేకానంద తీరం నుండి సముద్రంలోకి ఈదుకొచ్చి ఈ రాతి గుండుమీద కూర్చుని ధ్యానం చేశారట. ఇప్పుడు మనం సరిగ్గా అదే చోటులోకి అడుగుపెడుతున్నాం. మనమూ కాసేపు మౌనంగా ధ్యానం చేసి తరిద్దాం పద!” అంటూ లోపలికి అడుగుపెట్టాడు.
అలాగే అన్నట్టుగా నవ్వుతూ బాబాయ్‌ను అనుసరించాడు రాఘవ.
గది లోపల చీకటిగా ఉంది. ఎదుటిగోడ ముందు ఒక దీపం నిశ్చలంగా వెలుగుతూ ఉంది.
ఆ వెలుతురు తప్ప ఆ గదిలో ఇంకే వెలుతురూ లేదు. అంతటా నిశ్శబ్దం ఆవరించి ఉంది.
బయటి ప్రపంచంతో ఏమాత్రం సంబంధం లేనంతగా ఇంకేదో లోకంలో ఉన్నట్టుగా అనిపించింది రాఘవకు. దీపం వెలుగులో అక్కడక్కడా మనుషులు లీలగా కనిపిస్తున్నారు.
అందరూ నేలమీద కూర్చుని ధ్యానంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్లల్లో ఏ కదలికలూ లేవు. మాటలూ లేవు.
బాబాయ్ ఒకచోట నేలమీద వజ్రాసనం వేసుకుని కూర్చున్నాడు.
రాఘవ ఆయనకు కాస్త పక్కనే పద్మాసనంలో కూర్చున్నాడు.
ఆ గదిలో వెలుగుతున్న దీపపు జ్యోతిని కాసేపు చూసి కళ్లు మూసుకున్నాడు.
ఎక్కడి నుండో లీలామాత్రంగా చెవులకు ఓంకార నాదం వినిపిస్తోంది.
మనసును కుదుటపరుచుకుంటూ ధ్యానం చెయ్యటానికి ప్రయత్నించాడు. కుదరటం లేదు. మనసు ఎక్కడెక్కడికో పరుగులు తీస్తోంది. ధ్యాస ఒక సంఘటన నుండి మరో సంఘటనకు, ఒక దృశ్యం నుండి మరో దృశ్యానికి మళ్లుతోంది. నిలకడ సాధ్యం కావటం లేదు.
చాలా అసంతృప్తిగా ఉంది రాఘవకు. అశాంతిగా కూడా అనిపిస్తోంది. అక్కణ్ణించి లేచి వెళ్లిపోవాలని మనసు తొందరపెడుతోంది. పదినిమిషాలకు మించి ఆ గదిలో ఉండలేకపొయ్యాడు. బాబాయ్ లేచి వస్తాడేమోనని చూశాడు. ఆయన నిశ్చలంగా వజ్రాసనం నుండి కదలక మెదలక కూర్చుని ధ్యానంలో మునిగిపోయి ఉన్నాడు.
ఇక ఆయన కోసం ఎదురుచూసి లాభం లేదనుకుని రాఘవ లేచి బయటికొచ్చేశాడు. బయట కొంతసేపు ఆయనకోసం ఎదురుచూశాడు.
కానీ ఆయన వచ్చేటట్టు కనిపించకపోయేసరికి అలా అలా ఆ ప్రదేశమంతా తిరిగొద్దామనుకొని బయలుదేరాడు.
బయటి వాతావరణం అంత వేడిగా ఏమీ లేదు. ఆకాశం నిండా మబ్బులు పట్టి ఆహ్లాదకరంగానే ఉంది.
నడుచుకుంటూ ప్రహరీగోడ దగ్గరకు వెళ్లి నిలబడి సముద్రంకేసి చూపులు తిప్పాడు.
అలాగే తదేకంగా సముద్రాన్నే చూడసాగాడు.
