Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

జర్నలిస్ట్ కథలు-5: యూజ్లెస్ ఫెలో

[ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ బుద్ధా మురళి గారు సంచిక పాఠకుల కోసం ‘జర్నలిస్ట్ కథలు’ అనే ఫీచర్ అందిస్తున్నారు.]

“యూజ్లెస్ ఫెలో” మెల్లగా అన్నప్పటికీ తన కుమారుడి నోటి నుంచి వచ్చిన ఆ మాట కిరణ్ కుమార్‌కు వినిపించింది.

“ఏమన్నావు?” అని అడిగితే, “ఏమీ లేదు. నువ్వు నా చదువు కోసం చేసిన అప్పును వడ్డీతో సహా ఇచ్చేశాను. మరోసారి నా చదువు కోసం అప్పు చేశాను అనే మాట వినిపించ కూడదు. ‘నీ చదువు కోసం ఎంత కష్టపడ్డాం’ అంటూ డ్రామా డైలాగులు వినిపిస్తే నాకు చిరాకు వేస్తుంది. అమెరికా వెళ్లేందుకు చేసిన అప్పును వడ్డీతో సహా ఇచ్చేశాను. చిన్నప్పటి నుంచి నా మీద ఎంత ఇన్వెస్ట్ చేశావో చెప్పు. వడ్డీతో సహా ఇచ్చేస్తాను. ఇంకోసారి సెంటిమెంట్ డైలాగులు వినిపిస్తే మర్యాదగా ఉండదు. నీ డబ్బు నీకు ఇచ్చేశాను. ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్‌ను. ఎవరికి రుణపడి ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఇంటికి వచ్చిన వాళ్లందరికీ నన్ను చదివించేందుకు ఎంత కష్టపడింది కథలు కథలుగా చెప్పి సానుభూతి పొందాలి అనే డ్రామాలు ఇక ఆపేయండి. అప్పు తీర్చేశాను. ఇక నా బతుకు నాది మీ బతుకు మీది.”

కొడుకు ప్రవీణ్ చెబుతున్న మాటలు విని కిరణ్‌కు గుండె పగిలినట్టు అయింది. తన జీవితం మొత్తం ఇద్దరు పిల్లలను ప్రయోజకులను చేయాలి అనే ఏకైక లక్ష్యంగానే సాగింది. అమ్మాయి పెళ్లి. రిటైర్ అయిన జీవితం. ఇక్కడి వరకు లాక్కురావడమే ఎలా సాధ్యం అయింది అన్నట్టుగా సాగింది.

తన సంపాదన కుటుంబ సంపాదన అనుకున్నట్టుగానే, తన కుమారుడి సంపాదన కూడా కుటుంబ సంపాదనే అనుకున్నాడు. నానా తంటాలు పడి కుమారుడిని అమెరికా పంపాడు. చదువు ముగిసింది. ఉద్యోగంలో చేరాడు. ‘చెల్లికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. కుదిరితే డబ్బు సర్దాల్సి ఉంటుంది’ అని కిరణ్ తన కుమారుడికి ఫోన్‌లో చెప్పినప్పటి నుంచి గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడో ఓసారి తాను ‘అప్పు చేసి మరీ నిన్ను అమెరికా పంపించాను. అప్పు తీర్చడానికి నేనెంత కష్టపడుతున్నానో తెలుసా?’ అని ఏదో కోపం వచ్చినప్పుడు అన్న మాట ప్రవీణ్‌కు కోపం తెప్పించింది. పెళ్లి కోసం ఇంటికి రాగానే వడ్డీతో సహా లెక్క కట్టి డబ్బులు, వడ్డీ అసలు లెక్క రాసిన కాగితం విసురుగా తండ్రికి అందించాడు. ఆ లెక్కలు, వాడి మాటలు విన్నాక తల్లి తండ్రులకు పిల్లలకు మద్య ఉండేది లెక్కలకు చిక్కే బంధమా అని మనసులోనే కుమిలి పోయాడు. తండ్రి కొడుకు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ భార్యకు తెలియదు. నేను లోకాన్ని చూశాను. దేన్నయినా తట్టుకోగలను. కానీ భార్య తట్టుకోలేదు. అందుకే తనలోని ఘర్షణను తనకే పరిమితం చేసుకున్నాడు. ఇప్పుడు కొడుకు అమెరికాలో డాలర్లలో సంపాదిస్తున్నాడు. ఇంకా నయం నవమాసాలు మోసి కన్నందుకు తల్లికి తొమ్మిది నెలల గర్భం అద్దె, తాగిన పాలకు లెక్కగట్టి ఇస్తే ఆ పిచ్చి తల్లి తట్టుకోలేక గుండె పగిలి పోయేది అనుకున్నాడు.

