[‘జీవి(తము)’ అనే శీర్షికతో పద్య కవితలను అందిస్తున్నారు శ్రీ చిరువోలు విజయ నరసింహారావు.]
1.
మనిసి గడియార మొక రీతి మసలు గాదె
‘సెల్లు’ ఉన్నంత వరకె తా చెల్లు టైము
ప్రాణమున్నంత వరకె తా బ్రతుకు మనిసి
జీవమది ముఖ్యమౌ గద జీవి కెపుడు
2.
మెరుపు చైతన్య మది పోవ చిరిగి పోవు
ప్రాణ పటమది జనులకీ బ్రతుకు నందు
ఆత్మ దైవ శక్తియే మన ఆట నడుపు
నద్ధి తొలగిన మానవుడగు శవంబు
3.
మార్చి గడియారమున ‘సెల్లు’ మరల నడుప
శక్య మగును కాని, మన కది శక్య మగునె?
ప్రాణమది పోవ, బ్రతికింప వలను పడదు
జీవికిన్ యంత్రముల భేద చిత్ర మిదియె
4.
క్షణము ముందర పనులన్ని చక్కజేసి
అంతలో సర్వ మణగగా నచ్చెరు వగు
నదియ దైవ లీలగ దోచు నవని పైన
అజున కైనను మార్చగా నద్ది వశమె?
5.
ఆయువు తీరినంత మన మందర మిద్దర చచ్చి పోవుటే
ఖాయము మృత్యువంచెరిగి, కల్ములు, సంతతి చింత మున్గగా
మాయ యటంచు దోచు గద, మానవు డాశల చిక్కి, స్రుక్కునే
హేయము కాదె తానకట, యెప్పుడు చావనటంచు నమ్ముటే
6.
రోగుల గనియు మనుజు లారోగ్యవంతు
లనగ తలచు చుండు సతము నాసుపత్రి
చేరు వరకు, వైద్యులు చెప్ప చేటు నెఱుగు
నాశ బ్రతుకున మాయగా నవతరించు
7.
నిన్న మొన్నటి దాక నిత్యంబు పనులన్ని
శ్రద్ధగా నెరవేర్చె బుద్ధి గలిగి
పలుమార్లు పరుగెత్తి భారంబు లెక్క చే
యక,వ్యవహారము లమలు జేసె
ధనమును వెచ్చించి జనముల మెప్పించి
అగచాట్లు పడి కూడ నాదరించె
సకల కార్యంబులు సఫలంబుగా జేసి
కార్య దక్షుడటన్న ఖ్యాతి నందె
నట్టి ధైర్య శౌర్య ధురీణు డనఘు డితఁడు
జనులు నుతియింప తానుబ్బి సాయపడుచు
సతత పర హిత చిత్తుడై బ్రతుకు వాడు
మరణ మందుట ఆశ్చర్య భరిత మగును
8.
ఏమి మాహాత్మ్యమో జీవి స్వామీ కరుణ
ప్రాణ సహితుడై బ్రతుకు తా భద్రముగను
దైవ కరుణ తప్ప, యముడు తరణ మొసగి
ఆయు వంతము చేయు తా నరుగు దెంచి
9.
చైతన్య కణము గలిగిన
సత్యంబుగ జీవుడుండు సకలము తానై
నిత్యము, చైతన్య ముడుగ
హత్యా సదృశముగ తాను హతుడై చచ్చున్
10.
ప్రాణమే ముఖ్యమగు జీవి బ్రతుకుట కిల
ప్రాణమే శక్తి నొసగు నీ ప్రాణులకును
ప్రాణమే మన సంసార పథమగు గద
ప్రాణము తొలగ శవమయి పాడె నెక్కు
బంధువులు కూడ విడువరే బంధములను
11.
ఆస్తి పెంచగ గోరి యారాట పడుచుండు
నహరహంబును ధర నాత్ర పడుచు
సంతాన విద్యకై సహనంబుతో ఖర్చు
చేసి, గొప్ప బడుల జేర్చు వారు
పెండ్లి సేయగ నెంచి పిల్ల తండ్రి ధనము
నధికంబుగా పొందు విధము వెదుకు
దాచి, మూటలు గట్టి ధనమెల్ల సుతులకు
దోచి పెట్టగ జూచు దుర్బలులయి
నిత్య మిహ లోక చింతయే నియమ విధిగ
మదిని యారాట పడిపోవు మానవులకు
దైవ చింతనా ధర్మముల్ తలపు రావు
ఆత్మ శోధన యననేమొ అరయ బోరు
12.
