Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-18: ఏఐ స్కైలాబ్

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్దా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

‘ఏఐ ఐటీ రంగాన్ని సంక్షోభంలో నెడుతోంది. పలు ఐటీ కంపెనీలు వేల మంది ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. మనుషులు చేసే పనులు ఏఐ చేయడం వల్ల వర్క్ ఫోర్స్‌ను తగ్గించక తప్పడం లేదు అని ఐటీ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. ఆరు నెలల కాలంలో సుమారు.. వేలమంది’ అని టివిలో వార్తలు వస్తుంటే,

ప్రతాప్ ఇంట్లోకి అడుగుపెడుతూనే చిరాగ్గా టీవీ ఆఫ్ చేశాడు.

అప్పటి వరకు టీవీలో వార్తలు వింటున్న నిరంజన్ కొడుకు ముఖంలోకి చూసి మౌనంగా ఉండిపోయాడు.

‘అంత దురుసుగా ప్రవర్తించాల్సింది కాదు’ అని మనసులోనే అనుకుని ప్రతాప్, “నాన్నా టీవీలో అన్నీ నెగిటివ్ న్యూస్‌లే వస్తాయి. వారికి టీఆర్పీ రేటింగ్ ముఖ్యం. దీనికోసం ఎంతకైనా తెగిస్తారు. 30 ఏళ్ళు జర్నలిస్ట్‌గా రోజంతా ఇంతకాలం వార్తల్లోనే గడిపారు కదా? రిటైర్ అయ్యారు. హాయిగా మీకు నచ్చిన సాహిత్యం చదువుకోండి. మిత్రులను కలవండి, యాత్రలకు వెళ్ళండి. ఇంకా ఆ నెగిటివ్ వార్తలు ప్రపంచం ఎందుకు నాన్నా” అని మెల్లగా చెప్పాడు.

“టివీల్లోనే కాదు మై సన్, మా కాలంలో పేపర్లు కూడా ఇదే పని చేశాయి. నువ్వు పుట్టలేదు. నేను చదువుకునే రోజుల్లో స్కైలాబ్ పడుతుంది, మనుషులంతా అంతరించి పోతారు – అని రోజూ ప్రజలను భయపెడుతూ వార్తలు ప్రచురించేవి.” అని నిరంజన్ చెబితే,

ప్రతాప్ మధ్యలో జోక్యం చేసుకుని “అలాంటి వార్తలను ప్రజలు నమ్మేవారా?” అని అడిగాడు.

“ఆ రోజుల్లో మీడియాలో వార్తలు అంటే అన్నీ నిజాలే అనుకునే రోజులు” అని నిరంజన్ నవ్వాడు.

“మనుషులు ఉండనప్పుడు ఈ గొర్లు బర్లు ఎందుకు అని అమ్ముకొని జల్సా చేసిన అమాయకులు కూడా ఉన్నారు. వారి అమాయకత్వం కూడా వీరికి వ్యాపార వస్తువు అయింది. స్కైలాబ్ నీటిలో పడి గుట్టుచప్పుడు లేకుండా మునిగిపోయింది. కానీ వాళ్ళ పత్రిక సర్క్యులేషన్ స్కైలాబ్ వార్తలతో రాకెట్‌లా దూసుకెళ్లింది” అని నిరంజన్ తన చిన్ననాటి విషయాలు గుర్తుకు చేసుకున్నాడు.

“అంటే న్యూస్ ఇప్పుడే కాదు ఎప్పుడో అమ్మకపు వస్తువు అన్నమాట” అని ప్రతాప్ అడిగాడు.

“ఆ కాలం కొంత నయం. వార్తలు రాసిన తర్వాత పత్రికలు అమ్మేవారు. ఇప్పుడు బేరం కూర్చుకున్న తర్వాత పత్రిక ప్రచురిస్తారు. పత్రికలే కాదు. టీవీలు సైతం అంతే. అప్పట్లో పత్రిక అంటే సంపాదకుడు ఎవరు? అని అడిగేవారు. ఇప్పుడు ఏ పార్టీ అని అడుగుతారు.” అని నిరంజన్ గట్టిగా నవ్వాడు.

