Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కడపటి మాట

[శ్రీ పెద్దాడ సత్యప్రసాద్ రచించిన ‘కడపటి మాట’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

చివరాఖరి మాట
జీవితం అంత బరువు
మొత్తం తీసుకున్న ఊపిరులు
అన్నీ కూడగట్టిన తీరు
అక్షరం పేర్చుకుంటూ
నోరు పెగల్చుకుంటూ
బయటకు రావడానికి
పెద్ద యుద్ధమే జరుగుతుంది
అది విషాదమైన వీడ్కోలు
బతుకంతటికీ తుది సెలవు
కడపటి కబురుకు విలువెక్కువ
తప్పక పాటించాల్సిన నిబంధన
మళ్ళీ చెప్పేందుకు మనిషి ఉండడు
మార్చేందుకు అవకాశం లేదు
పోయేవారికి ఉండేవారికి
వారధి చిట్టచివరి ఊసు
అచ్చమైన ఆత్మ ఘోష
అరమరికలు లేని స్వచ్చమైన
సుందరమైన పలుకు అది
ఆ మాట ఒట్టు కంటే గట్టిది
శాసనం కంటే గొప్పది
ఉన్న భువిని వదిలేస్తూ
తనువుకి తర్పణం ఇస్తూ
లోపలి నుంచి జీవుడు
బయట ఉన్న ప్రపంచానికి
చెప్పే ఆఖరి మాట అది

Exit mobile version