Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-3

జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.

రసమయ్యా గిరా వృద్ధాం నిత్యతారణ్య మాపిపత్।
అధః శ్రీజయసింహాత్న్తం తత్కీర్తం కల్హణద్విజః॥
తతో దేశాధిరోషేణ తదభాగ్యై రథాపివా।
కరిర్వామ్యాధయా కశ్చిన్నాజి జీవత్పరాన్నపాన్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 5, 6)

ల్హణుడు తన అమృతమయమైన కలంతో రాజు జయసింహుడి కాలం వరకూ రాజులను సజీవంగా నిలిపాడు. ఆ తరువాత దేశ దౌర్భాగ్యం వల్ల తమ అమృతమయమయిన పదాలతో రాజులను సజీవంగా నిలిపే కావ్యం ఎవ్వరూ చేపట్టలేదు. ఇప్పుడు దయామయుడయిన జైనులాభధేను, పాత రాజులను చీకటి లోంచి వెలుగులోకి తెచ్చి సజీవంగా నిలపాలని నిశ్చయించాడు. ఆ బాధ్యతను శ్రేయభట్టుకు అప్పగిస్తే, ఆయన రాజతరంగిణిని రచన బాధ్యత జోనరాజుకు అప్పగించాడు.

జోనరాజుకు తన శక్తి తెలుసు. తన బలహీనతలు తెలుసు. కల్హణుడిలా తాను పరిశోధన చేసి, కశ్మీరు అణువణువూ వెతికి, శోధించి, వివరాలు సేకరించి రాజుల జీవితాలను తెలుసుకుని వారి చర్యలను విశ్లేషించి, కల్హణుడిలా భావి తరాలకు మార్గదర్శనం చేసేలా, ప్రపంచ పరిణామం పట్ల, మానవ జీవితం పట్ల అవగాహన కలిగి ఒక దృక్పథం ఏర్పడేలా రాజతరంగిణి రచనను తాను చేయలేనని తెలుసు. అందుకని కావ్యారంభంలోనే తన బలహీనతలు చెప్పుకున్నాడు. తన రచననను కల్హణుడి కావ్యంతో పోల్చవద్దన్నాడు.

పృథ్వీనాథ గుణాఖ్యానే చాపలం మే న దూషణమ్।
అలంకారై వహంకారాత్మ రూపాసి హి వల్గాతి॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 15)

తన బలహీనతలన్నీ చెప్పిన తరువాత, ఒక వేళ రాజుల గొప్పతనాన్ని సరిగ్గా వివరించటంలో తాను విఫలమయితే తనను దూషించవద్దంటున్నాడు. కురూపి కూడా ఆభరణాలతో అలంకరించుకుంటే గర్వంగా నడచినట్టు, కేవలం రాజతరంగిణి రచనతోనే తాను సంతృప్తి పడుతున్నానని చెప్పాడు.

కవీనా మూపయోగ్య వా మద్వాక్ స్వాంతర సిద్ధయే।
గంగాజలం జలం తేషాం యైర్న పీతం జలాంతరమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 16)

కల్హణుడిలా ఒక ఆదర్శంతో, ఒక ఆవేశంతో జోనరాజు రాజతరంగిణి రచనను ఆరంభించలేదు. రాజు ఆజ్ఞాపించాడు కాబట్టి రచిస్తున్నాడు. అంతే తప్ప రాజతరంగిణి వంటి రచన చేసేంత శక్తి కానీ, ఆసక్తి కానీ తనకు లేవని జోనరాజుకు తెలుసు. అయితే,  కల్హణుడి రాజతరంగిణి ఒక తరం నుంచి మరొక తరానికి అందుతూ కశ్మీర రాజులను సజీవంగా ఉంచటమే కాదు, రాజతరంగిణి రచించిన కల్హణుడిని కూడా చిరంజీవిని చేయటం జోనరాజు గమనించాడు. కల్హణుడి రాజతరంగిణిని కొనసాగించటం వల్ల తాను కూడా చిరంజీవిగా మిగులుతానని జోనరాజు గ్రహించాడు. అందుకని స్పష్టంగా చెప్పాడు. ఒక కవి రాయాల్సిన కావ్యాన్ని నేను రచించటం వల్ల – ఎలాగయితే కేవలం నీరుగా కనిపించినా, గంగానది వ్యక్తిని శుద్ధుడిని చేస్తుందో, అలా కవిని కాకపోయినా, రాజతరంగిణి రచనను చేపట్టటం వల్ల నేను చిరంజీవిని అవుతున్నాను అన్నాడు. అంతేకాదు, తాను కేవలం సూత్రప్రాయంగా రాజుల చరిత్రను ప్రదర్శించాననీ, తరువాత తరం వారెవరయినా దీనికి అలంకారాలు చేయవచ్చనీ అన్నాడు. ఎలాగయితే చక్రం మణులను చిదిపి వేయగలదు, చిన్న చిన్న ముక్కలుగా చేయగలదు కానీ, ఇంకా చక్కటి యంత్రం మాత్రమే ఆ మణులను మాలగా గుచ్చగలదు. అలా, తాను రాజుల చరిత్రను తనకు తెలిసినంత సూత్రమాత్రంగా పొందుపరిచాడు. అంటే, దారం ఇచ్చాడు. దానిలో మణులను పేర్చుతారో, పూలను అల్లుతారో అది ఇతరులు తమ శక్తిని బట్టి చేయాల్సిన పని అన్నాడు జోనరాజు.

