[గణపతిశాస్త్రి గారి పిల్లలు కూడా బాగా చదువుకుంటారు. కూతురు గిరిజని ఎస్.ఎస్.ఎల్.సి. వరకు చదివించి పదిహేడవ ఏట, 22 సంవత్సరాల లక్ష్మీనారాయణకు ఇచ్చి పెళ్ళి చేస్తారు. అల్లుడిని బిఎ చదివించి, బిఎడ్ చేయించి టీచరుగా స్థిరపరుస్తారు గణపతిశాస్త్రి. ఆయన పెద్ద కొడుకు శంకరశాస్త్రి లా చదివి న్యాయవాది అవుతాడు. రెండో కొడుకు రైల్వేలలో గుమాస్తాగా చేరుతాడు. శర్మ (నాన్నలు) లెక్చరర్ అవుతాడు. మంగమ్మ (అమ్మలు) మెడికల్ కాలేజీలో చేరుతుంది. నాన్నలు ఉద్యోగంలో చేరినప్పటికీ ఐ.ఎస్.ఎస్. అవ్వాలన్న తన ఆశయం కోసం కృషి చేస్తుంటాడు. ఆ ఏడాది నోటిఫికేషన్ రాగా దరఖాస్తు చేస్తాడు. మంగమ్మ చదువు కొనసాగుతూంటుంది. పేద రోగుల పట్ల అభిమానంగా ఉంటుంది. పోస్టల్ కోచింగ్ తీసుకుంటాడు నాన్నలు. రాత పరీక్ష పాసయి ఇంటర్వ్యూకి వెడతాడు. కానీ ఆ దఫా ఎంపికవడు. అయితే క్రుంగిపోక, తనకి ఇంకో ఏడాది వయసు ఉందని, మళ్ళీ ప్రయత్నిస్తానని అందరికీ చెప్తాడు. ఈ దఫా పరీక్ష బాగా రాస్తాడు, ఇంటర్వ్యూ కూడా బాగా చేసి ఐఎఎస్‌కి ఎంపికవుతాడు శర్మ. అందరూ అతన్ని, కుటుంబ సభ్యులని అభినందిస్తారు. – ఇక చదవండి]
ఆ మరునాడు శలవు దినం. మాష్టారు, కళావతి, ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు, పూజ, ముగించుకొన్నారు. అన్నా చెల్లెలు, కొద్దిపాటి ఆలస్యంగా లేచేరు. శర్మకు, పూరీ బంగాళాదుంపల కూర ప్రీతికరమయినవి. వాటి తయారీలో ఉంది, కళావతి. బంగాళాదుంపల కూర తయారవుతూ ఉంది. మాష్టారు, పిల్లలు, ఆ దగ్గరలోనే పీటలమీద ఆసీనులయి ఉన్నారు. ఆ సమయంలో, వీధి తలుపు తట్టినట్టు అయింది. శర్మ, వెళ్లి తలుపు తీసేడు. శర్మను స్వయంగా అభినందించడానికి వచ్చిన, మేనత్త, పెట్టి పట్టుకొన్న మామయ్యగారిని చూసేడు. పెట్టి అందుకొన్నాడు. “రండి మామయ్యగారూ, రా అత్తా.” అని ఉభయులునూ ఆహ్వానించి, పాదాభివందనం చేసేడు. గణపతి శాస్త్రిగారు, శర్మను అభినందించి, ఆశీర్వదించేరు. వరలక్ష్మి, మేనల్లుడిని కౌగలించుకొని, “కలెక్టరుగారిని కలసుకుందామని వచ్చేనురా.” అని, తన సంతోషాన్ని ప్రకటించింది. అంతలో, మాష్టారు కళావతి మంగమ్మ వచ్చి, శాస్త్రిగారికి, వరలక్ష్మికి పాదాభివందనం చేసేరు. అందరూ లోనికి వెళ్ళేరు.
మద్ధాహ్న భోజనాలయ్యేయి. అందరూ సమావేశమయ్యేరు. మాష్టారు, తమ పిల్లల పెళ్లిళ్ల విషయంలో, అక్కా బావగార్ల సలహా తీసుకోదలచేరు. ముందుగా మాష్టారు సంభాషణ ప్రారంభించేరు.
“బావగారూ, పెద్దవాళ్ళు; మీరూ అక్కా, సమయానికి వచ్చేరు. పిల్లలిద్దరి పెళ్లిళ్ల విషయంలో మీ సలహా కావాలి.”
“అవునండీ, మేము ఏమీ తేల్చుకోలేక పోతున్నాం. మేమే ఒకరోజు మీ ఊరొచ్చి మీతో మాట్లాడదామనుకొన్నాం.” కళావతి కూడా సలహా కోరింది.
“నాన్నలు చదువయిపోయింది.. స్థిరమయినది, ఓ పెద్ద ఉద్యోగం కూడా దొరికింది.. అమ్మలు చదువు కూడా.. అయిపోవస్తున్నాది అనుకొంటాను. మరి ఆలస్యం చెయ్యకండి. తగిన సంబంధాలు చూసి, ఇద్దరికీ పెళ్లిళ్లు చేసీయండి.” అక్క, హితోపదేశం చేసింది, తమ్ముడికి.