“కాలాన్ని బట్టి అన్నీ వ్యాపారంగా మారినప్పుడు మీడియా మాత్రం మడికట్టుకుని ఎందుకు ఉంటుంది” అని ప్రతాప్ తండ్రి మాటలను సమర్థించాడు.

వంటగది నుంచి వీరి మాటలు వింటున్న సుభద్ర మధ్యలో జోక్యం చేసుకుని,

“వినేవాడు ఉండాలి కానీ మీ నాన్న తన ఉద్యోగం గురించి బుర్ర కథ చెప్పినట్టు గంటల తరబడి చెబుతాడు. పెళ్లయినప్పటి నుంచి వీసమెత్తు బంగారం కొనలేదు. పైగా పెళ్ళిలో మీ తాత పెట్టిన బంగారం కూడా అమ్ముకున్నాడు. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. ‘ఆ సీఎంను ఇలా కడిగేశాను’. ‘ఈ కేంద్ర మంత్రి నేనంటే వణికిపోయాడు’ అని కథలు చెబుతాడు. కానీ గ్యాస్ అయిపొయింది. మీ పలుకుబడితో ఓ గ్యాస్ సిలెండర్ సంపాదించండి అంటే చేతులెత్తేస్తాడు” అని దెప్పి పొడిచింది.

నిరంజన్ రిటైర్ అయి నెల రోజులు అవుతుంది. ఒకటి రెండు నెలలు విశ్రాంతి తీసుకోని తిరిగి ఉద్యోగంలో చేరాలి అతని కోరిక. అదే విషయం చెబితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు.

“నాకు తెలుసు. నన్ను నెల రోజులు కూడా నువ్వు భరించలేక పోతున్నావు. వచ్చే నెల నుంచి మళ్ళీ ఉద్యోగంలో చేరుతున్నాను. ఆఫీస్‌లో మాట్లాడాను, రమ్మన్నారు. ఈ రోజుల్లో రాసేవాడు ఎవరున్నారు. వెళతాను” అని నిరంజన్ అందరికీ వినబడేట్టు చెప్పాడు.

“ఇప్పుడు నేనేమన్నాను. వెళితే వెళ్ళండి. ఎవరిని భయపెడుతున్నారు.” అని సుభద్ర ఘాటుగా జవాబు ఇచ్చింది.

“మీ గొడవలు ఎప్పుడు ఉండేవే” అనుకుంటూ ప్రతాప్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ప్రతాప్ ఇంట్లోకి అడుగుపెడుతూనే చిరాకుగా టీవీ న్యూస్ ఎందుకు ఆఫ్ చేశాడో నిరంజన్ అర్థం చేసుకున్నాడు. ఆ విషయం ఏమీ ప్రస్తావించకుండా భార్య కీచులాడుతున్నట్టు వాతావరణం తనకు తానే సృష్టించాడు. తన ఉద్దేశం భార్యకు తెలియదు. కుమారుడికి తెలియదు.ఇంటి పెద్దగా తానే ధైర్యం కోల్పోతే ఇంట్లో వాళ్ళు ఏమవుతారు అనుకున్నాడు.

ఇంట్లోకి అడుగుపెట్టగానే ఎప్పుడూ లేనట్టుగా తన కుమారుడి ముఖంలో భావాలను నిరంజన్ పసిగట్టాడు.

సరిగ్గా మూడు దశాబ్దాల క్రితం ఇదే భావాలను కొందరి ముఖాల్లో ఆసక్తిగా చూశాడు. ఇప్పుడు అవే భావాలు తన కుమారుడి ముఖంలో చూసి తట్టుకోలేక పోయాడు.

మూడు దశాబ్దాల క్రితం నాటి ఆ దృశ్యం నిరంజన్‌కు ఇప్పటికీ బాగా గుర్తుంది.

