Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కల ఇదనీ, నిజమిదనీ..

[ప్రొ. శ్రీనివాస రాఘవ. కె. గారు రచించిన ‘కల ఇదనీ, నిజమిదనీ..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]

 

1992.. ఆంధ్రా పారిస్ ‘తెనాలి’.

మోహన్ రావు గారు అక్కడి లోకల్ స్కూల్లో సైన్స్ టీచర్‌గా పనిచేసి, అప్పుడే రిటైర్ అయ్యారు. ముప్పై ఏళ్ల పాటు సైన్స్ టీచర్ గా పని చేసిన ఆయనకు ప్రతి దాంట్లోనూ లాజిక్, సైన్స్ కనిపించేవి. దేవుడు, దెయ్యం, శకునాలు లాంటివి వింటే ఆయనకు చిరాకు. అవన్నీ మనుషుల బలహీనతలు అని ఆయన గట్టి నమ్మకం. పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు అయిపోయి స్థిరపడ్డారు. ఇంట్లో ఆయన, భార్య ఉమాదేవి మాత్రమే ఉంటారు. ఉదయం లేవగానే వేడి కాఫీ తాగుతూ పేపర్ చదవడం, సాయంత్రం అయితే లైబ్రరీ దగ్గర రిటైరైన స్నేహితులతో ముచ్చట్లు.. ఇదీ ఆయన సాఫీగా సాగిపోతున్న రోజువారీ జీవితం!

రెండు రోజుల క్రితమే ఒక దూరపు బంధువు చనిపోతే వెళ్లి పలకరించి వచ్చాడు. అప్పటి నుంచీ ఇంట్లో వాతావరణం కొంచెం మందకొడిగా ఉంది.

ఒకరోజు ఉదయం ఇల్లు తుడుస్తున్న పనిమనిషి కామాక్షి, ఉమ తో గొణిగిన మాటలు ఆయన చెవిన పడ్డాయి. అమ్మగారూ! తెనాలి నుంచి గుంటూరు వెళ్లే దారిలో అంగలకుదురు దాటాక ఒక మలుపు ఉందే.. అక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయట. రాత్రిపూట చాలా మందికి కనిపించాయట. ఈమధ్య ఆ దారిలో వరసగా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఎవరో పాపం, భార్యాభర్తలు బైక్ మీద వెళ్తూ ఆ చెట్టుకు గుద్దుకుని స్పాట్ లోనే పోయారట!”

ఆ మాటలు వినగానే ఉమాదేవి ఉలిక్కిపడింది. మోహన్ రావు మాత్రం కోపంగా, “ఏమే కామాక్షి! ఆ మలుపు దగ్గర రోడ్డు సరిగ్గా లేదు, దానికి తోడు రాత్రిపూట తాగి తోలుతారు. యాక్సిడెంట్లు కాక ఏమవుతాయి? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఇవన్నీ పనికిమాలిన మూఢనమ్మకాలు!” అని గట్టిగా మందలించాడు. మోహన్ రావు కొట్టిపారేసినా, ఉమ మనసులో మాత్రం ఆ భయం అలాగే గూడుకట్టుకుని ఉండిపోయింది. ఆ అంగలకుదురు మలుపు దగ్గర దట్టమైన చింత చెట్లు, మర్రి చెట్లు ఉంటాయి. ప్రతినెలా అక్కడ కచ్చితంగా ఒక ప్రమాదం జరగడమే ఆమె భయానికి కారణం!

కొద్దిరోజులకు మోహన్ రావు చిన్ననాటి ప్రాణ స్నేహితుడు వినుకొండ నుంచి ఫోన్ చేశాడు. మూడు రోజుల్లో తన కొడుకు పెళ్లి అని, ఎట్టి పరిస్థితుల్లోనూ రావాలని పట్టుబట్టాడు. స్నేహితుడి మాట కాదనలేక మోహన్ రావు పెళ్ళికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కానీ అసలు సమస్య ఏంటంటే, ఆ పెళ్లి మరుసటి రోజే మోహన్ రావు, భార్య కలిసి హైదరాబాద్ లో ఉన్న కొడుకు దగ్గరకు వెళ్లాలి. రైలు టికెట్లు కూడా రిజర్వేషన్ అయిపోయాయి. కాబట్టి ఉదయం వెళ్లి, పెళ్లి చూసుకుని రాత్రికి రాత్రే తెనాలి తిరిగి వచ్చేయాలి.