“డాక్టరమ్మకి ఏవయినా సంబంధాలు చూస్తున్నారా. మొదట, అమ్మాయి పెళ్లి చేయాలి గదా. చెల్లెలి పెళ్లి అయిన దాకా, కలెక్టరు గారు, బ్రహ్మచారిగా ఉండాలి.” గణపతి శాస్త్రిగారు, నవ్వుతూ, నిబంధనతో కూడిన సలహా ఇచ్చేరు.
“బావగారూ, అమ్మలు చదువు ఇంకా..( కూతురును ఉద్దేశించి) – ఏవమ్మా, ఇంకా మూడేళ్లు ఉంటుందా, నీ చదువు.” సంశయం తీర్చుకోదలిచేరు, మాష్టారు.
“ఆఁ. ఇంకా మూడేళ్లు ఉంది నాన్నా.” అని తండ్రి సంశయం తీర్చింది, మంగమ్మ.
“ఇంకా మూడేళ్లు ఉందా.. సరే దానికేమిటి. చదువు సాగుతూ ఉండొచ్చు. తగిన సంబంధం చూసి, పెళ్లి చేసీ. తరువాత చదువయ్యేక, కాపురానికి పంపొచ్చు. డాక్టరమ్మగారి పెళ్లి అవగానే, కలెక్టరుగారి పెళ్లి చేసీ వచ్చు.” తమ్ముడికి చెబుతూ, సమస్యాపూరణం చేసింది, వరలక్ష్మి.
“అత్తా, నాకింకా మూడేళ్లు పడుతుంది, పెళ్లి చేసుకోడానికి.” శర్మ తన అభిప్రాయం చెప్పేడు.
“ఇంకా మూడేళ్లు ఎందుకు నాన్నా.” కారణం అడిగింది, కళావతి.
“అమ్మా, ట్రైనింగు పీరియడ్ రెండేళ్లు. అందులో కొన్నాళ్ళు హాస్టల్లో ఉండాలి. తరువాత దేశమంతా తిప్పుతారు. ట్రైనింగు అయ్యేక ఇంటికి కావలిసినవి, ఒక్కొక్కటి సమకూర్చుకోవాలి. ఆ తరువాత పెళ్లి చేసుకొంటాను.”
“కలెక్టరుగారూ, ఇంటికి కావలిసినవి నువ్వు సమకూర్చుకోడం దేనికి. పెళ్ళయితే, కారు దగ్గరనుండీ అన్నీ అత్తవారే ఇస్తారు.” శాస్త్రిగారు నవ్వుతూ చమత్కరించేరు.
“మామయ్యగారూ, నేను అత్తవారినుండి, కారు కాదు గదా, చిల్లి కానీ కూడా పుచ్చుకోను.” తన దృఢమయిన ఆలోచన చెప్పేడు, శర్మ.
“నీకు ట్రైనింగులో ఏమయినా ఇస్తారా.” మేనత్త విచారణ.
“ఉద్యోగంలోలాగే, పూర్తి జీతం ఇస్తారు, అత్తా.” వివరణ ఇచ్చేడు, మేనల్లుడు.
“ఏమండీ, డాక్టరమ్మగారూ, నీ పెళ్లి మాటేమిటి.” మంగమ్మను అడిగింది, మేనత్త.
“అత్తా, నా చదువయినదాకా పెళ్లి చేసుకోను. చదువు మధ్యలో పెళ్లి చేసుకొంటే, నా జూనియరు, ఓ అమ్మాయికి, పెళ్లి అవగానే, అత్తవారు చదువు మానీసి వాళ్ళ ఊరు వచ్చేయమని ప్రెషర్ పెడితే, ఏడ్చుకొంటూ వెళ్లిపోయింది. అందుచేత నేనూ మూడేళ్ళ తరువాతే పెళ్లి చేసుకొంటాను. కట్నాలు అడిగిన వాళ్లెవరినీ నేను పెళ్లి చేసుకోను.” తన నిర్ణయం చెప్పింది, మంగమ్మ.
“మరేం, ఇక సమస్యే లేదు. ఇద్దరూ మూడేళ్లదాకా కుదరదూ.. అంటున్నారు. వాళ్ళు చెప్పినదీ సబబుగానే ఉన్నట్టుంది. వాళ్ళు కోరినట్టూ మూడేళ్లు ఆగండి.” శాస్త్రిగారు, మాష్టారు దంపతులకు, తుది తీర్పు వెల్లడించేరు.
అందరకూ అది సమ్మతమయింది.