అలల ఘోష ఇంత దూరానికైనా గట్టిగానే వినబడుతోంది. తెల్లని పాల నురుగులాంటి అలలు వేగంగా ఉవ్వెత్తున పైకిలేచి తీరాన్ని దాటి ముందుకెళ్లిపోవాలన్న ఆతృతతో పరుగులు పెట్టి వస్తోంది. దాని వేగం చూస్తే అది తీరాన్ని దాటేస్తుందేమోనన్న నమ్మకం కూడా కలుగుతోంది. కానీ అది తీరాన్ని చేరిన మరుక్షణం అలాగే వెనక్కు వెళ్లిపోతోంది. మళ్లీ కాసేపటికి మరో అల. అలా అలలు లేస్తూనే ఉన్నాయి, పరుగులు పెట్టి వస్తూనే ఉన్నాయి. వాటికి విరామం లేదు, విశ్రాంతి లేదు. నిరంతరం, తరం తరం, యుగ యుగాలుగా అవి అలా ఉత్సాహంతో ఉరకలు వేస్తూనే ఉన్నాయి.
అయితే, అలా తీరానికి దూసుకొచ్చే అలలను ముందుకు పోనీక వెనక్కు లాగుతున్న దేమిటీ? ఏ శక్తి వాటిని నిలువరిస్తోంది? దాన్నే మనం మన జీవితానికి అన్వయించుకుంటే మనల్ని ముందుకు పోనివ్వకుండా వెనక్కులాగే ఆ శక్తిని కష్టాలతోనూ, కడగండ్లతోనూ పోల్చవచ్చా? ఆ పోలికే సరైనదైతే అలల్లాగా మనం మళ్లీమళ్లీ ముందుకు వెళ్లాలని ఎందుకు ప్రయత్నించటం లేదు? పిరికితనంతో ఎందుకు పలాయనం చిత్తగించి ఉన్నచోటు నుండి ఇక్కడి దాకా పారిపోయి వచ్చాం?.. తనలో పోరాడే శక్తి లేదా? తను బలహీనుడైపొయ్యాడా?.. తనంత పిరికివాడు ఈ లోకంలో ఇంకెవరూ ఉండరు కాబోలు!
“ఏం చూస్తున్నావిక్కడ?” అంటూ మాధవరెడ్డి చెయ్యి అతని భుజమ్మీద పడటంతో ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాడు రాఘవ. నవ్వుతూ ఏం లేదనట్టుగా తల అడ్డంగా ఊపాడు.
“రా, టైమైంది, భోజనానికి వెళదాం!..” అంటూ ఆయన ముందుకు అడుగు వేస్తూ.. “ఏం ధ్యాన మంటపంలో ఉండకుండా వచ్చేశావు?” అని అడిగాడు మాధవరెడ్డి.
“ఎందుకో నేను కొద్దిసేపు కూడా ధ్యానం చెయ్యలేకపొయ్యాను బాబాయ్! ఈ కొత్త ప్రదేశంలో నేను మనసును స్థిమితంగా ఉంచుకోలేకపొయ్యాను. నాకది వీలు కాలేకపొయ్యింది.” నిరాశగా అన్నాడు రాఘవ.
“అది నీ ఒక్కడి సమస్యే కాదు! ఆఖరికి మన స్వామి వివేకానందకు కూడా మొదటిసారి ధ్యానం చెయ్యటం కుదరక రామకృష్ణుల వారి దగ్గరికి వెళ్లి.. “తండ్రీ, నేను కుదురుగా ధ్యానం చెయ్యలేకపోతున్నాను. గదిలో డబడబమంటూ శబ్దం చేస్తూ తిరుగుతున్న ఫ్యాను నన్ను అస్థిమితపరుస్తోంది.” అన్నారట. అప్పుడు రామకృష్ణుల వారు.. “ఏదైతే నిన్ను అస్థిమితపరుస్తూ శబ్దం చేస్తోందో దానిమీదే నువ్వు ధ్యాస పెట్టు” అన్నారట.
