Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కలంతో ‘కాల ప్రభంజనాన్ని’ తట్టిలేపిన కవయిత్రి

[డా. కొండపల్లి నీహారిణి గారు రచిందిన ‘కాల ప్రభంజనం’ అనే కవితాసంపుటిని సమీక్షిస్తున్నారు శ్రీమతి రాధికాసూరి.]

పరిచయం అవసరం లేని పేరు కొండపల్లి నీహారిణి. ఆత్మీయపు సంభాషణ అమె సొంతం. అందరిలో తానొకరిగా, కలివిడిగా ఉంటూ అందరూ బాగుండాలనే తత్వం. మహిళాసాధికారత కోసం తపన చెందుతూ ఎనిమిదవ అడుగేయమంటూ అతివల్ని ప్రోత్సహిస్తుంటారు. ఆగిపోయిన కలాలకు జీవకళనిస్తూ  ఆన్‌లైన్ పత్రికల్ని నిర్వహిస్తున్న అభ్యుదయశీలి. కవయిత్రిగా కలాన్ని కదిలిస్తూ ఎన్నో ప్రక్రియల్ని స్పృశిస్తూ ముందుకు సాగుతున్న ఈ సాహితీమూర్తికి తెలంగాణ మాడలికంపై వల్లమాలిన ప్రేమ. చాలా వరకు తెలంగాణ భాష, యాసల్లోనే రచనలు చేసే వీరు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

పదిహేడు పుస్తకాలు వెలువరించిన వీరి నాలుగవ కవితా సంపుటి, ‘కాల ప్రభంజనం’ చదివినప్పుడు కలిగిన భావపరంపరలను ‘అక్షరమాలిక’గా అల్లాలన్పించింది. అరవైఐదు కవితలున్న ఈ పుస్తకం వ్యక్తులు, వ్యక్తిత్వాలు, ఆర్తి, వేదన, బంధాలు, కష్టసుఖాలు కలబోసిన కవితాగుచ్ఛం. దీన్ని ప్రముఖ అనువాదకులు ‘ఎలనాగ’గారు ఆంగ్లంలోకి అనువదించారు.

అవసరాల గుర్తెరిగి అసమానతల జాడ్యాన్ని విడనాడాలంటూ, జీవారణ్యం పచ్చగా కళకళలాడినప్పుడే భవితవ్యం పదిలంగా ఉంటుందంటూ ‘శార్వరి నామ’ సంవత్సరంతో చక్కటి ఉద్బోధ చేయించారు తొలి కవితలోనే.

సంచార జాతుల గతుకుల బాటలోని అగచాట్లను, కన్నీటి వెతల్ని కళ్ళకు కట్టినట్టు చూపెడుతూ ‘గూడులేని రోజుకూలీలైన అభాగ్యులంటూ’ కొందరి జీవితాలకు మెరుగులు దిద్దుతూ ‘కాలంతో పాటు కదులుతున్న చిరునామాలేని అభాగ్యులం’టూ బాధపడతారు. ‘దిగంతాలకు పనులను చేయవచ్చిన బ్రతుకు జీవులం’టూ ఆవేదన చెందుతారు.

ముప్పిరిగొనే సందేహాల బందీఖానాలో చిక్కని స్వతంత్రుడివై అరిషడ్వర్గాలు జయించిన వ్యక్తిగా దగాపడ్డ మనసుల అగ్నిజ్వాలల్ని ‘అక్షర తర్పణంతో ఉపశమనం కలిగించ’మంటూ చక్కటి బోధ చేస్తారు. ‘ఉనికి కోల్పోని వ్యక్తిత్వం నీదైతే నీ జీవితానికి నీవే రాజు నీవే బంటు’ అంటూ ఆత్మవిశ్వాసం నింపుతారు. ధనకాంక్షతో మనిషి ఎంతలా దిగజారిపోతున్నాడో తెలుపుతూ ఎదగాల్సిన సమయంలో ‘భావదారిద్ర్యాన్ని వీడి అహంకారపు ముసుగు తొలగించుకొని ‘ముందుకు సాగిపోవాలని దిశా నిర్దేశం చేస్తారు.

మానవ జీవితంలోని ఎత్తుపల్లాలు ఎంతలా బాధిస్తాయో చెబుతూ, మార్పు అనివార్యమైనప్పుడు తన జీవితాన్ని తానే సరి చేసుకుంటూ, మానవతా విలువలు కలబోసుకుని మంచితనపు వంతెన వేసుకుని ముందుకు సాగాలంటూ హితబోధ చేస్తారు.

