Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-20: జర్నలిస్ట్ జీవితం

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్దా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

పత్రికకు పంపడానికి వ్యాసం కంపోజ్ చేస్తుంటే పక్కన సెల్ ఫోన్‌లో మెసేజ్ వచ్చిన సౌండ్. ఏ సమాచారాన్ని, ఏ మెసేజ్‌ను చిన్నచూపు చూడవద్దు అని నాలుగు దశాబ్దాల జర్నలిజం నేర్పిన పాఠం వంట బట్టి మెసేజ్ చూశాను.

“మన స్కూల్ మేట్స్ అందరూ కలుస్తున్నారు. నువ్వు తప్పకుండా రావాలి. కొన్ని దశాబ్దాల తర్వాత కలుస్తున్నాం. సమయం లేదు. బిజీ అని వంకలు చెప్పవద్దు అందుకే చాలా ముందుగా చెబుతున్నాం.” సారాంశం ఇది. మెసేజ్ చూడగానే రాస్తున్న వ్యాసం పక్కకు పెట్టి జ్ఞాపకాల్లో మునిగిపోయాను. దశాబ్దాలు గడిచిపోయాయి. ఏదో నిన్న మొన్ననే స్కూల్‌కు వెళ్లాం, అల్లరి చేశాం. చదువుకున్నాం అన్నట్టుగా ఆ జ్ఞాపకాలు తాజాగా ఉన్నాయి. అదేం చిత్రమో నిన్న మొన్నటి విషయాలు కూడా కొన్ని గుర్తుండవు. ఆఫీస్‌లో కలిసి పని చేసిన కొందరి పేర్లు కూడా గుర్తుకు రావు. కానీ స్కూల్‌లో చదువుకున్న నాటి విషయాలు ఇంకా తాజాగా ఉంటాయి. బహుశా బాధ్యతలు లేని, సమస్యల గురించి తెలియని, జీవితంలో బతికిన రోజులు కావచ్చు. పెద్దయ్యాక జీవిస్తారు కానీ ఎక్కడ బతుకుతారు. అందుకేనేమో బతికిన ఆ రోజులను ఎవరూ మర్చిపోరు.

చిన్ననాటి మిత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేకపోయినా, కనీసం హాజరు కావడం ధర్మం అనిపించింది.

***

చెప్పిన సమయానికన్నా ముందే అక్కడికి చేరుకున్నాను. నా కన్నా ముందే చాలా మంది వచ్చారు. సెలవు రోజు కావడం వల్ల స్కూల్ భవనాన్ని సమావేశానికి ఇచ్చారు. స్కూల్‌లో కూర్చున్న తరగతి గదులు ఒక్కొక్కటి చూస్తూ లీనం అయిపోయాను. స్కూల్ చూస్తే కొంచెం చిన్నగా అనిపించింది. అదేంటి అదే స్కూల్లో కొన్ని సంవత్సరాల పాటు గడిపాం కదా? అప్పుడు పెద్ద పెద్దగా కనిపించే తరగతి గదులు, ఆటస్థలం, ప్రేయర్ కోసం వరుసగా నిలుచున్న స్థలం అన్నీ ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్నాయి అనిపించింది.

అప్పుడు మనం చిన్నవాళ్ళం కాబట్టి స్కూల్, తరగతి గదులు పెద్దగా కనిపించాయి. ఇప్పుడు పెద్దవాళ్ళం అయ్యాం కాబట్టి తరగతి గదులు చిన్నగా అనిపిస్తున్నాయేమో అనుకున్నాను.. ఈ ఆలోచనకు నాలో నేనే నవ్వుకొని అప్పటికే వచ్చిన మిత్రులను పలకరించాను.

నా చూపు అన్నపూర్ణ వైపు మళ్ళింది. ఎందుకో అన్నపూర్ణను చూస్తే గౌరవంతో కూడిన భయం. నన్ను గమనించనట్టుగానే అన్నపూర్ణ మిత్రులతో కబుర్లలో మునిగిపోయింది. కృష్ణ, మౌళి, శ్రీనివాస్,శంకర్, భాస్కర్, అనురాధ, విజయలక్ష్మి, అనిల్ అందరూ వచ్చారు. కొందరు పేరు చెబితే కానీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అంతా వచ్చాక నిర్వాహకులు కార్యక్రమం మొదలు పెట్టారు.