ఆ తర్వాత “నీకు ధ్యానం కుదిరిందా?” అని ఆయన అడిగితే, స్వామి వివేకానంద ఆనందంగా ‘కుదిరింది’ అని చెప్పారుట. కనుక ధ్యానం చెయ్యటం అంత సుళువేం కాదు. మనో నిగ్రహం దానికి చాలా అవసరం. పోనీలే, ముందు ముందు అది నీకు సాధ్యం కావచ్చు!” అన్నాడు ఓదార్పుగా.
తర్వాత ఇద్దరూ పళ్లెంలో భోజనం పెట్టుకుని మంటపంలో ఎదురెదురుగా కూర్చుని తిన్నారు.
భోజనమయ్యాక కాసేపు విశ్రాంతిగా నడుము వాల్చి పడుకున్నారు. కొంతసేపటికి రాఘవకు మాగన్నుగా కునుకుపట్టింది..
మాధవరెడ్డి తట్టి లేపేంతవరకూ నిద్రలోనే జోగాడు రాఘవ. తర్వాత వాళ్లిద్దరూ అలా అలా తిరుగుతూ నెలవారీ సూర్యోదయ దిశలూ, ఆయనాలూ వాటికి సంబంధించి గీసిన రేఖలను పరిశీలించారు, వాటి గురించి చాలాసేపు చర్చించుకున్నారు.
ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకల్లా అందరూ తిరుగు ప్రయాణమై కేంద్రానికి చేరుకున్నారు.
11. పాపం అహల్య!
వివేకానంద కేంద్రంలో యోగా శిక్షణా తరగతులు ప్రారంభమై అప్పుడే రెండు వారాలు గడిచిపొయ్యాయి.
ఈ రెండు వారాలూ రోజుకు రెండుసార్లు నిర్వాహకులు శిక్షణార్థుల చేత యోగాభ్యాసాన్ని చెయ్యిస్తున్నారు.
మొదట్లో కాస్త ఇబ్బందిగా అనిపించినా, ఒళ్లు సహకరించకపోయినా ఇప్పుడు మాత్రం అందరూ చక్కగా యోగాసనాలను వేస్తున్నారు.
ఈ రెండు వారాలకే శరీరమంతా తేలికై ఏదో నూతనోత్సాహం పుట్టుకొచ్చినట్టుగా అనుభూతి చెందుతున్నారు. అందరిలోనూ ఒక వేగం, చురుకుదనం కనిపిస్తున్నాయి. ఆసనాలతో పాటుగా ప్రాణాయామం కూడా నేర్పుతున్నారు. అదీ ఎంతో ప్రయోజనకారిగా ఉంటోందని కొందరు వయసు మీరినవాళ్లు చెబుతున్నారు.
మొత్తానికి అందరిలోనూ ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతోంది.
ఇక నిర్వాహకులు నేర్పుతున్న దేశభక్తి గీతాలు అందరిలోనూ గొప్ప స్ఫూర్తిని నింపుతున్నాయి.
ఈపాటికే అందరికీ..
“ధర్మ్ కె సిపాహి చలే, కర్మ్ కె సిపాహి చలే;
నవ భారత్ కా నిర్మాణ్;
మనసా సతతం స్మరణీయం;
నౌ జవాన్ ఆవొరే నౌ జవాన్ గావొరే;
నిర్మాణోం కె పావన యుగ్ మే;
విస్మృత బేధా సంతో, నిర్మల భావా పన్నా;”
వంటి గీతాలు కంఠతా వచ్చేశాయి.
వీటిని తరగతుల ప్రారంభ సమయాల్లో శిక్షణార్థులతో బృందంగా పాడిస్తుంటే ఉప్పొంగే ఆనందం వర్ణనాతీతం.
వీటితో పాటుగా ఉపన్యాస రూపంలో పురాణ కథలు, నీతులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆసక్తిగా వినేటట్టుగా చేస్తున్నాయి.
