[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్దా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
సిగరెట్ దమ్ము లాగుతూ సురేష్ దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. టీ కొట్టు వద్దకు అప్పుడే వచ్చిన కిషోర్ సిగరెట్ తీసుకుని ముట్టిస్తూ సురేష్‌ను విష్ చేశాడు. “రెండు రోజుల నుంచి కనిపించలేదు. ఊరెళ్ళావా?” అని పలకరించాడు.
ఇద్దరూ ఆంధ్ర ప్రగతి పత్రికలో జర్నలిస్ట్‌లు. ఆఫీస్ లోకి వెళ్లే ముందు టీ కొట్టు కొట్టు వద్ద గ్రూపులుగా చేరి మంచి చెడు కాసేపు మాట్లాడుకొని వెళ్లడం వాళ్లకు అలవాటు.
“ఔను. ఊరెళ్ళి ఈ రోజే వచ్చాను. ఊరెళ్ళే ముందు రోజు బ్యానర్ వార్తకు నేను పెట్టిన హెడ్డింగ్ సూపర్ హిట్టయింది. ఆంధ్ర వెలుగులో ఫ్రెండ్ ఉన్నాడు. వాడు చెప్పాడు. అసెంబ్లీ విధ్వంసంపై ఆంధ్రప్రగతి బ్యానర్ హెడ్డింగ్ పేలిపోయింది అని అంతా మాట్లాడుకుంటున్నారు అని వాడే చెప్పాడు. ఎంత కష్టపడ్డా సరైన గుర్తింపు ఉండి ఏడిస్తే కదా? అందుకే మన పత్రిక ఇలా ఉంది. ఓ ప్రమోషన్ లేదు. గుర్తింపు లేదు” అని సురేష్ తన దీర్ఘ కాల అసంతృప్తిని వెళ్లగక్కాడు.
అంతా వింటూ సిగరెట్ తాగుతున్న కిషోర్ చిన్నగా నవ్వుకున్నాడు. అది సురేష్ కంటపడనే పడింది.
“నీకు నవ్వులాటగా ఉంటుంది.24 గంటలు పత్రిక కోసమే ఆలోచించే మాలాంటి వాళ్లకు ఎంత బాధగా ఉంటుందో ఏం తెలుస్తుంది” అని సురేష్ నిష్ఠురమాడాడు.
అప్పుడే అక్కడికి వచ్చిన రాజా వాళ్ల సంభాషణ వింటూ ఆసక్తిగా దగ్గరకు వచ్చాడు.
“ఊరెళ్లారా? మీ ఊరిలో పిచ్చుకలు ఉంటాయా?” అని సురేష్‌ను అడిగాడు.
సురేష్ మనసులో ‘వీడిదో పిచ్చుకల గోల’ అనుకున్నాడు.
“ఏమో అంతగా గమనించలేదు. ఊరికి వెళ్ళడానికి, రావడానికి ఒక రోజు పోయింది. ఊరిలో ఉన్నది ఒక్క పూట మాత్రమే. మనుషులను పలకరించడానికే సమయం సరిపోలేదు. ఇక పిచ్చుకలు ఉన్నాయా? లేవా? తిన్నాయా? పిచ్చుకలు పస్తులున్నాయా? అని పరిశోధించే అంత సమయం ఎక్కడుంటుంది” అని కాసింత వ్యంగ్యంగానే సమాధానం చెప్పాడు సురేష్.
రాజా పాపులర్ పత్రికలో పని చేసేప్పుడు పిచ్చుకల మీద ఆదివారం అనుబంధం కోసం కవర్ స్టోరీ రాశాడు. ఛైర్మన్ ఆ స్టోరీని మెచ్చుకున్నాడు. తాను పిచ్చుకల గురించి చాలా పరిశోధించి ఆ స్టోరీ రాశాను అని రాజా అడిగిన వారికి అడగని వారికి చెబుతుంటాడు. పిచ్చుకల స్టోరీ రాసి పదేళ్లు అవుతున్నా, పత్రిక మారినా, రాజా పిచ్చుకల మీద పరిశోధన ఆపలేదు. రాజాను ఎవరైనా పలకరిస్తే చాలు పిచ్చుకల గురించి మాట్లాడేస్తుంటాడు. అతన్ని అంతా పిచ్చుక అని పిలుస్తుంటారు.
‘పిచ్చుక ఇంకా ఆఫీస్‌కు రాలేదా? పిచ్చుక ఈ రోజు ఏం రాస్తున్నాడు?’ అని అతన్ని పిచ్చుక గానే పలకరిస్తారు. హైదరాబాద్ సిటీలో ఉన్నవారిని ‘మీ ఏరియాలో పిచ్చుకలు ఉన్నాయా?’ అని పలకరిస్తే జిల్లాల నుంచి వచ్చేవారిని ‘మీ ఊరిలో పిచ్చుకలు ఉన్నాయా?’ అని అడుగుతాడు.
