Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-11: సీఎం టీ తాగరు

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

“ఏం ఆచారి.. ఇప్పటికైనా నన్ను జర్నలిస్టుగా ఒప్పుకుంటావా?”

ముఖ్యమంత్రి సూర్యా రావు అలా ప్రశ్నించే సరికి ఆచారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక నవ్వాడు.

ముఖ్యమంత్రి తన ఛాంబర్‌లో ఠీవిగా కూర్చున్నాడు. అసలే డబ్బుతో వచ్చిన దర్పానికి తోడు పదవి వల్ల అది రెట్టింపైంది.

జర్నలిస్టులు తమ గోడు చెప్పుకోవడానికి వస్తామంటే రమ్మని పిలిచారు.

ముఖ్యమంత్రికి తమ గోడు ఎలా చెప్పాలి? ఎక్కడి నుంచి ప్రారంభించాలి? అని జర్నలిస్టులు ఆలోచిస్తుండగా సూర్యా రావు కళ్లుమూసుకుని ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాడు.

తమ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ముఖ్యమంత్రి కళ్లుమూసుకుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడని జర్నలిస్టులు మురిసిపోయారు.

సూర్యా రావు పెదవులపై సన్నని చిరునవ్వు. అది ఎంత దాచినా దాగలేదు.

***

అశోక్‌నగర్ సందులోని జన జాగృతి పత్రిక కార్యాలయం.

చిన్న ప్రెస్. ఓ డజను మంది పని చేస్తారు. వారపత్రిక కావడంతో పెద్దగా హడావుడి ఉండదు.

ఉదయం పదకొండు గంటలు కావస్తోంది. ఒక్కొక్కరుగా సిబ్బంది చేరుకుంటున్నారు.

అందరికన్నా ముందే వచ్చిన ఆర్టిస్ట్ సూర్య టేబుల్ తుడుచుకుని పని మొదలుపెట్టాడు. ఒక్కొక్కరు వస్తుంటే అందరినీ విష్ చేస్తున్నాడు.

గోడల మీద రాతలు రాయడం నుంచి జీవితాన్ని ప్రారంభించిన సూర్యకు జీవితంలో ఎదగాలనే పట్టుదల బలంగా ఉండేది. ఒక్కో మెట్టు ఎక్కుతూ పోతున్నాడు.

ఖద్దరు చొక్కాలు వేసుకునే నాయకులు, ఖాకీ దుస్తుల్లో పోలీసులు, తెల్ల దుస్తుల్లో అధికారులు.. అందరూ జర్నలిస్టులను గౌరవించడాన్ని చూసిన సూర్య, తానూ జర్నలిస్టు కావాలని అనుకున్నాడు.

చదువు అంతంత మాత్రమే. కానీ తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదని నమ్మే సూర్య, తెలిసినవారి ద్వారా జన జాగృతి కార్యాలయానికి చేరుకున్నాడు.

జర్నలిస్టు కావాలనే తన కోరిక గురించి చెబితే అనుభవం లేదని చెప్పి నిరాశ పరిచారు.

గోడలపై అందంగా అక్షరాలు రాసే తన అనుభవం గురించి చెప్పడంతో జన జాగృతిలో ఆర్టిస్ట్‌గా అవకాశం ఇచ్చారు.

పని చేసేది పత్రికా కార్యాలయంలోనే కాబట్టి, ఆర్టిస్టు అయినా జర్నలిస్టే అని సూర్య మురిసిపోయాడు.

అయితే ఆ మురిపెం ఎక్కువ కాలం నిలవలేదు.

ఆఫీసులోని సబ్ఎడిటర్లు, రిపోర్టర్లు తనను జర్నలిస్టుగా గుర్తించడం లేదని సూర్యకు తొందరగానే అర్థమైంది.

“లక్ష్యం ముఖ్యం. చిన్నచిన్న అడ్డంకులను పట్టించుకోవద్దు” అని తనకు తానే ధైర్యం చెప్పుకుని నెట్టుకొచ్చాడు.

మధ్యాహ్నం రిపోర్టర్లు, సబ్ఎడిటర్లు టీ తాగేందుకు బయటకు వెళ్తుంటే తనను పిలవకపోయినా సూర్య వాళ్లతో వెళ్లేవాడు.

