Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కైంకర్యము-2

ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి.

ఆశ్రమ ప్రాంగణములో ఆయుర్వేద ఆసుపత్రి ఉంటుంది. ఆ చుట్టు ప్రక్కల ఊళ్ళ నుంచి ఎందరో వచ్చి మందులు తీసుకుంటూ వుంటారు. వారిలో కొందరు డబ్బులు ఆశ్రమములో దానం  చేసి వెళతారు. చాలా వరకూ పేదలే వైద్య సాయం కోసం  వస్తూ వుంటారు. ఆ ఆసుపత్రిలో వైద్యం  చేయించుకుంటే రోగం  మరి దరి చేరదని చుట్టు ప్రక్కల ఊళ్ళలో నమ్మకం  కూడా వుంది. ఊరి రైతులు ఆశ్రమానికి కాయగూరలో మరోటో ఇచ్చి వెడతారు. ఎవ్వరినీ ఇవ్వమని కాని, వద్దని కాని ఆశ్రమంలో బలవంత పెట్టరు.

ఆశ్రమానికి అనుసంధానంగా వున్న వంటశాల విశాలమైనది. ఆ వంటశాలలో ఉదయము స్వామి కైంకర్యముగా బాలభోగము, మధ్యాహ్నం నివేదన వుంటాయి. రాత్రికి పండ్లు మాత్రము ఆహారము. వచ్చిన అతిథులు సైతం అదే నియమం  పాటించాలి. కాదంటే వ్యక్తిగతంగా వారి ఏర్పాటును చూసుకోవాలి.

ఆశ్రమము చుట్టూ కొబ్బరి చెట్లతో కళకళలాడుతూ ఉండి, సదా కోవెలలో వేణుగోపాలుని ఉత్సవాలతో, వచ్చిన భక్తులతో గోకులాన్ని తలపిస్తుంది.

ఆ చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి శ్రీ నారాయణ యతివరేణ్యుల దర్శనానికి వచ్చేవారికే కాదు, భోజన సమయానికే కాదు ఏ సమయమైనా, ఎవరికైనా ఉచిత ఆహారం  అందిస్తారు.

ఆశ్రమమంలో టీ కాని, కాఫీ కాని ఉండవు. బాగా జబ్బు పడిన వారికి ఆశ్రమ సేవకులు పళ్ళ రసాలు ఇస్తారు. స్వామి దర్శనానికి వచ్చిన వారు టీ కానీ, కాఫీ కాని త్రాగాలంటే అప్పనపల్లి వరకూ వెళ్ళాల్సిందే. ఈ మధ్యనే ఒక చిన్న టీ కొట్టు పెట్టుకున్నారు ఒకరు ఆశ్రమ గేటు బయట.

ఆశ్రమమంలో మరో ప్రక్క పెద్ద గ్రంథాలయము కూడా వుంది. అక్కడ వైష్ణవాగమాలపైనే కాక సర్వ విషయాలపై అతి పురాతనమైన, విశిష్టమైన గ్రంథాలు దొరుకుతాయి. పరిశోధన చేసే విద్యార్థులు కూడా ఆ గ్రంథాలయానికి వస్తూ వుంటారు.

ఆశ్రమానికి  అల్లంత దూరంలో పాఠశాల ఉంది. అక్కడే పన్నెండు వరకూ విద్యను బోధిస్తారు. తరువాత ఆ పేద పిల్లలు తమ బ్రతుకు తెరువుకో, వృత్తివిద్యాలయాలకో వెళతారు.  దాదాపు పదిహేనేళ్ళగా సాగుతోంది ఈ కార్యక్రమం, విజయవంతంగా. ఆ బడినుంచి చదువుకొని వెళ్ళి జీవితాలు  నిలబెట్టుకున్న పేద విద్యార్థులు ఎందరో ఉన్నారు. అవన్నీ ఏ విభాగానికి ఆ విభాగంగా నడుస్తున్నా వాటిని రాఘవాచార్యులు పర్యవేక్షిస్తూ ఉంటారు.

