Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కావమ్మగారి వ్లాగ్!

[శ్రీమతి మాలా కుమార్ రచించిన ‘కావమ్మగారి వ్లాగ్!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

“ఒరేయ్ విట్ఠయ్యా.. విట్ఠయ్యా” సెల్ మాట్లాడటము అవుతూనే గట్టిగా పిలిచింది కావమ్మ.

“అబ్బా.. గుండమ్మ కథలో గుంటనక్క గంటయ్యను పిలిచినట్లు ఏమిటా పిలుపు?” విసుక్కుంటూ వచ్చాడు విఠల్.

“ఏం చేయమంటావురా? మా నాన్న పేరు పెట్టాలీ అని మీ నాన్న వాళ్ళ నాన్న పేరు పెట్టారా! మామగారి పేరు పెట్టి ఎట్లా పిలుస్తారా? అందుకేగా రంగారావుకు, పండరీపురం వెళ్ళి వచ్చాక ఆ విఠలుడి దయతో పుట్టావని విఠల్ అని కలుపుకున్నానా?” మామగారి పేరు ఉచ్చరించినందుకు, సుతారంగా చెంపలు వాయించుకుంటూ గదమాయించింది కావమ్మ.

“ఎప్పుడూ ఉండేదేగా ఈ గోల! అసలు ఎందుకు పిలిచావో చెప్పు” అడిగాడు పాండురంగ విఠల్!

“మా వేలు విడిచిన మేనల్లుడు జగన్నాథం, వాడి కుటుంబంతో స్వామివారి దర్శనానికి వస్తున్నాడట. కొండకు వెళ్ళే ముందు మనింటికి వచ్చిపోతానని, ఇప్పుడే చెప్పాడురా” బంధుప్రీతి కావమ్మ మొఖం చాటంత చేసుకొని, సంబరపడిపోతూ చెప్పింది.

“ఎవరమ్మా ఆ జగన్నాథం? గుర్తు రావటం లేదే?” సాలోచనగా అడిగాడు విఠల్.

“నువ్వు చూడలేదులేరా! వాడి చిన్నప్పుడే వాళ్ళ నాన్న బొంబాయ్ వెళ్ళాడు. అప్పటి నుంచి రాకపోకలు లేవులే! ఇన్నాళ్ళకు వస్తున్నాడు. ఎప్పుడో వాడి చిన్నప్పుడు చూసాను. మళ్ళీ ఇన్నాళ్ళకు చూడబోతున్నాను. చిన్నప్పుడు భలే అల్లరి చేసేవాడు. కావక్కా.. కావక్కా.. అంటూ నన్ను వదిలేవాడు కాదు. ఆ వెంకన్న దయవలన మీ నాన్నగారికి ఇక్కడ ఇంజనీర్ గా ఉద్యోగం రావటంతో ఎక్కడెక్కడి బంధువులూ కలుస్తున్నారు” మురిపెంగా అన్నది కావమ్మ.

“నూటికి ఒక్కటే తక్కువ

వేటి వేటి బంధువులు,

బాబోయ్ ఏమని పొగిడెద

బంధువుల సేన మనది,

బ్రహ్మాండంగా.. ఆ.. ఆ..”

“ఏమిట్రా రావుడూ? ఏమో అంటున్నావు?” అనుమానంగా అడిగింది కావమ్మ.

పక్కనే లాప్‌టాప్ మీద పని చేసుకుంటున్న రమేష్ “ఏమి లేదు బామ్మా, మనకు బంధువుల సేన చాలా ఉందే అని పొగుడుతున్నాను” జవాబిచ్చాడు.

రాధ కాఫీ తెచ్చి, భర్తకూ, అత్తగారికి ఇస్తూ “అత్తయ్యా, మరి మనం పెళ్ళికి వెళ్ళాలి కదా! వాళ్ళు వస్తే ఎట్లా వెళతాము?” అడిగింది.