పరహితము, మైత్రి, సాంఘిక వర్తనంబు
సత్య సౌశీల్య చరితంబు, సన్మతియును
ఇరుగు పొరుగుల సహకార మింగితమును
తలపగా నెంచ రణుమాత్ర, కలల నైన
13.
మనసు శాంతముగ నిలిపి, మాయ దాటి
శ్రేయమును పొంద చింతించి,శ్రీకరమగు
దైవ చింతనా తత్పర తత్త్వ మరసి
మనుట మాన్యమై యొప్పు నీ మానవులకు
14
ఎంత యారాట పడినను సుంత ఫలము
లేదు, దేహము నశ్వరం బాదు కొనగ
సుతులు, సతియు బంధు గణము చూడబోరు
కట్టె లందున బూదియై కాయ ముడుగు
15.
ధనము,నాస్తి పాస్తులు తన తనువు వెంట
కదలి రావు, కర్మ యొకటె కలిమి యగును
పుణ్య పాపంబులకు లెక్క బోధ సలుపు
నద్ది, మరు జన్మ మూలమై యర్హత నిడు
16.
తెలియ కున్నను, సకలంబు తెలిసి కూడ
మాయ సంసార జలధి నమాయకులయి
మునిగి పోవుదు రక్కటా! మూర్ఖు లగుచు
దీని నెవరు తప్పింతురు తేరుకొనగ?
17.
అధికార పీఠంబు నాశించు బుద్ధిని
యణుమాత్ర వీడరీ యధము లకట!
లంచాలు గొనవచ్చు లాభమ్ము నార్జింప
జనులపై పడి చచ్చు చవట లకట!
పతి సతి వ్యామోహ భావంబు వీడక
ప్రక్క చూపులు మాన రొక్క మారు
పరుల గాసిని బెట్ట పలుమార్లు యోచించు
దుష్ట బుద్ధిని వీడ రిష్ట మతిని
చింత లన్నియు దుర్మార్గ చేష్ట లగుచు
పథము లన్నిట హింసా స్వభావు లగుచు
తోటి వారి దుఃఖమె తమ తోడు కాగ
దురిత చిత్తులై మనువారు దుష్టు లకట!
18.
జీవి ఆశల మోహాల చింత జిక్కి
చివరి వరకును పరుగిడి చెలగు చుండు
ప్రాణ మున్నంత వరకు తా పాట్లు పడుచు
మృత్యు విషయంబు మఱచునే నిత్య మవని
19.
చచ్చు వేళను కూడ తా సంభ్రమమున
నధిక మాదాయ యత్నంబు లాప బోడు
సుఖము లందాశ వీడడు చోద్య మకట!
చావు కూడ మన దురాశ చంప బోదు
20.
ఒక సుఖ మిది నిజ మిక నెంత మాత్రయు
అప్పు నడుగగ రాదవసరంబు
బాధ్యతల్ నెరవేర్చు బాధ యేమియు లేదు
తిండి తిప్పల గోల యుండ బోదు
స్నాన సంధ్యాదులన్, జప, తపంబుల విధి
ఏ మాత్ర ముండదీ ఇహము నందు
ఆత్మ శోధన, బాధలను చింత యుండదు
దీర్ఘ నిద్ర మునుగు తిరము గాను
కట్టెలను కాలు మంటయే కాన రాదు
ఆస్తులను వీడెనను బెంగ నాస్తి యగును
బంధు గణములు వేధించు భయము లేదు
అంతయును శాంతి, నిశ్శబ్ద మావరించు
21.
అదియ సుఖ సుప్తి, నిర్మోహ పదము కాదె!
అదియ యంతిమ సంస్కార మగును కాదె!
అదియ ఋణముక్తి నొసగి తా హాయి గూర్చు
నదియ జీవికి విశ్రాంత పదవి యగును
సర్వ సామాన్య సత్యమీ జగతి నిదియ
అరయఁదగు నీతి, ధర్మమీ యవని పొల్చు.
21 అక్టోబర్ 1939 న జన్మించిన శ్రీ చిరువోలు విజయ నరసింహారావు ప్రవృత్తి రీత్యా కవి. దుర్గా మహాలక్ష్మి, దుర్గా ప్రసాదరావు గార్లు తల్లిదండ్రులు. ఎం.ఎ. విద్యార్హత. రైల్వే మెయిల్ గార్డుగా ఉద్యోగ విరమణ చేశారు. భార్య సత్యప్రసూన. ముగ్గురు కుమారులు.
15 శతకములు ముద్రితములు. రెండు జీవితచరిత్ర గ్రంథాలు వెలువరించారు. అనువాదాలు చేశారు. నీతి శతకములు, సాయి శతకములు తదితర రచనలన్నీ కలిపి 73.