ఆ రోజు ప్రొ॥ ప్రభాకరంగారు రామాయణంలోని అహల్య వృత్తాంతాన్ని ఆసక్తిగా చెబుతున్నారు.
“గౌతముడు ఒక మహర్షి, మహా తపస్సంపన్నుడు. ఆయన భార్య అహల్య. గొప్ప పతివ్రత. గౌతముడు రోజూ తొలి జామున కోడి కూయగానే నిద్రలేచి నదికి వెళ్లి స్నానమాచరించి, ఆశ్రమానికి తిరిగొచ్చి భక్తిప్రపత్తులతో దైవారాధన చేసిగాని మిగలిన దైనందిన కార్యక్రమాల్లో మునిగేవాడు కాడు. ఇక అహల్య అయితే భర్త అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయనకు ఎప్పుడు ఏం కావాలో సమకూర్చిపెడుతూ సహధర్మచారిణి అన్న పేరును సార్థకం చేసుకుంటున్న సాధ్వీమణి.
ఇలా ఉండగా ఒకనాడు దేవేంద్రుడి చూపులు రుషిపత్ని మీద పడుతుంది. ఆమెను ఎలాగైనా పొందాలనుకుంటాడు. పథకం పన్ని, ఒకనాడు తొలి జాము కాకముందే కోడిలా కూస్తాడు. అది నిజమని నమ్మి యథా ప్రకారం గౌతముడు నిద్రలేచి నదీ తీరానికి బయలుదేరుతాడు.
దేవేంద్రుడు గౌతముడిలా రూపం దాల్చి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. స్నానానికి వెళ్లిన భర్త తిరిగొచ్చేసరికి, ఆహల్య యథారీతిన ఆయనకు సేవలు చెయ్యటం మొదలుపెడుతుంది.
నదికి బయలుదేరిన గౌతమునికి ఎందుకో అనుమానం కలుగుతుంది.
ఎక్కడా ఏ అలికిడీ లేదు. జంతువుల కదలికలూ లేవు. పక్షుల అరుపులూ, కిలకిలారావాలూ మొదలవలేదు. తూర్పున సంధ్య ఎరుపెక్కలేదు. అంతా స్తబ్ధంగా ఉంది.
‘తనుగానీ కోడి కూసినట్టుగా భ్రమపడలేదు కదా?’ అని భావించి ఆశ్రమానికి తిరిగొస్తాడు.
ఆశ్రమంలో తనలా ఉన్న నకిలీ గౌతముణ్ణి చూసిన ఆయనకు విషయమంతా అర్థమైపోతుంది.
ఆవేశంతో దేవేంద్రుణ్ణి చూస్తూ.. ‘స్త్రీలపై ఉన్న కామోద్రేకంతో, కన్నూ మిన్నూ కానక నువ్వు ఇంతటి నీచానికి ఒడిగట్టావు కనుక నీ ఒళ్లంతా కళ్లై పో గాక!’ అని శపిస్తాడు.
క్షణాలలో దేవేంద్రుడి ఒళ్లంతా కళ్లై పోయి చూడ్డానికి అసహ్యంగా తయారయ్యాడు.
తర్వాత అహల్య వైపుకు తిరిగి, ‘నిజమైన భర్త ఎవరో తెలుసుకోకనే సపర్యలు చేసి ఇంతటి నీచానికి ఒడిగట్టావు కనుక శిలవై పోయి ఇదే ఆశ్రమంలో బూడిదలో పడి ఉండమని’ శపిస్తాడు.
ఆమె కన్నీళ్లు కారుస్తూ తనకు శాప విమోచనం కలిగించమని అడిగినప్పుడు, ‘పరమ పావనుడైన శ్రీరాముని పాద స్పర్వతో నువ్వు పూర్వపు రూపం దాలుస్తావని’ చెప్పటంతో ఆమె శిలగా మారిపోయి ఆశ్రమంలోనే పడి ఉంటుంది.