అధికారానికి ఆడా, మగా భేదం లేదంటూ, ‘ఈ కదనరంగాన ఈ జగతి చెందాన పౌరుషాన్ని రగిలించి’న జ్వలిత చేతనంగా ‘ఆడపోలీసు’ను చూపిస్తూ విధినిర్వహణలో సవాళ్ళను ఎదుర్కొంటూ లక్ష్యం వైపు సాగిపోతూ జనారణ్యపు మృగాల పాలిట ‘మృగరాణివి’ అంటూ అభినందిస్తూ పొగడ్తలు గుప్పిస్తారు.

ఎకాయెకిన లక్షల జీవితాల్ని కాటేసిన కరోనా రక్కసితో ఆగమై పోయి దిక్కుతోచని జనానికి ధైర్యవచనాలు నూరిపోస్తూ, ‘కరోనా హం డరేంగే నహీ’ అంటూ, మనుషులమంతా ఏకమై మానవ మేధతో నిన్ను తరిమికొడతామంటూ బెదరగొడతారు. ‘కరోనాభూతం’ కొంత మంచిని కూడా నేర్పి కుటుంబ జీవనాన్ని కొత్త పుంతలు తొక్కించిందంటారు. అరమరికల్ని అవతలపారేసిన సందర్భాలని, ‘ఇంటిలోని అందం ఇంతింత కాదయ్యా’ అంటూ గృహవాసపు సంబంధాల సౌందర్యానికి సంబరపడి పోతారు.

నేటి సమాజంలో కేవలం బ్రతుకు గురించి మాత్రమే భయపడాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తారు ‘కాల ప్రభంజనం’ కవితలో. ‘మానవ మృగాలుగా కాకుండా మానవతావాదులుగా మగ పిల్లల్ని’ పెంచి సమాజానికి అందించే బాధ్యత తల్లిదండ్రుల దేనంటూ చక్కటి సూచన చేస్తారు. ‘వాడి ద్వంద్వ వైఖరిని నిరసిస్తూ.. వాడి పాపపు శవాన్ని ఊహిస్తానంటూ’ ఆవేశపు సెగలు వెళ్ళగక్కుతూ, ‘అందాల వెన్నెలలు లేని అడవి దగ్ధహృదిని’ అంటూ ఆక్రోశిషిస్తారు.

అడ్డదారుల్లో కూడబెట్టిన సంపద దుర్గంధంతో సమానమని చరమాంకం ‘ఓటికుండలా నిస్తేజమై నాలుగు గోడల్ల నువ్వు శబ్ద సంకేతాలు విను’, అంటూ ఘాటుగా స్పందిస్తారు.

జ్ఞాన శిఖరమైన అలరారిన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యాసారాన్ని గ్రోలి చదువులమ్మ ఒడిలో సేదతీరాలని తపించే విద్యార్థులు ఎందరో! ఆమె మనసు పొరల్లో దాగిన కోరికను వెల్లడిస్తూ.. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా, ‘మెరికల్లాంటి మేధావుల్ని ధారాదత్తం చేస్తుంద’ని చదువుల మర్మమెరిగిన ‘అక్షర సూర్యులను అందిస్తూ’ ఎన్నో అద్భుతావిష్కరణల నిలయమైంది ఈ ఉస్మానియా యూనివర్సిటీ అంటూ పొగడ్తలతో ముంచేస్తారు.

దుక్కి దున్నడం నుండి పంట చేతికొచ్చి పైకాన్ని కళ్ళజూసే వరకు రైతు కష్టాన్ని, దళారీల చేతిలో ఛిద్రమౌతున్న అతని బ్రతుకు పోరాటంలోని సాధక బాధకాలను ఏకరువుపెడుతూ, ‘లోకబాంధవుని మానస పుత్రుడు’ అంటూ పొగడ్తలు గుప్పిస్తారు.

ఆరుగాలపు శ్రమతో అలసి సోలుతున్న ఇంటాయనకు తన వంతు సహాయాన్ని అందించే అతని ఇల్లాలిని అభినందిస్తూ ‘హాలిని’ అంటూ కితాబిస్తూ చక్కని పద ప్రయోగం చేశారు.

‘కొందరికి తిండి జీవులాటయితే మరికొందరికి తిండి దేవులాట’ అంటూ ‘బొడ్డు కోయాలన్నా బొక్కలనతికించాలన్నా’ కత్తెరే దిక్కని చమత్కరిస్తూనే కత్తెర అగచాట్లను, అవసరాన్ని గుర్తుచేస్తారు.

