శ్రీ గోనంద ముఖైర్ధర్మ సంముఖైరా కలేః కిల।
కశ్మీర కాశ్యపీ భూపైరపాలి గుణశాలిభిః॥
తేషామభాగ్య హేమన్త నిశాతమసి తిష్టతి।
నైన కశ్చిదపశ్యత్తా న్కావ్యా ర్కానుదాయాశ్చిరమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 2, 3)
కలియుగారంభం నుంచి గోనందుడు, అనేక ఇతర గొప్ప గొప్ప రాజులు కశ్మీరాన్ని పాలించారు. కానీ ఆ తరువాత చిరకాలం ఆ అభాగ్య రాజులు చలికాలం నాటి చీకటిలో ఉన్నట్టు దౌర్భాగ్యానికి గురయ్యారు. ఆ చీకటిని తొలగించేందుకు ఏ కవి సూర్యుడు ఉదయించలేదు.
దైవ ప్రార్థన అయిన తరువాత జోనరాజు తాను రాజతరంగిణి రచనకు పూనుకునేందుకు దారితీసిన కారణాల నేపథ్యాన్ని వివరిస్తున్నాడు. ఇది సర్వసాధారణంగా సాంప్రదాయకంగా వస్తున్న పద్ధతి. ఒక కవి ఒక కావ్యాన్ని రచించే ముందు, ఆ కావ్య రచనకు కారణం, లక్ష్యం, ఆ రచన నేపథ్యం వివరించటం ఆనవాయితీ. ఇప్పటి రచనలకు ముందుమాట లాంటిది ఇది. కావ్య రచనకు దారితీసిన పరిస్థితులు వివరించటం, కావ్య లక్ష్యం, లక్షణాలను పొందుపరచటంతో పాటు తన కన్నా ముందు ఇలాంటి కావ్య రచనకు పూనుకున్న వారిని ప్రస్తావించటం, వారి ప్రాశస్త్యాన్ని వివరించటం, వీలయితే వారి రచనతో పోల్చి తన రచన వైశిష్ట్యాన్ని వివరించటం, లేకపోతే, వారి రచనతో పోలిస్తే తన రచన ఎలా తేలిపోతుందో చెప్పి, వినయంగా తన రచన గురించి తానే అంచనా వేయటం, కుకవి, కువిమర్శకులను ఎత్తి పొడవటం, ఆ పై కావ్యాన్ని ఆరంభించటం అనేది కొద్దిపాటి తేడాలతో దాదాపుగా ప్రాచీన కావ్యాలన్నింటిలో కనిపిస్తుంది. అదొక పద్ధతి. ఒక సాంప్రదాయం.
కొందరు వినయ సంపన్నులైన కవులుంటారు. వారు తమని తాము కావాలని తక్కువ చేసుకుంటారు. ఇదొక రకమైన రక్షణ పద్ధతి. ప్రతి పనినీ విమర్శించేవారు కొందరుంటారు, పొడిగేవారుంటారు. పొగిడేవారితో సమస్య లేదు, విమర్శించేవారితో సమస్య. ఆ విమర్శ సద్విమర్శ అయితే పర్వాలేదు. కవి, తనలోకి తాను చూసుకుంటాడు. తన కావ్యంలో ఎత్తి చూపిన లోపాలను గ్రహించి దిద్దుకుంటాడు. సాధారణంగా, కవికి కానీ రచయితకు కానీ తన సృజన విలువ తెలుస్తుంది. పైకి ఎంతగా సమర్థించుకున్నా, లేదా, ఎంతగా తక్కువ చేసుకున్నా, తన రచన విలువ రచయితకు అంతరంగంలో తెలుస్తుంది. అందుకే రచయిత ఎంతగా, తనను తక్కువ చేసుకుంటూ వినయం ప్రదర్శించినా, కుకవుల నిందలోనో, కువిమర్శకుల దూషణలోనో – రచయిత అహంకారం, ఆత్మవిశ్వాసం వంటివి తెలుస్తాయి.