చెప్పుకోవడానికి కిరణ్ కుమార్ పేరు మోసిన జర్నలిస్ట్. పరిచయాలకు కొదవేమి లేదు కానీ ప్రైవేటు ఉద్యోగాలు. ప్రతి రోజూ భయమే. రిటైర్ అయ్యాక మూడు వేల రూపాయల ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ తప్ప ఆస్తులు లేవు. ఉద్యోగంలో ఉన్నప్పుడు చేయి చాచి ఉంటే ఇప్పుడు దర్జాగా బతికే అవకాశం ఉండేది. కానీ ఒకరి వద్ద చేయి చాచేందుకు మనసు అంగీకరించలేదు. ఆత్మగౌరవంతో బతికాడు. ఎంతటి ప్రముఖుడైనా సమాన స్థాయి వ్యక్తి అనే మాట్లాడేవాడు. నీ నుంచి నేను ఏదైనా ప్రయోజనం ఆశిస్తే నీ హోదా గుర్తుకు వస్తుంది. ఏ ప్రయోజనం ఆశించనప్పుడు నువ్వూ మనిషివే, నేనూ మనిషినే. ఒక మనిషి మరో మనిషితో ఎలా మాట్లాడుతాడో అలానే మాట్లాడుతాను అనేవాడు. ఎదుటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా మాటతీరు అంతే.. ఇంత కాలం తలెత్తుకొని బతికాడు. రిటైర్ అయి ఆరు నెలలు అవుతోంది. రిటైర్ అయ్యాక పనికి వస్తాడు అనుకుంటే తక్కువ జీతంతో మళ్ళీ కొంత కాలం పని చేసే అవకాశం ఇస్తారు. కిరణ్ కుమార్‌కు మేనేజ్‌మెంట్ అలాంటి అవకాశం ఇచ్చినా ‘పిల్లలు ప్రయోజకులు అయ్యారు. ఇంకా పని చేసే ఓపిక లేదు చాలు’ అని తిరస్కరించాడు.

‘యూజ్లెస్ ఫెలో’ అంటూ తన కుమారుడి నోటి నుంచి వచ్చిన ఆ మాట, అతని ప్రవర్తన కిరణ్‌ను కుదురుగా ఉండనివ్వడం లేదు. పదే పదే అదే మాటను గుర్తు చేసుకుంటున్నాడు. మనిషి అవసరం ఉన్నంత వరకే ఆ బంధాలు అందంగా ఉంటాయి. నచ్చని పని చేసినా, ఇష్టం లేని పని చేసినా, కష్టం అనిపించిన పని చేసినా బంధాలు పేకమేడల్లా కూలిపోతాయి అనుకున్నాడు. తల్లి తండ్రులు, భార్యా పిల్లలు ఈ బంధాలు మాత్రమే కల్తీ లేనివి, మిగిలిన బంధాలు అన్నీ పరస్పర అవసరాలతో ఏర్పడే బంధాలే అనుకున్నాడు ఇంత కాలం. తానే ఆలోచనల్లో వెనుకబడి ఉన్నానని, తప్పెవరిదీ కాదు కాలం మారింది. ఇప్పుడు ఎవరి జీవితం వారికి ముఖ్యం. అనేది తానే గ్రహించలేక పోయాను అనుకున్నాడు. ఆలోచనల్లో మునిగిపోయిన కిరణ్‌కు తన జీవితం మొత్తం తన కళ్ళ ముందు కనిపించింది.

బాగా బతికిన తండ్రి అందరినీ నమ్మి ఉన్నదంతా పోగొట్టుకొని గంపెడు మంది పిల్లల్లతో బతకడానికి హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. ఎలాగైనా బతికేస్తాం అనే నమ్మకం తప్ప ఏ భరోసా లేదు. ఐ ఫోన్ కొనిపించలేదు అని ఆత్మహత్యలు చేసుకునే ఈ రోజుల్లో ఏమీ లేకుండా తన తండ్రి గంపెడు సంతానంతో హైదరాబాద్‌లో అడుగు పెట్టడం ఇప్పటికీ ఆశ్చర్యమే. తన తండ్రికి కుటుంబం అంతా హుసేన్ సాగర్‌లో దూకి చనిపోదాం అనే ఆలోచన వచ్చి ఉంటే? తలుచుకుంటే కిరణ్‌కు ఇప్పటికీ ఒళ్ళు జలదరిస్తుంది.