కోవెల ఎదురుగా ఒక చిన్న గిఫ్టు స్టోరు కూడా వుంది. అక్కడ శ్రీవైష్ణవానికి చెందిన పుస్తకాలు అమ్ముతారు. మంచి ఇత్తడి దీపాల నుంచి దేవతారాధనలో పనికి వచ్చే సమస్తమూ అక్కడ దొరుకుతాయి. చాలా అద్భుతమైన పుస్తకాలకూ ఆ దుకాణానికి పేరుంది.

రాఘవాచార్యులు కోవెలలో ఆరాధన ముగిసిన తరువాత తిరిగి తన ఇంటికి వెళ్ళి కొద్దిగా తేనీరు త్రాగారు. పెరుమాళ్ళుకు నివేదించినది స్వీకరించి ఆశ్రమము ఆఫీసు గది వైపు నడిచారు. ముందురోజు లెక్కలు చూస్తూ గడిపారు. అవి అన్నీ సరిగ్గా ఉన్నాయని అనిపించినాక, ఆసుపత్రికి కావలసిన మందులు ఉన్నాయా లేదా అని, లెడ్జరు చూసుకున్నారు. వాటిలో తగ్గిన మందులను తిరిగి ఆర్డరు పెడుతున్న కాగితాన్ని చూసి సరియని టిక్కు చేసి వెంటనే పంపారు, అవి ముందు జరగవలసినవి కదా అని.

స్కూలు పిల్లల అవసరాలు, ఆహారము మొదలైన లెక్కలు చూసుకున్నారు. ఆ విద్యాలయానికి నెలకు ఒకసారి డాక్టరు వెళ్ళి ఆ బాలబాలికల ఆరోగ్యము పరీక్షించి వెళతారు. ఆ వివరాలు చూసిన తరువాత, ఆయన తదుపరి హాస్టలు పిల్లల అవసరాలకు సంబంధించిన ఖర్చులు చూశారు. నారాయణయతి ప్రతి నెలా వ్యక్తిగతంగా ఈ బడి, ఆసుపత్రి చూస్తారు. ఏ విధమైన తేడా ఉన్నా ఆయన దృష్టి దాటిపోదు. ఆయన వస్తున్నారంటే అందరూ జాగరూకతతో వుంటారు. నారాయణయతి వ్యక్తిగత పర్యవేక్షణకు ముందు రాఘవాచార్యులు వెళ్ళి చూసుకుంటారు.

నారాయణయతికి ప్రతి గది, ప్రతి మూల గుర్తే. ఎలాంటి తేడా ఉన్నా  వెంటనే పట్టేస్తారు. ఆయనకున్న అటు వంటి దివ్యదృష్టి వలననే అంతటి పెద్ద సంస్థలూ ఎలాంటి తేడా లేకుండా సాగుతున్నాయి. దానికి మించి, యతివర్యుల మీద అందరికీ అపారమైన  భక్తి కూడా వుంది. అందుకే ముందుగా మన రాఘవాచార్యుల పరిశీలన.

ఒకసారి ఇలాంటి పర్యటనలో విద్యార్థుల గదిలో తిరుగుతూ చెయ్యి తలుపు మీద పెట్టారు రాఘవాచార్యులు. చేతికి మట్టి అంటింది. విద్యార్థులకు, వార్డెనుకూ వణుకు వచ్చిన మాట నిజం. రాఘవాచార్యులు ఎవ్వరినీ ఏమీ అనలేదు. ఆయనే ఒక బకెట్టు నీళ్ళు తెచ్చి తలుపులు కడిగి వెళ్ళిపోయారు. ఆ వార్డెనుతో సంభాషణ ఏం జరిగిందో కానీ, వార్డెను నుంచి విద్యార్థుల వరకూ అంతా సిగ్గుపడ్డారు, ఆశ్రమములో దిగ్గజ్జంలా తిరిగే ఆచార్యులవారు ఇలాంటి పని చెయ్యాల్సి వచ్చిందని. మళ్ళీ ఆ పాఠశాలలో కానీ, వసతిగృహములో కానీ అటువంటి నిర్లక్షపు ధోరణి కనపడలేదు.

విద్య, ఆరోగ్యాలకు నారాయణయతివరేణ్యులు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అందుకే రాఘవాచార్యులు కూడా తమ వైష్ణవము తరువాత దానికే పెద్దపీట వేస్తారు. సనాతన ధర్మస్థాపనకు మాత్రము ఎప్పుడూ ప్రథమస్థానమే అక్కడ.