పెళ్లి ముహూర్తం రాత్రిపూట. వినుకొండ వెళ్లాలంటే ముందు గుంటూరు వెళ్లి అక్కడ బస్సు మారాలి. అన్నీ సవ్యంగా జరిగితే తెనాలి నుంచి వినుకొండకు మూడు నాలుగు గంటల ప్రయాణం.

బయల్దేరే రోజు ఉదయం ఉమాదేవికి మనసెందుకో కీడు శంకించింది. “వద్దులెండి, నాకెందుకో అపశకునంగా అనిపిస్తోంది. ఈ ప్రయాణం మానుకోండి. పైగా మీకేమో హై బీపీ, రాత్రిపూట ప్రయాణాలు మనకు పడవు” అని బతిమాలింది.

“పిచ్చి మాటలు మాట్లాడకు. ప్రాణ స్నేహితుడి కొడుకు పెళ్లి, వెళ్లకపోతే బాగుండదు. నాకేం కాదు, నేను ఉదయాన్నే వచ్చేస్తాను,” అని మొండిగా చెప్పాడు మోహన్ రావు. వెళ్లక తప్పదని అర్థమైన ఉమాదేవి, కనీసం రక్షణగా ఉంటుందని జేబులో పెట్టుకోమని ఒక చిన్న ఆంజనేయస్వామి ఫోటోను ఇచ్చింది. మోహన్ రావు చిరాకు పడుతూ దాన్ని పక్కన పెట్టేసి బస్టాండ్‌కు బయల్దేరాడు. ఎలాగోలా తంటాలు పడుతూ బస్సులు మారి సాయంత్రానికి వినుకొండ చేరుకున్నాడు.

రాత్రి 8:30 గంటలు. పెళ్లి మండపం బంధుమిత్రులతో సందడిగా ఉంది. స్నేహితులతో కలిసి భోజనం చేశాడు మోహన్ రావు. పాత స్నేహితులను కలవడంతో కబుర్లలో పడి, భోజనం తర్వాత వేసుకోవాల్సిన బీపీ (BP) ట్యాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయాడు.

కొద్దిసేపటికి ఆయనకు సన్నగా చెమటలు పట్టడం మొదలైంది. గుండెలో ఏదో తెలియని దడ, కంగారు. కాస్త ఆయాసంగా అనిపించడంతో, స్నేహితుడు ఒక గది చూపించి కాసేపు విశ్రాంతి తీసుకోమన్నాడు. “కొంచెం సేపు పడుకుని ముహూర్తానికి లేస్తానులే” అని మంచం మీద వాలిన మోహన్ రావుకు, అలసట వల్ల గాఢమైన నిద్ర పట్టింది.

“ఒరేయ్ మోహన్, లే ముహూర్తం సమయం అయింది!” అని ఎవరో తట్టి లేపడంతో ఉలిక్కిపడి లేచాడు. హడావుడిగా వెళ్లి పెళ్లి తంతులో పాల్గొన్నాడు.

పెళ్లి అయిపోగానే, ఇక తెనాలి బయల్దేరాలని నిర్ణయించుకున్నాడు. రేపు ఉదయాన్నే భార్యతో కలిసి హైదరాబాద్ వెళ్లాలి. “ఈ అర్ధరాత్రి ఎక్కడికి వెళ్తావురా? బస్సులు దొరకడం చాలా కష్టం. ఈ రాత్రికి ఇక్కడే పడుకో” అని స్నేహితుడు ఎంత వారించినా వినలేదు. అప్పటికే రాత్రి 11:30 అయింది. ఎలాగోలా పరిగెత్తుకుంటూ వెళ్లి 11:45 కి గుంటూరు వెళ్లే చివరి బస్సు ఎక్కాడు.