ఒక రోజు మాటల సందర్భంలో ఆచారితో అన్నాడు.

“ఆచారి అన్నా.. చూస్తూ చూస్తూ ఉండు. ఏదో ఒక రోజు నేనూ మీలాగే జర్నలిస్టునవుతాను. వారపత్రికలో కాదు.. దినపత్రికలో జర్నలిస్టుగా ఓ వెలుగు వెలిగిపోతా చూడు.”

ఆచారి నవ్వి సూర్య ఆశలపై నీళ్లు చల్లాడు.

“గోడ మీద అక్షరాలు రాయడం వేరు.. పత్రికలో జర్నలిస్టుగా రాయడం వేరు. ముందు సొంతంగా అక్షరాలు రాయడం నేర్చుకో. తరువాత జర్నలిజం గురించి కలలు కందువులే.”

***

సూర్యా రావు ఫ్లాష్‌బ్యాక్‌లో మునిగిపోయి జన జాగృతిలో పని చేసిన రోజులను గుర్తు చేసుకుంటుంటే, ఆచారి కూడా ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నాడు.

జర్నలిస్టుగా గుర్తింపు కోసం తపించిన సూర్యకు అక్షరాలు పెద్దగా రాకపోయినా అమోఘమైన తెలివితేటలు ఉన్నాయి.

పెళ్లితో దశ తిరిగింది.

తొందరగా సంపన్నుడు కావాలంటే రియల్ ఎస్టేట్, రాజకీయం.. ఈ రెండింటికి మించింది లేదనుకున్నాడు.

రెండింటిలో ఒకదాన్నే ఎందుకు ఎంచుకోవాలి? రెండింటిలోకి ఎందుకు ప్రవేశించకూడదు అనుకున్నాడు.

పట్టిందల్లా బంగారమైంది.

రియల్ ఎస్టేట్‌లో ఇంత డబ్బు ఉందని అతడే ఊహించలేదు. తన జిల్లాతో పాటు హైదరాబాద్ జిల్లాలో ఏ సర్వే నంబర్‌లో ఏ మతలబు ఉందో ఔపోసన పట్టాడు.

రియల్ ఎస్టేట్‌లో సంపద పోగుపడిన తరువాత రాజకీయాల్లో ఒక్కో మెట్టు ఎక్కసాగాడు.

కాలం కలిసి రావడం, మీడియా అండగా నిలవడంతో రియల్ ఎస్టేట్‌లో దూసుకెళ్లినట్టే రాజకీయాల్లోనూ దూసుకెళ్లాడు.

ఒక్కొక్కరిని తొక్కుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ సూర్య కాస్తా సూర్యా రావుగా మారి ముఖ్యమంత్రి అయ్యాడు.

తనతో కలిసి పని చేసిన సూర్య ముఖ్యమంత్రి అయితే, తెలివైన ఆచారి మాత్రం జర్నలిస్టు నుంచి సీనియర్ జర్నలిస్టయ్యాడు.

జర్నలిస్టుల ఇంటి స్థలాల వివాదం ఇరవై ఏళ్లుగా నలుగుతోంది.

ఒకప్పుడు ‘జర్నలిస్టు’ అనే పిలుపు కోసం తపించిన సూర్య ముఖ్యమంత్రి కావడంతో తమ సమస్య తీరినట్టేనని ఆచారి సంతోషానికి హద్దులేకుండా పోయింది.

తనలాంటి బడుగు జర్నలిస్టులను కూడగట్టుకుని ఆచారి సీఎం సూర్యా రావు వద్దకు వెళ్లాడు.

***

“ఏం ఆచారి.. ఇప్పటికైనా నన్ను జర్నలిస్టుగా గుర్తిస్తావా?”

సూర్యా రావు అలా ఎందుకు అన్నాడో మిగిలినవాళ్లకు అర్థం కాలేదు. కానీ ఆచారికి అర్థమైంది.

“మీరు జర్నలిస్టు మాత్రమే కాదు.. పత్రికలను నడిపించే పాలకులు.”

ఆచారి చమత్కరించాడు.

పైకి చమత్కారమే అయినా అసలు వాస్తవం ఇదే కదా? అని ఆచారి తనలో తానే అనుకున్నాడు.