దేవేంద్రుడు సిగ్గుతో కుంచించుకుపోతూ.. తన తప్పును మన్నించి తనకూ శాప విమోచనం కలిగించమని ప్రార్థించగా, ఈ భూమండలంలోని పుణ్యనదులలో స్నానమాచరించమని, ఏదో ఒక నదిలో మునిగినప్పుడు అతనికి శాపవిమోచనం కలుగుతుందని చెబుతాడు గౌతముడు. అలా అన్ని పుణ్య నదులలో మునుగుతూ ఒకరోజు ఓ నదిలో స్నానమాచరిస్తూ ఉండగా.. అతని ఒంటిమీదున్న కళ్లన్నీ మాయమైపోయి యథారూపం ప్రాప్తించిందట.
ఎక్కడైతే ఇంద్రుడు శుచి కావించబడ్డాడో ఆ ప్రాంతాన్నే మనం ఇప్పుడు ‘శుచీంద్రం’ అని పిలుస్తున్నాం.
ఇక అక్కడ గౌతముని ఆశ్రమంలో శిలలా పడున్న అహల్య చివరకు రాముని రాకతో, ఆయన పాదస్పర్శతో శాప విముక్తురాలై తన నిజ రూపాన్ని పొందిందట.” అంటూ ప్రొఫెసరు కథను ముగించాడు.
ఆ తరగతి అయ్యాక నిర్వాహకులు కొంత విరామ సమయాన్ని ఇచ్చారు. ఆ సమయంలో కొందరు విశ్రాంతిగా కూర్చున్నారు. కొందరు లేచి అటు ఇటు తిరగసాగారు.
కానీ రాఘవ మాత్రం ఎందుకో అక్కడే ముభావంగా కూర్చుండిపొయ్యాడు.
మాధవరెడ్డి రాఘవ ముఖంలోకి చూశాడు. అతని ముఖంలో ఏదో దిగులు గూడుకట్టుకుని ఉండటం కనిపించింది.
అందుకు కారణమేమిటో తెలుసుకోవాలి అనుకున్నాడు మాధవరెడ్డి.
“ఏమైందీ? ఎందుకలా ఉన్నావు..” అని రాఘవను పలకరించాడు.
రాఘవ దీర్ఘంగా నిట్టూరుస్తూ.. “బాబాయ్, ఇందాకా మనం విన్న అహల్య కథలో.. దేవేంద్రుడు తప్పు చేశాడు కాబట్టి అతణ్ణి శిక్షించటంలో, శపించటంలో అర్థముంది? కానీ ఏ తప్పూ చెయ్యని అహల్యను శిక్షించటం ఎంతవరకూ సమంజసమంటావు బాబాయ్?” అని అడిగాడు.
అందుకు ఏ సమాధానమూ చెప్పకుండా తల ఊపుతూ మౌనం వహించాడు మాధవరెడ్డి.