ఈనాడు మనం గొప్ప కవిగా కొనియాడే కాళిదాసు సైతం ‘రఘువంశం’ కావ్యం ఆరంభంలో సాగరాన్ని చిన్న తెప్పపై దాటాలని ప్రయత్నించే మూర్ఖత్వం తనది అన్నాడు. పొడుగువారికి మాత్రమే అందే ఫలాన్ని అందుకోవాలని ప్రయత్నించే మరుగుజ్జు లాంటి ప్రయత్నం గొప్ప కవిగా మన్ననలందుకోవాలనుకునే తన ప్రయత్నం అన్నాడు. అప్పటి నుంచీ కవులు, తమ కావ్యారంభంలోనే ఇలా తమని తక్కువ చేసుకుంటూ కూడా తమ కావ్య ప్రాధాన్యాన్ని, వైశిష్ట్యాన్ని వివరించటం ఆనవాయితీ అయింది.
కల్హణుడు సైతం రాజతరంగిణి రచన ఆరంభంలోనే ‘ఇంతకు ముందు ఎందరో రాసిన రాజుల చరిత్రను మళ్ళీ రాయటం ఎందుకని ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోవద్ద’ని అభ్యర్థిస్తూ, గతంలో కశ్మీర రాజుల చరిత్రలను రాసిన వారి కన్నా ఏ రకంగా తన రాజతరంగిణి భిన్నమో, ఎందుకని తన రాజతరంగిణి చదవాలో వివరించాడు. పాత కవుల రచనల్లో లోపాలను పేరు పేరునా వివరించాడు. తన రాజతరంగిణి ఏ రకంగా గత కవుల కావ్యాల కన్నా మెరుగో వివరించి, ఈ రాజతరంగిణి నీటిని ముత్యాల పాత్రలలో తాగమన్నాడు. జోనరాజు సైతం కల్హణుడి అడుగుజాడలలో నడిచాడు. అయితే, కల్హణుడి రచనతో పోలిస్తే, తన రచన ఉత్తమ స్థాయిలో ఉండదని జోనరాజుకు తెలుసు.
రాజతరంగిణి రచన రాయమని కల్హణుడిని ఎవరూ అభ్యర్థించలేదు. ఆదేశించలేదు. దిగజారుతున్న రాజకీయ, సామాజిక పరిస్థితులను చూసి కల్హణుడు స్పందించాడు. వ్యక్తిత్వహీనమై, ఉన్నత విలువలకు తిలోదకాలిచ్చి, నీచం వైపు పరుగులిడుతున్న కశ్మీర సమాజాన్ని చూసి, వారికి తమ గత వైభవాన్ని జ్ఞప్తికి తెచ్చి, వారిలో ఆత్మగౌరవాన్ని జాగృతం చేసి, ఆత్మవిశ్వాసాన్ని రగిలించాలన్న ఉద్దేశంతో రాజతరంగిణి రచనను కల్హణుడు ఆరంభించాడు. అధికారం అశాశ్వతం అనీ, దాని కోసం పోరాడి సమాజానికి శాశ్వత నష్టం కలిగించకూడదన్న జ్ఞానాన్ని, విచక్షణను భావి పాలకులకు అందించాలన్న తపనతో రాజతరంగిణి రచనను ఆరంభించాడు కల్హణుడు.
కల్హణుడి తరువాత రాజతరంగిణి రచనను మరే కవీ కొనసాగించలేదు. ఒకవేళ ఎవరయినా రాజతరంగిణి లాంటి రచనను చేపట్టినా, దాని తాలూకూ ఆనవాళ్ళు కానీ, ప్రతులు కానీ లభించలేదు. కానీ మానవ ప్రకృతిలో ఒక లక్షణం ఉంది. ఏదైనా పదిమంది దృష్టిని ఆకర్షిస్తే, అలాంటి పని చేపట్టటం ద్వారా తామూ పదిమంది దృష్టిలో పడవచ్చని ఇతరులు అలాంటి కార్యక్రమాన్ని చేపడతారు. వారు విజయవంతమవుతారా? ఆ పనిలో వారికి గుర్తింపు వస్తుందా? అన్న అంశాన్ని పక్కన పెడితే, విజయవంతం అయి పలువురి ప్రశంసలు పొందిన ఓ పనిని ఇతరులు అనుసరించటం అన్నది స్వాభావికంగా జరుగుతుంది. కానీ కల్హణుడి తరువాత మళ్ళీ జోనరాజు చేపట్టే వరకూ రాజతరంగిణి రచనను మరెవరూ చేపట్టిన ఆనవాళ్ళు లేవు. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం.