శర్మ, మసూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎకాడమీ ఫర్ ఎడ్మినిస్ట్రేషనులో, ఏడు నెలల ట్రైనింగుకు చేరేడు. అక్కడ భవనాలు, సదుపాయాలూ, ఊహకందనివిగా ఆశ్చర్యబరచేయి. అమ్మా నాన్నలకు, చెల్లెలకు, తాను ఉండెడి నర్మదా హాస్టల్, ఆఫీసర్స్ మెస్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫెసిలిటీసు, అన్నీ వివరంగా, సంతోషంతో పొంగిపోతూ తెలియబరచేడు. తన రూములో టెలిఫోను సదుపాయం కూడా ఉన్నదని, ఉత్తరంలో రాసేడు. ఆ వివరాలు తెలుసుకొని, మాష్టారు దంపతులు, కొడుకు అంత ఉన్నత పదవికి చేరుకొన్నాడని, గర్వపడ్డారు. చెల్లెలు కూడా గర్వపడింది.
శర్మకు, ఎకాడమీలో ఏడునెలల ట్రైనింగు పూర్తయింది. పది రోజుల శలవు తీసుకొని, ఇల్లు చేరుకొన్నాడు. ఇంట్లో తను యోచించిన మార్పులు తెచ్చేడు. దుక్క సూరమ్మగారి ఉద్యోగం పునరుద్ధరింపబడింది. ఇంట్లో సోఫా సెట్టు, డైనింగు సెట్టు, మున్నగు సదుపాయాలు అన్నీ సమకూర్చబడ్డాయి. టెలిఫోను సౌకర్యం కూడా ఏర్పడింది. తండ్రిచేత ట్యూషనులు అన్నీ మాన్పించేడు. మాష్టారు, ఆర్థిక స్థోమతు లేని విద్యార్థులకు మాత్రం ఎప్పటి వలె ఉచితంగా ట్యూషన్లు కొనసాగించేరు. ఒక పూట టేక్సీ చేయించుకొని మాష్టారి కుటుంబం నలుగురూ విజయనగరం వెళ్ళేరు. శర్మ, మేనత్తకు కంచిపట్టుచీర, మామయ్యగారికి పట్టుపంచల చాపు, బహూకరించేడు. ఉభయులూ ఉప్పొంగిపోయేరు. ఇద్దరూ మాష్టారిని ప్రశంసించేరు. “నందవలసలో పూజారి కాను, అని, కాలంతోబాటు మారి, పిల్లలిద్దరినీ అభివృద్ధిలోనికి తెచ్చేవు.” అని కొనియాడేరు. ఇద్దరూ అందులో కళావతి పాత్రను కూడా మెచ్చుకొన్నారు.
ఆ సందర్భంలో, వరలక్ష్మి గతాన్ని ఒకమారు జ్ఞప్తికి తెచ్చుకొంటూ, మరదలుతో ఇలా అంది.
“నీకు తెలుసో లేదో గాని, మీ ఆయన, బాగా చిన్నప్పుడే.. మా ఊళ్ళో రెండో క్లాసు పాసయ్యేడు అప్పుడు; వాడిని అడిగేను; నాన్నగారిలాగ పూజారివి అవుతావా, అని. అడ్డంగా బుర్ర ఊపేడు. పూజారిని అవ్వనన్నాడు. చదువుకొని ఉద్యోగం చేస్తానన్నాడు.” అని చెబుతూ, “కాలంతోబాటు మారాలి, అని అప్పటినుండీ వాడి బుర్రలో ఉండేది.” అని చిరునవ్వుతో అంటూఉంటే, మాష్టారు కూడా చిరునవ్వుతో స్పందించేరు.
బ్రహ్మకపాలంలో చనిపోయిన వారికి పిండప్రదానం చేస్తే, వారికి పునర్జన్మనుండి విముక్తి కలుగుతుందని, అనేక హిందువుల నమ్మకం. మాష్టరుగారికి, చాలా కాలం నుండి, తన తల్లిదండ్రులకు, బదరీనాథ్ సమీపాన ఉన్న బ్రహ్మకపాలంలో పిండప్రదానం చేయాలని ఉండేది.కాని, పరిస్థితులు అప్పట్లో అనుకూలించలేదు. మారిన అనుకూల పరిస్థితులలో, పిల్లలిద్దరి పెళ్లి జరిపించేక, తీర్థయాత్రలు చేసుకోవాలని దంపతులిద్దరూ ప్రణాళిక వేసుకొన్నారు. అందులో భాగంగా, మిక్కిలి శీతల ప్రదేశమయిన, బ్రహ్మకపాలం, వయసు మళ్లక మునుపే, వెళ్లాలని నిశ్చయించుకొన్నారు. ఆ ఆలోచనలన్నీ, పిల్లలిద్దరూ కాలేజీలో ఉన్న రోజుల్లోనే, ఒక రోజు నలుగురూ కూర్చొని ఉన్నప్పుడు, ఏదో మాటల సందర్భంలో, మాష్టారు వెలిబుచ్చేరు. శర్మ మాసూరీలో ఉన్న రోజుల్లో, తన కొలీగ్ ఒకరు, తన చిన్నతనంలోనే పోయిన తండ్రికి పిండప్రదానం చేయడానికి బ్రహ్మకపాలం వెళ్ళేడు. ఆ విషయం, శర్మకు తెలిసింది. గతంలో తండ్రి వెలిబుచ్చిన కోరిక జ్ఞప్తికి వచ్చింది. కన్నతండ్రి కోరిక తీర్చదలచుకొన్నాడు. ఆ విషయం నలుగురూ ఉన్నప్పుడు లేవనెత్తేడు. “మీ పెళ్లిళ్లు కానీ.” అన్నారు, మాష్టారు. “అత్తా మామయ్యగారికి కూడా ఏర్పాట్లు చేద్దామనుకొంటున్నాను. మామయ్యగారు పెద్దవారయిపోతున్నారు. వచ్చే నెలలో వెళ్ళడానికి తయారుగా ఉండండి. ఆ తరువాత, బాగా చలి ఎక్కువ అవగానే, వెళ్లడం కుదరదు. బదరీనాథ్ దేవాలయం మూసీస్తారు. అత్తా మామయ్యగారికి కూడా చెప్పండి. నేనూ ఉత్తరం రాస్తాను,” అని చార్ ధామ్ యాత్రకు తల్లిదండ్రులను సన్నాహ బరచేడు. ఆ సమయంలో, సూరమ్మగారు ఉండడం వలన, తనకే ఇబ్బంది ఉండదని, మంగమ్మ హామీ ఇచ్చింది.