“వాడికీ వరుస అన్నయ్య కూతురే అవుతుంది కదే, వాళ్ళూ ఆ పెళ్ళికి వస్తారట” జవాబిచ్చింది కావమ్మ.

“ఎవరి పెళ్ళికి వెళుతున్నారు బామ్మా? ఆ అమ్మాయి మాకేమవుతుంది?” అడిగాడు రమేష్.

“మీకు మామయ్య కూతురవుతుందిరా. మీరూ రావాలి పెళ్ళికి సరదాగా” మనవడు ఎందుకు అడిగాడో అర్థం కాక రమేష్ వైపు చూస్తూ అంది.

“ఇంట్లో ఇక్కడ ఇద్దరం, హైద్రాబాద్‌లో ఒకడు బ్రహ్మచారులం బెండకాయల్లా గలగలలాడుతూ ఉన్నామే! మాకు ఆ పిల్లను చూడాలని గుర్తురాలేదా? పైగా పట్టుచీరలు, నగలు దిగేసుకొని పెళ్ళికి, మీరూ వచ్చిన చుట్టాలూ వెళ్ళటమే కాక, మేమూ రావాలా? నూటికి ఒక్కటే తక్కువ, వేటి వేటి బంధువులు! ఆ బంధువులకు ఒక్కటంటే ఒక్క అమ్మాయి కూడా లేదా! కావమ్మ వ్లాగ్ మధ్యాహ్నం రెండింటికల్లా తెరిచి, చుట్టాల పిల్లలకు ఇన్స్టా లో సంబంధాలు, జూమ్ కాల్ లో పూజలు, వాట్సప్ లో వ్రతాలు చేయిస్తావు.. కానీ మమ్మలిని మాత్రం బయటనే సిగ్నల్ దగ్గర వదిలేసావు” ఆవేశంగా, ఉక్రోశంగా అరిచాడు.

రమేష్ అరుపులకు బిత్తరపోయి చూస్తున్నారు కావమ్మ, విఠల్, రాధ!

అంతలోనే కావమ్మ తేరుకొని, “అయ్యో మనవడా! కావమ్మ వ్లాగ్ తెరవడం, పూజలు, వ్రతాలు, సమాధానాలు, సంబంధాలు చూడటం, ఫుల్ సర్వీస్ సెంటర్ అంటావు కాని.. దేనికైనా, మీకు మాచ్ మేకింగ్ KYC పూర్తి అవ్వాల్సిందే” అని అంటుండగానే..

హడావిడిగా కామేష్ లోపలికి వచ్చి, అక్కడి వాతావరణం గమనించకుండానే, రమేష్‌తో “బ్రో తొందరగా రారా, మా సినిమాలో పెళ్ళిపురోహితుడి వేషం వేసేవాడు హాండిచ్చాడు. షూటింగ్ ఆగిపోయింది. నిన్ను తీసుకొస్తానని చెప్పాను లే.. లే..” తొందర చేసాడు.

“ఒరే కావుడూ..” ఏదో చెప్పబోయింది కావమ్మ.

అప్పటికే కాస్త తేరుకున్న రాధ “కావుడూ, రావుడూ ఏమిటండీ? మీ పేరు, మామయ్యగారి పేరు పెట్టాలని, అలా పెద్దల పేర్లు పెట్టే ఆనవాయితీ ఉందని, రామారావు, కామేశ్వర్రావూ పెట్టమని మీరు గోల చేస్తే, కామేష్, రమేష్, అని పెట్టుకున్నాను. అలా పిలవలేరా?” రుసరుసలాడింది.

కోపంగా ఏదో అనబోతున్న కావమ్మ, రమేష్ “ఎహే ఆపండీ మీ పేర్ల గోల. మహా పెట్టారులే గొప్ప పేర్లు” అని ఒక్క అరుపు అరిచేసరికి మూతి తిప్పుతూ మనవడిని చూసింది.

