[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘కాల నిబంధనం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
చిత్తం చింతించే స్థితి రాక తప్పదు!
ప్రాణం పరితపించే పరిస్థితి
రాక తప్పదు!
ఒకరిని గ్రుడ్డిగా విశ్వసించి
గుండె కోతకు గురైన అవస్థలను,
వ్యక్తిత్వాన్ని పలుమార్లు విక్రయించి
గుల్లగా మారిన అదనులనూ
తడవ తడవకూ తలచుకుంటూ
తలవంచుకు తల్లడిల్ల వలసిన
తరుణం తప్పనిసరిగా వస్తుంది!
అన్యులను నొప్పించి
అస్మదీయులను మెప్పించినందుకో,
తొందరపడి ఒకరిని
దురుసుగా దూషించినందుకో,
మిన్నగా భూషించినందుకో,
పక్షపాత బుద్ధిని పాటించి
ఒకరిని చేరదీసినందుకో,
వర్గ భేదాన్ని పాలించి
ఒకరిని వేరు జేసినందుకో,
ఏక పక్షంగా
ఒకరితో కలహించినందుకో,
ఆత్మ సాక్షిగా
ఒకరిని కపటించినందుకో,
అకారణంగా
ఒకరిని అనుమానించినందుకో,
అధికార మదంతో
ఒకరిని అవమానించినందుకో
ఉల్లము తపించే
సంకటం ఏర్పడక మానదు!
ఉసురు తల్లడిల్లే
సందర్భం ఏతెంచక మానదు!
కూడిన రుగ్మతలకు చికిత్సలెన్నున్నా
కూడబెట్టుకున్న పాప వ్యాధికి
అంతర్గతంగా ఆక్రందిస్తూ,
మానసికంగా క్షమా భిక్షనర్థిస్తూ
పశ్చాత్తాపాగ్నిలో కమలడమే వైద్యం!
వయస్సు బిగువు వడలినప్పుడు,
మనస్సు బింకం సడలినప్పుడు
ఆత్మ పరిశోధన ఫలితాల
ఒత్తడి వలన,
స్వాపరాధ భావనల
రాపిడి వలన,
అవసాన దశల
ముట్టడి వలన
మనిషి
తనను తాను
ఛీత్కరించుకుంటూ,
సిగ్గుతో చిన్నబోయే
దశ దగ్గరించక మానదు!
దుర్దశ దహించక మానదు!
లోలోపలి లోపాల తాపాలు
కన్నీళ్ళై చిప్పిల్లే కాలం
ఖరారుగా ఆసన్నమౌతుంది!
చిత్తం చింతిల్లే సమయం
కరాఖండిగా ఉత్పన్నమౌతుంది!