తండ్రినడిగి తేదీలు నిర్ణయించేడు. ఢిల్లీ లోని తన స్నేహితుని సంప్రదించి, తదనుగుణముగా ఢిల్లీనుండి చార్ ధామ్ యాత్రకు, యాత్రా స్పెషల్ బస్సులో నలుగురకు రేజర్వేషను చేయించేడు. విశాఖపట్నం నుండి ఢిల్లీకు, రైలులో ఫస్టు క్లాసులో రేజర్వేషను చేయించేడు. తిరిగి విధులలో చేరేడు.
శర్మ రాసిన ఉత్తరం చదువుకొని, శాస్త్రిగారు, వరలక్ష్మి చాలా సంతోషించేరు. శాస్త్రిగారు, “వరాలూ, నువ్వంటే మేనత్తవి. కాని, నేనంటే కూడా ఎంత గౌరవం, ఎంత అభిమానం, శర్మకు.” అని మెచ్చుకొన్నారు, శర్మను.
“అవునండీ, కలెక్టరు పని చేస్తున్నా, ఎంతో వినయంగా ఉన్నాడు. మరొకరు అయితే, భూమి మీద నడవరు.” అని తనూ ప్రశంస చేసింది, మేనత్త.
“వరాలూ, అమ్మలుకు కూడా మనమంటే చాలా గౌరవం, అభిమానం. మొన్న మనం వెళ్ళినప్పుడు చూడు; ఆ రోజు సాయంత్రం తలనొప్పిగా ఉందని నేను అనగానే, మొహమాటానికి నేను ఎంత వద్దన్నా; వెంటనే అమృతాంజనం తెచ్చి, నా నుదుట రాసింది. డాక్టరు చదువు చదువుతున్నా, ఏమీ భేషజం లేదు. అంతా పిల్లల పెంపకంలో ఉంటుంది, వరాలూ.”
“అవునండీ, మా తమ్ముడికి, మనమంటే గౌరవం, అభిమానం. అదే పిల్లలికి వచ్చింది.”
“వరాలూ, ఇంట్లో పెద్దవాళ్ళు, బంధువుల గూర్చి మంచి గాని, చెడు గాని, పిల్లల ముందు తరచూ మాట్లాడుతూ ఉంటే, అది పిల్లల మీద పని చేస్తుంది. ఇంట్లో, వాళ్లు పెరిగిన వాతావరణమే, వాళ్ళ ప్రవర్తనకు దారి చూపిస్తుంది.” పిల్లల పెంపకం విషయంలో ఒక ముఖ్య సూత్రం చెప్పేరు, శాస్త్రిగారు.
మాష్టారి దంపతులు, శాస్త్రిగారి దంపతులు, యాత్రకు విశాఖపట్నంలో బయలుదేరి, ఢిల్లీ చేరుకొన్నారు. వారు ఒకరోజు బడలిక తీర్చుకోడానికి, శర్మ ఢిల్లీలో ముందుగా ఏర్పాట్లు చేసేడు. ఆ మరునాడు, నలుగురూ యాత్రాస్పెషలులో బయలుదేరేరు. ఆ బస్సులో, మరో రెండు తెలుగు కుటుంబాలు కూడా ఉండేవి. వారితో ఇష్టాగోష్టి జరుపుతూ, నలుగురకు బాగా కాలక్షేపం అయింది. హరిద్వార్ చేరుకున్నాక నలుగురూ గంగాస్నానం చేసి, లక్ష్మణ్ ఝూలా సందర్శించేరు. యాత్ర ముందుకు సాగింది. యాత్రికులు, హిమాలయాల ప్రకృతి సౌందర్యము ఒక ప్రక్క, నిర్మల జలాలతో, పరవళ్లు త్రొక్కుచూ ప్రవహించుచుండెడి, పవిత్ర గంగానది మరియొక ప్రక్కా, కళ్లప్పగించి చూస్తూండేవారు. అది, భువియా, దివియా, అనే అనుభూతి పొందుతూండేవారు. యాత్రికులు, యమునోత్రి సందర్శించుకొని, గంగోత్రి చేరుకొన్నారు. ఆకాశంబుననుండి, శంభుని శిరంబందుండి, సుశ్లోకంబైన హిమాద్రి, ఆ పవిత్ర స్థలంలోనే, భూమిపై తొలి అడుగు వేసిందని మన పురాణాలు చెప్తాయి. అది నా ఘనతే అని సగర్వంగా చెబుతుంది, అచ్చట భాగీరథీ నదీ తీరాన్న ఉన్న, భగీరథుని శిలావిగ్రహం.