కామేష్ నెత్తిన ఒక్క మొట్టికాయ వేసి “వీడో సినిమా పిచ్చోడు. పోయిన సారి బృందగానం పాడేవాళ్ళు హాండిచ్చారని ఏడుస్తే, పోనీ పాపం, మా గొంతూ వినిపిస్తుందని నా ఫ్రెండ్స్‌ను కూడా వెంటేసుకొని వస్తే ఎంత చెవులు చించుకొని విన్నా మేము వినిపించలేదు. ఇప్పుడేమో పెళ్ళిచేసే పురోహితుడిగా రావాలా? మన పెళ్ళి గతి లేదు కానీ ఎవరికో పెళ్ళి చేయించాలా? నీకు సిగ్గులేదురా? పెళ్ళీపెళ్ళాం అవసరం లేదా? ఇట్లా సినిమా పెళ్ళిళ్ళు నువ్వు చేస్తూ, నాతో చేయిస్తూ ఉంటావా? అవునులే ఏడ్చేవాడికి పెళ్ళాం వస్తే నాకూ పెళ్ళాం వస్తందని బేఫికర్‌గా ఉన్నావు” వడగళ్ళ వానలా దడదడలాడించిన తమ్ముడి వైపు తల తడుముకుంటూ బిక్కమొహంతో చూసాడు కామేష్!

ఇంటి ముందు ఆటో ఆగిన చప్పుడికి అందరూ అటువైపు చూసారు. ఒక్కసారిగా రమేష్ కళ్ళ ముందు మెరుపు మెరిసింది! నల్ల కార్పిస్ మీద ఆకుపచ్చ ప్రింటెడ్ షర్ట్ వేసుకొని ఉన్న ఓ అమ్మాయి చెంగున ఆటోలో నుంచి దూకింది. భుజాల వరకూ ఉన్న జుట్టును సుతారంగా వేళ్ళతో వెనక్కి తోసుకుంటూ ఎదురుగా తననే గుడ్లప్పగించి చూస్తున్న రమేష్‌ను చూసి, కొంటెగా నవ్వింది.

“ఒరేయ్ జగ్గూ రారా. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు చూస్తున్నానురా నిన్నుపెద్దవాడివి అయ్యావు. ఇది నీ కూతురా?” నోరంతా తెరిచి, సంబరంగా ఆహ్వానించింది వాళ్ళను కావమ్మ.

“ఎట్లా ఉన్నావే అత్తయ్యా? ఇది నా కూతురు ఊహ, మొన్ననే ఇంజనీరింగ్ అయిపోయింది. నా భార్య కళ్యాణి” పరిచయం చేస్తూ సూట్ కేస్ తీసుకొని లోపలికి నడిచాడు జగ్గూ అనబడే జగన్నాథం!

“ఇటియ్యండి మామయ్యా, నేను తెస్తాను” అంటూ సూట్‌కేస్ తీసుకున్న మనవడిని బుగ్గన చేయేసుకొని ఆశ్చర్యంగా చూసింది కావమ్మ.

కుశల ప్రశ్నలు, కాఫీలు అయ్యాక ముందు పెళ్ళి చూసుకొని, తరువాత స్వామివారి దర్శనానికి వెళుదామనుకున్నారు.

గులాబీ రంగుకు ఆకుపచ్చ అంచున్న పట్టులంగా, జాకెట్టూ, ఆకుపచ్చ జార్జెట్ వోణీ వేసుకొని, మెడలో చంద్రహారం, నడుముకు వడ్డాణం, చెవులకు జుంకీలు, బంగారు జడకుప్పెలతో పొడగాటి జడతో వయ్యారంగా బెడ్ రూం నుంచి వచ్చిన ఊహను కళ్ళు విప్పార్చుకొని చూస్తూ అరే ఇందాక పొట్టి జుట్టు, ఇప్పుడు పొడగాటి జడ ఇదేమి వింత అని ఆశ్చర్యంగా చూస్తున్న రమేష్‌ను ‘హాయ్ బావా’ అని పలకరించింది ఊహ చిలిపిగా నవ్వుతూ.