***

టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ ఆఫీస్‌లో ఒక్కో సెక్షన్ తన కళ్ళ ముందే మాయం అవడాన్ని నిరంజన్ ఆసక్తిగా చూశాడు. తాను ‘ఆంధ్ర నేల’ పత్రికలో చేరిన కొత్తలో వార్తలు పేపర్ మీద ప్రింట్ చేయడానికి సీసంతో తయారు చేసిన అక్షరాలు ఒక్కొక్కటి పేర్చేవారు. ఇలా హ్యాండ్ కంపోజింగ్ చేసే కంపోజిటర్‌లపై తొలి వేటు పడింది. తర్వాత డిటిపి వచ్చింది. ఆ రోజు చూసిన దృశ్యాన్ని నిరంజన్ గుర్తు చేసుకున్నాడు. వార్తలు కంపోజ్ చేసి, బ్రోమైడ్‌లను కత్తిరించి న్యూస్ పేపర్ సైజులో పేస్ట్ అప్ చేసేవారు. పత్రిక 12 పేజీలు అయితే ఇలా అన్ని పేజీలు పేస్ట్ చేయాలి. డజన్ల కొద్ది పేస్టర్‌లతో ఆఫీస్ సందడిగా ఉండేది. పేరుకు వాళ్ళు కార్మికులే అయినా ఎడిటర్ కన్నా ఎక్కువ అధికారం చలాయించేవాళ్ళు. వార్తను నచ్చినట్టు కట్ చేసేవాళ్ళు. న్యూస్ ఎడిటర్ పక్కన నిలబడి సూచనలు ఇస్తే మూడ్ బాగుంటే పట్టించుకునే వాళ్ళు. కత్తెర వేస్తాడు అని అంతా గౌరవించేవారు. అసలే పేస్టర్‌లు, వీరిలో కొందరు కార్మిక నాయకులు కూడా. వారి పవర్ చూసి తీరాల్సిందే. ఓ రోజు సచివాలయం నుంచి ఆఫీస్‌కు రాగానే అందరూ కంప్యూటర్ ముందు చేరి ఆసక్తిగా గమనిస్తున్నారు.

“ఏం జరిగింది?” అని పేస్టర్‌ను అడిగితే “ఇక మా అవసరం ఉండదు సార్.. ఈ రోజు నుంచి పేజీ మేకప్ కంప్యూటర్ లోనే చేస్తారు. ఇంజనీర్లు సబ్ ఎడిటర్‌లకు ట్రైనింగ్ ఇస్తున్నారు” అని పేస్టర్ గద్గద స్వరంతో పలికాడు.

“మరి మీ ఉద్యోగాలు” అని నిరంజన్ అడిగితే..

“మీ ఉద్యోగాలు తీసేయం. మీకు ఏ పని వస్తే అది చేయవచ్చు అని మేనేజ్ మెంట్ చెప్పింది. మీలా మేం రాతగాళ్ళం కాదు. ఆఫీస్ బాయ్ పని తప్ప మాకు ఇంకేం పని వస్తుంది సార్” అని పేస్టర్ దీనంగా పలికాడు. దాదాపు పాతిక మంది పేస్టర్‌లు కంప్యూటర్ వద్ద గుమికూడి ఆసక్తిగా చూస్తున్నారు. మేనేజ్‌మెంట్‌కు, ఎడిటర్‌కు కూడా భయపడని ఆ పేస్టర్‌లను ప్రాణం లేని కంప్యూటర్ బతుకు భయాన్ని చూపిస్తోంది. పని చేయకుండా ఎంత కాలం జీతం ఇస్తారు. ఉద్యోగం పోతే కుటుంబం ఏమవుతుంది. చదువుకుంటున్న పిల్లలు, తన కోసం ఎదురు చూసే భార్య వీరందరి గురించిన ఆలోచనలు ఆ పేస్టర్‌ల ముఖంలో ఆందోళనల రూపంలో కనిపిస్తున్నాయి.

ప్రపంచం తలక్రిందులు అయినా రాసే పనికి ప్రత్యామ్నాయం లేదు. నా పనికి డోకా లేదు అని నిశ్చింతగా అందరి ముఖాల్లోని ఆందోళనలను నిరంజన్ ఆసక్తిగా గమనిస్తున్నాడు. వీళ్లకు ఎంత పొగరు ఉండేది అనుకున్నాడు. మూడు దశాబ్దాల తర్వాత కూడా ఆ దృశ్యం తనకు ఇంకా గుర్తుంది. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్నా కొద్ది పత్రిక ఆఫీస్‌లో ఒక్కో సెక్షన్ ఎగిరిపోయింది. అక్షర దోషాలు సవరించే ఫ్రూఫ్ రీడర్లు పోయారు. పత్రికలు చదివే రీడర్స్ తగ్గారు. సెక్షన్ పోవడం అంటే కొన్ని కుటుంబాలు సుడిగుండంలో పడడం.