యాత్ర ముందుకు సాగింది. బస్సు బదరీనాథ్ చేరుకొంది. ఎముకలు కొరికేస్తున్న చలి. నలుగురూ ప్రొద్దుటే లేచేరు. స్నానానికి వేడినీటి సదుపాయం ప్రసక్తే లేదు. నలుగురూ, చల్లని చన్నీళ్ళలోనే స్నానం చేసి, కాలి నడకన, దగ్గరలోనే ఉన్న బ్రహ్మకపాలం చేరుకొన్నారు. మాష్టారు, శాస్త్రిగారు, తమ తల్లిదండ్రులకు భక్తి శ్రద్ధలతో పిండప్రదానం చేసేరు. మాష్టారి చిరకాలపు కోరిక తీరింది. కోరిక తీర్చిన పుత్రరత్నాన్ని దంపతులిద్దరూ కొనియాడేరు. శాస్త్రిగారు, “నేను ఈ యాత్రగూర్చి విన్నాను గాని, చేసుకొనే ఆలోచన కూడా నాకు రాలేదు. భగవత్సంకల్పం లేనిదే, ఈ యాత్ర ఎవరూ చేసుకోలేరు. ఆ భగవంతుడే కలెక్టరుగారి చేత చేయించేడు.” అని చమత్కరిస్తూ, శర్మను అభినందించేరు. ఆ పిమ్మట, బదరీనారాయణ దేవాలయంలో, విష్ణుదర్శనం చేసుకొన్నారు.
బస్సు, ఆఖరి యాత్రాస్థలమయిన కేదారనాథ్‌కు బయలుదేరింది. గౌరీకుండు చేరుకొంది. ఆ పై బస్సు మార్గం లేదు. అక్కడకు సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది, కేదారనాథ్. సన్నని కాలిబాటే శరణ్యం. ఆ స్థలం 11657 అడుగుల ఎత్తున ఉండడం వలన, అచ్చట భరింప శక్యము గాని చలితోబాటు, ప్రాణవాయువు కొరతకూడా ఉంటుంది. ముందు జాగ్రత్తగా యాత్రికులందరూ ఆక్సిజను సిలిండరులు అద్దెకు తీసుకొన్నారు. ఆ పదమూడు కిలోమీటర్లూ, యాత్రికులు, గుర్రాలు, పోనీలు, పల్లకీలపై ప్రయాణిస్తారు. మాస్టారు, శాస్త్రిగారు, చెరో పోనీ అధిష్టించేరు. ఆడవాళ్ళిద్దరూ, చీరలు ధరించి ఉండడం వలన, చెరో పల్లకీ ఎక్కేరు. అష్టకష్టాలు పడి, నలుగురూ కేదారనాథ్ చేరుకొన్నారు. రద్దీగా ఉన్న దేవాలయం లోనికి, శ్రమపడి ప్రవేశించేరు. ఆ దేవాలయంలోని శివలింగం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. శాస్త్రిగారి ఆధ్వర్యంలో నలుగురూ ఆ జ్యోతిర్లింగానికి, పూజ చేసుకొన్నారు.
చార్ ధామ్ యాత్ర, సంతృప్తికరంగా ముగించుకొని, నలుగురూ ఇళ్లకు క్షేమంగా చేరుకొన్నారు.
శర్మకు రెండేళ్ల ట్రైనింగు పూర్తయింది. రాజమండ్రీలో S.D.M. గా ఉద్యోగంలో చేరేడు. మంగమ్మకు నాలుగున్నర సంవత్సరాల కాలేజీ చదువు పూర్తయింది. అప్పటికి మరో సంవత్సరం, హౌస్ సర్జనుగా పని చేస్తే, డాక్టరు డిగ్రీ చేతికి వస్తుంది.