బస్సు గుంటూరు చేరుకునే సరికి రాత్రి 1:30 అయింది. బస్సు దిగగానే మోహన్ రావుకి పరిస్థితి తీవ్రత అర్థమైంది. వాతావరణం భయంకరంగా మారిపోయింది. కుండపోత వర్షం పడుతోంది. కరెంట్ లేదు, బస్టాండ్ అంతా కటిక చీకటి. ఉదయం 5:30 కు గానీ తెనాలికి బస్సు లేదని ఎంక్వయిరీలో చెప్పారు. అప్పటిదాకా ఆ చలిలో, ఆ దోమల్లో కూర్చునే ఓపిక లేదు. ఎలాగైనా ఇల్లు చేరుకోవాలన్న మొండి పట్టుదలతో గుంటూరు-తెనాలి రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డాడు. ఏదైనా వాహనం వస్తే లిఫ్ట్ అడుగుదామని రోడ్డు మీదకు వచ్చాడు.

చాలా సేపు గడిచింది. ఒక్క మనిషి లేడు, ఒక్క వాహనం రాలేదు. చలికి శరీరం వణుకుతోంది.

అంతలో దూరంగా ఏదో ఆటో శబ్దం.. డబ్ డబ్ డబ్ మంటూ వినిపించింది. డిమ్‌గా వెలుగుతున్న హెడ్‌లైట్‌తో ఒక పాత ఆటో ఆయన ముందుకు వచ్చి ఆగింది. మోహన్ రావు వర్షంలో తడుస్తూనే ఆటో దగ్గరకు వెళ్లి లిఫ్ట్ అడిగాడు. ఆ చీకట్లో ఆటో డ్రైవర్ ముఖం చూస్తే.. ఎక్కడో తెలిసిన వాడిలా ఉన్నాడు.

“రామూ.. నువ్వేనా?” అన్నాడు మోహన్ రావు.

అవును, అతడు రాము. ఇంతకు ముందు మోహన్ రావు పనిచేసిన స్కూల్లో వాచ్‌మన్‌గా చేసేవాడు. స్కూల్లో ఏదో దొంగతనం జరిగిందని వాడి మీద నింద పడితే, పనిలోంచి తీసేశారు.

“నమస్కారం మాస్టారు గారు! అవును నేను రామూనే. మీరేంటి ఇక్కడ ఉన్నారు ఇంత వర్షంలో?” అన్నాడు రాము నెమ్మదిగా.

“అవన్నీ తర్వాత చెప్తాగానీ, ముందు నన్ను తెనాలిలో దించు,” అన్నాడు మోహన్ రావు.

“సరే మాస్టారూ ఎక్కండి. కానీ ఆటో పరిస్థితి అంతగా బాగోలేదు. కొంచెం రిపేరు ఉంది, మధ్యలో ఎక్కడైనా ఆగిపోవచ్చు” అన్నాడు రాము.

“సరే పద, ఇప్పుడు ఇంతకంటే వేరే అవకాశం లేదు కదా. ఎంత దూరం పోతే అంత దూరం పోదాం” అని ఆటో ఎక్కాడు మోహన్ రావు.

ఆటో వర్షాన్ని చీల్చుకుంటూ ముందుకు వెళ్తోంది. కరెంట్ లేకపోవడం వల్ల దారంతా చిమ్మచీకటిగా ఉంది.

“ఏరా రాము, ఏంటి ఈ ఆటో వ్యవహారం?” అని అడిగాడు మోహన్ రావు.

“మాస్టారు గారు, స్కూల్ మానేసిన తర్వాత మా ఇంటి పరిస్థితి ఏమీ బాగోలేదు. ఏ దారీ లేక ఇలా ఆటో నడుపుతున్నాను. రోజూ తెనాలి నుంచి గుంటూరుకి, గుంటూరు నుంచి తెనాలికి.. సరుకులు, మనుషులు.. ఇదే నా జీవితం అయిపోయింది,” అన్నాడు రాము దీనంగా.

వర్షం వల్ల చలిగాలికి మోహన్ రావు వణికిపోతున్నాడు.. కానీ రాము మాత్రం వర్షంలో తడుస్తున్నా, ఏ చలనం లేకుండా ఆటో నడుపుతున్నాడు. కనీసం వణుకు లేదు. ఆటో వింత శబ్దాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

“మాస్టారు గారు.. నాకు ఏమైనా అయితే నా పిల్లల్ని మీరు చూసుకుంటారని నాకు ఎప్పుడో మాటిచ్చారు.. గుర్తుందా?” అడిగాడు రాము హఠాత్తుగా.

“అవునురా, వాళ్లని నేనే చదివిస్తాను. అయినా అవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావ్?” అన్నాడు మోహన్ రావు చిరాగ్గా.