ప్రతాప్ ఇంట్లోకి ఆందోళనగా వచ్చి, టీవీ న్యూస్ ఎందుకు ఆఫ్ చేశాడో ప్రతాప్ గమనించినప్పటికీ, గమనించనట్టే ఉండిపోయాడు. మూడు దశాబ్దాల క్రితం పత్రిక ఆఫీస్‌లో ఆ పేస్టర్‌ల ముఖం లోని ఆందోళనే ఇప్పుడు ప్రతాప్ ముఖంలో కనిపించింది . ప్రతాప్ ఐటీ కంపెనీలో ఐదేళ్ల నుంచి పని చేస్తున్నాడు. తాను రిటైర్ అయినప్పుడు ఎంత జీతమో తన కొడుక్కు ఉద్యోగంలో చేరిన మొదటి నెలలోనే అంత జీతం అని మిత్రులకు గర్వంగా చెప్పుకుంటాడు. హాయిగా గడిచిపోతున్న వాడి జీవితంలో ఏఐ అనే స్కైలాబ్ అల్లకల్లోలంగా మార్చింది. ప్రతినెల ఆఫీస్‌లో ఏదో ఒక బ్యాచ్ ఉద్యోగం పోతోంది. బకాసురునికి రోజుకో మనిషిని ఆహారంగా పంపినట్టు, ఏఐకి రోజుకో బ్యాచ్ బలి అవుతోంది. తన వంతు వస్తుందేమో అనే భయం ప్రతాప్‌కు కంటికి కునుకు లేకుండా చేసింది. ‘ఈ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు మూడు దశాబ్దాల క్రితమే తెలుసు’ అనుకున్నాడు నిరంజన్.

కొడుకు గదిలోకి వెళ్లి “ఎప్పుడూ పనితో బిజీగా ఉండే నాకు ఇంట్లో ఏమీ తోచడం లేదు. రేపటి నుంచి మళ్ళీ ఆఫీస్‌కు వెళుతున్నాను” అని నిరంజన్ చెబితే,

ప్రతాప్ “నీ ఇష్టం నాన్నా” అన్నాడు.

ఆ ముఖంలో ప్రశాంతత నిరంజన్ గమనించక పోలేదు.

‘స్కైలాబ్ ఎక్కడ పడుతుందో అక్కడి వాళ్ళ జీవితం అంతం అవుతుంది అని చిన్నప్పుడు భయపడ్డాం. ఇప్పుడు ఏఐ అనే స్కైలాబ్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఐటీ మీదనే ఆధారపడ్డ యువతకు కంటికి కునుకు లేకుండా చేస్తోంది’ అనుకున్నాడు నిరంజన్. కుటుంబ భారం మొత్తం కొడుకు మీద ఉంటే తట్టుకోలేడు. అందుకే నిరంజన్ మళ్ళీ ఉద్యోగానికి సిద్ధం అయ్యాడు. తనతో వేగలేక మళ్ళీ ఉద్యోగానికి వెళుతున్నాడు అని భార్య అనుకుంటోంది. కాలక్షేపం కావడం లేదని వెళుతున్నాడు అని కుమారుడు అనుకుంటున్నాడు. కుటుంబానికి చివరి వరకు తానే మూలస్తంభంగా ఉండాలని, ఏఐ స్కైలాబ్‌ను కుటుంబం ఉమ్మడిగా ఎదుర్కోవాలని తాను మళ్ళీ ఉద్యోగానికి వెళుతున్న సంగతి నిరంజన్‌కు మాత్రమే తెలుసు.

కుటుంబ వ్యవస్థ ఎలాంటి సంక్షోభాన్నయినా ఎదుర్కొంటుంది అని నిరంజన్ నమ్మకం.

Exit mobile version