అంతాతానై ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయే సహనశీలియైన ఆలిని వంటింటికే పరిమితం చేసి, గృహహింస పేరుతో జరుపుతున్న, ‘మానినీమారణ హోమాన్ని’ దిగ్విజయంగా జరుపుతున్న కొందరు పురుష పుంగవులకు ఇంతి అవసరాన్ని ఆమూలాగ్రం వివరిస్తూనే ‘అర్రమందారాలు ఆగ్రహిస్తే ఎర్రమందారాలౌ’తాయంటూ ఆవేశంతో హెచ్చరిక చేస్తారు.

సాంస్కృతిక వారసత్వసంపద సజీవ సాక్షమై ముందు తరాలకు అందాలంటే సదాచారాలు, పర్వదినాలు వర్తమానంలో గొప్పగా ఆదరించబడాలి. ఈ మిథ్యా ప్రపంచంలో ఆధ్యాత్మిక భావమే ఆలంబనవుతుంది. అమ్మ జగదంబకు భక్తితో సమర్పించే కైంకర్యం. ‘బోనం ఎత్తడం అంటే అమ్మదనాన్ని’ఎత్తడమంటారు ఒక చోట. విపత్తుల నుండి గట్టెక్కించమంటూ ఆదిపరాశక్తిని గ్రామదేవతగా అర్చిస్తూ అమ్మోరుకు సమర్పించే పరమాన్నమే బోనం.

మనుషులు తమ వృత్తి, ప్రవృత్తుల అనుసారం సాగించే ప్రయాణపు తీరును తెలుపుతూ ‘అద్దంలో ముఖం దిద్దుకున్నట్టు’ అంతరంగాన్ని సరిదిద్దుకుంటూ సాగుతారని అభ్యుదయాన్ని కాంక్షించే ధర్మనిరతుడైన వ్యక్తి సామాజిక చైతన్యం కోసం నడుం బిగిస్తే వెంట వచ్చే వ్యక్తులెందరో! తమ పాండిత్యం, శక్తియుక్తులు కలగల్సిన వ్యక్తులు చరిత్రలో తమ స్థానాన్ని పదిలం చేసుకుంటారని, అపరచాణక్యులు పీవీ నరసింహారావు గారిని, స్వర గాంధర్వులు బాలూగారిని, నిస్వార్థ సేవకులైన ధర్మబిక్షం గారిని గుర్తు చేస్తారు.

కవి గురించి చెప్తూ, తన కలం సిరా చుక్కలను భావాక్షరాలుగా మలిచి ప్రళయాన్నైనా ప్రణయాన్నైనా మదిని తట్టేలా అలవోకగా రాయగలడంటూ, కాలగర్భంలో కలిసిపోయిన విషయాలను వెలికి తీసి, శిధిలాక్షరాలకు హంగుల లిపిని కలబోసి మెరుగులద్ది నాలుగు కాలాలు నిలిచేలా చరిత్రను తిరగ రాయగలడంటూ, అక్షర కుసుమాలతో కవితా యాగం చేయగలడని, గొప్ప భావ దార్శనికుడు, అక్రమార్కుల చిట్టాలిప్పి ‘కవితల దుడ్డు కర్రతో దండించే రక్షకుడు’ అంటూ హర్షాతిరేకంతో నొక్కి చెప్తారు.

చదువరి, జ్ఞానపిపాసి, మాండలిక భాషా ప్రేమికురాలైన కొండపల్లి నీహారిణి గారు నిరంతరం తమ కలంలో సిరా చుక్కలు నింపుకుని అక్షరాలకు పదును పెడుతూ మరిన్ని రచనలు చేస్తూ కొత్తవారిని ప్రోత్సహిస్తూ, అక్షర జైత్రయాత్రను నిర్విఘ్నంగా కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను.

***

కాల ప్రభంజనం (కవిత్వం)
రచన: కొండపల్లి నీహారిణి
ప్రచురణ: కొండపల్లి వేణుగోపాలరావు
పేజీలు: 175
వెల: 120
ప్రతులకు
పాలపిట్ట బుక్స్
403, విజయసాయి రెసిడెన్సీ,
సలీం నగర్, మలక్‌పేట్,
హైదరాబాద్ – 500 036.
ఫోన్ 098498 37327

Exit mobile version