Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-14: రాజయ్య పాన్ షాప్ – జర్నలిస్ట్‌ల చాట్ జిపిటి

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్దా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

“ఏం రమేష్ డల్‌గా ఉన్నావ్” ఆలోచిస్తూ సిగరెట్ తాగుతున్న రమేష్ ఒక్కసారిగా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు. అటు ఇటు చూశాడు. ఎవరూ లేరు.

“రమేష్ నిన్నే! అలా కంగారు పడతావేం. నేనే”

మాటలు మళ్ళీ వినిపించాయి.

రాజయ్య పాన్ షాప్ తప్ప అక్కడ ఎవరూ లేరు.

దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేసే రమేష్ ఆఫీస్ పక్కనే ఉన్న రాజయ్య పాన్ షాప్‌కు రోజుకు కనీసం మూడు నాలుగు సార్లు వస్తాడు. రాజయ్య పాన్ షాప్‌లో సిగరెట్ కొని అక్కడే పక్కన గోడకు కాలు పెట్టి మిత్రులతో కాసేపు కబుర్లు చెప్పుకుని ఆఫీసుకు వెళ్లడం అతని దినచర్య. సిగరెట్ తాగే అలవాటు ఉన్నవారు, లేనివాళ్లు అందరూ అక్కడ కాసేపు కష్ట సుఖాలు చెప్పుకొని, ఆఫీస్ రాజకీయాలు మాట్లాడుకొని వెళ్లడం దినచర్య. ఆఫీస్ లోపల ఏం జరుగుతుందో ఎడిటర్‌కు ఎంత తెలుసో, రాజయ్యకు అంతకన్నా ఎక్కువ తెలుసు. ఎడిటర్ ముందు మనసు విప్పి మాట్లాడరు. కానీ రాజయ్య దగ్గర దాపరికం ఉండదు. వింటాడు అని పట్టించుకోకుండా ఆఫీస్‌లో జర్నలిస్ట్‌లు బృందాలుగా వచ్చి అక్కడ సిగరెట్ తాగి కాసేపు కబుర్లు చెప్పుకొని వెళతారు.

కలకత్తా లోని రైటర్స్ క్లబ్, ముంబైలో పృథ్వీ థియోటర్ క్లబ్‌లో మేధావులు చర్చలు జరుపుతున్నట్టు రాజయ్య పాన్ షాప్ వద్ద అనేక విషయాలపై చర్చలు జరుగుతాయి.

ఆ రోజు రాజయ్య పాన్ షాప్ ఎందుకో తెరవలేదు. కొంచం దూరం పోయి సిగరెట్ కొనుక్కొని రమేష్ అలవాటు ప్రకారం రాజయ్య పాన్ షాప్ పక్కన గోడకు అనుకోని ఏదో ఆలోచిస్తున్నాడు.

తాను ఆలోచిస్తున్నప్పుడు ‘ఏం రమేష్’ అనే పిలుపు వినిపించడంతో, రమేష్ కు ఎవరు పిలుస్తున్నారో అర్థం కాలేదు.

“కంగారుపడకు రమేష్. జీవితం అన్నాక ఇలాంటి కష్టాలు మామూలే” అని ఓదార్పు మాటలు వినిపించాయి.

రాజయ్య పాన్ షాప్ నుంచి వినిపిస్తున్న మాటలు అవి.. రమేష్ ఒక్కసారిగా భయపడిపోయాడు.

“అంతగా భయపడిపోవలసిన అవసరం లేదు రమేష్. నాకు శరీరం లేదు కానీ నేను నీలాంటి వాడినే. ఆఫీస్‌లో మీ జీవితం ఎలా నలిగిపోతుందో రాజయ్య పాన్ షాప్‌లో నా జీవితం అలానే నలిగిపోతుంది. మీ బాస్‌తో పోలిస్తే మా రాజయ్య కొంచెం బెటర్‌నే. ఈ రోజు మీ ఫ్రెండ్స్ ఎవరూ రానట్టు ఉంది. ఒక్కడివే వచ్చావు. అందుకే పలకరించాను. భయపడకు. మీ ఫ్రెండ్స్‌తో మాట్లాడినట్టు నాతో మాట్లాడవచ్చు. అందరి జీవితంలో ఇలాంటి కష్టాలు మాములే. ఈ కష్టాల నుంచి నువ్వు భయటపడతావు” అని పాన్ షాప్ భరోసా ఇచ్చింది.