వినైవ పార్థనాం కావ్యం కవేః పశ్యన్తి సాధవః।
కిమర్థతః శశీ విశ్వం సుధాసారేణ సిద్ధతి॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 19)

సన్మతులు, ఉత్తములు విమర్శించకుండా రచనను చదువుతారు. అర్థం చేసుకుంటారు. భూమిపై అమృతం కురిపించమని చంద్రుడిని ఎవరైనా అభ్యర్థిస్తారా? ఒకరి అభ్యర్థన అవసరం లేకుండానే చంద్రుడు భూమిపై అమృతం కురిపిస్తాడు. అలాగే ఉత్తములు కావ్యాన్ని పఠిస్తారు. తమ అభిప్రాయాల్ని తెలుపుతారు. కానీ కొందరు దుర్బుద్ధులుంటారు. వీరు అర్థాలు వివరించినా, ఒప్పుకోరు, దూషిస్తారు. తప్పులెన్నుతారు. ఎలాగయితే అమృతంతో శుభ్రం చేసినా, బొగ్గు నలుపు వదలదో, అలాగే ఎంతగా వివరించినా వారికి అర్థం కాదు. తప్పులెన్నటం, దూషించటం మానరు. జోనరాజు ఈ శ్లోకం మామూలుగా తన విమర్శకులను దృష్టిలో పెట్టుకుని రాసినా, కాస్త ఆలోచిస్తే జైనులాబిదీన్ సుల్తానుగా ఉన్నప్పటి పరిస్థితులను గమనిస్తే, ఈ శ్లోకం  వెనుక ఎంతో దాగుందనిపిస్తుంది.

జైనులాబిదీన్ సుల్తాన్ అయ్యే సమయానికి కశ్మీరు పరిస్థితి అంత బాగా లేదు. సికందర్ బుత్‌షికన్ భయంకరమైన ప్రవర్తన వల్ల, బలవంతపు మతాంతరీకరణల వల్ల  ఇస్లాం స్వీకరించని భారతీయులంతా  కశ్మీరు వదిలి ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోయారు. దాంతో పాలనతో పరిచయం ఉన్నవారు కశ్మీరులో లేకుండా పోయారు. అధికారంలో ఉన్నవారు మతప్రచారానికి, ప్రజలను దోచుకోవటనికీ ఇచ్చిన ప్రాధాన్యం పాలనపై పెట్టలేదు. ఇది కశ్మీరు సుల్తాన్ జైనులాబిదీన్‍ను కలవరపరిచింది. శ్రేయభట్టు సూచనను అనుసరించి సుల్తాన్, కశ్మీరు వదిలిపోయిన వారందరినీ కశ్మీరుకు ఆహ్వానించాడు. వారికి మత స్వేచ్ఛనిచ్చి, రక్షణనిస్తానని వాగ్దానం చేశాడు. దాంతో మళ్ళీ కశ్మీరులోకి భారతీయులు ప్రవేశించారు. పాలనా పగ్గాలు చేపట్టి కశ్మీరుకు శాంతిని సాధించారు. జైనులాబిదీన్ పరమత సహనం ప్రదర్శించటమే కాదు, సంస్కృత కావ్యాలను పర్షియన్ లోకి, పర్షియన్ కావ్యాలను సంస్కృతం లోకి అనువదింప చేశాడు. ఇందులో భాగంగానే పర్షియన్ ప్రేమ గాథను   ‘కథాకౌతుకమ్’ పేరుతో సంస్కృతంలోకి అనువదించాడు జోనరాజు శిష్యుడు శ్రీవరుడు.  . అనేక పర్షియన్ పదాలకు సమాన అర్థాన్నిచ్చే సంస్కృత పదాలను రూపొందించాడు. ఈ రకంగా కూడా  జైనులాబిదీన్ మన్ననలను అందుకున్నాడు జోనరాజు. జోనరాజు తరువాత రాజతరంగిణి రచనను కొనసాగించాడు శ్రీవరుడు.

