[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్దా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]
“రాజుగారి ఉంపుడుకత్తె పనిమనిషి కూడా, సైన్యాధ్యక్షుడిని మించి అధికారం చెలాయిస్తుంది అంటే ఆ రాజ్యం పతనం వైపు పయనిస్తున్నట్టు”.
ఆ రోజు విశ్వం చెప్పిన ఈ మాటలు ఇంకా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. బ్యాంకులను వేల కోట్లు ముంచిన ప్రముఖ దినపత్రిక యజమాని అరెస్ట్ అనే వార్త చూడగానే ఆనాటి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆనాటి దృశ్యం తన కళ్ళ ముందు మెదులుతోంది.
సాయంత్రం రిపోర్టర్లు ఒక్కొక్కరు ఆఫీస్‌కు చేరుకుంటున్నారు. అద్దాల క్యాబిన్‌లో ఎవరేం చేస్తున్నారో అందరికీ కనిపిస్తుంటుంది. రిపోర్టర్ విశ్వం కంప్యూటర్‌పై సీరియస్‌గా వార్త కంపోజ్ చేస్తుంటే కొద్దిసేపటికే బయటి నుంచి అద్దాల క్యాబిన్‌ను బాబాయ్ చేతితో మెల్లగా తట్టాడు. అతని అసలు పేరు కన్నా బాబాయ్ గానే ప్రఖ్యాతి. అదే సంస్థలో ఇంగ్లీష్ పేపర్ రిపోర్టర్. విశ్వం వెనక్కి చూసి, బయటకు వెళ్లి బాబాయ్‌తో కాసేపు మాట్లాడి వచ్చాడు.
నేను ఈ ఆఫీస్‌కు కొత్త. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ రెండు మూడు దశాబ్దాల నుంచి పని చేస్తున్నవాళ్లు. విశ్వం వార్త కంపోజ్ చేయడం ముగిశాక టీ తాగడానికి లేస్తే, నేనే చనువుగా భుజం మీద చేయి వేసి, “టీ కి వెళ్దాం వస్తావా?” అని అడిగాను.
స్వర్గానికి వెళుతున్నా, విశ్వంను టీకి వెళ్దాం అంటే రెడీ అవుతాడు అని ఆఫీస్‌లో జోక్.
ఇద్దరం కలిసి ఆఫీస్ బయట టీ తాగడానికి వెళుతున్నాం. టీ తాగి ఆఫీస్ లోకి వస్తుండగా
“విశ్వం, నువ్వు ఏమీ అనుకోవద్దు ఓ మాట అడుగుతాను” అని నేనే చర్చ మొదలుపెట్టాను.
విశ్వం సమాధానం చెప్పక ముందే నా అనుమానాన్ని అడిగాను. “ఆఫీస్‌లో నువ్వు అందరికన్నా సీనియర్‌వి. నీ తర్వాత ఆఫీస్‌కు వచ్చిన బాబాయ్ క్యాబిన్ అద్దాలు తట్టి పిలవగానే బయటకు వెళ్లి ఆ రోజు వార్తలు చెప్పావు. ఇలానే నువ్వు అతని బ్యూరోకు వెళ్లి అద్దాల క్యాబిన్ మీద తట్టి వార్తలు తీసుకోగలవా” అని అడిగాను.
అప్పటికి ఆఫీస్ లోకి చేరుకున్నాం. ఆఫీస్ ప్రారంభంలో ఎడిటర్, రిపోర్టర్‌ల ఛాంబర్ ఉంటే చివరలో వాష్‌రూమ్ ఉంటుంది. వాష్‌రూమ్‌కు వెళ్లే దారి పక్కన ఓ కుర్రాడు నిలబడి ఆఫీస్‌లో అందరినీ ఆసక్తిగా చూస్తున్నాడు. నా ప్రశ్నను ఆసక్తిగా విన్న విశ్వం నవ్వుతూ ఆ కుర్రాడిని చూపించి “అతను తెలుసా? మన వాష్‌రూమ్ కడిగే బాయ్. బాబాయ్ సంగతి తర్వాత, వాష్‌రూమ్ కడిగేవాడు కూడా న్యూస్ ఎడిటర్ అయిన నీ మీద అధికారం చలాయించగలడు. ఎందుకంటే మన ఆఫీస్‌లో ఇద్దరు పవర్‌ఫుల్ వ్యక్తులు ఎడిటర్, సిఇఓ. వాళ్ళ ఇద్దరి ఇంట్లో వీడు టాయిలెట్‌లు కడుగుతాడు. అదీ వాడి బలం. మనం ఏమైనా అంటే నేరుగా వెళ్లి వారికి చెబుతాడు. రాజుగారి ఉంపుడుకత్తె పనిమనిషి కూడా సైన్యాధ్యక్షుడిని మించి అధికారం చెలాయిస్తోంది అంటే ఆ రాజ్యం పతనం వైపు పయనిస్తున్నట్టు. మౌనంగా ఉంటే రాజ్యంతో పాటు మనం పోతాం. తప్పు ఎత్తి చూపితే ఇప్పుడే పోతాం. ఇప్పుడే పోవడం మంచిదా? కొద్ది రోజులు నీడ పట్టున ఉండడం మంచిదా? రెండింటిలో ఏది బెటర్” విశ్వం చెప్పిన ఆ మాటలతో నాకు దిమ్మతిరిగిపోయింది.