కిషోర్ రాజాను ఆటపట్టించడానికి “నీకు మేనేజ్‌మెంట్ పిచ్చుకల అలవెన్స్ మంజూరు చేసిందట కదా” అని పలకరించాడు.
“ఐదేళ్ల నుంచి ప్రమోషన్ లేదు. ఇక పిచ్చుకల అలవెన్స్ కూడానా” అని రాజా నిరాశగా పలికాడు.
వీళ్లందరినీ చూసి మహేష్ బైక్ ఆపి వాళ్ళ దగ్గరకు వస్తూ ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు.
“మనం ఇరిగేషన్‌లో పదివేల కోట్లు తగ్గిద్దాం. అందులో నుంచి ఐదు వేల కోట్లు తగ్గించి, పెన్షన్‌కు వాడితే మీకే రెండు వేల కోట్లు మిగులుతాయి. ఏమీ కాదు నేను చెబుతున్నా కదా? 20 వేల కోట్లు అడ్జెస్ట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు” అంటూ మహేష్ ఇస్తున్న సలహాలను సురేష్ నవ్వుతూ వింటున్నాడు.
మొదటిసారి మహేష్ మాటలు విన్నవారికి పిచ్చెక్కి పోతుంది. వీడికి పిచ్చా. ఫుట్‍పాత్ మీద టీ తాగుతూ వేల కోట్ల రూపాయలను ఇలా తేలిగ్గా తీసి పారేస్తున్నాడు అనుకుంటారు. ఓ రోజు ఉడిపి హోటల్‌లో ఇలానే వేల కోట్ల ముచ్చటను గట్టిగట్టిగా మాట్లాడుతుంటే అక్కడ టిఫిన్ చేస్తున్నవారికి దిమ్మ తిరిగిపోయింది. ఫోన్‌లో మాట్లాడడం అయిపోయాక ‘అన్నా ఓ వంద రూపాయలు బదులు ఇవ్వు. జీతం రాగానే ఇచ్చేస్తా. రాత్రికి రూమ్‌కు వెళ్లేటప్పుడు చపాతీ తీసుకు వెళ్ళాలి. నేను ఇంటికి వెళ్లే టైమ్‌కు హోటల్స్ అన్ని మూసేస్తారు’ అని అడిగితే సురేష్ వందరూపాయలు బదులు ఇచ్చాడు. ఉడిపి హోటల్‌లో ప్రశాంతంగా టిఫిన్ చేద్దాం అని వచ్చినవారి ముఖాలు చూస్తే రాజా మాటలు వారికి పిచ్చెక్కించేట్టు ఉన్నాయని గ్రహించిన కిషోర్ “అతను రిపోర్టర్. ఫైనాన్స్ సెక్రెటరీతో బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాడు. వేల కోట్ల రూపాయల బడ్జెట్ గురించి మాట్లాడగలడు కానీ ఇంటికి వెళ్ళాక ఒంటరి జీవితం. తినడానికి ఏమైనా ఉండాలి కదా? అందుకే వందరూపాయలు బదులు అడిగాడు” అని తమ టేబుల్ లో తమ ఎదురుగా కూర్చున్న అతనికి వివరించి చెప్పాడు. చెప్పకపోతే వాడి బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోయి ఉండేది అనుకున్నాడు. సచివాలయంలో మన ఆఫీస్‌లో మాట్లాడినట్టు అలా గట్టిగా మాట్లాడకురా అని మహేష్‌కు ఎన్నిసార్లు చెప్పినా మార్చుకోలేదు.
ఫిల్టర్ లేకుండా నిజాయితీగా మాట్లాడడమే కాదు వృత్తి లోనూ అంత నిజాయితీగా ఉన్నాడు. అందుకే రాత్రి సాపాటుకు కూడా చేతులు చాపే పరిస్థితి.
“ఈసారైనా ప్రమోషన్‌లు వస్తాయంటావా?” సబ్ ఎడిటర్ గిరి కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నాడు. గిరి పని చేసే సమయం కన్నా ఆఫీస్‌లో చిట్టీల వ్యాపారానికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు.
తాను రాసిన బ్యానర్ ఐటమ్ గురించి ఎవరూ మాట్లాడక పోవడం సురేష్‌కు అసంతృప్తిగా ఉంది. ఆ మాట పైకే అన్నాడు. “బాగా పని చేసేవారిని కూడా మేనేజ్‌మెంట్ గుర్తించకపోతే పని చేయాలి అనే ఉత్సాహం ఎలా ఉంటుంది?” అని సురేష్ పలికితే కిషోర్ జోక్యం చేసుకొని “సురేష్ నువ్వు ఒక్కడివే కాదు. మన అందరం నిద్రలో తప్ప మిగిలిన సమయం అంతా పేపర్ గురించి, రాసే వార్తలు, రాయబోయే వార్తల గురించి ఆలోచిస్తాం. మరి మేనేజ్‌మెంట్ ఎంత సేపు ఆలోచిస్తుందో మీలో ఎవరికైనా తెలుసా?” అని అక్కడున్న అందరినీ అడిగాడు.