***

ఒక్కొక్కరు తాము జీవితంలో సాధించిన విజయాలు చెబుతున్నారు. వ్యాపారం చేస్తున్నవారు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్థికంగా చితికిపోయిన వాళ్ళు, ఆర్థికంగా విజయం సాధించిన వాళ్ళు. తరగతి గది  కూడా సమాజానికి సూక్ష్మ రూపం. ఇక్కడా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా విజయం సాధించిన వాళ్ళు తమకు ఎక్కడెక్కడ ఆస్తులు, ఇండ్లు, పొలాలు ఉన్నాయో చెబుతున్నారు.

నా పరిస్థితి చూసి పక్కనున్న భాస్కర్ “ఏరా నీకు చిన్నప్పటి నుంచి అన్నపూర్ణ బెస్ట్ ఫ్రెండ్ కదా? మాట్లాడు” అన్నాడు.

“లేదు ఇప్పుడు మాట్లాడను. ఎప్పుడు మాట్లాడుతానో తెలియదు. ఆమె అంటే నాకు చాలా గౌరవం. నా రచనలు పంపిస్తా కానీ ఇప్పటి వరకు మాట్లాడలేదు. బహుశా మాట్లాడితే ఇప్పటి వరకు ఉన్న ఫీలింగ్ పోతుందేమో” అన్నాను.

“ఫీలింగ్ పోవడం ఏమిటి?” భాస్కర్ ఆశ్చర్యంగా అడిగాడు.

“మన చిన్ననాటి విషయాలు మాట్లాడుకుంటారు అని చాలా ఆశతో ఇక్కడికి వచ్చాను. నువ్వు కూడా అంతే అనుకుంటా. కానీ ఇప్పటి వరకు మాట్లాడిన అందరూ తమ సంపాదన గురించి గర్వంగా చెబుతున్నారు. ఇది ఆస్తుల ప్రకటన సభలా ఉంది కానీ అనుభూతుల సభలా లేదు. అన్నపూర్ణ ‘లా’ చదివింది. చిన్నప్పటి నుంచి చురుకైనది. చిన్నప్పుడు నెలకు 20 పైసల స్కూల్ ఫీజు. ఆ 20 పైసలు నోట్లో పెట్టుకొని చలాకీగా అందరికన్నా ముందు ఫీజు చెల్లించే ఆ రూపం కళ్ళ ముందు ఇంకా సజీవంగా ఉంది. మన విజయం మొత్తం మనదే కాదు. మనం పుట్టిన కుటుంబం, మన నేపథ్యం, మనం పెరిగిన ప్రాంతం వీటన్నిటి ప్రభావం ఉంటుంది. అన్నపూర్ణ తెలివైనది. కానీ కుటుంబ నేపథ్యం సహకరించలేదు. ఆడపిల్ల కాబట్టి అంత స్వేచ్ఛగా బయటకు పంపక పోవడం వల్ల తాను కోరుకున్న విధంగా జీవించలేక పోయింది. ఇప్పుడు తమ విజయాల గురించి చెబుతున్న ఎంతోమంది కన్నా ఆమె తెలివైనది. ఎందుకో నాకు ఈ విజయాలపై పెద్దగా ఆసక్తి ఉండదు.” అని నేను మెల్లగా చెబుతుంటే, ఒక్కసారిగా అందరూ నా వైపు చూస్తున్నారు.

“ఏమైంది? అలా చూస్తున్నారు” అని భాస్కర్‌ను అడిగితే, మైకులో అప్పటికే నా పేరు మూడు సార్లు పిలిచారు, మాట్లాడమని చెప్పాడు. లేచి మాట్లాడేందుకు వెళ్ళాను.

“మన మిత్రులు చాలా మంది ఆర్థికంగా బాగా స్థిరపడడం, ఆస్తులు కూడగట్టడం సంతోషం. సంపద కూడబెట్టని వాడు వేదాంతం చెబుతాడు అనుకున్నా పరవాలేదు.