షూటింగ్ రేపు చూసుకోవచ్చులే పదపదమని కామేష్‌నూ బయలదేరదీసారు.

అందరూ పెళ్ళివారింటికి చేరే సరికి అక్కడ అంతా గడబిడగా ఉంది. అక్కడ కనిపించిన పెళ్ళికూతురిని చూసి నిశ్చేష్టుడయ్యాడు కామేష్! అలాగే పక్కన కుర్చీలో కూలబడ్డాడు. ఊహ చుట్టూ ఊహలల్లుకుంటూ తిరుగుతున్న రమేష్, అన్న చేయి పట్టి లాగటంతో ఏమిటన్నట్లు చూసాడు. కళ తప్పిన అన్న మొహం చూసి షూటింగ్ గురించి బాధ పడుతున్నాడేమో అనుకొని, “పరవాలేదులేరా, ఇది ప్రాక్టీస్ షూటింగే కదా! రేపు వెళ్ళవచ్చు. నువ్వు వాళ్ళకు కాల్ చేసి చెప్పావుగా” అని సముదాయించి ఏదీ ఈ పిల్ల అంతలోనే ఎటుపోయింది అని చుట్టూ చూస్తున్నాడు.

“అది కాదురా” అన్న మళ్ళీ చేయి పట్టి లాగటంతో, విసుగ్గా అటు చూసిన రమేష్ అన్న కళ్ళల్లో లీలగా తడి, మొహం అంతా గులాబీ రంగులోకి కందిపోవటం చూసి గాభరా పడ్డాడు.

పక్కన కూర్చుంటూ “ఏమయిందిరా?” అనునయంగా అడిగాడు కాసేపు ఊహను వదిలేసి.

“అటు చూడు” పెళ్ళికూతురుని దీన మొహంతో చూపించాడు కామేష్.

“అరే! నీ సుందరీ” గట్టిగా అరుస్తున్న తమ్ముడి నోరు మూసాడు కామేష్.

“ఇదేమిటిరా? ఇట్లా అయ్యింది?” అన్నతో విచారంగా అన్నాడు.

“అంతా నా ఖర్మ” ఏడుపు గొంతుతో గొణిగాడు.

“పెళ్ళికొడుకు కట్నం డబ్బులు తీసుకొని పారిపోయాడు” పెళ్ళికూతురి మేనమామ అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చాడు.

పెళ్ళికూతురి తల్లి గొల్లుమంది!

‘ఏమిటేమిటీ పెళ్ళికొడుకు పారిపోయాడా?’ గందరగోళం, అరుపులు! ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఏమి జరుగుతోందో ఏమీ అర్ధం కావటం లేదు.

“యాహూ.. రొట్టె విరిగి పానకంలో పడింది. బ్రో.. ఇదేమంచి సమయం నువ్వు సుందరిని తీసుకొని పారిపోరా!” అన్న చెవిలో గుసగుసగా అన్నాడు రమేష్.

“పనిలోపని పెళ్ళికొడుకు డబ్బుతో పారిపోయిన రీల్‌కు ఇన్స్టాలో బోలెడు వ్యూస్ వస్తాయి” సెల్ తీసాడు రమేష్.

పోదామా అన్నట్లు సుందరి వైపు ఆశగా చూసాడు కామేష్. ఇదేమీ పట్టనట్లు నిర్వికారంగా కూర్చొని ఉంది సుందరి.

పెళ్ళికూతురు తండ్రి భుజం మీద కండువా తీసి నెత్తిన వేసుకొని రెండు చేతులు నెత్తిన పెట్టుకొని కూర్చున్నాడు.