ఎవరూ చెప్పక పోవడంతో కిషోర్ తానే చెప్పాడు. “మన యజమానికి ఉన్న అనేక వ్యాపారాల్లో మీడియా ఒక చిన్న వ్యాపారం. పత్రిక గురించి రోజుకు గంట కూడా ఆలోచించడు. లాభసాటి వ్యాపారాలు ఎన్నో ఉండగా, పెద్దగా లాభం లేని వ్యాపారం గురించి ఆలోచించి సమయం ఎందుకు వృధా చేసుకుంటాడు? తెలివైన వ్యాపారి. తన సమయాన్ని లాభసాటి వ్యాపారం పై ఖర్చు చేస్తాడు. యజమానికే లేని దురద మనకుంది. అందుకే 24 గంటలు ఆలోచిస్తాం.” అని కిషోర్ చెబుతుంటే, రాజా ఓ కొత్త కుర్రాడిని పిచ్చుకల గురించి అడుగుతున్నాడు.
ఆ మాటలు విన్న కిషోర్ నవ్వి “మనం రాజాను పిచ్చుక అని ఎగతాళి చేస్తాం కానీ నిజానికి మనందరి జీవితాలు పిచ్చుక జీవితాలే. ఓనర్‌కు కోపం వచ్చినా, ఎడిటర్‍కు నచ్చక పోయినా మనల్ని పిచ్చుకల్లా నలిపేస్తారు. బయటి నుంచి చూసిన వారికి మన జీవితాలు అద్భుతం అనిపిస్తాయి. స్వేచ్ఛా పక్షుల్లా ఎక్కడికంటే అక్కడికి ఎగిరిపోతాం అనిపిస్తుంది. కానీ నిజం అదికాదు మనం పిచ్చుకలం. ఎవరికి కోపం వచ్చినా నలిపేస్తారు. బతుకు కోసం పంజరంలో బంధీ అయిన పిచ్చుకలం” అని కిషోర్ బాధగా చెబుతుంటే, ఎందుకో ఆ రోజు ఎవరికీ రాజాను పిచ్చుక అని ఎగతాళి చేయబుద్ది కాలేదు.
రాజా మాత్రం ఏమీ తెలియనట్టుగా తన పని తాను చేసుకుంటూ ఓ కొత్త కుర్రాడిని అడుగుతున్నాడు “మీ ఊరిలో పిచ్చుకలు ఉన్నాయా ?”.
నాలుగు దశాబ్దాల జర్నలిజం జీవితం. ఉదయంలో అక్షరాభ్యాసం. అనంతరం నాలుగు దశాబ్దాలు ఆంధ్రభూమిలో అక్షర సేద్యం. 1987లో ఆంధ్రభూమిలో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరక ముందు నుంచే భూమిలో బోలెడు వ్యాసాలు. 2017లో ఆంధ్రభూమి నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా రాయడం ఆపలేదు. ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో 20 ఏళ్ళ పాటు ‘జనాంతికం’ పేరుతో వారం వారం రాజకీయ పోకడలపై సెటైర్ కాలం. ఈ కాలంకు తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం లభించింది. ఆంధ్రభూమి మాసపత్రికలో ఐదేళ్ల పాటు ‘వర్తమానం’ కాలం. విద్యార్థిగా ఉన్నపుడు ఆంధ్రభూమితో ఏర్పడిన అనుబంధం కరోనా ఆంధ్రభూమిని మింగేయక ముందు వరకు కొనసాగింది. రిపోర్టర్‌గా ఉంటూ కాలం రాసిన వాళ్ళు అరుదు. 87లో ఆంధ్రభూమి విశాఖపట్నం ఎడిషన్‌లో కాళీపట్నం ఆధ్వర్యంలో ‘నేటి కథ’ అని రోజుకో కథ వచ్చేది. అక్కడే కథలు రాయడం మొదలు పెట్టి, అక్కడే ఆపేశాను. చాలా ఏళ్ళ తరువాత తిరిగి కథలు రాయాలి అని ఆసక్తి కలిగింది. 2017లో తెలంగాణ తొలి సమాచార హక్కు కమిషనర్ పదవి చేపట్టాను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలోని ఈ పదవివి ఐదేళ్ల పాటు విజయవంతంగా పూర్తి చేశాను. తిరిగి పూర్తి స్థాయి రాత పనిలో పడిపోయాను. రాసుకొని బతకడంలో ఓ తృప్తి ఉంటుంది.
పుట్టింది భువనగిరి జిల్లా మన్నెవారి తుర్కపల్లి. కనులు తెరిచింది, జీవిత కాలం మొత్తం గడిపింది/గడిపేది హైదరాబాద్ లోనే.. ఇద్దరు పిల్లలు, భార్య.. ఇదీ జీవితం.
