Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-17: దమ్మున్న ఓనర్ కమ్ ఎడిటర్

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్దా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

“ఎంతైనా దమ్మున్నోడు రా”

సెల్‌ఫోన్‌లో ఏదో ఛానల్ చూస్తూ ప్రశాంత్ నోటి నుంచి అప్రయత్నంగా వచ్చిన మాట.

ఆ మాట వినగానే కృష్ణ పెదవులపై చిన్నగా నవ్వు.

చాలా రోజుల తర్వాత కలిసిన కృష్ణ, ప్రశాంత్ ఇరానీ హోటల్‌లో టీ తాగుతూ రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. మూడు దశాబ్దాల క్రితం ఇద్దరూ ఒకేసారి జర్నలిజం లోకి వచ్చారు. ఆ ఇద్దరే కాదు, దమ్మున్నోడు అని ప్రశాంత్ మెచ్చుకుంటున్న ఆ నల్ల బాలు కూడా వీరి సమకాలికుడు. ఒక్కొక్కరిది ఒక్కో దారి అయింది.

“ఎందుకు నవ్వుతున్నావు? దమ్మున్నోడు కాదా?” అని ప్రశాంత్ అడిగాడు.

“అది కాదులే, ఏదో గుర్తుకు వచ్చి నవ్వాను” అని కృష్ణ నిజం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

“మూడు దశాబ్దాల క్రితం ముగ్గురి జీవితం ఒకటే. బతికే కాలాన్ని బట్టి చూస్తే సగం జీవితం. ఏదైనా సాధించే శక్తి సామర్థ్యాల కోణంలో మూడు దశాబ్దాలు అంటే పూర్తి జీవితం అన్నట్లు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడు! విజయం సాధించినట్లే కదా?” ప్రశాంత్ తన వాదన బలంగా వినిపించాడు.

“నేను కాదు అనలేదు కదా” అని కృష్ణ నెమ్మదిగా బదులిచ్చాడు.

“నువ్వు కాదు అనలేదు. కానీ నీ నవ్వులో అర్థం అదే కదా?” అని ప్రశాంత్ ఇది తేలేంత వరకు వదిలేది లేదు అన్నట్టు పట్టుపట్టాడు.

కృష్ణ జర్నలిస్ట్‌గా రిటైర్ అయ్యాడు. జర్నలిజంలో ఎదుగూ బొదుగూ లేదని ఎప్పుడో గ్రహించిన ప్రశాంత్, రెండు దశాబ్దాల క్రితం జర్నలిజం వదిలేసి దూరంగా వెళ్లి ఓ ఎన్జీవో స్థాపించి సంపదకు దగ్గరయ్యాడు. తమలాగే డొక్కు స్కూటర్‌పై తిరిగిన నల్ల బాలు, తాను పని చేసిన పత్రికకే ఓనర్. రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చురుకైన పాత్ర వహిస్తూ, బినామీ వ్యాపారాలు, ఛానల్స్‌లో క్షణం తీరిక లేని అద్దాల మేడ మీద జీవితం గడుపుతున్నాడు.

“నల్లబాలు బాగ్ లింగంపల్లిలో ఉండేవాడు. తెలుగు ధర్మం పార్టీ నాయకుడు నెల నెల ఇంటి ఖర్చులకు కవర్ పంపితే కానీ గడవదు. అక్కడి నుంచే నల్ల బాలులో కసి పెరిగింది. ఎలాగైనా బోలెడు సంపాదించాలి అనుకున్నాడు. పాలకులకు దగ్గరయ్యాడు అనడం కంటే, తనకు దగ్గరైన వారు పాలకులు అయ్యారు అనడం సరైన మాట. నచ్చిన పార్టీని, నాయకుడిని ఆకాశానికెత్తడం, నచ్చని పార్టీ పైన, నాయకుడిపైన బురద జల్లడంలో ఎక్కడ లేని దమ్ము చూపించేవాడు. కాలం కలిసి వచ్చింది. దేవుడిగా పూజలు అందుకున్న నట నాయకుడు అవమానకరంగా గద్దె దిగి చంద్రగిరి సీఎం కావడంతో నల్లబాలు పట్టిందల్లా బంగారం అయింది. రిపోర్టర్ నుంచి ఓనర్ కమ్ ఎడిటర్ అయ్యాడు. నల్లబాలు దమ్మున్న జర్నలిస్ట్, ఏం చేసైనా అలా ఎదగాలి అనుకునేవాళ్లు కొందరైతే.. అది జర్నలిజం కాదు ఇంకేదో అని తిట్టేవాళ్ళు కొందరు. ఎవరేమనుకున్నా నల్లబాలు భవనం అంతస్తులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నల్లబాలు గురించి ఈ సంగతులు అందరికీ తెలిసినవే. చేతకాని వాడు నీతులు చెబుతాడు, దమ్మున్నవాడు నల్లబాలు లా ఎదుగుతాడు” అని ప్రశాంత్, కృష్ణను రెచ్చగొట్టినట్టు పలికాడు.