“దేవేంద్రుడు పన్నిన పన్నాగంలో ఆమె బలిపశువు అయ్యింది బాబాయ్! అతను రూపం మార్చుకుని ఆశ్రమానికి వస్తే.. ఆమె మాత్రం ఏం చెయ్యగలదు? వచ్చింది తన భర్తేనని నమ్మింది, నమ్మి సేవలు చేసింది. అదేనా బాబాయ్, ఆమె చేసిన నేరం? అయినా ఆమెకు అనుమానం వచ్చే ఉంటుంది బాబాయ్! కానీ.. ‘చీకటిగా ఉంది, నదీ తీరానికి తర్వాత వెళదాంలే అనుకుని భర్త తిరిగొచ్చాడేమో!’ అనుకుని ఉండొచ్చు. అంతకు మించి ఆ దేవేంద్రుణ్ణి ఎలా నిలదీయగలుగుతుంది? అందుకే ఏ అనుమానాలనూ పెంచుకోక తన దైనందిన సపర్యలలో మునిగిపోయింది. ఇందులో ఆమె చేసిన తప్పెక్కడుంది బాబాయ్? అభం శుభం ఎరుగని ఆ ఇల్లాలు చెయ్యని నేరానికి శిక్ష అనుభవించటం అన్యాయం కదు బాబాయ్! ఇందులో నాకు దేవేంద్రుని స్త్రీ వ్యామోహం కన్నా గౌతముని అహంభావమే నీచంగా అనిపిస్తోంది బాబాయ్! సంఘటన పూర్వాపరాలు విచారించకుండా, తప్పొప్పులు తెలుసుకోకుండా ఆవేశంతో శపించటమేనా? ఒక రుషికి ఉండ వలసిన లక్షణమేనా అది! రుషులు శాంతస్వభావులు అంటారే, ఏదీ ఆయనలో ఆ శాంత గుణం? ఆ తరుణంలో ఆ తరుణి ఎంతటి మనఃక్షోభకు గురై ఉంటుందో ఊహించుకుంటేనే బాధ కలుగుతోంది బాబాయ్! జరిగిన అన్యాయాన్ని నేనే సహించలేకపోతున్నానే, ఆనాడు.. ఆ క్షణంలో.. ఆ స్త్రీ ఎంతగా కుమిలిపోయి ఉంటుందో ఊహించలేకున్నాను బాబాయ్..” అంటూ ఆవేదనతో తల దించుకున్నాడు రాఘవ.
“రాఘవా ఇది పురాణ కథ. ఎందుకు నీకింతటి ఆవేదన?” అని అతని భుజం పట్టుకుని కుదిపాడు మాధవరెడ్డి. కొంతసేపటికి తేరుకున్నాడు రాఘవ.
తల పైకెత్తి మాధవరెడ్డి ముఖంలోకి చూశాడు.
“రాఘవా, పురాణాలు చెప్పే నీతి ఏంటంటే.. జీవితంలో మనం ఏ తప్పూ చెయ్యకూడదు. ఒకవేళ తప్పంటూ చేస్తే దాని పర్వవసానాలు ఎలా ఉంటాయో తెలిjజెయ్యటం. కనుక ఇలాంటి కథలను పురాణాల్లో చెప్పటం జరిగింది. ఇలాంటి సంఘటనల ద్వారా మానవులు బుద్ధి తెచ్చుకుని తనను తాను సరిదిద్దుకుని జీవితాన్ని మలుచుకోవాలి. కనుక అలాంటి సంఘటనలను ఉన్నది ఉన్నట్టు చూడాలే కానీ, దాని పూర్వాపరాలను, తప్పొప్పులను బేరీజు వెయ్యకూడదు. వాటిని విమర్శించకూడదు. వాటిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించాలి. తెల్సిందా?!” అనునయంగా అన్నాడు మాధవరెడ్డి.
“ఔను బాబాయ్, నిజమే! వాటిని మనం తర్కించకూడదు. మన మిడిమిడి జ్ఞానంతో విమర్శించకూడదు.”
“బాగా అర్థంచేసుకున్నావు రాఘవా.” అంటూ లేచి అతని భుజమ్మీద ఆప్యాయంగా చెయ్యేశాడు మాధవరెడ్డి.
“ఆ.. రాఘవా, సమయసారిణిలో మార్పు జరిగింది కదా, ఆ ప్రకారం తర్వాతి తరగతి ఎవరిది, ఎక్కడ?” ప్రశ్నించాడు.
“ప్రొ॥ బెన్నెట్గారిది, శారదాంబ తోటలో..”
“అయితే త్వరగా పద, వెళ్లి ముందు వరసలో కూర్చుందాం!” అంటూ త్వరత్వరగా అక్కడ నుండి అడుగులు ముందుకు వేశాడు మాధవరెడ్డి, అనుసరించాడు రాఘవ.