రాజతరంగిణి కావ్యాన్ని జైనులాబిదీన్ విన్నాడు. మెచ్చాడు. అంటే అర్థం, కశ్మీరులో కల్హణ రాజతరంగిణి, కశ్మీరు ఇస్లామీయుల వశం అయిన తరువాత కూడా ప్రచారంలో ఉంది, చలామణీలో ఉంది. రాజతరంగిణి రాజుల చరిత్ర చెప్తుంది కాబట్టి, తన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచి ఉండేందుకు కల్హణుడి నుండి జోనరాజు వరకూ నడుమ ఉన్న కాలంలో ఏ రాజు కూడా రాజతరంగిణి లాంటి రచనను కొనసాగించమని కోరకపోవటంతో పాటు, ఏ కవి కూడా స్వచ్ఛందంగానో, రాజు మెప్పు కోసమో రాజతరంగిణి కొనసాగించకపోవటం ఆశ్చర్యంగా ఉండడమే కాదు, నమ్మశక్యంగానూ ఉండదు. కానీ ఈ నడుమ కాలంలో రాజతరంగిణిని మరో కవి చేపట్టిన ఆనవాళ్ళు లేకపోవటంతో రాజతరంగిణి లాంటి రచన చేపట్టే తీరిక లేకనో, అవకాశం లేకనో ఎవ్వరూ ఆ వైపు దృష్టి మళ్ళించలేదనుకోవాలి. ఎవరయినా ఆ వైపు దృష్టి మళ్ళించినా, ఆ రచన ప్రాచుర్యం పొందలేదని, కశ్మీరులో నెలకొని ఉన్న అల్లకల్లోల, అనిశ్చిత, అభద్రతా పరిస్థితుల వల్ల అలాంటి ప్రయత్నాలు జరిగినా కాలగర్భంలో కలిసిపోయాయని అనుకోవాలి. ఎందుకంటే, కశ్మీరు అత్యంత వైభవాన్ని, శాంతి సౌఖ్యాలను చివరిసారి అనుభవించింది అవంతివర్మ కాలంలో. అవంతివర్మ తరువాత నుంచీ ఏదో ఒక రూపంలో సర్వశక్తిమంతమైన రాజు కశ్మీరుకు లభించలేదు. రాజు శక్తిమంతుడైనా, ఏదో ఓ సమయంలో అతడు దిగజారటం వల్ల బలహీనుడయ్యాడు. అతనికి వ్యతిరేకంగా జరిగిన కుట్రలకు కశ్మీరు అల్లకల్లోలమయింది.