నా దృష్టిలో నేను చాలా సంపన్నుడిని. ఒక జర్నలిస్ట్‌గా జీవితం గడిపాను. ఇష్టంగా జర్నలిస్ట్‌ను అయ్యాను. చరిత్రతో కలిసి అడుగులో అడుగు వేసి నడిచే అదృష్టం ఒక్క జర్నలిస్ట్‌కు మాత్రమే సాధ్యం. డబ్బు సంపాదించడం తప్పు అని నేను చెప్పడం లేదు. జ్ఞాపకాలు కూడా సంపాదనే అని నా ఉద్దేశం. అలాంటి ఎన్నో అద్భుత జ్ఞాపకాల సంపద పోగు చేసుకున్నాను.చిన్నప్పుడు మనం తరగతి గదిలో చరిత్రను ఎంతో ఆసక్తితో చదివాం. అశోకుడు, అక్బర్, బాబర్‌తో పాటు ఎంతో మంది పాలకుల గురించి చదివాం. అది ఆ కాలం నాటి చరిత్ర. ఇప్పటి చరిత్రను కళ్ళతో చూస్తూ దాని గురించి రాసే అదృష్టం జర్నలిస్ట్‌గా నాకు దక్కింది. ఒక నటుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ ఉపన్యాసం, వాజపేయి చెణుకులు, తెలంగాణ ఉద్యమం, ఒక బక్కపల్చటి వ్యక్తి తెలంగాణ సాధించడం వంటి  చారిత్రక సంఘటనలు అన్నింటికి సాక్ష్యంగా నిలిచి ఆ చరిత్రను రికార్డ్ చేసే అదృష్టం దక్కింది. నా దృష్టిలో జ్ఞాపకాలు గొప్ప సంపద. నా జీవితంలో అన్నీ తీపి జ్ఞాపకాలేనా? అంటే అస్సలు కాదు. పిల్లల ఫీజులు కట్టడానికి తంటాలు పడ్డ రోజులు ఉన్నాయి. సెలవులు దొరక్క ఏ పెళ్ళికి వెళ్ళని రోజులు, పనిలో పడి అర్ధరాత్రి వరకు ఆఫీస్ లోనే గడిపిన పెళ్లి రోజు జ్ఞాపకాలు ఉన్నాయి. బాస్ వేధింపులు ఉంటాయి. తోటివారితో కష్టసుఖాలు పంచుకోవడం ఉంటుంది. ముఖ్యమంత్రి ఆప్యాయంగా పలకరించిన రోజులు ఉన్నాయి, కానిస్టేబుల్ లాఠీతో కొట్టిన రోజులు ఉన్నాయి. స్టార్ హోటల్‌లో గడిపిన రోజులు, నక్సల్స్‌తో అడవిలో నడవలేక చతికిల పడిన సందర్భాలు ఉన్నాయి. వృత్తిలో నా అనుభవాలే నా జీవితంలో అద్భుత సంపద. ప్రతివారికి అంతిమ రోజు వస్తుంది. ఆ రోజు మనం గుర్తు చేసుకునేది మనం ఎంత సంపాదించాం, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అని కాదు. మన జీవితంలో ఎదురైనా మనుషులు, మన జీవితం గడిపిన స్మృతులు సినిమా రీల్స్‌లా గుర్తుకు వస్తాయి. వాటిని చూస్తూ మనం ప్రశాంతంగా మన జీవితాన్ని ముగించాలి. అద్భుతమైన జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతూ జీవితాన్ని ముగించేట్టు ఉండాలి. కానీ జీవితమంతా సంపాదనలోనే గడిచిపోయింది. జీవించక ముందే జీవితాన్ని ముగిస్తున్నాను అని అసంతృప్తి ఉండకూడదు. నా ఉద్దేశం జర్నలిస్ట్ జీవితం ఒక్కటే అద్భుతం అని చెప్పడం కాదు. మనం ఏ వృత్తిలో ఉన్నా మన జ్ఞాపకాలు అందగా ఉండాలి. ఏ వృత్తిలో ఉన్నా మనిషి జీవితంలో అద్భుత జ్ఞాపకాలకు కొదవ లేదు. సంపాదనే కాదు జీవితంలో అందమైన జ్ఞాపకాలు పోగుచేసుకోవాలి. నేను ఎప్పుడు జీవితాన్ని ముగించాల్సి వచ్చినా అందమైన జ్ఞాపకాలతో ముగిస్తాను అనే నమ్మకం ఉంది. మీలో ఆ నమ్మకం ఉందా?” అని చెప్పి ముగించాను.

హాల్లో నిశ్శబ్దం ఆవరించింది.

కిందకు వచ్చిన తర్వాత భాస్కర్ షేక్ హ్యాండ్ ఇస్తూ, “అన్నపూర్ణతో మాట్లాడుతావా?” అని అడిగాడు.

“మాట్లాడతాను ఇప్పుడు కాదు.. జీవితం ముగింపులో” అని నవ్వాను.

Exit mobile version