“ఊరికే.. మీకు నా బాధ చెప్పుకుందామని చెప్తున్నా మాస్టారు గారు,” అన్నాడు రాము నిస్సత్తువగా.

ఆ సంభాషణ మోహన్ రావుకు ఏదో అసౌకర్యాన్ని కలిగిస్తోంది. టాపిక్ మార్చాలని, ఉదయం పనిమనిషి చెప్పిన మాటలు గుర్తొచ్చి, “అది సరే కానీ, రోజూ ఇదే రూట్లో వెళ్తుంటావు కదా. ఇక్కడేదో దెయ్యాలు ఉన్నాయని జనాలు అంటుంటారు, దాని?” అని వెటకారంగా అడిగాడు.

రాము గొంతులో వెటకారం లేదు, కేవలం గంభీరత మాత్రమే ఉంది.

“నిజమే మాస్టారు గారు. అంగలకుదురుకి కొంచెం ముందు ఒక బ్రిడ్జ్ దాటిన తర్వాత ఒక మలుపు వస్తుంది. అది చాలా ప్రమాదకరమైంది. అక్కడే ఒక పెద్ద మర్రిచెట్టు, కొన్ని గుబురు చెట్లు ఉంటాయి. సాయంత్రం దాటగానే ఆ చెట్ల దగ్గర నల్లగా ఒక అమ్మాయి, పిల్లలు కనిపిస్తారు. అందరికీ కాదు, కొంతమందికే.. అలా వాళ్లు కనిపించారంటే, సంగతేంటి ఆ చూసిన వాళ్లకి యాక్సిడెంట్ అవుతుంది. మరణం తప్పదు.”

“ఇదంతా నిజమా లేక ఊరికే పుకారా?” అడిగాడు మోహన్ రావు నవ్వుతూ.

“లేదండీ.. నిజంగా నిజమే,” అన్నాడు రాము గట్టిగా.

“అంత గట్టిగా ఎలా చెబుతున్నావు? నువ్వు గానీ చూశావా ఏంటి?” మోహన్ రావు గొంతులో నవ్వు మాయమైంది.

రాము దగ్గర్నుంచి సమాధానం లేదు. మోహన్ రావుకు ఏవో తెలియని అనుమానాలు మొదలయ్యాయి. “ఏరా రాము, మాట్లాడవేంటి?” అని గట్టిగా అడిగాడు.

అప్పుడే ఆటో అద్దంలోంచి రాము ముఖం మెరుపు వెలుతురులో స్పష్టంగా కనిపించింది. మోహన్ రావు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. అద్దంలో రాము ముఖం మామూలుగా లేదు. రాము తల వెనుక భాగం నుజ్జునుజ్జయి ఉంది. తల నుంచి రక్తం ధారగా కారుతోంది.

“ఒరేయ్ రాము! ఏమైందిరా నీకు?” భయంతో, కంగారుగా అరిచాడు మోహన్ రావు.

రాము ఇప్పుడు ఏడుస్తున్నాడు. “మాస్టారు గారు.. నా పిల్లల్ని మీరే కాపాడాలి..”

మోహన్ రావుకు గొంతు పెగలడం లేదు. తడారిపోయిన గొంతుతో, “ఏ.. ఏమైంది రామూ?” అని వణుకుతూ అడిగాడు.

రాము నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. ఇప్పుడు ఆ ముఖంలో ప్రాణం లేదు. కళ్లు పాలిపోయి, తెల్లగా తేలేసి ఉన్నాయి.

“మాస్టారూ.. పది రోజుల క్రితం నేనూ, నా పెళ్లాం ఇదే రోడ్డు మీద వస్తుంటే.. ఎదురుగా వచ్చిన లారీ గుద్దేసి వెళ్లిపోయింది. అక్కడికక్కడే ఇద్దరం పోయాం మాస్టారూ.. నా ఆటో బాగా పాడయిపోయింది .. నేనిక్కడే ఆగిపోతాను.. మీరు తెనాలి ఎలాగోలా వెళ్లిపోండి..” అన్నాడు రాము ఏడుస్తున్న గొంతుతో.