‘ఏం జరుగుతుందో ఆఫీస్ లో అందరికీ తెలుసన్నమాట.ఎవరి డ్రామా వాళ్ళు ఆడుతున్నారు’ అనుకుని నా పనిలో నేను పడిపోయాను.
ఇంతలో బక్క పలుచని, తైల సంస్కారంతో పాటు డ్రెస్ సంస్కారం కూడా లేని యువకుడు వస్తుంటే అప్పటి వరకు ఎవరి మీదనో జోకులు వేస్తున్న డెస్క్ ఇంచార్జ్ , సిటీ ఇంచార్జ్ మౌనంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. విశ్వం నా వైపు చూసి గట్టిగా నవ్వి దగ్గరకు వచ్చి “అన్నా మీరు న్యూస్ ఎడిటర్, మీ పక్కన ఉన్నది డెస్క్ ఇంచార్జ్. ఎడిటర్ తర్వాత రాంక్ మీది. ఆఫ్ట్రాల్ చిక్కడపల్లి ఏరియా స్ట్రింగర్ వస్తుంటే అప్పటి వరకు జోకులు వేసుకున్న మీరు మాట్లాడడం మానేశారు. ఏంటి కథ” అని విశ్వం అడిగితే, ఏమో అన్నట్టు ముఖం పెట్టి నేను సమాధానం చెప్పలేదు.
“వాడు పొద్దున్నే ఎడిటర్ ఇంట్లో పనిమనిషి పనులన్నీ చేసి వస్తాడు. సాయంత్రం ఆఫీస్ నుంచి వెళ్ళాక, ఎడిటర్ ఇంటి పనులు చేయడమే కాకుండా ఆఫీస్‌లో ఎవరేం మాట్లాడుకుంటున్నారో చెబుతాడు. అందుకే అప్పటి వరకు మాట్లాడుకుంటున్న మీరు వాడు రాగానే మౌనదీక్ష లోకి వెళ్లారు. ఇవన్నీ రాజ్యం బలహీనపడుతున్న లక్షణాలు, కోట గోడలు కూలిపోతున్న సంకేతాలు” అంటూ విశ్వం తన పనిలో తాను మునిగిపోయాడు.
***
ఓ రోజు చిక్కడపల్లి ఏరియా స్ట్రింగర్ ఓ వార్త తెచ్చి జనరల్ పేజీలో వేయమని కోరితే అవకాశం దొరికింది కదా అని మాట కలిపాను. “ఏంటీ ఆఫీస్‌లో ఇంత అధికారం చెలాయిస్తావు” అని అడిగాను.
వాడు ఏ మాత్రం మొహమాటపడకుండా “సార్ పొద్దున్నే ఎడిటర్ ఇంటికి వెళతాను. సార్‌ను దేవుడిలా చూస్తా. భక్తుడిలా ఇంట్లో పనులన్నీ చేస్తాను. ఆఫీస్‌లో అందరి గురించి పూజారిలా దేవుడికి చెబుతా. మీ అందరికీ భయపడుతూ పని చేయడం కన్నా ఒక్కరి కాళ్లు మొక్కి ఆఫీస్‌లో అందరినీ భయపెట్టడం మంచిది కదా? మీతో సహా అందరి గురించి ఎడిటర్‌కు చెప్పేది నేనే” అంటూ వెళ్ళిపోయాడు.
‘అతి తెలివి’ అని మనసులోనే అనుకున్నాను.
వాడి గురించి మర్చిపోయాను. ఆఫీస్‌లో కూడా కనిపించలేదు.
ఓ రోజు “అతను కనిపించడం లేదు ఏమైంది?” అని సిటీ ఇంచార్జ్‌ను అడిగితే,
“ఏం జరిగిందో,? ఎలా జరిగిందో తెలియదు. చనిపోయాడు. వారం రోజులు మార్చురీలోనే శవం పడి ఉంది. దేవుడిగా కొలిచిన ఎడిటర్ చివరి చూపు చూడలేదు. కుటుంబం ఎప్పుడో దూరం అయింది. అనాధ మరణం అని తెలిసింది” అన్నాడు.
