[సంచిక పాఠకుల కోసం ‘ధురంధర్ 2’ లో వినిపించిన పాత పాట “కభీ బేకసీ నే మారా” అనే పాటని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]
సాకీ:
యే గజల్ హై న గీత్ హై కోయీ
యే మేరే దర్ద్ కీ కహానీ హై
మేరే సీనే మేఁ సిర్ఫ్ షోలే హైఁ
మేరీ ఆంఖోఁ మేఁ సిర్ఫ్ పానీ హై
పల్లవి:
కభీ బేకసీ నే మారా
కభీ బేబసీ నే మారా
గిలా మౌత్ సే నహీఁ హై (2)
ముఝే జిందగీ నే మారా
సాకీ:
ముకద్దర్ పే కుఛ్ జోర్ చల్తా నహీఁ
వో మౌసమ్ హై యే జో బదల్తా నహీఁ
చరణం 1:
కహీఁ థీ యే బద్‌నసీబీ
కహీఁ థీ మేరీ గరీబీ
కిస్ కిస్ కా నామ్ లూఁ మైఁ (2)
ముఝే హర్ కిసీనే మారా
సాకీ:
బేమురవ్వత్ బేవఫా దునియా హై యే
యహీ దునియా హై తో క్యా దునియా హై యే
చరణం 2:
న కమీ థీ దోస్తోఁ కీ
న కమీ థీ దుష్మనోఁ కీ
కహీఁ దుష్మనీ నే లూటా (2)
కహీఁ దోస్తీ నే మారా
‘ధురంధర్ 2’ సినిమాలో ఎన్నో పాత పాటలు వినిపిస్తాయి. చాలా మటుకు హింసాత్మక దృశ్యాలకి నేపథ్యంగా వస్తాయి. ఈ పాటలన్నీ పాత సినిమాల్లో నృత్యగీతాలు లేక ప్రత్యేక (ఐటమ్) గీతాలే. ఈ పాటల్ని హింసాత్మక దృశ్యాలకి వాడటం కొత్త ప్రయోగమే. హింసని స్టైలిష్‌గా చూపించటానికి ఈ ప్రయోగం చేశారని కొందరు విమర్శిస్తున్నారు. కొంతవరకూ అదీ నిజమే. ప్రేక్షకులు తమ వివేకాన్ని ఉపయోగించాలి కానీ హింసే ఫ్యాషన్ అనుకుంటే అది అనుకునేవారి తప్పే కానీ వేరు కాదు.
ఈ పాత పాటల్లో ఒక పాట మాత్రం హింసాత్మక సన్నివేశంలో కాక భావోద్వేగభరితమైన సన్నివేశంలో వస్తుంది. అదే “కభీ బేకసీ నే మారా” అనే పాట. ఇది ‘అలగ్ అలగ్’ అనే చిత్రం లోనిది. ఆనంద్ బక్షీ రాశారు. కిశోర్ కుమార్ పాడారు.
నాయకుడు (రాజేష్ ఖన్నా) డబ్బే ప్రధానమని భావించే అమ్మాయిని (టీనా మునీమ్) ప్రేమించి మోసపోతాడు. గాయకుడు కావాలని ప్రయత్నించి విఫలమౌతాడు. ఆ వైఫల్యాలని తలచుకుంటూ పాడే పాట ఇది. ఇది ఒక గజల్. గజల్లో ప్రతి చరణంలో రెండు పంక్తులు ఉంటాయి. ఆ రెండు పంక్తుల్లో గాఢమైన భావం, అంత్య ప్రాసలు ఉండటంతో భావస్ఫోరకంగా ఉంటాయి. అందుకే గజళ్ళు వినే శ్రోతలు ‘వహ్వా వహ్వా’ అంటూ ఉంటారు. ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే పల్లవికి, చరణాలకి కూడా వేరు వేరు సాకీలు ఉన్నాయి.
‘ధురంధర్ 2’ లో పాకిస్తాన్లో హమ్జా అనే భారతీయ గూఢచారి ఆలమ్ అనే తన తోటి గూఢచారికి తన గతం గురించి చెప్పినప్పుడు వస్తుంది ఈ పాట. దేశం కోసం జీవితాన్ని పణంగా పెట్టిన గూఢచారులకి ఈ పాట పల్లవి అతికినట్టు సరిపోతుంది. ఒక చరణం కథకి అన్వయమవుతుంది. అయితే ‘ధురంధర్ 2’ లో ఈ పాటలోని పల్లవి మాత్రమే వస్తుంది.
ఇది గజలూ కాదు గీతమూ కాదు
కథగా చెబుతున్నా నా వేదనే
నా గుండెలో జ్వాల ఉంది
అయినా కళ్ళలో ఉన్నది నీరే
ఒంటరినై చస్తిని ఓసారి
దిక్కు తోచక చస్తిని ఓసారి
మృత్యువును నిందించనేల?