***

‘యూజ్లెస్ ఫెలో’ తొలిసారి తనను ఇలా తిట్టిన మాట గుర్తుకు వచ్చి పెదవులపై చిరునవ్వు మెరిసింది. స్కూల్‌లో చదివేప్పుడు హెడ్ మాస్టర్‌కు తానంటే ఎందుకో చాలా ప్రేమ ఉండేది. క్లాస్‌కు రాగానే పాఠం తననే చదవమనేవారు. స్పష్టంగా చదువుతానని ఇష్టపడేవారు. చదివాక ‘యూజ్లెస్ ఫెలో’ అని ముద్దుగా అనేవారు. అదాయన ఊతపదం. హెడ్ మాస్టర్ అలా తనను అంటే ఎంత ముచ్చటేసేదో. ఆ మాట ఇంకా చెవుల్లో గింగురు మంటూనే ఉంటుంది. బాధ్యతలు లేని వయసు, సమస్యలు లేని జీవితం, పేదరికం అంటే తెలియని పేదరికం. చిన్న చిన్న వాటికే సంతోష పడే జీవితం అది.

చదువు పూర్తయి జర్నలిస్ట్‌గా ఉద్యోగం. ఏదో సాధించాలి అనే తపన, సమాజంపై ప్రభావం చూపించాలి అనే కోరికతో జర్నలిజం లోకి అడుగు పెట్టిన కిరణ్ కుమార్‌కు కొద్ది రోజులకే కళ్ళు తెరుచుకున్నాయి. ఇక్కడ పత్రికా స్వేచ్ఛ అంటే యజమానులకు తప్ప జర్నలిస్ట్‌లకు కాదు అని తెలిసి వచ్చింది. అప్పటికే సంసారంలో, ఉద్యోగంలో నిండా కూరుకుపోయాడు. కొత్త ఎడిటర్ వచ్చాడు. ప్రపంచంలో తనకు తప్ప ఎవరికీ తెలివి లేదు అనుకునే మూర్ఖుడు. అతని తెలివి తేటలన్నీ మేనేజ్‌మెంట్‌ను బుట్టలో వేయడానికి మాత్రమే పనికి వచ్చాయి. ఎడిటర్ గొంగళి పురుగు లాంటోడు కానీ సీతాకోక చిలుకను అనుకుంటాడు. మంచి జీతం, మంచి సంస్థ.. తెలియని దేవుడికన్నా తెలిసిన దయ్యం బెటర్ అనుకోని కిరణ్ కుమార్ అక్కడే ఉండిపోయాడు. ప్రతి ఒక్కరిని ‘యూజ్లెస్ ఫెలో’ అనడం ఎడిటర్‌కు అలవాటు. నిజానికి సంస్థలో అల్లుడిలా అనుభవిస్తున్న ఎడిటర్‌నే ‘యూజ్లెస్ ఫెలో’. కానీ ఆ మాట అతనే అందరినీ అంటుంటాడు.

ఓ రోజు ఎడిటర్ కిరణ్‌ను ఇలానే ఏదో విషయంలో ‘యూజ్లెస్ ఫెలో’ అని తిడితే, కొలీగ్ “ఏరా ఎంతో మంది ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయి, బాగా రాస్తావు. నువ్వు సరే అంటే ఇంతకన్నా రెట్టింపు జీతం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వెళ్లిపోకుండా మాటలు పడుతూ వీడి వద్దనే పడి ఉండడం అవసరమా?” అని అడిగితే, “నేను వీడి వద్ద పని చేయడం లేదు, వాడు, నేను, నువ్వు ఈ సంస్థలో పని చేస్తున్నాం” అంటూ సమర్థించుకున్నాడు. ‘మొదటిసారి బాధ పడ్డాను. తరువాత ఆలోచించాను. మంచి సంస్థ, మంచి జీతం. బయటకు వెళితే అక్కడే సమస్యలో ఎవరికి తెలుసు. నేను ఒక్కడిని తిట్లు తింటూ బాధ పడ్డా, కుటుంబం బాగుంటుంది, కుటుంబానికి ఓ భద్రత ఉంటుంది. కుటుంబం కోసం ఆ మాత్రం భరించలేనా?’ అని తేలిగ్గా తీసుకున్నాడు. “చదువుకునే రోజుల్లో ఎంత అగ్రెసివ్‌గా ఉండేవాడు. కుటుంబం ఎలా మార్చేసింది” అని కొలీగ్ నవ్వుకుని భుజం తట్టి తన పనిలో తాను మునిగిపోయాడు.