అతను దేవుడిలా కొలిస్తే, ఎడిటర్ చివరి చూపునకు కూడా పోలేదు. పవర్‌లో ఉంటేనే పలకరింపు. రాజకీయ నాయకులే కాదు ఏ వృత్తిలో ఉన్నా అంతే అనిపించింది. పలకరింపు మనిషికి కాదు అతనితో ఉండే అవసరానికి, అతనిలో ఉండే పవర్‌కు అనుకున్నాను. చిక్కడపల్లి స్ట్రింగర్ తనలో మూర్తీభవించిన అజ్ఞానాన్ని తెలివి అనుకున్నాడు అనిపించింది.
మరో పత్రికలో మంచి అవకాశం రావడంతో నేను రాజీనామా చేసి వెళ్ళిపోయాను.
చాలా రోజులు ఆ పత్రిక గురించి పట్టించుకోలేదు.
ఇన్నాళ్లకు ఆ పత్రిక యజమానిని అరెస్ట్ చేసారు అనే వార్త చూడగానే విశ్వం మాటలు గుర్తుకు వచ్చాయి. మనిషి శరీరం, కుటుంబం, దాంపత్యం, మీడియా సంస్థ కావచ్చు, ఓ కంపెనీ కావచ్చు కూలిపోతున్న లక్షణాలు కనిపిస్తుంటాయి. ప్రకృతి హఠాత్తుగా కూల్చి వేయదు. సమయం ఇస్తుంది. పొడి దగ్గే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారి తీయవచ్చు. మనిషి ఆరోగ్యం, సంస్థ ఆరోగ్యం ఎప్పటికప్పుడు జాగ్రతగా చూసుకోవాలి అనిపించింది. ఒక సంస్థ మరణం అంటే వేలాది కుటుంబాల మరణం అనే జ్ఞానం అవసరం. ఆలోచన మాని ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన కంప్లీట్ హెల్త్ చెకప్ కోసం బయలుదేరాను.
నాలుగు దశాబ్దాల జర్నలిజం జీవితం. ఉదయంలో అక్షరాభ్యాసం. అనంతరం నాలుగు దశాబ్దాలు ఆంధ్రభూమిలో అక్షర సేద్యం. 1987లో ఆంధ్రభూమిలో జర్నలిస్ట్‌గా ఉద్యోగంలో చేరక ముందు నుంచే భూమిలో బోలెడు వ్యాసాలు. 2017లో ఆంధ్రభూమి నుంచి వెళ్లిపోయిన తరువాత కూడా రాయడం ఆపలేదు. ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో 20 ఏళ్ళ పాటు ‘జనాంతికం’ పేరుతో వారం వారం రాజకీయ పోకడలపై సెటైర్ కాలం. ఈ కాలంకు తెలుగు యూనివర్సిటీ నుంచి కీర్తి పురస్కారం లభించింది. ఆంధ్రభూమి మాసపత్రికలో ఐదేళ్ల పాటు ‘వర్తమానం’ కాలం. విద్యార్థిగా ఉన్నపుడు ఆంధ్రభూమితో ఏర్పడిన అనుబంధం కరోనా ఆంధ్రభూమిని మింగేయక ముందు వరకు కొనసాగింది. రిపోర్టర్‌గా ఉంటూ కాలం రాసిన వాళ్ళు అరుదు. 87లో ఆంధ్రభూమి విశాఖపట్నం ఎడిషన్‌లో కాళీపట్నం ఆధ్వర్యంలో ‘నేటి కథ’ అని రోజుకో కథ వచ్చేది. అక్కడే కథలు రాయడం మొదలు పెట్టి, అక్కడే ఆపేశాను. చాలా ఏళ్ళ తరువాత తిరిగి కథలు రాయాలి అని ఆసక్తి కలిగింది. 2017లో తెలంగాణ తొలి సమాచార హక్కు కమిషనర్ పదవి చేపట్టాను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలోని ఈ పదవివి ఐదేళ్ల పాటు విజయవంతంగా పూర్తి చేశాను. తిరిగి పూర్తి స్థాయి రాత పనిలో పడిపోయాను. రాసుకొని బతకడంలో ఓ తృప్తి ఉంటుంది.
పుట్టింది భువనగిరి జిల్లా మన్నెవారి తుర్కపల్లి. కనులు తెరిచింది, జీవిత కాలం మొత్తం గడిపింది/గడిపేది హైదరాబాద్ లోనే.. ఇద్దరు పిల్లలు, భార్య.. ఇదీ జీవితం.