కల్హణుడు రాజతరంగిణిని ముగించే నాటికి జయసింహుడు సుస్థిరమైన పాలనను అందించటం ఆరంభించాడు. ఆయన పాలనలో అధిక భాగం, సింహాసనం కోసం నలువైపుల నుండి దాడులను ఎదుర్కోవటం లోనే సరిపోయింది. సింహసనంపై ఆశతో కశ్మీరుపై దాడులు చేస్తున్న వారందరి అడ్డు తొలగించిన తరువాత జయసింహుడు కశ్మీరాన్ని సుస్థిరం చేసి, శక్తిమంతం చేయటంపై దృష్టి పెట్టాడు. కల్హణుడు అంతవరకూ కశ్మీరు చరిత్రను రాశాడు. కల్హణుడు తరువాత జయసింహుడు ఐదేళ్ళు మాత్రమే రాజ్యం చేశాడు. ఆ అయిదేళ్ళలో ఆయన యవనుల (తురుష్కుల) సేనలతో తలపడ్డాడు. అంతే, జీవితాంతం అంతర్గత శత్రువులతో తలపడి, ఎట్టకేలకు విజయం సాధించిన జయసింహుడు, అ అపై బయటి నుంచి వచ్చి పడే శత్రువులతో తలపడ్డాడన్న మాట. జయసింహుడి తరువాత కశ్మీరుకు సరైన రాజు లభించలేదు. సింహాసనం పైన ఆశ, సింహాసనం దక్కించుకునేందుకు ఎలాంటి పనికయినా సిద్ధం, సింహాసనం కోసం పోరాటం వల్ల కశ్మీరు బలహీనం అయింది. సామాజికంగా కూడా వ్యక్తులలో దూరదృష్టి తగ్గింది. నైతిక విలువలు తగ్గాయి. భవిష్యత్తు కన్నా వర్తమానం ప్రాధాన్యం వహించింది. పొంచి ఉన్న ముప్పును గుర్తించి జాగ్రత్త పడే బదులు, తమలో తాము కలహించుకుంటూ, మృత్యుముఖం వైపు పరుగులిడే మూర్ఖుల్లా ప్రవర్తించారు. చివరకు కశ్మీరు ఇస్లామీయుల వశం అయింది. దాంతో కశ్మీరు అస్తిత్వం ప్రమాదంలో పడింది. ఇస్లామీ రాజుల పాలనలో కశ్మీరు రూపాంతరం చెందడం వేగవంతమయింది. ఈ సమయంలో జోనరాజుకు రాజతరంగిణి రచనను కొనసాగించమని ఆదేశం అందింది. జోనరాజు రాత వల్ల అతను అప్పటికే వయసులో పెద్దవాడని అర్థమవుతుంది.
చరిత్ర రచన జోనరాజుకు కొత్త. కావ్య రచన ఆయనకు అలవాటు. కల్హణుడిలా జోనరాజు కశ్మీరమంతా తిరిగి పరిశోధనలు చేయలేడు. చేయలేదు కూడా. రాజుల గురించి విపులంగా రాయాలని ప్రయత్నించలేదు. తన రచన కేవలం ఒక రేఖామాత్రమైన చరిత్ర రచన తప్ప కల్హణుడిలా లోతుగా పరిశీలించి, అధ్యయనం చేసి సమగ్రమయిన దృక్పథంతో, అవగాహనతో రచించిన రచన కాదని జోనరాజు ‘ముందుమాట’లో స్పష్టంగా చెప్పాడు.
రాజోదన్త కథా సూత్రపాత మాత్రం కృతం మయా।
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 17)
రాజుల కథలను సూత్ర మాత్రంగానే చెప్పానని స్పష్టంగా చెప్పాడు.
కుర్వన్తు రచనామత్ర చతురాః కవిశిల్పినః
రచనలో నిష్ణాతులైన కవులు తాము సూత్ర మాత్రంగా చెప్పిన రాజుల ఉదంతాలను బహు అలంరణలతో భవిష్యత్తులో రచించవచ్చునన్నాడు జోనరాజు.
అంటే, తన రచనలో లోపాలు జోనరాజుకు తెలుసు. రచనలో తన పరిమితులు జోనరాజుకు తెలుసు. కానీ రాజాజ్ఞ పాటించక తప్పదు. కాబట్టి తన శక్తి కొలదీ తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని ప్రయత్నించాడు జోనరాజు.
ప్రధానంగా జోనరాజును రాజతరంగిణిని కొనసాగించమని ఆదేశించటంలో జైనులాబిదీన్ ఉద్దేశం, తన ఖ్యాతి కూడా భవిష్యత్తు తరాలకి అందాలన్నది విస్పష్టం. అందుకని జోనరాజు ముందుమాట నుంచీ సుల్తాన్ జైనులాబిదీన్ గొప్పతనం, ఆయన దయ, జాలి, కృపామయమైన మనస్సులను స్పష్టం చేస్తూ రచనను కొనసాగించాడు. గోనందుడి తరువాత వచ్చిన రాజులు దురదృష్టవంతులనీ, వారు అమావాస్య నాటి చిక్కటి చీకటిలో కొట్టుమిట్టాడుతున్నారని, వారిపై వెలుగులు ప్రసరించే కవి లేడన్న వ్యాఖ్యలతో నాందీ ప్రస్తావన ప్రారంభించాడు జోనరాజు. కవుల పదాలు అమృతతుల్యం. అవి వ్యక్తులను చిరంజీవులు చేస్తాయి. భౌతికంగా మరణించిన రాజులను, వారి పాలనా కాలాన్ని భవిష్యత్తు తరాల ముందు సజీవంగా నిలిపి వారిని చిరంజీవులు చేస్తాయి. అలాంటి కవులు ఎవరూ లేకపోవడం వల్ల ఆ రాజులు ఇంత కాలం అంధకారంలో ఉండిపోయారు.