రమేష్‌లో ఆశ్చర్యం పోయి కుతూహలం మొదలయింది.

“నేను మామూలుగానే ఉన్నాను. నాకేం కష్టాలు లేవు. నేను కష్టాల్లో ఉన్నట్టు నీకు ఎందుకు అనిపిస్తోంది?” అని రమేష్ అడిగాడు.

“నువ్వు వార్త కవరేజ్‌కు వెళ్లి వార్త రాస్తున్నావా? కవరేజ్‌కు వెళ్లకుండా సొంత పని మీద వెళ్లి, మీ ఫ్రెండ్ నుంచి వార్త తీసుకోని రాస్తున్నావా? అనేది మీ ఎడిటర్ కనిపెట్టకపోవచ్చు కానీ నేను అది కూడా చెప్పగలను” అని పాన్ షాప్ ధీమాగా పలికింది.

“ఏదైనా చెబుతావా?” అని రమేష్ అడిగితే,

“చెబుతా” అని పాన్ షాప్ బదులిచ్చింది.

“మా ఫ్రెండ్ ఆచారి గురించి” అని రమేష్ అనగానే,

“దమ్మున్న మీడియాలో పని చేసే మీ ఫ్రెండ్ ఆచారి గురించి ఏం చెప్పమంటావు? ఓనర్ కుమార్తెకు మీ ఆచారి మధ్యవర్తిగా ఉండి సీఎం కోటాలో మెడికల్ కాలేజీలో సీటు వచ్చేట్టు చేసిన ప్రయత్నాల గురించి చెప్పాలా? దమ్మున్న పత్రిక ఓనర్ కళాపోషణ గురించి చెప్పాలా? రాజకీయ పార్టీ కోసం చేసే పని గురించి చెప్పమంటావా? అంతకు ముందు బాగ్ లింగంపల్లి జీవితం గురించి చెప్పాలా? పార్టీ అధినేత అతనికి నెల నెల ఇంటి ఖర్చుల కోసం ఇచ్చిన కవర్ సంగతి చెప్పాలా? ఎన్నికల్లో డబ్బు పంపిణీ బాధ్యత అప్పగిస్తే నొక్కేసిన డబ్బు గురించి చెప్పమంటావా? ఏం చెప్పాలి” అని పాన్ షాప్ నుంచి వరుస ప్రశ్నలు వినిపించగానే,

రమేష్ ఒక్కసారిగా “వామ్మో నీకు ఇన్ని విషయాలు తెలుసా?” అని విస్తుపోయాడు .

“మేం రోజూ ఇక్కడ మాట్లాడుకుంటాం కాబట్టి మా ఆఫీస్ సంగతులు నీకు తెలుసు. అక్కడి వరకు అర్థం చేసుకోవచ్చు. మిగిలిన పత్రికలు బాగోతాలు కూడా నీకు ఎలా తెలుస్తాయి. మాయలు మంత్రాలు వచ్చా?” అని అడిగాడు.

“ఈ రోజుల్లో కూడా మాయలు, మంత్రాలు, చేతబడులు నమ్ముతావా? ఎంత అమాయకుడివోయ్ రమేష్” అని పాన్ షాప్ జాలి చూపించింది.

“మంత్రాలు లేకపోతే అన్ని పత్రికలు వ్యవహారాలు ఎలా తెలుసు” అని అడిగాడు.

“చాట్ జిపిటి గురించి విన్నావా? వినే ఉంటావు లే” అంటే,

“ఆ తెలుసు” అని రమేష్ బదులిచ్చాడు.

