[నరేష్ నున్నా గారు రచించిన ‘Joey అమ్మకి జో.. జో..!’ అనే కవితని అందిస్తున్నాము.]
“కంగారూల కంట్రీకి వచ్చి మూడు నెలలయ్యింది కదా, ఇంకా ఒక్క Skippy ని కూడా చూసినట్టు లేవు..” అన్నాడొకడు, బావిలో కప్పలా నేను బైటకి రావడంలేదని నిష్ఠూరపడుతూ.
***
చూడకేం.. జోజో జోలల అమ్మని, జిలుగు జీమూతపు జోలెని, జోగుతున్న Joey (♡) ని కూడా చూశాను,
అప్పుడెప్పుడో అనగనగా ఆదిమ జాతక కథల కంటే అనాది జానపదంలో ఆస్ట్రేలియన్ ఆకాశదేవర(♦) ఆడిన అల్లరి ఆటలోంచి.
గునగునల గుబులుతో దారితప్పిన ఆత్మ (♣) ఆ ఆటలో అంటిపండు. తన కడుపులోది కూడా తీసిపెట్టే తల్లి ఊరుకుంటుందా, ఆ చిన్నారిపొన్నారిని పొదువుకొని అదుముకుంది. కొలబద్దలు చాలని అమ్మ ప్రేమకి వరాల వాన కురిసింది. యూకలిప్టస్ బెరుడుతో నేసిన మడ్డి గోధుమ రంగు జోలె అమ్మ పొట్టకి అమిరింది, యుగాల పొడవైన జోలె కుర్ర జోయ్ వారసత్వమై కుదురుకుంది.
మొదట నాకొక కబురుగానే జోయ్ తెలిసినప్పుడు లేదు ఏ చడీచప్పుడు.
కానరాని లోకాన దారులు తచ్చాడుతూ జోలెలోకి చేరిందా జెల్లీబీన్.
వెనకటి వేయి జన్మాల పాట అల్ట్రాసౌండ్ తెర మీద గురగురమన్నట్టు పొట్ట సంచిలో పొదుగు కుడిచి కూన బ్రేవుమంది.
చిటికెన చివర గోవర్ధనం మొలిచినట్టు బోర విరిచిన పిడికిళ్లు గోనెని ఉబ్బరించాయి.
అదరగణ్ణపు ఆవలింతకి మెటికల తాళాల చిటికెల రాగం డొక్కలలోయలో మారుమోగింది.
తాకుడే భాష, తన్నుడే కబురు, గరుకు పస నాలుక స్పర్శ స్వప్న సందేశం. కడుపార జోయ్ కదిలితే సృష్టికావ్యానికది connotation.
అక్కడక్కడే గింగిరాలు తిరుగుళ్ళు.. అంతలోనే చిలిపి చిర్రుబుర్రులు. బావ్ బూచి దోబూచి.. అంతా అమ్మతోనే లాలూచీ. కొత్త కొత్త అలకలు నిక్కినిక్కి లేస్తే, కొసరు చూలు మురిపాలు తొంగితొంగి చూస్తాయి.
***
“కాని దేశాలు వచ్చావు కానీ, కాలు బైట పెట్టి చూశావా కనీసం ఒక్క కంగారూనైనా..” అడిగాడొకడు, గుల్లలో ముడుచుకున్న నత్తలా ఉండిపోయానని ఎగతాళి చేస్తూ.
చూడకేం.. జో అచ్యుతానందాల మా అమ్మని, ఉయ్యాల జంపాల జోలెని, జోరు బేజారు జోయ్‍ని కూడా చూశాను, “నాన్నా.. వచ్చేశావా నా దగ్గరకి” అంటూ వడివడిగా వచ్చి నన్ను వాటేసుకున్నప్పుడే –
~
♡ నా Joey అమ్మకి
♦ Baiame లేక Byamee (ఆగ్నేయ ఆస్ట్రేలియా ఆదిమజాతుల జానపదం)
♣ Wombat