శ్రీ జైనోల్లాభదేనే క్షమాం సంప్రత్యక్షతి రక్షతి।
జోనరాజాభిధస్తేషా ముద్వతో వృత్తవర్ణనే॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 7)
ఇన్నాళ్ళకు జైనోల్లాభధేను (జైనులాబిదీన్) అనే మహానుభావుడు రాజ్యం చేస్తున్నాడు. ఆయన జాలి, దయల వల్ల, ఇప్పుడు, జోనరాజు ఆ రాజుల పాలనను వంశావళిని వర్ణిస్తున్నాడు. ఎలాగయితే, ప్రయాణీకుల ఆకలి తీర్చేందుకు రహదారిలో పళ్ళిచ్చే వృక్షాలను నాటుతారో, అలా, తమని అందరూ మరిచిపోయారనే రాజుల దుఃఖాన్ని ఉపశమింపజేసేందుకు ఈ కావ్య రచన ఆరంభమయింది.
మృగ్నాన్విస్మృతి పాథోధీ జయసింహాధి భూపతీన్।
శ్రీ జైనోల్లభదేనస్య కారుణ్యా దుజ్జే హీర్షతః॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 10)
విస్మృతి అనే సముద్రంలో మునిగి ఉన్న రాజులపై జాలితో జైనులాబిదీన్ వారిని రక్షించాలని అనుకున్నాడు. ఫలితంగా ‘శ్రీ శౌర్యభట్టు’ను ఈ కార్యానికి నియమించాడు. అంటే రాజతరంగిణిని రచింపజేసే బాధ్యతను శౌర్యభట్టుపై పెట్టాడన్న మాట సుల్తాన్. సుల్తాన్ ఆస్థానంలో శౌర్యభట్టు సర్వధర్మాధికారి. ఈ శౌర్యభట్టుకు జోనరాజు అంటే ప్రీతి. రాజతరంగిణిని జయసింహుడి చివరి పాలనా కాలం నుంచి జైనులాబిదీన్ పాలనా కాలం వరకూ కొనసాగించవలసిన బాధ్యతను జోనరాజుకు అప్పగించాడు. అందుకే, జోనరాజు, తనకు రాజతరంగిణిని కొనసాగించమన్న ఆదేశాలు శౌర్యభట్టు నుంచి అందాయని, అందుకని తాను రాజతరంగిణి రచనను ఆరంభించానని స్పష్టంగా చెప్పాడు.
