Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కళ

[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘కళ’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

గ్రహణం పట్టిన మనసు
విజృంభించే మెదడు చరణసయ్యాట
రెండూ విసిరిన ఒకే ఒరలోని బాణాలే!

పూసిన వాకిలిపై వీచే పూలగాలి
తోస్తుంది ఇంటిని ప్రపంచీకరణ స్పైక్స్ పై
పిన్నీసు ప్రశ్న విసురు గుచ్చి
అనంత గాలి నిండిన బెలూన్ పై

వినేవాని కనులచెవులు
పట్టించుకోకుంటే అది
పారకం మరచిన నిశ్చల నిర్జల తటాకమే

నాలుక ఆడించే ఆట అక్షరాలతో
అలవాటైన వారికి ఓ సరదా!
పరదాల చాటు నటనలు
శోభించని వ్యర్థ విదూషక చిత్రం

అబద్ధపు కలలో నిజం కళను చూసినవాడు
అదే కళలో కలను చెక్కలేడు ‘వన్ వే’

కవిత్వం కళ
నడుస్తున్న బతుకుకంటే గొప్పగా
చీకటిని ఛేదిస్తే గొప్ప

లేదంటే కాదంటే
అదో శిధిలాలయ దిబ్బ
గాలి పోగేసిన పెద్ద మట్టి కుప్ప.

 

Exit mobile version