(ఇంకా ఉంది)
1961 లో జన్మించిన జిల్లేళ్ళ బాలాజీ 1983 నుండి రచనలు చేస్తున్నారు. 1983లో వీరి మొదటి కవిత ‘కామధేను’ వారపత్రికలోనూ, మొదటి కథ 1984లో ‘పల్లకి’ వారపత్రికలోనూ ప్రచురితమయ్యాయి.
వీరివి ఇప్పటి వరకూ 150 కి పైగా కథలూ, 120 కి పైగా కవితలూ పత్రికలలో ప్రచురితమయ్యాయి. వివిధ పత్రికలు, సంస్థలు నిర్వహించిన కథల పోటీలలో 19 కథలకు బహుమతులు లభించాయి. వీరి కథలు కొన్ని తిరుపతి, కడప రేడియో కేంద్రాలలో ప్రసారమయ్యాయి.
1) మాట్లాడే పక్షి 2) సిక్కెంటిక 3) వొంతు 4) ఉండు నాయనా దిష్టి తీస్తా.. 5) పగడాలు.. పారిజాతాలూ.. 6) నిరుడు కురిసిన వెన్నెల 7) కవన కదంబం (కవితా సంపుటి)మొ!! పుస్తకాలను వెలువరించారు. వీరి తొలి నవల, మరి రెండు కథా సంపుటులు ప్రచురణ కావలసి ఉంది.
వీరి సాహిత్య కృషికి గాను 1) గురజాడ కథా పురస్కారం (కడప) 2) కుప్పం రెడ్డెమ్మ సాహితీ పురస్కారం (చిత్తూరు) 3) తెలుగు భాషా వికాస పురస్కారం (పలమనేరు) 4) గురు దేవోభవ పురస్కారం (తిరుపతి) 5) ఉగాది విశిష్ట పురస్కారం (తిరుపతి) 6) శ్రీమతి కామాక్షీబాయి – శ్రీ నారాయణరావు సాహితీ పురస్కారం (చిత్తూరు) మొదలైనవి వరించాయి.
వీరి రచనలపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధన జరుగుతున్నది.
తమిళ భాషపై పట్టు ఉన్నందున తమిళం నుండి తెలుగులోకి అనువాదాలు కూడా చేస్తున్నారు. ఇప్పటిదాకా వీరు… 130 కి పైగా కథలు, 10 నవలలు, 2 నవలికలు, 1 కవితా సంపుటి, 1 వ్యాస సంపుటి, 1 వచన రామాయణం.. అనువదించారు.
1) కాల ప్రవాహం 2) జయకాంతన్ కథలు 3) నైలు నది సాక్షిగా… 4) శిథిలం 5) జీవనాడి 6) నీళ్లకోడి 7) బహిర్గతం కాని రంగులు మొ!! కథా సంపుటులు వెలువడ్డాయి.
అలాగే 1) కల్యాణి 2) ఒక మనిషి.. ఒక ఇల్లు.. ఒక ప్రపంచం 3) ప్యారిస్‌కు పో! 4) యామం 5) గంగ ఎక్కడికెళుతోంది? మొదలగు నవలలు, చతుర మాసపత్రికలో మరో 3 నవలలు ప్రచురితమయ్యాయి. అలాగే 1) కాపరులు (వ్యాస సంపుటి) 2) ఫిర్యాదు పెట్టెపై నిద్రిస్తున్న పిల్లి (కవితా సంపుటి) వెలువడ్డాయి. మరో రెండు అనువాద నవలలు సాహిత్య అకాడమీ ప్రచురించవలసి ఉంది.
అనువాదంలో.. 1) ప్రతిష్ఠాత్మకమైన ‘కేంద్ర సాహిత్య అకాడెమీ అనువాద పురస్కారం’ (2010) 2) ‘నల్లి దిశై ఎట్టుమ్’ పత్రిక నుండి ఉత్తమ అనువాదకుడి పురస్కారం (2011) 3) ‘కె.ఎస్.మొళిపెయర్పు విరుదు’ పురస్కారాలను పొందారు (2023).