మంగమ్మ, తన వివాహ విషయం, దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేది. ఆ విషయంలో, పెద్దల ముందు, గతంలో మూడేళ్లు గడువు కోరింది. ఆ గడువులో, మరొక్క సంవత్సరం మిగిలి ఉందని, లెక్కలు చూసుకొంది. ఆ గడువు తీరే లోపున, తనకు సరియగు జీవితభాగస్వామిని ఏ విధంగా నిర్ణయించుకోవాలి, అని, పరిపరి విధాల యోచిస్తూ ఉండేది. గతంలో మంగమ్మకు ఇద్దరు సీనియర్లు ప్రొపోజ్ చేసేరు. వారిలో ఒకడు మిక్కిలి ధనవంతుల కుటుంబంలో పుట్టేడు. “నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి.” అని అతనిని మంగమ్మ అడిగింది. తను మెడిసినులో పి. జి. చేస్తానన్నాడు. మంగమ్మ గైనకాలజీలో పి. జి. చేస్తే, ఇద్దరూ కలసి, అన్ని ఎక్విప్మెంట్స్ తోనూ, హాస్పిటలు ఓపెన్ చేద్దామని భావిస్తున్నాను, అన్నాడు. దానికి గిరాకీ బాగా ఉంటుందని హామీ ఇచ్చేడు. మంగమ్మకు జీవితంలో ధనార్జనపై మోహం ఉండేది కాదు. తెలివయినది. సీనియరును అర్థం చేసుకొంది. అతడు ప్రేమించేది, మంగమ్మను కాదు. మంగమ్మ ధనార్జన, అని. సున్నితంగా తిరస్కరించింది.
తనకు ప్రొపోజ్ చేసిన, రెండవ సీనియర్నూ, మంగమ్మ అదే ప్రశ్న, “నీ ఫ్యూచరు ప్లాన్స్ ఏమిటి.” అని అడిగింది. “నేను అమెరికాలో రెసిడెన్సీ చేసి, అక్కడే సెటిల్ అవుతాను.” అని సగర్వంగా చెప్పేడు. దానికి స్పందిస్తూ, “నాకు అటువంటి ఆలోచనలు లేవు. నేను మన దేశంలోనే ఉద్యోగం చేసి సెటిల్ అవుతాను.” అని తన ధృడ నిశ్చయాన్ని తెలిపింది, మంగమ్మ.
“నీవంటి తెలివయినవాళ్లు, ఈ దేశంలో ఉండిపోతే, వేస్ట్ ఆఫ్ టేలెంట్.” అని సలహా ఇచ్చేడు. “దేశంలోని డాక్టర్లు అందరూ, అమెరికా ఇంగ్లండు వెళిపోతే, ఇక్కడ మనదేశంలో కూడా కొందరయినా ఉండాలికదా. So let me stay here.” అని హాస్యం మేళవిస్తూ, అతనినీ తిరస్కరించింది.
మంగమ్మ తోటి విద్యార్థినులలో, ఇద్దరుకు వివాహమయి అప్పటికి సుమారు ఒక ఏడాది అయింది. వారి అనుభవాలు అడిగి తెలుసుకొంది. ఆ రెండూ, పెద్దలు కుదిర్చిన వివాహాలే. ఇరుప్రక్కలా, పెద్దల మధ్య ఉత్తరప్రత్యుత్తరాలు, వధూవరుల ఫోటోల మార్పిడి, వధువు ఇంట పెళ్లి చూపులు అయిన తరువాత జరిగిన వివాహాలే, ఆ రెండున్నూ. ఆ ఇద్దరిలో ఒకామె, అన్నివిధాలా సంతృప్తిగా ఉన్నానని చెప్పింది. రెండవ విద్యార్థిని, తప్పుడు నిర్ణయం తీసుకున్నానని పశ్చాత్తాపపడేదిట. పుట్టి పెరిగిన తన ఇంటి వాతావరణానికి, అత్తవారింటి వాతావరణానికి, పొందిక లేదట. భర్తకు త్రాగుడు అలవాటు ఉన్నదని ముందుగా తెలియలేదట. ఆ అలవాటు, ఆరోగ్యానికి హానికరమని, భవిషత్తులో, పిల్లలకు కూడా ఆ అలవాటు రాగలదని, సలహా ఇచ్చిందట. తన వ్యక్తిగత విషయాలలో ఎప్పుడూ కలుగజేసుకోవద్దని భర్త కఠినంగా హెచ్చరిక చేసేడుట. ఆ వ్యక్తితో జీవించలేనని నిర్ణయానికి వచ్చిందట. డైవోర్సు యోచనలో ఉన్నానని చెప్పిందట.
