Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాలం

[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘కాలం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

కాలానికి కైమోడ్పులు!
ఆద్యంత రహిత మహా కాలానికి అబ్బిన
నిత్య గమన శీలానికి చేమోడ్పులు!

ఎవరి కోసమూ
ఎన్నడూ ఎక్కడా ఆగని
గాలి తరగల్లా, జల తరంగాల్లా
మున్ముందుకే సాగే
ప్రశస్త కాల చలనానికి ప్రాంజలి!
అగ్రాహ్య కాల చరిత్రకు
భక్తి పూర్వక అంజలి!

కాలం
సృష్టి మహేంద్రజాలం!
కాలావిర్భావ వృత్తాంతం
ఊహకందని ఉదంతం!
కాల శక్తి కీర్తనం అశక్యం !
అది అనంతం!

మహా యుగాల పూర్వంనుండీ
పయనించే కాలం అభేద్యం!
కాలం లెక్కింపు అసాధ్యం!
కాలం పరమాత్మ స్వరూపం!

ఎక్కడో ఒక హద్దు వద్ద
ఎల్లరి ప్రయాణమూ ఆగిపోయినా
అనంత ప్రస్థాన దీక్షలో లీనమై
నిర్వికార కాలం
నిర్లిప్తంగా
నిర్విరామంగా
సృష్టి ఆరంభంనుండి గమిస్తూనే ఉన్నది
తనకే తెలిసిన గమ్యం దిశగా
పురోగమిస్తూనే ఉంటుంది!

కాలానిది
ఏ గుణానికీ తలవంచని తత్వం!
ఎవరి పెత్తనానికీ లొంగని సత్త్వం!

మనిషి తాననుభవించే
మంచి చెడులకూ
సుఖ దుఃఖాలకూ
కాలమే కారణమనడం
అనుచిత భావన!
ఆ భావన
అసమర్థులు పోషించే
అయుక్త యోచన!
ఆ యోచన
పరాధీన తత్వాల
ప్రత్యక్ష ప్రకటన!
ఆ ప్రకటన
ప్రబలే ప్రమాదకర పలాయనవాదాన్ని గూర్చి
హెచ్చరించే సూచన!

కాలానికి
కారుణ్యాన్నీ, కాఠిన్యాన్నీ ఆపాదిస్తూ
ఉపకారిగా, అపకారిగా
పరిగణిస్తూ
తన యోగ్యతనూ, అయోగ్యతనూ ,
తన గొప్పలనూ, తప్పులనూ
ఉపేక్షించడం
మానవ మానసిక దౌర్బల్యం!
బుద్ధి వైకల్యం!

సదాచారికి
కాలం సదా సానుకూలమే!
సాధకునికి
కాలం నిత్యం సహాయకారే!

తీవ్ర వేగంతో మార్పు చెందే
త్రికాలాలు
తమ విలువను బోధించే
గురుకులాలు!
ఒక్క క్షణమే వర్తమానం అస్తిత్వం!
ముగిసిన క్షణం
గతంగా స్థితం!
రానున్న క్షణం
భావిగా అవగతం!

నిజానికి
కాలానికి ఏ కొలమానం లేదు!
ఏ పరిమాణం లేదు!
భూభ్రమణం ఏర్పరచే
దివారాత్రులు
జాములు
రుతువులూ
మనిషి చేత
అతని సౌకర్యం నిమిత్తం,
ఆతని దినచర్యల
సౌలభ్యం కోసం
సమయాన్ని సూచించే ఉపకర్తలై
కాలాన్ని గణించే
పంచాంగాలను
కేలెండర్లను
గడియారాలనూ
ఆవిష్కరించేందుకు
ఆధారాలైనాయి తప్ప
వాస్తవంగా
కాలానికి ఏ కొలతా లేదు!
నిర్జీవ గ్రహాలలోనూ
నిండివుండే కాలాన్ని
గమనించే దెవరు?
గణించేదెవ్వరు?

ఎన్నడో ఆరిపోయిన తారాదీపం
నేటికీ కాంతులీనుతున్నట్లు కనిపించడం
కాల విచిత్రం కాదు
అది
దూరం సృజించే అద్భుతం!
కాలం
విభిన్న ఖండాలలో
విభిన్నంగా వెలువడడం
కాల వైవిధ్యం కాదు
అది దూరాలు చేసే వైచిత్ర్యం!
మూడు వందల అరవై సంవత్సరాల మానవ కాలం
దేవతలకొక
సంవత్సర కాలం కావడం
దైవ మహిమ విచిత్రత్వం!

కాల మహిమ అనిర్వచనీయం!
ఈ కవిత
కాలం గూర్చి
అణుమాత్ర పరిచయం మాత్రమే!
అల్ప సమాచార సంచయం మాత్రమే!
అజేయ కాలానికి
సహస్ర ప్రణామాలు!
అమేయ కాలానికి
శత కోటి ప్రశంసలు!

Exit mobile version