ఒక కవి స్ఫూర్తి పొంది, స్వీయ ప్రేరణతో రచించే కావ్యం స్థాయి వేరు. ఇతరులు ఆజ్ఞాపిస్తే, ఆ ఆజ్ఞాపాలనలో భాగంగా రచనను చేయటం వేరు. జోనరాజుకు ఈ తేడా తెలుసు. అందుకే తనకు, నీటితో తుళ్ళిపడే నదికీ, నీరెండిపోయిన నదికీ తేడా తెలుసునని స్పష్టం చేశాడు. తానీ కావ్య రచనను గొప్ప కవిగా పేరు సంపాదించేందుకు రాయలేదనీ, తనకు అంత పాండిత్యం లేదని, తాను ఎండిపోయిన నదిలాంటి వాడినని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. కాడ ఎప్పటికీ పద్మం కాదని, తాను కాడ లాంటి వాడినని నిర్మొహమాటంగా చెప్పాడు. అంతేకాదు, ‘అంతః శూన్యం లఘుం ప్రజ్ఞాం’ అని చెప్పాడు. తనకు అంత లోతైన ఆలోచన లేదని, తాను ‘పొట్లకాయ’ లాంటి వాడినని, తనకు నైపుణ్యం శూన్యం అనీ చెప్పాడు. ఇది ఎందుకు చెప్పాడంటే, రాజతరంగిణి ఆరంభంలోనే కల్హణుడు, గతించిన కాలాన్ని సజీవంగా దర్శింపగల శక్తి ఈ విశ్వంలో ఇద్దరికే ఉందని స్పష్టం చేశాడు. ఒకరు సృష్టికర్త, రెండవది కవి [కల్హణ రాజతరంగిణి, 1 – 4]. కవి అన్నవాడు దివ్యదృష్టితో ఇతరులు ఊహించలేని విషయాలను అనుభవించి, వాటిని సజీవంగా భవిష్యత్తు తరాల ముందు నిలపగలడు [కల్హణ రాజతరంగిణి, 1 – 5] అన్నాడు. అంటే, మామూలు రాళ్ళు, రప్పలలో ఒదిగి ఉన్న గత చరిత్రను ఆవిష్కరించటమే కాక, వాటి అంతరంగంలోని సంఘర్షణలను, మనోభావాలను గ్రహించి ప్రదర్శించగల ప్రతిభ కవిదన్న మాట. అందుకే జోనరాజు ఆరంభంలోనే తనకు కల్హణుడి అంత లోతైన ఆలోచన, అవగాహనలు లేవని, ‘దివ్యదృష్టి శూన్యం’ అనీ స్పష్టం చేశాడు. అందుకే తాను రచిస్తున్న రాజతరంగిణి ‘సూత్ర మాత్రం’ అన్నాడు.
తన రచన కేవలం ‘సూత్రపాత మాత్రం’ అన్నాడు జోనరాజు . ‘సూత్రం’ అంటే formula, thread, ….., yarn or plan అన్న అర్థాలున్నాయి. జోనరాజు చరిత్రను కావ్యంగా రచిస్తున్నాడు. అయితే, కల్హణుడి అంత లోతుగా, సమగ్రంగా, విపులంగా రచించటం లేదు. కేవలం పూలను ఒకచోట గుదిగుచ్చే దారంలా మాత్రమే చరిత్రను రచిస్తున్నానన్న అర్థం వస్తుంది. దారం లేకపోతే మాల లేదు. కాబట్టి జయసింహుడి నుంచి తన కాలం వరకూ జరిగే చరిత్రను ‘దారం’లా, ‘connecting thread’ లా మాత్రమే చెప్తున్నాడన్న అర్థం వస్తుంది. అలాగే ‘సూత్రం’ ‘formula’ అనుకుంటే అర్థం మారిపోతుంది. Formula అన్నది ఒక వాక్యంలో ‘సారాన్ని’ ప్రదర్శిస్తుంది. కానీ దాన్ని వివరించాలంటే ఎన్నో పేజీలు కావాలి. అలా ఎంతో విషయాన్ని ఒక సూత్రమాత్రంగా ప్రదర్శిస్తున్నాడనుకోవచ్చు. అందువల్ల ఆయన సంక్షిప్తంగా ప్రదర్శించిన ‘సారం’ పిండుకుంటే బోలెడంత రసాన్నిస్తుంది. కాబట్టి జోనరాజు రచించిన శ్లోకాలను పైపై అర్థం చూసి సరిపుచ్చుకుంటే పొరపాటు. Formula is a concise way of expressing information symbolically. ‘సూత్రమాత్రం’గా అంటే సమాచారాన్ని సంక్షిప్తంగా, ప్రతీకాత్మకంగా అందించటం. కాబట్టి జోనరాజు రాజతరంగిణిలో సంక్షిప్తంగా ప్రతీకాత్మకంగా పొందుపరిచిన సమాచారాన్ని విశ్లేషిస్తూ సాగాల్సి ఉంటుంది.
(ఇంకా ఉంది)