ఒకప్పుడు మీడియా స్వతంత్రంగా పనిచేసేది. ఇప్పుడు రాజకీయ పార్టీలు, పాలకులే మీడియాను నడిపిస్తున్నారు. పత్రికలకు అసలైన యజమానులు, ఎడిటర్లు రాజకీయ నాయకులే కదా?

ఇలాంటి మాటలను పైకి చెప్పలేని నిస్సహాయ స్థితికి చేరుకున్నాం అని తనకు తానే సర్దిచెప్పుకున్నాడు.

మూడు దశాబ్దాల క్రితం కలిసి పనిచేసినా ఆచారిని సీఎం మరిచిపోలేదని మిగిలిన జర్నలిస్టులు సూర్యా రావు స్నేహధర్మానికి సంబరపడ్డారు.

“రెండు దశాబ్దాల క్రితం డబ్బు పెట్టి జర్నలిస్టులు ప్రభుత్వం వద్ద ఇళ్ల స్థలాలు కొంటే, వివాదాలు, కోర్టు కేసులతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. మీరే న్యాయం చేయాలి.”

ఆచారి అందరి తరఫున ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశాడు.

“ఎంత మాట! నేను జర్నలిస్టుగా జీవితం ప్రారంభించి మీ అందరి ఆశీస్సులతో ఈ స్థాయికి వచ్చినవాడిని. నేను సీఎం అంటే ప్రతి జర్నలిస్టు సీఎం అని గర్వంగా భావించాలి.

మీ సమస్యను పరిష్కరించే భాగ్యం నాకు ఆ దేవుడు ప్రసాదించాడు. అధికారుల నుంచి నివేదిక తెప్పించుకుని, నివేదిక రాగానే టీ తాగినంత సమయంలో మీ ఫైల్‌పై సంతకం చేస్తాను.”

ముఖ్యమంత్రి భరోసా ఇచ్చాడు.

ఆచారి కళ్లల్లో నీళ్లు ఉబికి వచ్చాయి. మాట తడబడింది.

“మీ నుంచి ఇంత అద్భుతమైన స్పందన ఊహించలేదు.”

అని మాటలు కూడబలుక్కొని కృతజ్ఞతలు తెలిపాడు.

ఆచారిని అనుసరిస్తూ జర్నలిస్టులందరూ సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ బయటకు వెళ్లారు.

***

“ఆచారి గారు.. మూడు దశాబ్దాల క్రితం ముఖ్యమంత్రి, మీరు కలిసి ఒకే పత్రికలో పనిచేశారని తెలిసి ఏదో అనుకున్నాం. కానీ నిజంగా ఇంత అద్భుతమైన సీఎంను జన్మలో చూడలేం. మూడు దశాబ్దాలైనా మిమ్మల్ని సీఎం మరువలేదు.”

జర్నలిస్టు లోకేషం ఆచారిని అభినందనల్లో ముంచెత్తాడు.

“ఔను. సీఎం గారు మీరు మాట్లాడుతుంటే, ఆయన మిమ్మల్ని ఆదరించిన తీరు చూస్తుంటే శ్రీకృష్ణుడు – కుచేలుడి కథ ప్రత్యక్షంగా చూస్తున్నట్టు అనిపించింది. జన్మ ధన్యం అయింది.”

ఎప్పుడూ ఎవరినీ పొగడని సీనియర్ క్రైమ్ రిపోర్టర్ సత్యం ఆచారి భుజం తట్టి మెచ్చుకున్నాడు.

“నేడో రేపో మన ఇంటి స్థలాలు మన చేతిలో ఉంటాయి. సీఎం గారికి మన స్థలంలోనే అభినందన సభ ఏర్పాటు చేయాలి.”

అంతా ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు.

***

“ఊరక రారు మహానుభావులు.. మంత్రి గారు ఇలా వచ్చారేం?”

మంత్రి శీనన్నను చూడగానే సీఎం సూర్యా రావు స్వాగతం పలికాడు.

“జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై మన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము. జర్నలిస్టులు మిమ్మల్ని కలిస్తే మీరూ హామీ ఇచ్చారట! మీతో మాట్లాడి ఫైల్ సిద్ధం చేద్దామని వచ్చాను.”

