ఓ ఆలోచనా కాస్త ఆగవా
నేను శ్వాస తీసుకోవాలి.
ఓ కాలమా కాస్త ఆగవా
నన్ను నేను పరిశీలించుకోవాలి.
ఓ ఇంద్రియమా కాస్త ఆగవా
నా మనసుకు దారి వెతుక్కోవాలి.
ఓ ఉదయమా కాస్త ఆగవా
నాలో కల్మషాల్ని కడిగివేయాలి.
ఓ ఋతువా కాస్త ఆగవా
నేను రంగు మూలల్ని కనుక్కోవాలి.
ఓ ఆకాలా కాస్త ఆగవా
నేను అమ్మతత్వం అర్థం చేసుకోవాలి.
ఓ దాహమా కాస్త ఆగవా
నేను అమృతత్వం తోడు కోవాలి.
ఓ అసహనమా కాస్త ఆగవా
నేను గురు చరణాల్ని సేవించుకోవాలి.
ఓ కత్రుత్వమా కాస్త ఆగవా
నేను అభయహస్తాన్ని ఆశ్రయించాలి.
ఓ ద్వందమా కాస్త ఆగవా
నేను ఒక్కటిలో లీనమైపోవాలి.
విస్సాప్రగడ వేంకట కృష్ణ సాయి స్వస్థలం ఏలూరు. సర్ సి అర్ అర్ కాలేజ్ లో పట్టభద్రులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో కొద్ది కాలం పనిచేసి, 1997 లో అమెరికా వలస వెళ్లి బోస్టన్ పరిసర ప్రాంతంలో స్థిరపడ్డారు. వృత్తి రీత్యా సమాచార సాంకేతిక (IT) రంగంలో చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. కాలేజీ రోజుల నుంచి కవితా సాహిత్యం పై మక్కువ. ఏవో చిన్న చిన్న పద కవితలు వ్రాసుకుని బంధువర్గం తోను మిత్రుల తోను పంచుకుని సంతోషపడేవారు. ప్రముఖుల రచనలు చదవడం ఇష్టం. బోస్టన్ పరిసర ప్రాంతాల తెలుగు సంఘం మరియు న్యూ ఇంగ్లాండ్ షిరిడి సాయి పరివార్ దేవాలయంలో స్వచ్ఛంద స్వేచ్ఛా శ్రమదానం చేయడం ఇష్టపడతారు.