“ఎవరి అభిప్రాయం వారిది” అని కృష్ణ కూల్‌గా పలికాడు.

“మొదట నువ్వు ఎందుకు నవ్వావో అది చెప్పు?” అని ప్రశాంత్ అడిగాడు.

నవ్వుకు కారణం చెప్పేంత వరకు వదిలేలా లేడు అనుకున్న కృష్ణ, తాను ఉద్యోగంలో చేరిన మొదటి నెలలోనే నేర్చుకున్న గొప్ప జీవిత సత్యాన్ని చెప్పాడు. కృష్ణ ఒక్కసారిగా మూడు దశాబ్దాల క్రితం నాటి జీవితానికి వెళ్లాడు.

జూబ్లీ బస్సు డిపోకు వెళ్లే సరికి సంగారెడ్డికి వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. కృష్ణ వెళ్లి కూర్చున్నాడు. పేరుకు జిల్లా కేంద్రం అయినా సాయంత్రం అయితే ఎవరూ ఉండరు. ప్రయాణం రోజూ సిటీకి వచ్చి వెళ్లే ఉద్యోగులే ఎక్కువ. ఉద్యోగంలో చేరిన కొత్తలో తానూ అదే పని చేశాడు.

కొద్ది సేపటికే పావలా శ్యామలలా ఉన్న బక్కపల్చటి మహిళ తన కూతురుతో కలిసి బస్సు ఎక్కింది. “దొంగలు నా డబ్బు కొట్టేశారు, సంగారెడ్డికి రావడానికి డబ్బులు కూడా లేవు” అని బస్సులో ప్రయాణికులకు తన కథ దీనంగా చెబుతూ డబ్బులు అడుగుతోంది. చాలా కొద్ది మంది స్పందించారు.

తన వద్దకు రాగానే కృష్ణ “ఇలా అడుక్కోవడానికి సిగ్గుగా లేదా? ప్రతి రోజు వస్తున్నావు, ఇదే కథ చెబుతున్నావు” అని నిలదీశాడు. బస్సులో ఉన్న వాళ్ళు ఎక్కువగా సంగారెడ్డికి రోజూ ఇదే సమయానికి ఆఫీస్‌కు వెళ్లి వచ్చేవాళ్ళు. ఆమె కథ అందరూ విన్నదే. అబద్ధం చెబుతుంది అని అందరికీ తెలుసు, కానీ ఎవరూ పట్టించుకోలేదు.

కృష్ణ ఆమె బండారాన్ని బయటపెట్టానని సంబరపడుతుంటే, ఆ బక్కపల్చటి మధ్యవయసు మహిళ గట్టిగా అరుస్తూ “నేను అబద్ధం చెబుతున్నానా?” అని నిలదీసింది.

“ఔను, ఈ బస్సులో ఉన్న అందరికీ తెలుసు. రోజూ వస్తావు, ఇదే కథ చెబుతావు” అని కృష్ణ నెమ్మదిగా అన్నాడు.

“నా మాట అబద్ధం అనుకుంటే సంగారెడ్డికి నాకు మీరే టికెట్ తీసుకోండి. ఇక్కడే కూర్చుంటా!” అని గట్టిగా అరుస్తూ ఆమె బైఠాయించడంతో కృష్ణకు మొదటిసారి భయం వేసింది.

బస్సులో అందరికీ ఆమె గురించి తెలిసినా ఒక్కరూ కృష్ణకు మద్దతుగా మాట్లాడలేదు. అందరూ తనవైపే చూస్తుండడంతో కృష్ణకు అవమానంగా అనిపించింది. ఇంకాసేపు ఉంటే ఆ మహిళ తనపై దాడి చేసేట్టు ఉందని అనుకుని, సిగ్గుతో తలదించుకుని బస్సు నుంచి దిగిపోయాడు. ఆమెను రోజూ చూస్తున్న కండక్టర్ బస్సు దిగుతున్న కృష్ణను చూస్తూ “కొన్ని చూసీ చూడనట్టు వదిలేయాలి సార్” అని నవ్వాడు. బస్సు దిగుతున్న తనను ఆమె ఇంకా గట్టిగట్టిగా ఏవేవో తిడుతూనే ఉంది. ఇది ఎవరైనా చూస్తే తాను తప్పు పని చేస్తే ఆమె తనను పట్టుకున్నట్టుగా ఉంది.

“అబద్ధం చెబుతూ మోసం చేస్తున్న ఆమె గట్టిగా అరుస్తుంటే, ఆమె అబద్ధాన్ని బయటపెట్టిన నేను సిగ్గుతో బస్సు దిగిపోయాను. మా ఇద్దరిలో దమ్మున్నది ఆమెకే కదా?” అని కృష్ణ అడిగాడు.

కృష్ణ ఎటువైపు తీసుకువెళుతున్నాడో ప్రశాంత్‌కు అర్థమవుతోంది. ప్రశాంత్ తల ఊపాడు.