సాధారణంగా, తమవాడు కానివాడిని గౌరవించినా, పొగిడినా భరించే సహృదయం అతి కొద్ది మందిలో ఉంటుంది. అయితే ఈ నడుమ మతం ప్రవేశించిందంటే అసూయ, ద్వేషం స్థాయిని చేరుకుంటుంది. సుల్తాన్ ఆదేశాల మేరకు కశ్మీరులోని ఇస్లామీయులు – కశ్మీరు వదిలి పారిపోయిన పండితులు తిరిగి కశ్మీరుకు వస్తే బహిరంగంగా నిరసన తెలపకుండా మౌనంగా ఉండి ఉంటారు. కానీ పారిపోయిన కాఫిర్‍లు కశ్మీరు తిరిగివచ్చిన తరువాత అధికార పదవులు పొందటం, సుల్తాను వారిని గౌరవించటం, బహుమతులివ్వటం ఎంతోమందికి కన్నెర్రనయి ఉంటుంది. సుల్తాన్ ఆగ్రహం భయంతో బహిరంగంగా తమ నిరసనను ప్రకటించకున్నా, ఏదో ఒక రూపంలో వారి నిరసన వ్యక్తమవుతూండి ఉంటుంది. జోనరాజ రాజతరంగిణిలో వర్ణించిన పలు సంఘటనలు ఈ ఆలోచనను బలపరుస్తాయి.

తాము పడగ నీడలో నివసిస్తున్నామని, సుల్తాన్ అండ తొలగిన మరుక్షణం తమ మనుగడ ప్రమాదంలో పడుతుందనీ ఇస్లామేతరులందరికీ తెలుసు. అందుకని సుల్తాన్ ఎంతగా అభినందిస్తే, అంతగా అభద్రతా భావానికి గురవటం సహజం. ఇది జోనరాజు రచనలో స్పష్టంగా తెలుస్తూంటుంది. రాజతరంగిణి రచనను జోనరాజుకు అప్పగించటం ఎంతమందికి బాధ కలిగించి ఉంటుందో ఊహించవచ్చు. సంస్కృత పండితులలో కూడా ఇది నిరసనకు దారి తీయటం స్వాభావికం. మళ్ళీ రాజతరంగిణిని రాయించాల్సిన అవసరం ఏముంది? దగ్గర నుంచి రాయాలంటే గొప్ప కవులు లేరా? జోనరాజే దొరికాడా? వరకూ పలు రకాల వ్యాఖ్యలూ, నిరసనలు చెలరేగి ఉంటాయి. వాటికి జోనరాజు ప్రతిస్పందనగా అనిపిస్తుందీ శ్లోకం.  బొగ్గును  అమృతంతో కడిగినా   నలుపు పోదు. ఎంతో లోతైన ఆలోచన కల పోలిక ఇది. ‘ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా’ అన్న పద్యం తెలుసు. కానీ ‘బొగ్గును అమృతంతో కడగటం’ అన్నది కొత్త. అంటే స్వాభావికంగా వారు దుష్టులు. వారి మౌలిక లక్ష్యం దౌష్ట్యం. ఏం చేసినా వారంతే!

పశ్యంతు మత్కావ్యమతి చిదం దూరం గతా కవేః।
అతః పరముఖ ప్రేక్శి భావదైన్య కాదర్శనా॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 21)

నా కావ్యాన్ని ప్రజలు చదవాలి, నన్ను అభినందించాలి అన్న కోరిక ఎప్పుడో నాలో పోయింది. ఇతరుల నుంచి పొగడ్తలు వినాలన్నది పనికిమాలిన కోరిక.

రాజతరంగిణి రచనను చేపట్టే సమయానికి జోనరాజు వృద్ధుడని పలువురి అభిప్రాయం. దాదాపుగా 70 ఏళ్ళుండవచ్చని కొందరి అంచనా. కాబట్టి అప్పటికి అతనికి ఈ విమర్శలు ఎదుర్కుని విసుగు వచ్చి ఉంటుంది. తానేం చేసినా విమర్శించేవారు విమర్శిస్తారని అతడికి తెలుసు. అందుకని ఇప్పుడు తనకు కవిగా గొప్ప పేరు సంపాదించాలన్న కోరిక లేదని స్పష్టం చేశాడు. తరువాత శ్లోకంలో జోనరాజు విమర్శ పలు ఆలోచనలను కలిగిస్తుంది. ఇది ఆధునిక సమాజానికి, సాహిత్య ప్రపంచానికీ, రాజకీయాలకు కూడా వర్తిస్తుంది.