శీనన్న బదులిచ్చాడు.

సూర్యా రావు గట్టిగా నవ్వాడు.

“నేను పుట్టక ముందు నుంచే కాలు గుర్తు పార్టీని నమ్ముకుని ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. వాళ్లందరినీ పక్కన పెట్టి, రెండేళ్ల క్రితమే పార్టీలో చేరిన నన్ను సీఎం ఎందుకు చేశారో మీకు ఇప్పటికైనా అర్థమై ఉండాలి.”

సూర్యా రావు నవ్వాడు.

“మీరే కాదు.. ప్రభుత్వంలో నంబర్ టూగా ఉన్న నేను కూడా పార్టీలో చేరిన రెండేళ్లకే నంబర్ టూ అయ్యాను. నంబర్ వన్‌ను తప్పిస్తే క్యూ‌లో ఉన్నది నేనే.”

శీనన్న నవ్వాడు.

“నాది రియల్ ఎస్టేట్ బలం అయితే.. మీది కాంట్రాక్టుల బలం.”

సీఎం అనగానే ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు.

“ఆ ఇంటి స్థలాల గొడవ పక్కన పెట్టండి. మీడియాలో పని చేసినవాడిగా చెబుతున్నాను.

వాళ్ల సమస్యను ఎంతకాలం అలా నానుస్తూ ఉంటే అంతకాలం వాళ్లు మన పాటకు డాన్స్ చేయమన్నా చేస్తారు. సమస్యను పరిష్కరించాం అంటే తోక జాడిస్తారు.

ఎప్పుడు కలిసినా సానుకూలంగా స్పందించాలి.

జర్నలిస్టులు చాలా మేధావులమని అనుకుంటారు. వాళ్లంత వెర్రివాళ్లు ఉండరు. అలా అని మీరు వాళ్లు వెర్రివాళ్లు అని అస్సలు అనకూడదు.

‘మీ అంత మేధావులు లేరు’ అనాలి.

ఏం అడిగినా సానుకూలంగా స్పందించాలి.”

సూర్యా రావు శీనన్నకు జ్ఞానబోధ చేశాడు.

“మరి టీ తాగినంత సమయంలో సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు కదా?”

శీనన్న గుర్తు చేశాడు.

“ఒక్క జర్నలిస్టుకేనా? రాష్ట్ర ప్రజలందరికీ హామీ ఇచ్చాం. అయినా.. నేను టీ తాగను.”

సీఎం నవ్వాడు.

“అమ్మో! మీరు మామూలోళ్లు కాదు. గోడ మీద రాతల నుంచి ప్రజల తలరాతలు రాసే స్థాయికి వచ్చారంటే మీరు మహా ముదురు.”

సూర్యా రావును శీనన్న మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు.

***

శీనన్న సీఎం‌ను కలిసి బయటకు రాగానే జర్నలిస్టులు ఆశగా ఆయన్ని చుట్టుముట్టారు.

“మీ సమస్య పరిష్కారానికి సీఎం సానుకూలంగా స్పందించారు. టీ తాగినంత టైంలో మీ సమస్య పరిష్కరిస్తామన్నారు. ఈ రోజు నుంచి మీరు కోటీశ్వరులు. వెళ్లండి.. పండగ చేసుకోండి!”

అని చెప్పి శీనన్న కారు ఎక్కి వెళ్లిపోయాడు.

***

ఆచారి ఇంటికి వెళ్లి విషయం చెప్పగానే భార్య భావోద్వేగానికి గురైంది.

ఇరవై ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఇంటి స్థలం ఇక తమదేనని ఆమె నమ్మింది.

ఆచారి కూడా ఆ రోజు జరిగినదంతా గుర్తు చేసుకుంటూ ఆనందించాడు.

ముఖ్యమంత్రి చెప్పిన మాట మాత్రం అతని చెవుల్లో ఇంకా మారుమోగుతూనే ఉంది –

“టీ తాగినంత సమయంలో మీ ఫైల్‌పై సంతకం చేస్తాను.”

సీఎం టీ తాగడని.. తమ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని ఆ దంపతులకు తెలియదు.

Exit mobile version