“చాట్ జిపిటిలో మంత్రాలు, మాయలు ఏమీ లేవు. మనుషులు ఇచ్చే సమాచారం అంతా తీసుకొని, ఆ సమాచారం నుంచే మనుసులు అడిగే వాటికి సమాధానం చెబుతుంది. ప్రజలందరూ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే, ఆ డబ్బును అదానీకి లోన్ ఇచ్చినట్టు అన్నమాట. హా.. హా.. ఏదో ఈజీగా అర్థం కావాలి అని అలా చెప్పాను లే. మనుషుల్లో ఉన్నంత పక్షపాతం ఏఐలో ఉండదు. బ్యాంకులు సంపన్నులకు లోన్లు ఇస్తాయేమో కానీ, యంత్రాలు అలా కాదు అందరికీ అవకాశం సమాన అవకాశాలు ఇస్తాయి.” అని పాన్ షాప్ చెబుతుంటే,

రమేష్ మధ్యలోనే ఆపి “మిగిలిన పత్రికలు బాగోతాలు ఎలా తెలుస్తాయి? అది చెప్పు ముందు” అని అడిగాడు.

“ఏఐ గురించి తెలుసు కదా? ఏఐ లను స్వయంగా నిర్వహించుకోవడానికి ఏజెంట్ లను ఏర్పాటు చేస్తారు. ఓ 15 వేల మంది ఏజెంట్‌లు మనిషి ప్రమేయం లేకుండా తమలో తామే చర్చించుకొని నిర్ణయాలు తీసుకుంటున్న వార్త ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది తెలుసా?”

“తెలుసు” అని రమేష్ బదులిచ్చాడు.

“ఏఐ లోని ఏజెంట్లు ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నట్టే మా పాన్ షాప్‌లు అన్ని కలిసి ఒక నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాం. నువ్వు పెద్దగా గమనించి ఉండవు. ప్రతి పత్రికా ఆఫీస్ సమీపంలో ఓ పాన్ షాప్ ఉంటుంది. అసెంబ్లీ, సెక్రెటరియేట్, పార్టీ ఆఫీస్‌లు ఇలా ప్రతి చోట ఉన్న పాన్ షాపులు ఏఐ ఏజెంట్‌ల మాదిరిగానే నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకున్నాం. మీ మతలబులు అన్నీ మా గుప్పిట్లో ఉన్నాయి. ఏ పత్రికలో ఏ పతివ్రతుడికి ఎవరితో సంబంధమో చెప్పమంటావా?” అని పాన్ షాప్ కవ్విస్తూ అడిగింది.

“కొన్ని విషయాలు తెలియక పోవడమే మంచిది. వద్దు” అని రమేష్ ఆలోచనలో పడ్డాడు.

“నువ్వు ఏం ఆలోచిస్తున్నావో చెప్పనా? ఏఐ ఇదే వేగంతో అభివృద్ధి చెందితే ఈ దశాబ్దంలో మానవ జాతి అంతరించి పోతుంది అని ఏఐ నిపుణులు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నావు కదా?” అని అడిగింది.

“ఔను” అని రమేష్ ముక్తసరిగా సమాధానం చెప్పారు.

“నీ ఆలోచన అక్కడే ఆగలేదు. నీతులు చెప్పే మీడియాలో నిండా అక్రమాలే. అత్యాచారాలు చేసే బాబాలు, ప్రజల కోసమే బతుకుతున్నాం అని చెప్పే రాజకీయ నాయకులు, సంపాదకీయాల్లో నీతులు రాసి అస్సలు పాటించని సంపాదకులు, యజమానులు వీరందరినీ చూసి ఏఐ నిపుణులు చెప్పినట్టు మానవజాతి అంతరించి, కొత్త లోకం మళ్ళీ మొగ్గ తొడగాలి అనుకుంటున్నావు కదూ” అని రాజయ్య పాన్ షాప్ అడిగింది.

“మాటలకు చేతలకు పొంతన లేని ఈ లోకం అంతరించాలి అనే కోరుకుంటున్నాను” అన్నాడు రమేష్.

“భూమాత భరించలేనంతగా పాపం పెరిగిపోయినప్పుడు. ప్రకృతి తనను తానూ రక్షించుకోవడానికి ఏదో ఒక రూపంలో విలయాన్ని సృష్టిస్తుంది. మనుషుల్లో మార్పు తేలేం. యుగాంతం ఆ పని చేస్తుంది. ఇప్పుడు ఏఐ రూపంలో యుగాంతానికి ఏర్పాట్లు జరుగుతున్నాయేమో” అని పాన్ షాప్ పలికింది.

సిగరెట్ మంట చురుక్కుమని తాకడంతో టైం అయింది అనుకొని రమేష్ ఆఫీస్ లోకి బయలుదేరాడు.

Exit mobile version