“రోడ్డు మీద అర్ధరాత్రి తప్పుడు పని చేస్తూ దొరికిపోయే వాళ్లు కూడా ‘మా గురించి ఏమనుకుంటున్నావు?’ అని పోలీసుల మీదికి తిరగబడగలరు. అంతటి దమ్ము సామాన్య మహిళలు ఎవరిలోనూ కనిపించదు. తల్లితండ్రుల సంరక్షణలో పెరిగిన పిల్లల కన్నా.. రోడ్డు మీద కాగితాలు ఏరుకుని, మద్యం తాగుతూ, రోడ్డు మీదే బతికే పిల్లల్లో ఎక్కువ ధైర్యం ఉంటుంది. దేన్నయినా ఎదుర్కొనే దమ్ము ఉంటుంది” కృష్ణ చెబుతుంటే ప్రశాంత్‌కు ‘నిజమే’ అనిపించింది.

“ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని గాడిలో పెట్టిన మేధావి రాసిన పుస్తకాలు ప్రపంచ ప్రఖ్యాత అమెరికా యూనివర్సిటీలో సిలబస్‌గా పెట్టారు. మనం అతన్ని మౌనముని అని రాశాం. ఏం చదివాడో తెలియని వారిని ‘దమ్మున్న నాయకుడు’ అని పూజిస్తాం. చదువుకున్నవాళ్లు, జ్ఞానులు, విచక్షణా జ్ఞానం ఉన్నవాళ్లు మౌనంగా ఉంటారు. బుర్రలో ఏమీ లేనివాళ్లు గట్టిగట్టిగా అరుస్తారు. అలా అరిచేవాళ్లను ‘దమ్మున్నవాళ్లు’ అని, మౌనంగా ఉన్నవాళ్లను ‘ముద్దపప్పు’ అని ముద్ర వేస్తాం” అని కృష్ణ చెప్పాడు.

“అంటే నల్లబాలుకు దమ్ములేదా?” అని ప్రశాంత్ అడిగాడు.

“ఆ మాట నేనెక్కడ అన్నాను? పాకిస్థాన్ కసబ్ ముంబైలో దాడులు జరిపి ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటే, ‘ధైర్యం అంటే అది’ అని ఓ ఇండియన్ పోలీస్ అధికారి పోలీసుల శిక్షణలోనే చెప్పిన వివాదం నీకు తెలుసు కదా? తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు కూడా ఉంటాడు అన్నట్టు దమ్మున్న మీడియాను వెనక్కి నెట్టి యూ ట్యూబ్ ఛానల్స్ అంత కన్నా ఎక్కువ బూతు మాటలు.. అదే నల్లబాలు కన్నా ఎక్కువ దమ్మును చూపిస్తున్నాయి. విడిచిపెట్టడానికే కాదు.. విలువలకు కట్టుబడి ఉండడానికి కూడా దమ్ముండాలి!” కృష్ణ తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు.

“అంటే జర్నలిజంలో చస్తూ బతకడం నా వల్ల కాక, ఎన్జీవోతో నాలుగు డబ్బులు వెనకేసుకున్న నాది కూడా తప్పంటావా?” అని ప్రశాంత్ అడిగాడు.

“నేను ఎవరిదీ తప్పు అనడం లేదు, కరెక్ట్ అనడం లేదు. ‘లక్ష్యమే కాదు, దానికి అనుసరించే మార్గం కూడా ముఖ్యం’ అని మహాత్ముడు చెబితే.. ‘మార్గం ఏదైనా సరే, లక్ష్యం ముఖ్యం’ అని కొందరు మొత్తం సమాజాన్ని ఆ మార్గానికి తీసుకువెళుతూ, తమను తాము ‘దమ్మున్న నీతిమంతులం’ అని చెప్పుకోవడాన్ని చూస్తే నవ్వు వస్తుంది.”

“గాంధీజీ చెప్పిన సమాజం వస్తుంది అని కలలు కంటున్నావా?”

“కృత్రిమ మేధ (AI) విజృంభణతో మానవ సమాజమే అంతరిస్తుందట. ఏమో, అలా అంతరించాక మంచి సమాజం వస్తుందేమో” అని కృష్ణ నవ్వాడు.

“మనుషులను మేనేజ్ చేసినప్పుడు AI ని మేనేజ్ చేసే దమ్మున్నోళ్ళు రారు అని ఎందుకు అనుకుంటున్నావు?” అని ప్రశాంత్ అడిగాడు.

ఊహించని ప్రశ్న రావడంతో కృష్ణ మౌనంగా ఉండిపోయాడు.

“నల్లబాలు మన లోకల్ దమ్మున్నోడు. AI ని గుప్పిట్లో పెట్టుకునే ఇంటర్నేషనల్ దమ్మున్నవాడు వస్తాడు. లోకంలో జీవులు ఉన్నంత వరకు దమ్మున్నోళ్ళు ఉంటారు” అని ప్రశాంత్ ధీమాగా చెప్పాడు.

Exit mobile version