మోహన్ రావుకు పిచ్చెక్కినట్లు అవుతోంది, ఏవో సంబంధం లేని ఆలోచనలు.. కొన్ని రోజుల క్రితం తను ఒక చావు ఇంటికి వెళ్లి సరిగా స్నానం చేయకుండానే ఇంట్లోకి వచ్చేసిన విషయం, ఉదయం తను వస్తుంటే నల్ల పిల్లి ఎదురు రావడం, భార్య అది అపశకునం అనడం, పనిమనిషి చెప్పిన దెయ్యాల వార్తలు, బీపీ టాబ్లెట్స్ మరిచిపోవటం.. అన్నీ ఒకేసారి మెదడులో తిరుగుతున్నాయి!

“ఒరేయ్ రాము! నాతో పరాచకాలు ఆడకు. నాకు అసలు భయం లేదు. నేను దెయ్యాలు, భూతాలు లాంటివి నమ్మను,” అని బయటకి ధైర్యం నటిస్తూ అరిచాడు మోహన్ రావు.

కానీ రాము ఆ మాటలు పట్టించుకోకుండా, “మాస్టారు గారు.. మనం ఆ మలుపులో ఉన్న మర్రిచెట్టు దగ్గరకు వచ్చేశాం. ఆ అమ్మాయి నన్ను పిలుస్తోంది.. మీరు ఆటో దిగిపోండి!” అని భయంకరంగా అరిచాడు.

మోహన్ రావుకు ఏమీ అర్థం కావడం లేదు. బయట కురుస్తున్న పెద్ద వర్షం కంటే వేగంగా ఆయన శరీరంలో భయం ఉప్పెనలా పెరుగుతోంది. వర్షపు చినుకులు నేరుగా తన గుండెల్లో పడుతున్నట్లు అనిపిస్తోంది. తల బరువువెక్కింది, గుండె కొట్టుకునే వేగం విపరీతంగా పెరిగింది. ఊపిరి ఆడటం లేదు.

హఠాత్తుగా రాము ఆటోను ఆపేశాడు. కిందకి దిగి ఆ దట్టమైన చెట్ల తోపులోకి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. మోహన్ రావు వణుకుతూ మెల్లిగా ఆటో దిగాడు. “రామూ.. రామూ..” అని అరుస్తున్నాడు. కానీ చుట్టూ కటిక చీకటి. ఆటో లైట్లు కూడా ఆరిపోయాయి. హోరున కురుస్తున్న వర్షపు శబ్దం తప్ప ఏమీ వినిపించడం లేదు.

అలా పక్కకు చూసేసరికి మోహన్ రావుకు రోడ్డు పక్కన కాలువలో ఎవరిదో శవం పడి ఉన్నట్లు అనిపించింది. భయం భయంగా దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూశాడు.. అది రాము శరీరమే! పది రోజుల క్రితం చనిపోయి, బాగా కుళ్లిపోయి, దుర్వాసన వస్తోంది.

మోహన్ రావుకు గుండె దడ తారాస్థాయికి చేరుకుంది. కళ్లు తిరుగుతున్నాయి. అంతలో దూరంగా ఆ మర్రిచెట్టు కింద నల్లటి చీర కట్టుకున్న ఒక ఆకారం, ఇద్దరు పిల్లలతో నిలబడి తన వైపే చూస్తున్నట్లు కనిపించింది.

ఇక తన పని అయిపోయిందని ఆయనకు అర్థమైంది. తన నమ్మకాలన్నీ పటాపంచలయ్యాయి. చివరి ఆశగా, ఉదయం తన భార్య బలవంతంగా జేబులో పెట్టిన ఆంజనేయ స్వామి ఫోటో కోసం వణుకుతున్న చేతులతో జేబులో వెతుక్కున్నాడు!

***

“మోహన్ రావ్.. మోహన్ రావ్.. మోహన్.. మోహ..”

ఎవరో తనను పిలుస్తున్నారు. ఎవరో తన భుజాన్ని గట్టిగా తట్టి లేపుతున్నారు.

హఠాత్తుగా ఉలిక్కిపడి కళ్లు తెరిచాడు మోహన్ రావు. ఆయన ఒళ్లంతా చెమటలు పట్టి ఉన్నాయి. శ్వాస వేగంగా ఆడుతోంది. ఎదురుగా చూస్తే తన స్నేహితుడు రామారావు నిలబడి ఉన్నాడు.