తన జీవిత భాగస్వామిని, ఏ విధంగా నిర్ణయించుకోడం అని, మంగమ్మ మనసు గందరగోళంలో పడ్డది. తల్లిదండ్రులు ఏర్పరిచిన పెళ్లిచూపులతోనా, లేక అతని వ్యక్తిగత వివరాలన్నీ, తనే సేకరించిన తరువాతా; ఏది సరయినదని, తేల్చుకోలేకపోతోంది. తల్లిదండ్రుల సమ్మతి లేకుండా పెళ్లి చేసుకోదలచలేదు. సింహావలోకనం చేసుకొంది. గత కొన్నిమాసాలనుండి, వివేకమూర్తి అనే సహాధ్యాయుడు, మంగమ్మను తరచూ కలుస్తూ ఉండేవాడు. కాని ప్రొపోజ్ చేయలేదు. కలసినప్పుడు, ఏదో ఒక విషయం చర్చిస్తూ ఉండేవాడు. ఆసుపత్రిలో, రోగులకు అందిస్తున్న సేవలలో, ధనికులకున్న ప్రాధాన్యత సామాన్యులకు లేదని, మంగమ్మ ఆలోచనతో ఏకీభవించేడు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ, అని, ఇండియాలోనే ఎప్పటికీ ఉంటానన్నాడు. ఆ విషయంలో మంగమ్మ అభిప్రాయం అడిగి తెలుసుకొన్నాడు. అలాగే, ఒకే మారు గాకుండా, అంచెలంచీలమీద, మరో విషయం మాట్లాడుతున్న సందర్భాలలో, మంగమ్మ కుటుంబం గూర్చి తెలుసుకున్నాడు. అప్పటి రాజకీయాలు కూడా ఇద్దరూ చర్చిస్తూ ఉండేవారు. మంగమ్మతో స్నేహితుడుగానే ప్రవర్తిస్తూ ఉండేవాడు. లక్ష్మణ రేఖ దాటలేదు. మంగమ్మ మీద మనసుపడ్డాడు. కాని, తన కుటుంబ వివరాలు అన్నీ ఆమెకు తెలియబరచకుండా ముందడుగు వేయదలచుకోలేదు. ఆమె అడగకుండా అవి ఎలా తెలియబరచడం; సంధిగ్ధంలో పడ్డాడు.
మంగమ్మ, వివేకమూర్తి గూర్చి ఆలోచించింది. తన కుటుంబం వివరాలు, తన ఇష్టాయిష్టాలు అడిగి ఎందుకు తెలుసుకొన్నాడు. అన్నీ తెలుసుకున్నాక, ఎందుకు ప్రొపోజ్ చెయ్యలేదు. లేక, అటువంటి ఆలోచనే లేదా. తను ఆ విషయంలో స్పందిస్తూ ఏ సంకేతమూ ఈయలేదని ముందుకు అడుగు వేయలేదా. కొంత కాలంనుండి, తనకు తెలిసినంతవరకు, వివేకమూర్తి తెలివయినవాడు. ప్రవర్తనలో ఏ లోపమూ లేదు. ఆ విధంగా అన్ని కోణాలనుండి ఆలోచించింది. ఒక నిశ్చయానికి వచ్చింది. అతని కుటుంబ వివరాలు, ఇష్టాయిష్టాలు, మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకొందాము అనుకొంది. ఆ సేకరణ అతను తనకు సరైన జోడీ అవునో కాదో తెలుస్తుందని భావించింది. అదీ కాక, వివేకమూర్తి తననుండి సంకేతాలు కొరకు ఎదురు చూస్తూ ఉంటే కూడా లాభిస్తుంది అనుకొంది. మంగమ్మ తన ప్రణాళికను అమలులో పెట్టింది.
మంగమ్మ సేకరించిన వివరాలు; వివేకమూర్తి తండ్రి ప్రకాశరావు రాజమండ్రీలో లాయరు వృత్తిలో ఉన్నాడు. బ్రాహ్మణుడు. అతని భార్య ఇందిర కూడా లాయరు. వైశ్యుల కుటుంబానికి చెందినది. ఆమె కుటుంబీకులు అందరూ శాకాహారులే. గత తరమునుండి ఆ రెండు కుటుంబాలు ఇరుగు పొరుగున నివసిస్తున్నారు. మిక్కిలి సాన్నిహిత్యంతో ఉంటూంటారు. ఒకరింట ఒకరి భోజనాలు తరచూ జరుగుతూ ఉంటాయి. ప్రకాశరావు, ఇందిర, చిన్నప్పటినుండి కలసి మెలసి పెరిగేరు. వారి వివాహము పెద్దలు కుదిర్చినదే. ఇందిర ఆచారవ్యవహారాలు అన్నీ బ్రాహ్మణ సాంప్రదాయము. మంగమ్మ, వివేకమూర్తి ఇష్టాయిష్టాలు తెలుసుకొంది. చాలవరకు అవి తనవాటితో కలిసేయి. అన్ని వివరాలూ తర్కించుకొంది. వివేకమూర్తి తన జీవితంలో సరియగు జోడీ అనుకొంది. కాని, అతని తల్లిది వైశ్యుల కుటుంబం. వారి వివాహానికి అది పెద్ద అడ్డంకి కావచ్చు. అవన్నీ అటు ఉంచినా, మూర్తి మనసు తెలియలేదు. వేచి చూద్దాము అనుకొంది.
అటు వివేకమూర్తి ఆలోచనలో బడ్డాడు. మంగమ్మ తన కుటుంబ వివరాలు, ఇష్టాయిష్టాలు, ఎందుకు అడిగి తెలుసుకొంది. తనను కోరుకొంటోందా. ఒకవేళ కోరుకొంటున్నా; ఆడపిల్ల; ఇటువంటి విషయాల్లో, ఆడవారు ముందుగా మనసు విప్పరు. అందుచేత, తనే ప్రొపోజ్ చేసి చూద్దాం, అనుకొన్నాడు. అవునో, కాదో, తెలిసిపోతుంది, అని.