సమఃస్యాద ప్రవీణానామ్ గీత సంస్కృతయో రసః।
వానారా యాన్జతే గున్హాః శీతే వహ్నిణ భ్రమాత్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 22)

ఒక్క చక్కని గీతం, సంస్కృత భాష సౌందర్యం, తెలియని మూర్ఖుడికి ఒకేలాగా అనిపిస్తాయి. కోతులు ఎర్రని గింజలు చూసి నిప్పు కణాలని భ్రమ పడినట్టు, మూర్ఖుడు మామూలు పాటకూ సంస్కృత భాష సౌందర్యానికీ తేడా గ్రహించలేడు. సామాన్య గీతాన్ని గొప్ప గీతమని భ్రమిస్తాడు. ఇది ఆధునిక సమాజంలో మనం అనుభవిస్తూనే ఉన్నాం. సాహిత్యం లోనూ అనుభవిస్తున్నాం. రాజకీయాల్లోనూ చూస్తూనే ఉన్నాం. విషయం లోతుల్లోకి వెళ్ళకుండా, పైపైన చూసేసి, తాత్కాలిక లాభాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని ప్రవర్తించటం చూస్తున్నాం. ఒక మామూలు వాక్యం ఎంతో ప్రాచుర్యాన్ని పొందటం; చక్కని రచన ప్రస్తావనకూ కూడా నోచుకోకపోవటం చూస్తున్నాం. ఎలాగయితే నోట్లో గట్టి పళ్ళున్నవాడే, చెఱుకుగడ తీపిని అనుభవించగలడో, అలాగే తెలిసినవాడే కావ్యం గొప్పతనం గ్రహిస్తాడు. మూర్ఖుడికి ఏమీ తెలియదు. అర్థం కాదు. చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే.

పదార్థే సుందరే కావ్యే దర్శితే నిర్మలాత్మనామ్।
దుర్వారం గుణిరత్నానాం మత్సర ప్రతిబింబనమ్॥
(జోనరాజ ద్వితీయ రాజతరంగిణి 24)

ఒక్కోసారి మంచివారు కూడా చక్కని కావ్యాన్ని చూసి మత్సరగ్రస్థులవుతారు. ఈ శ్లోకం జోనరాజు మనసుని పట్టిస్తుంది. తాను అంత గొప్ప కవిని కానన్నాడు. కల్హణుడి సృజనాత్మకత ముందు తాను పనికిరానన్నాడు. కల్హణుడి కావ్యంతో పోల్చవద్దన్నాడు. గంగాజలం ఎలా ప్రతి వ్యక్తినీ పవిత్రుడిని చేస్తుందో, అలా రాజతరంగిణి రచన వల్ల తాను చిరంజీవిని అవుతానన్నాడు. ఇంతా వినయంగా చెప్తూ, నెమ్మదిగా అసలు విషయం బయటపెట్టాడు. దుష్టులు, మూర్ఖులు మంచి కావ్యాన్ని గుర్తించలేరన్నాడు. పళ్ళు లేని వాడు చెఱుకుగడ నుండి రసాన్ని పీల్చి అనుభవించలేడన్నాడు. ఆపై పండితులు, తెలివైనవారు కూడా మత్సరానికి లోనయి మంచి కావ్యాన్ని కూడా ఎంచరన్నాడు. ఇలా వినయం చూపుతూనే, తానంత గొప్పవాడిని కాదు, ఇప్పుడు ఎవరి పొగడ్తలు, మెప్పులు అవసరం లేదంటూనే – చక్కని కావ్యాన్ని మూర్ఖులు ఎలాగో గుర్తించలేరు; పండితులు కూడా అసూయతో కావ్యగుణగణాలు తెలిసి కూడా చెప్పరంటున్నాడు. జైనులాబిదీన్ నుంచి రక్షణను, పొగడ్తలను అందుకుంటున్న జోనరాజు పరోక్షంగా ఎదుర్కున్న వ్యతిరేకత, విమర్శల స్వరూపాన్ని ఈ శ్లోకాలు తెలుపుతాయి. అయితే ఎవరినీ ప్రత్యక్షంగా విమర్శించే స్థితిలో లేడు జోనరాజు. అందుకే అందమైన సంస్కృత కావ్యం, గీతం ప్రసక్తి తెచ్చాడు. మామూలు పాటల అందం, ఉత్తమమైన సంస్కృత కావ్యం గొప్పతనాల నడుమ తేడా తెలుసుకునే స్థితిలో ఆనాటి సమాజం లేదని పరోక్షంగా చెప్తున్నాడు.