“ఒరేయ్ మోహన్ రావు! నా కొడుకు పెళ్లికి వచ్చి, గదిలోకి వెళ్లి ఇలా పడుకుని నిద్రపోతావ్ ఏంటిరా? ముహూర్తం అయిపోయింది, రా భోజనం చేద్దువుగాని,” అన్నాడు స్నేహితుడు నవ్వుతూ.

చుట్టూ చూశాడు మోహన్ రావు. తాను ఇంకా వినుకొండలో, పెళ్లి మండపంలోని గదిలోనే ఉన్నాడు.

“హమ్మయ్య! ఇదంతా కలా?” అని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు మోహన్ రావు. పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. పనిమనిషి చెప్పిన పుకార్లు, తను బీపీ టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్ల ఏర్పడిన ఆందోళన.. అన్నీ కలిసి మెదడు ఇలాంటి పీడకలని సృష్టించిందని ఆయన లాజిక్ మైండ్ కు అర్థమైంది.

హమ్మయ్య! ఇదంతా కలా! పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించింది. కలలో జరిగిన సంఘటనలన్నీ కళ్లముందే తిరుగుతున్నాయి. “చాలా భయంకరమైన కల వచ్చిందిరా” అని చెప్పబోయి, మళ్ళీ తనని పిరికివాడు అనుకుంటారని, తన నాస్తికత్వానికి అవమానమని భావించి ఆగిపోయాడు.

ఎలాగోలా పెళ్లి తంతు ముగించుకున్నాడు. కానీ ఆయన మనసులో ఒకటే పట్టుదల.. రేపు ఉదయం హైదరాబాద్ వెళ్లాలి. దానికి తోడు, తనకి ఏ భయమూ లేదని తనకు తాను నిరూపించుకోవాలి. స్నేహితుడు ఎంత వద్దని బతిమాలినా వినకుండా, ఆ రాత్రే వినుకొండ నుంచి బయల్దేరాడు.

***

గుంటూరు వెళ్లే చివరి బస్సు దొరికింది.

బస్సు గుంటూరు చేరుకునే సరికి రాత్రి 1:30 అయింది. బస్సు దిగగానే మోహన్ రావుకు గొంతు తడారిపోయింది. వాతావరణం అచ్చం తన కలలో లాగే ఉంది. కరెంట్ లేదు. కుండపోత వర్షం పడుతోంది. ఉదయం వరకు బస్సులు లేవు.

కలలో లాగే గుంటూరు-తెనాలి రోడ్డు మీదకు వచ్చి నిలబడ్డాడు. తనకి భయం లేదని ధైర్యం చెప్పుకుంటూ, ఏదో ఒక వాహనం కోసం ఎదురుచూస్తున్నాడు. ఎలాగైనా ఆ రాత్రి ఇల్లు చేరాలన్నది ఆయన పట్టుదల.

కొంచెం సేపటికి దూరంగా.. డబ్ డబ్ డబ్ మంటూ ఒక పాత ఆటో శబ్దం వినిపించింది. డిమ్‌గా వెలుగుతున్న ఒకే ఒక్క హెడ్‌లైట్‌తో ఆ ఆటో తన ముందే వచ్చి ఆగింది.

మోహన్ రావు గుండె ఒక్కసారిగా ఆగినట్లు అనిపించింది. వర్షాన్ని చీల్చుకుంటూ ఆటో లోపలికి తొంగి చూశాడు. ఆ డ్రైవర్ ముఖం.. తెలిసిన వాడిలాగే ఉంది.. అది రాము!

***

ఉమాదేవి ఆమె రాత్రంతా నిద్రపోలేదు. గడియారం వైపు, గుమ్మం వైపు.. భర్త రాక కోసం చూస్తూనే ఉంది.

తర్వాత రోజూ పేపర్ మొదటి పేజీ మూలలో చిన్న వార్త.

తెనాలికి చెందిన రిటైర్డ్ సైన్స్ టీచర్, నాస్తికవాది మోహన్ రావు గుండెపోటుతో మరణం. ఆయన శరీరం అంగలకుదురు మలుపు దగ్గర, దట్టమైన చెట్ల కింద రోడ్డు పక్కన పడి ఉంది.’

ఉమాదేవి చేతిలో పేపర్ జారిపోయింది. ఆమె గోడను పట్టుకుని అలా నిలబడింది.

గుమ్మం బయట వర్షం ఆగిపోయింది..!

Exit mobile version