[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘కాన్పు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
సప్తపది నడకలు దాటిన తీపి వెన్నెల ఆనందం
సంసార బంధం ఆటుపోట్ల తరంగిణి మందహాసం
ఆడిపాడిన ప్రేమలో కొత్త ప్రాణం
బాలనాగమ్మో చిన్ని చంద్రుడో బాల సూర్యుడో అరుంధతో
లాలిజో అమ్మమ్మ జోలపాట ఊయల
నవమాసాలు చెప్పలేని రాయలేని జనన జీవకావ్యం
ఆటాపాటల ఉమ్మినీరు ఈత
తల్లి సహజ ఏ.సి.గదిలో మమతానుబంధాల రాగమాల
అమ్మ ఆత్మ పంచుకున్న ఆత్మీయ బొడ్డుతాడు
తనువంత మనసు, కనులంత వెలుగునింపిన రుద్రవీణ అమ్మ
కాన్పు ఓ సరికొత్త కళ
ప్రసవ వేదన జన్మజన్మల వసంతం
కొత్త నలుసు మగ్న సంగీతమే అమ్మ నిత్య గీతాంజలి
మరణం అంచుల చుట్టేసే మలయమారుతం ప్రసవం
వదనసీమల మెరిసే ముత్యాల చెమట బిందువుల శబ్దనిశ్శబ్దం
వైద్యుని దోసిళ్ళ ఏది జారుకొచ్చినా
గట్టిగా పొదివి పట్టేదే వృత్తిస్పర్శ
సజీవనిర్జీవమేదైనా
శిశువైనా అమలిన మలమైనా
పట్టడమే మనసున ఆనంద నర్తనం
కాన్పు
తలతో శిశువు బయటపడ్డం క్షేమం
ఎదురుకాళ్ళతో జననద్వార యాత్రే ఆందోళన, అపాయం
ప్రసవ వేదన
అన్ని బాధలకన్నా గొప్ప తీపి బాధ
మమకారం పంచిన కన్నపేగు బంధం
స్వర్గంలో తేలవచ్చు, కొండొకచో అగాథంలోకి జారొచ్చు
సాధారణ కాన్పు వీలుగాక
డెలివరీకి అతి కష్టమైన
సిజేరియన్ సెక్షన్ అనివార్యం
తల్లీపిల్లా ప్రాణాల పరిరక్షణకై
డాక్టర్ దేవుడో ఆరోగ్య రక్షకుడో
ఎవరి నమ్మకం వారిదే
కాన్పు కాన్పుకూ వెంటాడే
మరణాన్ని జయించడమే సురక్షిత క్షేమప్రసూతి
ఆ డాక్టర్ మనసు మాట, చూపు అన్నీ ప్రసవ యజ్ఞంపైనే
దేవుణ్ని, వైద్యుణ్ని నమ్మిన చోటే
దేవుని రూపంలో వైద్యుడు అందించేను గొప్ప బహుమతి
మహా క్రతువులో శక్తిమీర..
అన్నీ త్యాగంచేసే మౌనవీణ
ప్రసూతి వైద్యుల చేతుల శక్తియుక్తితో
అజేయమైన గెలుపు పుస్తకంలో
నృత్యంచేసేను మదర్ అండ్ బేబి
చదువుతున్న పేజీల్లో ఆనందం
తణికిసలాడే మానవీయ సంతోష సంద్రం డాక్టరే మరి
డా.టి.రాధాకృష్ణమాచార్యులు సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి,రచయిత, అనువాదకులు, సమీక్షకులు.
5 సంకలనాలు తెలుగు కవిత్వంలో 1999 నుండి కరీంనగర్ నుండి పబ్లిష్ చేశారు. నలిమెల భాస్కర్ ‘సాహితీ సుమాలు’ వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots” Title తో ఆంగ్లంలోకి అనువాదం చేసినారు.