“నాన్నా మనమేమన్నా దేబ్యం మొహాలమా? ముద్ద కుడుముల్లాంటి ముప్పై లక్షలు తీసుకొని పారిపోతే ఊరుకోవాలా? పదండిరా వాడు ఎక్కడ ఉన్నా వేసుకొద్దాం” పెళ్ళికూతురు అన్న గాండ్రించాడు.

కదలక మెదలక కూర్చున్న అన్నమొహం చూసి “వీడో సున్నంపిడత మొహంగాడు. ఇహ నాకే తప్పదు! ఇది కావమ్మ వ్లాగ్‌లో వాగాల్సిందే” అని తలకొట్టుకుని, చిన్నగా బామ్మ పక్కన చేరి, “బామ్మా, బామ్మోయ్ ఇటు రా ఒక నిమిషం” పిలిచాడు రమేష్.

“ఏంటిరా అసలుకే పాపం మా పెద్దమేనల్లుడు చాలా దిగాలుపడ్డాడూ. వాడిని..”

“అబ్బా.. అదే బామ్మా అదే చెప్తున్నాను. నువ్వు పక్కకు రా, ఇటు రా” బామ్మ చేయి పట్టి పక్కకు గుంజి, “పాపం ఇంత ఏర్పాట్లు చేసాక తాళి కట్టే ముందు పెళ్లి కొడుకు పారిపోయాడు కదా! పాపం ఎవరైనా పెళ్ళికొడుకు కట్నం తీసుకొని పారిపోయాడు అనుకుంటారా? పెళ్ళికూతురు లోపం అనుకుంటారు కదా! మళ్లీ ఆ పిల్లకి ముందు ముందు ఎట్లా పెళ్ళి అవుతుంది?” అన్నాడు చాలా జాలిగా ఏదో ఆ అమ్మాయిని ఉద్ధరిస్తున్నట్టుగా!

కావమ్మ మనవడి వైపు అనుమానంగా చూసింది. వీడు అసలే పెళ్లి పిచ్చోడు. పెళ్లి పెళ్లి అని ఏడుస్తున్నాడు. వీడు చేసుకుంటానంటాడా ఏంటి ఖర్మ! అనుకోని వాడి నెత్తిన ఒకటి గట్టిగా మొట్టి “ఒరేయ్ వెధవ నువ్వు గాని చేసుకుందామనుకుంటున్నావా ఏమిట్రా ఆ పిల్లని! నీకు వరహీనమైతుంది. నీ కంటే ఏడాది పెద్దది” అంది.

తల తడుముకుంటూ “అబ్బా బామ్మా ఎంత గట్టిగా మొట్టావు! ఇక అందరూ బట్టతల బ్రహ్మచారి అంటారు” కోపంగా అని, కాస్త తమాయించుకొని, “అయినా నేనేం చెపుతున్నాను నువ్వేమంటున్నావు? పాపం, బ్రో మొహం చూడు ఎట్లున్నాడో దేవదాసు మొహంతో! అసలు నీకు ఒక రహస్యం చెప్పనా? ఈ అమ్మాయిని మనవాడు ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయికి చెప్పడానికి, నీకు చెప్పడానికి భయపడ్డాడు పిరికి సన్నాసి! ఇప్పుడు అనుకోకుండా ఇట్లా అవకాశం వచ్చింది ముడి పెట్టేసేయ్” అన్నాడు.

“ఓరినీ ఇదా సంగతి వాడికి ఎన్ని సంబంధాలు చూసిన ఒప్పుకోవటం లేదు ఎందుకా అనుకున్నాను. పిచ్చి వెధవ” అని కామేష్ దగ్గరికి వెళ్లి “ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా?” అని అడిగింది.

అంతే మధ్యకు కట్ చేసిన పుచ్చాకాయలా గులాబీ రంగులో వెలిగిపోయింది కామేష్ మొహం! పుచ్చకాయ గింజల్లా కళ్ళు నల్లగా, మిలమిలా మెరిసిపోతుండగా, సంబరంగా మెలికలు తిరిగిపోతూ బామ్మ చేయి గట్టిగా ఊపేశాడు.