చస్తిని జీవితం చేతిలో ప్రతిసారి
గూఢచారులు ఎంత ఒంటరివాళ్ళో చెప్పక్కరలేదు. దేశం కోసం వాళ్ళు అన్నీ వదిలేసి శత్రుదేశంలో ఉంటారు. గతం తలచుకోవటానికి కూడా వెనకాడతారు. ఎక్కడ బయటపడతామో అని భయం. ఆ భయం తమ గురించి కాదు. తమ గురించి భయముంటే వాళ్ళు గూఢచారిగా ఉండటానికి తగరు. వారి భయం దేశం గురించి. అందరిలో ఉన్నా ఒంటరిగా ఉంటారు. హమ్జా గతంలో ఒక విషాదం ఉంది. ఒక అన్యాయానికి అతని కుటుంబం బలవుతుంది. అక్కడే అతని మనసు చచ్చిపోతుంది. దేశం నాకేం చేసిందని నేను దేశం కోసం పని చేయాలి అంటాడు. అతన్ని దేశ భద్రతా అధికారి ఒప్పించి గూఢచారిగా పంపిస్తాడు. జీవితం అందరినీ ఆటాడిస్తుంది. కానీ కొందరిని కోలుకోలేని దెబ్బ తీస్తుంది. ఆ దెబ్బ నుంచి తేరుకుని నిలబడిన వాడే ధీరుడు. ధురంధరుడు. ‘జీవితమే నన్ను చంపింది, ఇంక చావుకి భయపడేదేమిటి?’ అనే భావం ఉన్న పల్లవి ఇక్కడ వస్తుంది. ఆ తెగింపే గూఢచారులని నడిపిస్తుంది.
విధి ముందు ఎంత బలమూ సరిపోదు
ఒకే ఋతువిది, ఎప్పుడూ మారిపోదు
దౌర్భాగ్యం ఎదురైంది ఓసారి
దారిద్ర్యం అడ్డైంది ఓసారి
పేరుపేరునా ఏం చెప్పను?
అందరూ కాలరాస్తిరి నన్ను
అందరూ విధి చేతిలో బొమ్మలే. విధిని ఓడించామనుకుని విర్రవీగేవారికి కూడా విధి నిశ్శబ్దంగా పాఠం నేర్పుతుంది. అయితే ఎప్పుడూ కష్టాలే ఉండవు. సుఖాలు కూడా ఉంటాయి. నేను దురదృష్టవంతుడిని అనుకోవటం మనిషికి అలవాటు. దౌర్భాగ్యం, దారిద్ర్యం ఉన్నా ఏదో ఒక ఆసరా ఉంటుంది. తల్లో, తండ్రో, భార్యో, భర్తో, స్నేహితుడో ఎవరో ఒకరు ఉండకపోరు. కానీ ఉన్నది వదిలి, లేనిది కోరటమే మనిషి నైజం. అప్పుడు అందరూ శత్రువుల్లాగే కనపడతారు. ఈ చరణం పాత చిత్రానికే అన్వయమవుతుంది, కొత్త చిత్రానికి కాదు.
నిర్దాక్షిణ్య నయవంచక లోకమిది
ఇదే లోకమైతే మహ గొప్ప లోకమిది
చెలికాళ్ళకు కొరత లేదు
పగవాళ్ళకి కొదవ లేదు
పగ గొంతు కోసింది ఓసారి
చెలిమి ప్రాణం తీసింది ఓసారి
లోకమంతా తన మీద కక్ష కట్టినట్టు అనిపిస్తుంది. అప్పుడు లోకేశ్వరుడిని తలచుకుంటే కొంత సాంత్వన లభిస్తుంది. పగవాళ్ళు ఎలాగూ మనకు హాని చేస్తారు, ఒక్కోసారి స్నేహితులే మోసం చేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ‘ధురంధర్ 2’ చిత్రంలో స్నేహితుని మోసం ఒక కొత్త రూపంలో వస్తుంది. చిత్రం చూడని వారు, ఆ మోసమేమిటో తెలుసుకోకూడదనుకునేవారు ఈ భాగం వదిలేయగలరు. <Spoiler Alert> హమ్జాకి ఆలమ్ అనే అతను స్నేహితుడు. ఇద్దరూ గూఢచారులే. హమ్జా అసంకల్పితంగా చేసిన ఓ పని వలన తన ఉనికి బయటపడే ప్రమాదం వస్తుంది. అప్పుడు ఆలమ్ తానే ఆ పని చేసినట్టు ఇతరులకి భ్రమ కల్పిస్తాడు. దాంతో అతను గూఢచారి అనే అనుమానం వస్తుంది. గూఢచారులని మన దేశం కేవలం బంధిస్తుందేమో కానీ పాకిస్తాన్ చిత్రహింసలు పెడుతుంది. ఆ చిత్రహింసలు భరించలేక వారు ఇతర రహస్యాలు కూడా చెప్పే అవకాశం ఉంది. ఎలాగూ దొరికిపోయాను కాబట్టి ఇక తనకి చావు ఖాయం అని ఆలమ్‌కి తెలుసు. అందుకే ముందే హమ్జాని తనని చంపేయమని చెబుతాడు. అతను దొరికిపోగానే హమ్జా అతన్ని తుపాకీతో కాల్చి చంపేస్తాడు. ఆ విధంగా స్నేహితుడైన హమ్జా స్నేహధర్మం పాటిస్తూ ఆలమ్‌ని చంపుతాడు. ‘చెలిమి ప్రాణం తీసింది’ అనే వాక్యం ఆ విధంగా నిజమవుతుంది. <End Spoiler>
దర్శకుడు ఆదిత్య ధర్ ఈ పాట పల్లవిని చిత్రంలో పెట్టాడు కానీ చరణాలని పెట్టలేదు. ముఖ్యంగా రెండవ చరణం పెడితే కథాగమనాన్ని చెప్పేసినట్టు ఉండేది. కానీ చెప్పీ చెప్పకుండా ఈ పాట ద్వారా కథాగమనాన్ని సూచించాడు. ఈ రకమైన ఎన్నో కొత్త పద్ధతులని ధర్ ఈ చిత్రంలో ఉపయోగించాడు. అందుకే భారతీయ చిత్రరంగాన్ని ఓ మలుపు తిప్పిన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘ధురంధర్ 1, ధురంధర్ 2’ చిత్రాలు భారతీయ చిత్రరంగాన్ని మరో మలుపు తిప్పాయి’ అన్నారు.