రెండు విభిన్నమైన నాగరికతలు, ధర్మాలు కలిసి బ్రతకాల్సి వచ్చినప్పుడు మామూలు పరిస్థితులలో సంఘర్షణ తప్పదు. రెండు విభిన్నమైన నాగరికతలు, ధర్మంలో ఒకరు మరొకరిపై ఆధిక్యం సాధిస్తే, ఘర్షణ తీవ్రరూపం దాల్చటం స్వాభావికం. కశ్మీరంలో ఇస్లాం ప్రవేశం, భారతదేశంలోని ఇతర ప్రాంతాల కన్నా భిన్నం. ఇతర ప్రాంతాలలో ఇస్లాం ‘విజేత’లా ప్రవేశించింది. కశ్మీరులో తలదాచుకునేందుకు ప్రవేశించిన ఇస్లామీయులు కొన్ని వందల సంవత్సరాలు, కశ్మీరీయులతో సహజీవనం చేస్తూ బ్రతికారు. కశ్మీరీ రాజులు ఇతర ప్రాంతాల నుంచి ఇస్లామీ యోధులను కశ్మీరుకు రప్పించినా, భారతీయ రాజుల పాలన ఉండడంతో, వారు రాజును ప్రభావితం చేయటం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఇస్లామీయుడు కశ్మీరు రాజు అవటం కూడా పోరాటం వల్ల, హింస వల్ల, మత ఆధిక్యం నిరూపించుకోవాలన్న లక్ష్యం వల్ల కాదు. దాంతో కశ్మీరులో ఇస్లాం అధికారంలోకి వచ్చినా, సమాజంలో పెద్దగా మార్పులు రాలేదు. కానీ ఇతర ప్రాంతాల నుంచి వెల్లువలా ఇస్లామీయులు కశ్మీరం చేరటం, వారు ఆయా ప్రాంతాలలో విజేతలై, భారతీయులపై ఆధిక్యం సాధించి, మతపరంగా పట్టుదలలు కలవారు కావటం కశ్మీరుపై ప్రభావం చూపింది. అంతవరకూ లేని మత దురహంకారం, సంకుచితత్వాలు కశ్మీరులో ప్రవేశించాయి.

‘షాహ హమదాని’ ఇరాన్ నుంచి ప్రాణాలు అరచేత పట్టుకుని, ఏడు వందల మంది అనుచరులతో కశ్మీరు చేరటంతో, కశ్మీరు పరిస్థితి మారిపోయింది. ఇస్లాం రాజ్యంలో కాఫిర్లు సమాన స్థాయిని అనుభవించటాన్ని హమదాని అభ్యంతరకరమైన విషయంగా పరిగణించాడు. అక్కడి నుంచీ కశ్మీరులో ఇస్లామేతరులు ద్వితీయశ్రేణి పౌరులయ్యారు. హక్కులన్నవి లేని మూగ మనుషులయ్యారు. సంస్కృతం, కశ్మీరీ భాషలు వెనుకబడ్డాయి. పర్షియన్ భాష తెర పైకి వచ్చింది. సంస్కృతం అర్థమయి, ఆనందించేవారున్నా, సంస్కృత కావ్యాన్ని అభినందించటం, పొగడటం ఆమోదయోగ్యం కాని పని అయింది. మామూలు గీతాలకు ప్రాధాన్యం పెరిగింది. మామూలు గీతాలు అంటే సంస్కృతేతర భాషలలో, ఇస్లామీయుల భాషలలో ఉండే పాటలు. ఇది ఈనాడు కూడా మనం అనుభవిస్తున్నాం. సంస్కృతం పేరు చెప్తే చాలు చలిజ్వరాలు వచ్చేసి, దయ్యం పూనినట్టు చిందులు వేసి, కేకలు పెట్టేవారిని చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు స్వేచ్ఛ, స్వతంత్రాలుండి, ఎవరికి ఇష్టమైన పని వారు చేసుకునే వీలున్న ప్రజాస్వామ్యంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే, సుల్తాన్ దయాదాక్షిణ్యాలపై, అతని అనుయాయుల ప్రసన్నతపై ఆధారపడి సంస్కృత కావ్యాలు రచించే వారి పరిస్థితి ఎలా ఉండేదో ఊహించటం సులభం. ఆ పరిస్థితిని నర్మగర్భితంగా, సూచ్యప్రాయంగా వర్ణిస్తున్నాడు జోనరాజు. స్పష్టంగా అనలేడు. అంటే మెడపై తల నిలవదు.

(ఇంకా ఉంది)

Exit mobile version