వివేకమూర్తి, ఒక రోజు, సమయం చూసుకొని, మంగమ్మ ముందు తన మనసు విప్పేడు. మంగమ్మ, దాపరికం లేకుండా, వ్యక్తిగతంగా తనకు అభ్యంతరం లేదంది. విషయం విపులంగా తల్లిదండ్రులతో చర్చించాలి, అంది. వారి సమ్మతి అవసరం, అని మర్యాదపూర్వకంగా చెప్పింది. మూర్తి, పెద్దలయెడ మంగమ్మకున్న గౌరవాన్ని మెచ్చుకున్నాడు. తనూ, తన తల్లిదండ్రులతో ఆ విషయం మాట్లాడాలి, అన్నాడు.
మంగమ్మ, ఆ విషయం తల్లిదండ్రులతో మాట్లాడే ముందు, అన్న అభిప్రాయం తెలుసుకోవాలి అనుకొంది. ఒక ఆదివారం, అన్నకు ఫోను చేసి, విషయం వివరంగా చెప్పింది. అన్న అభిప్రాయం అడిగింది.
“చెల్లీ, నువ్వు ఎవరితో జీవితమంతా గడపాలో, ఆ వ్యక్తి గూర్చి వీలయినన్ని వివరాలు తెలుసుకోడం మంచిది. నువ్వు అది చేసేవు. అదీకాక, మూర్తిని నీకు నాలుగు సంవత్సరాలనుండి తెలుసు. పూర్తిగా శాటిస్ఫయిడుగా ఉన్నానన్నావు. నామట్టుకు నాకు ఎట్టి అభ్యంతరమూ లేదు. కాని, చెల్లీ, మన అమ్మ, నాన్నగారు; They belong to previous generation. వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయమ్మా. మూర్తి తల్లిగారి కులం విషయంలో, వాళ్ళు కాంప్రమైజ్ అవుతారనుకోను.”
“అన్నా, మూర్తి తండ్రిగారు, మనవాళ్లేగదా. అందుచేత, మూర్తి బ్రాహ్మడుకిందే వస్తాడు గదా.”
“you are right. కాని మన వాళ్ళు, అతని తల్లి కేస్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారమ్మా. ఆ విషయంలో వాళ్లని ఒప్పించడం కష్టమనుకొంటాను.”
“ఎవరు పెట్టేరో ఈ కేస్ట్ సిస్టం. Meaningless. బ్రాహ్మడి రక్తం, వైశ్యుడి రక్తం వేరువేరుగా ఉంటాయా. అందరి ఎనాటమీ ఒకటే.” అని కేస్ట్ సిస్టం మీద తన అభిప్రాయాన్ని, చెప్పింది.
“నిజమేనమ్మా. ఎప్పుడో శంకరాచార్యులవారే చెప్పేరు; మనుష్యులందరిలోనూ ఉన్న ఆత్మ ఒకటే అని. తరతరాల వెనక, అప్పటి వారు ఒక సదుద్దేశంతో పెట్టేరు, ఒక సిస్టంను. అందరూ, అన్ని పనులూ చేసుకోవడం లోని కష్టనష్టాలు చూసి, ఉన్నవారిలో, ఎవరెవరి నైపుణ్యాని బట్టి, వారికి పనులు కేటాయించేరు. Division of labour. రానురాను, ఆ పద్ధతిని దుర్వినియోగం చేసి, జాతుల మధ్య ఇనపగోడలు సృష్టించేరు. నువ్వు అన్నది నిజమే. I fully agree with you.”
“అయితే ఇప్పుడు నన్ను ఏమిటి చేయమంటావు, అన్నా.” అయోమయంలో ఉన్న మంగమ్మ, అన్న సలహా కోరింది.
“Don’t give up. దేముడిమీద భారం వేసి, అమ్మా నాన్నగార్లతో, విషయం మాట్లాడు. Don’t argue. Try to convince them. Wish you good luck.”
అన్నతో మాట్లాడిన తరువాత, మంగమ్మ మనసులో కొంత భారం తగ్గింది. తల్లిదండ్రుల నిర్ణయం ఎలాగున్నా; కనీసం, అన్న తనను సమర్థిస్తున్నాడని.
(సశేషం)
శ్రీ గరిమెళ్ళ వెంకట లక్ష్మి నరసింహం నవంబరు, 1936 లో జన్మించారు. M.A. మరియు P.G. Diploma in Personnel Management పాసయ్యారు. ఉద్యోగ పర్వం, హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రారంభించి, పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఒక ఉన్నతాధికారిగా చేసి, 1994 లో విశ్రాంతి తీసుకొన్నారు. అమెరికా వాసి.
హైస్కూలు విద్యార్థిగా రంగస్థల ప్రవేశం చేసేరు. గడచిన అయిదు సంవత్సరములవరకు, చిన్న నాటికలు రాసి, వాటిలో పాత్రలు ధరించి, దర్శకత్వం చేసేరు.
గత అయిదు సంవత్సరాలనుండి, కథలు, కవితలు రాయడం ప్రారంభించేరు. ఈ నాటికి, 25 కథలు, 3 కవితలు ప్రచురణమయ్యేయి.