నిజానికి ఆ ఎడిటర్‌నే పనికిరానివాడు అని మేనేజ్‌మెంట్ గేటు బయటి నుంచి అటు నుంచి ఆటే ఇంటికి పంపించారు. కానీ అప్పటికే ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడు.

***

అమ్మాయి పెళ్లి కావడంతో కిరణ్ ఊపిరి పీల్చుకున్నాడు. పెళ్లి కాగానే అబ్బాయి ప్రవీణ్ అమెరికాకు పయనమయ్యాడు. “మళ్ళీ ఎప్పుడు వస్తావు?” అని తల్లి ప్రశ్నిస్తే ప్రవీణ్ నుంచి సమాధానం లేదు. తమను వదిలి వెళుతున్నందుకు బాధతో మాటలు రావడం లేదు అని తల్లి అమాయకంగా అనుకుంది. లెక్కలన్నీ పూర్తి అయ్యాయి కాబట్టి తన కొడుకు ఇక ఎప్పటికీ రాడు అని కిరణ్‌కు మాత్రమే తెలుసు. తల్లితండ్రులు చనిపోయినా విదేశాల నుంచి రాని పిల్లల గురించి చదివినప్పుడు అలాంటి వారు కూడా ఉంటారా? అని ఆశ్చర్య పోయిన కిరణ్‌కు ఇప్పుడు ఏది ఆశ్చర్యం అనిపించడం లేదు. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఓ ప్రమాదంలో 30 మంది చనిపోతే వార్త కవరేజ్ కు వెళ్లి తన పని తాను చేసుకుంటూ పోయాడు కానీ ఆ 30మంది కుటుంబ సభ్యుల ఆవేదన, బాధ గురించి ఒక్క క్షణం కూడా ఆలోచన రాలేదు. ఆ సంఘటనను ఒక వార్తగా మాత్రమే చూశాడు. మనిషిగా స్పందించలేదు. ఇప్పుడూ అంతే జరుగుతున్నా దానిని సాక్షిగా చూడడం అలవాటు చేసుకున్నాడు. ఎంత వయసు వచ్చినా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా కొన్ని సంఘటనలు జీవితంలో ఎదురయ్యేంత వరకు అర్థం కావు.

***

“ఏమోయ్ మళ్ళీ ఉద్యోగానికి వెళుతున్నాను.” అని కిరణ్ చెప్పగానే భార్య ఆశ్చర్యపోయి “అదేంటి ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నాకేంటి పిల్లలు చేతికి అంది వచ్చారు. ఎక్కడికీ వెళ్ళను, ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటాను అన్నారు. మూడు నెలలలకే బోర్ కొట్టిందా? మరి మేం జీవిత కాలం అంతా ఇంట్లోనే ఎలా ఉంటామో అర్థం అయిందా” అని ఎత్తిపొడిచింది.

“నీటి నుంచి బయటపడ్డ చేపలా గడిచిపోయింది నా పరిస్థితి. నీటిలో ఉంటేనే చేప బతుకుతుంది. జర్నలిస్ట్‌గా రాస్తూ ఉంటేనే నాకు బతికినట్టు ఉంటుంది. పని లేకపోతే మగవాడు శవంతో సమానం. అందుకే రెండు రోజుల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నించా, పాత మేనేజ్‌మెంట్ మళ్ళీ రమ్మంది, వెళుతున్నా” అని కిరణ్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు.

ఏ సంతానం మీద ఆశలు పెట్టుకొని విశ్రాంతి జీవితం గడుపుదామని కలలు కన్నాడో, వాళ్ళు ఇక ఇంటికి తిరిగి రారు, ఇంటి భారం తనదే అందుకే మళ్ళీ ఉద్యోగానికి వెళుతున్నానని తనకు తప్ప ఇంకెవరికీ తెలియదు.

Exit mobile version