అక్కడ రెండేళ్ళుగా ఐ.ఐ.టి. కోచింగు కూడా మొదలెట్టారు. అది ఈ మధ్య బాగా పుంజుకుంటోంది.

వేదపాఠశాలలో చదివినా, ఆ విద్యార్థులు పన్నెండవ క్లాసుకు రాసి పై కోర్సులకు పోవటము కద్దు. పేద విద్యార్థులు, వేద పాఠశాల విద్యార్థులు ఈ కోచింగుకు వెడతారు. వచ్చిన వారు యతివరేణ్యుల ఆశీస్సులతో కాలేజీలో చేరటము కూడా జరుగుతోంది. ఈ విద్యాలయం పేరు విని బయట నుంచి కూడా కోచింగుకు విద్యార్థులు వస్తున్నారు. ధర్మాచరణలో ఉన్నవారికే వారు అక్కడ ప్రాధాన్యతనిస్తారు.

ఆ రోజు రాఘవాచార్యుల వారిని కలవటానికి దూరము నుంచి ఒక తల్లి, తన కొడుకును వెంట పెట్టుకు వచ్చింది. ఆమె ఎగువ నుంచి వచ్చింది. కలవాలని ప్రయత్నించినా ఆయనను కలవలేకపోయింది. ఆయన ఈ లెడ్జరు పనులు చూసుకొని, వచ్చే పౌర్ణమి నాటి కార్యక్రమాల గురించి నారాయణ యతివరేణ్యులతో చర్చిస్తూ ఉండిపోయారు. దాంతో రోజంతా ఎదురుచూసినా ఆయన కనపడలేదు. ఆయన నారాయణ యతితో మీటింగు పూర్తి చేసుకు దాదాపు సాయంత్రం నాలుగవుతుండగా తన ఇంటికి వచ్చారు. ప్రసన్నలక్ష్మి కూడా భోజనము చెయ్యకుండా రోజంతా ఆచార్యుల కోసము ఎదురుచూస్తూ ఉండిపోయింది. ఆమె అలా ఎదురుచూస్తూ వంటగది గుమ్మానికి కొంగు పరుచుకొని చిన్న కునుకు తియ్యసాగింది.

రాఘవాచార్యులు నెమ్మదిగా వెనక వాకిటి వైపుకు వచ్చి పిలిచారు.

“లక్ష్మీ!” అంటూ.

ఆమె లేచి ఆయనను లోనికి రానిచ్చి, భోజనము వడ్డించే ప్రయత్నం చేస్తుండగా…

“నీవు తిని వుండవలసినదమ్మా…” అన్నారు ఆచార్యులు చిన్నగా నొచ్చుకుంటూ.

“మీరు తినకుండానే….” నవ్వింది లక్ష్మి.

ఆయన పనిలో పడి ఆలస్యమైనందుకు నొచ్చుకున్నారు. “పౌర్ణమి ఏర్పాట్ల గురించి చూస్తూ సమయము చూసుకోలేదమ్మా!” అన్నారాయన సంజాయిషీగా.

“ఫర్వాలేదులెండి. రండి…” అన్నదామె వడ్డిస్తూ.

“నీవూ పెట్టుకో…” చెప్పారు ఆచార్యులు.

ఇద్దరూ కలసి భోజనము కానిచ్చారు.

ఆయన కాసేపు పడుకుందామనుకుంటూ ఉండగా తలుపు చప్పుడైంది.

ఎదురుగా ఆశ్రమవాసి ఒకరు.

“మీ కోసం  ఒకరు వచ్చి వున్నారు. ఆమె ఉదయం  నుంచి ఆఫీసు ముందు నుంచి కదలటం  లేదు. మీ దర్శనం  అయితే తప్ప భోజనానికి రానని అంటే మీ కోసమిలా వచ్చాను……” చెప్పాడతను.

“అయ్యో అలాగా…” అన్నారాయన. ఆ వచ్చిన స్త్రీ మీద దయ, జాలితో హడావుడి పడుతూ, “వస్తున్నా…” అని చెప్పి తయారవటానికి లోనికి నడిచారు.

(సశేషం)

Exit mobile version