“అబ్బా నీ సంబరం దొంగలు తోలా! నా చేయి విరక్కొట్టకురా” అని నవ్వుకుంటూ పెళ్ళి కూతురు తండ్రి పక్కకు చేరింది.

“ఒరే సుబ్బుడూ దిగులు పడకు రా! అంతా మన మంచికే అనుకో” ఊరడించింది.

“ఏం మంచే అత్తయ్యా! ఉన్నదీ పాయే, ఉంచుకున్నదీ పాయే అన్నట్లు, పెళ్ళికొడుకూ పారిపోయే, డబ్బులూ పాయే! ఇక ఇప్పుడు దీన్ని ఎవరు పెళ్ళి చేసుకుంటారు?” అక్క భుజం మీద తలానించి, కండువాతో కళ్ళు తుడుచుకుంటూ, ముక్కు చీదాడు సుబ్బారావు.

‘వీడి ఏడుపు తగలెయ్య, ముక్కు చీమిడంతా నాకంటిస్తున్నాడు’ అని చికాకు పడుతూ, కావలసిన కార్యం ముందుందని చిరాకు అణుచుకొంది.

“పిన్నిగారూ పిల్ల బతుకెట్లాండీ” గుడ్ల నీరు కుక్క కుంటూ మళ్లీ బోరుమంది పెళ్లికూతురు తల్లి వరదమ్మ!

“అబ్బా.. నువ్వు ఉండవే వరదా! నీ ఏడుపుతో వరద గోదారిలా వరద తెప్పించకు. నేనొక ఉపాయం చెప్తాను వింటారా” అంది కావమ్మ.

“చెప్పు అత్తయ్యా మీకంటే మాకు కావాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారు?” అన్నాడు సుబ్బుడు ఏడుపు మొహంతో ముక్కూ చీదుతూ!

ముక్కుచీమిడి ఎక్కడ తన కొంగుకు తుడుస్తాడో, అందుకే ఏడ్చేవాళ్ళ ఎడమ చేతి కింద ఉండ కూడదు మనసులోనే విసుక్కుంటూ, కావ్యార్ధి అయిన కావమ్మ “మా పెద్ద మనవడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నామని తెలుసు కదా! వాడికి మీ అమ్మాయినిచ్చి, ఈ ముహుర్తానికే పెళ్లి చేసేద్దాము” అంది.

అసలు ముందే ఈ సంగతి తనకెందుకు తట్టలేదు చెప్మా? ఇంగ్లీష్ దొరలా గులాబీ రంగులో మెరిసిపోయే ఆపిల్ లాంటి పిల్లాడిని చంకలో ఉంచుకొని దేశమంతా వెతికి దొంగ వెధవని తెచ్చాడు అని నాలికరుచుకున్నాడు. చురుక్కుమన్న నాలికని తడుముకుంటూ సరే అన్నాడు నోరంతా విశాలం చేసుకొని.

ఇంతలో పదిమంది పూర్వ పెళ్ళికొడుకును మెడపట్టి తోసుకుంటూ తీసుకొచ్చారు.

“నాన్నా మన అదృష్ఠం. ట్రెయిన్ ఆలశ్యం అయ్యింది. పక్క స్టేషన్లో కూర్చున్నాడు. ఇదిగో డబ్బుల సంచీ. అన్నీ ఉన్నాయో లేవో చూడండి” పెళ్ళికొడుకు మెడ ఒక చేతితో, మనీ బ్రీఫ్‌కేస్ ఒక చేత్తో పట్టుకొని నిలుచున్న సెల్ఫీ తీసుకుంటూ అన్నాడు పెళ్ళికూతురి అన్నగారు సుభాష్!

“టికెట్ కొనుక్కున్నాను. అవి మాత్రం తక్కువ ఉన్నాయి” గొణిగాడు పూర్వ పెళ్ళికొడుకు.

“ఓరి బికారి వెధవా?” వాడి నెత్తిన ఒకటి మొట్టాడు సుభాష్.

అదేమీ పట్టించుకోకుండా దులిపేసుకొని “బావగారూ, మూహుర్తానికి ఇంకా సమయం ఉంది పెళ్ళి కానిచ్చేద్దామా?” పూర్వ వియ్యంకుడు ఉత్సాహపడ్డాడు.

“పిడత మొహంగాడా ఇంకేం మొహం పెట్టుకొని అడుగుతున్నావురా? ఎవడ్రా నీకు బావగారు? వీళ్ళను ఊరి పొలిమేర్ల దాకా వెళ్ళగొట్టండి రా” సుభాష్ ఆవేశపడ్డాడు.

“మేమేపోతాం లెండి, రారా కక్కుర్తి వెధవా” అని కొడుకును తోలుకు పోయాడు పూర్వ పెళ్ళికొడుకు తండ్రి.

హమ్మయ్య ఊపిరి పీల్చుకున్నారు అందరూ! పెళ్ళి బాజాలు మ్రోగాయి.

***

“బామ్మా” గారంగా పిలిచాడు రమేష్.

“మళ్లీ ఏమొచ్చింది రా? అడిగింది.

“మరేమో మరేమో..” అని నసుగుతున్న చిన్న మనవడిని, ఇంకో పక్కనుంచి వాడి వైపు ముసిముసి నవ్వులు రువ్వుతూ, జడ గిరగిరా తిప్పుతున్న ఊహను చూసి, బామ్మ గ్రహించేసుకొని, “అయితే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకుంటావన్నమాట!” అంది.

మెలికలు తిరిగిపోయాడు రమేష్!

“ఒరే జగన్నాథం ఇందాక అన్నాలు తినేటప్పుడు, నీ కూతురుకి పెళ్ళి చేయాలని, నా వ్లాగ్‌లో డిటేయిల్స్ అప్లోడ్ చేయమన్నావు కదా! వేరే ఎందుకు? మా చిన్న మనవడికి ఇస్తావా? పనిలో పని ఇద్దరు మనవళ్ళ పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోతుంది నాకు” అని, ‘మనసులో వీడి నస తప్పుతుంది’ అనుకుంటూ అడిగింది.

“అంతకంటేనా అక్కా!” అన్నాడు జగన్నాథం ఆనందంగా.

“కానీ ఇంకొన్ని రోజులు ఆగాలిరా అబ్బీ” అంది కావమ్మా తాపీగా.

“మళ్ళీ ఇదేమి లిటేగేషనే బామ్మా” బామ్మ చెవి దగ్గర గొణిగాడు రమేష్.

“మా చిన్నోడి కొడుకు, వీడికంటే పెద్దవాడు ఉన్నాడు కదా, వాడికీ చూస్తున్నాము. వాడికి వరకూ అయ్యే వరకూ ఆగాలిరా” కంటిన్యూ చేసింది కావమ్మ!

సినిమా పిచ్చోడిది అయ్యిందనుకుంటే వాడొకడు ఉన్నాడు కదూ! వాడో ధర్మరాజు, వాడిదెప్పుడు కావాలో! నా ఊహాసుందరి నాకెప్పుడు దక్కేనో! ఊహ ఓర చూపులు విరిబాణాలై గుండెల్లో గునపాలు గుచ్చుతుంటే గుండె పట్టుకొని పక్కనున్న కుర్చీలో కూలబడ్డాడు. “పెద్దవాడికే పెళ్ళాం లేకపోతే కడపటివాడు నాకు పెళ్ళామో అని కుళ్ళికుళ్ళి ఏడ్చాడట అన్నసామెతలా ఉంది” విరక్తిగా నవ్వుకున్నాడు పాపం రావుడు!

Exit mobile version