Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కల వికసించింది

[శ్రీ జిల్లేళ్ళ బాలాజీ అనువదించిన ‘కల వికసించింది’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము. తమిళ మూలం: పావణ్ణన్.]

“అన్నా..” అని సంతోషంతో అరిచాను. ఠక్కున కుర్చీలో నుండి లేచి మేజా డ్రాయరును మూసేసి, మేజాకు ఎదురుగా పెట్టున్న నాలుగైదు మూటలను దాటుకుంటూ మెట్లు దిగి పరుగెత్తి గుమ్మంలో నిలబడున్న వేలాయుథం అన్న పక్కన నిలబడ్డాను. “లోపలికి రండన్నా, మన అంగడే అన్నా, ఎలా ఉన్నారు?”

ఆయన్ను చూడగానే నాకు కాళ్లూచేతులూ ఆడలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. ఒక కథానాయకుడికి తగ్గ ముఖ వర్చస్సు, ఆకారం, ఎత్తు, ఆయన తిరిగి నిలబడ్డప్పుడు కూడా స్టేజీమీద నుండి ఒక కథానాయకుడు దిగొచ్చి నిలబడ్డట్టుగానే ఉంది. ఆ క్షణంలో ఆయనకు పేరు పెట్టటానికి ఒకప్పుడు మేము ఎంచుకుని పెట్టుకున్న అవినాష్, కౌశిక్, సుధానంద్ అన్న పేర్లంతా ఇప్పుడు వెంటవెంటనే గుర్తుకొచ్చాయి.

“అయ్యప్పగుడి పక్కన కొత్త మిల్లును తెరిచావని ఆయా చెప్పింది. అటువైపా ఇటువైపా అని తెలియక చూస్తున్నాను.” అని అన్న నవ్వారు. ఆకర్షణీయమైన నవ్వు.

“రండన్నా, లోపలికెళదాం.”

“ఆ పాత మిల్లు ఏమైంది?”

“అది కొంచెం చిన్నదన్నా. యాభై వంద మూట్ల ఒడ్లను పోసి ఎండబెట్టాలంటే కూడా అక్కడ స్థలంలేదు. అందుకనే దాన్ని అమ్మేసి దీన్ని కొన్నాను.”

“ఇది బాగుంది సోమూ. రెండు డ్రామా థియేటర్‌లు కట్టేంత ఉంది. పెద్ద స్థలం.”

అన్న నా చేతుల్ని పట్టుకుని లాగి ఒక్కక్షణం నన్ను గట్టిగా హత్తుకున్నారు. తర్వాత శ్వాసను పీల్చుకుని నవ్వుతూ “నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సోమూ.” అన్నారు.

మెట్లెక్కి ఆయన్ను అంగట్లోకి పిలుచుకొచ్చి నాపక్కన ఇంకొక కుర్చీలో కూర్చోబెట్టాను. తర్వాత తిరిగి, “రేయ్ ఏళుమలే, రమణి హోటల్‌కెళ్లి టీ వడలూ తీసుకు రా.” అని పంపించాను.

ఎదురుగా ఒడ్ల మూటల పక్కన నిలuడున్న తాతతో, “తాతా, ఈయనెవరో తెలుస్తోందా?” అని అడిగాను.

“బాగా తెలుసునే. మనూళ్లో ఉత్సవాల్లో ప్రతి సంవత్సరమూ వచ్చి నాటకం వేస్తారే, ఆ తమ్ముడే కదా?” అన్నాడు. “ఒక నాటకంలో కర్ణుడూ కుంతీదేవీ మాట్లాడుకుంటున్నట్టుగా ఒక సీన్ వస్తుంది. అప్పుడు ఈయన మాట్లాడే మాటలు విని ఏడవని మనిషే లేడు.” అని ఉత్సాహంగా చెప్పాడు తాత.

వరుసలో నిలబడున్న మరొక యువకుడు తానుగా ముందుకొచ్చి “మా నరయూరులో కూడా ఈయనొచ్చి నాటకం వేసున్నారు. నేనూ చూశాను. ‘నీది ఎంగే’ (నీతి ఎక్కడ?) అన్న నాటకంలో ముద్దాయి బోనులో నిలబడి వకీలును చూసి నిలదీస్తూ ప్రశ్నలడుగుతారు. మరిచిపోలేని అనుభవం అది. బాధింపబడ్డ మనిషిగానే మారిపోయి మాట్లాడటమంటే సామాన్యమైన విషయమా ఏంటీ?” అన్నాడు.

అన్న ఆ ఇద్దరినీ చూసి చేతులు జోడించి నవ్వుతూ నమస్కరించాడు. “మీరందరూ నన్ను మరిచిపోకుండా ఉండటాన్ని చూస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది.” కన్నీటి పర్యంతమవుతూ చెప్పాడు.

నేను మరింత ఉత్సాహంతో పక్కనున్న ఇద్దరు చిన్నపిల్లల్ని పిలిచి “రేయ్, ఈయన్ను చూస్తే ఎవరు లాగా అనిపిస్తోంది?” అని అడిగాను.

వాళ్లిద్దరూ అన్నను రకరకాల కోణాలలో నిలబడి కళ్లను చికిలించి చూశారు. తర్వాత ఒక్కక్షణం నవ్వారు. మెల్లగా, “ఇళమై ఊంజలాడుగిరదు (తెలుగులో..అందమైన అనుభవం) సినిమాలో కమల్ లాగా ఉన్నారు.” అని చెప్పి నవ్వుతూ “సరిగ్గా చెప్పానా?” అని అడుగుతూ వెళ్లిపోయారు. “నా మనసులో ఉన్నది అలాగే చెప్పేశార్రా మీరు.” అని వాళ్లను ప్రశంసించాను.

“చూశారా, చూశారా, నా మనసులో ఉన్నది కళ్లతో చూసినట్టు చెప్పేశారు పిల్లలు, చూశారా?” అని అన్నను చూసి అడిగినప్పుడు అన్న ఏమీ బదులివ్వలేదు.

టీ గ్లాసుల్నీ, పేపరు చుట్టి తీసుకొచ్చిన వడలను మేజామీద పెట్టి వెళ్లాడు ఏళుమలై.

ఒక ముక్క వడను తీసుకున్న అన్న, “ఇళమై ఊంజలాడుగిరదు సినిమా చూసొచ్చిన కొత్తలో నువ్వూ మనవాళ్లూ  ఆ విషయమే చెప్పారు. ఒక సందర్భంలో పిచ్చిగా ఆ పేరు చెప్పే పిలవటం మొదలుపెట్టారు.” అన్నారు.

“నవరస నాయకుడు అవినాశ్, కౌశిక్, సుధానంద్..”

“ఔను. గుర్తుంది. మూడింట్లో ఏ పేరు బాగుందని చీటీలు వేసి తీశాం. ఒక పోస్టర్‌లో కూడా ఆ విధంగానే పేరు వేసి ప్రింటు చేశారు కదా. ఆరోజు చిత్రా మేడమ్ కూడా మన టీమ్‌లో నటించారు. మామూలుగా మేఘలా మేడమ్ వేసే పాత్ర. ఉన్నట్టుండి ఆమె రాకపోవటంతో, ఈమెను నువ్వే వెళ్లి పిలుచుకొచ్చావు కదా? ఏడెనిమిది సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడెక్కడున్నారు?”

“ఆమెకు కొయంబత్తూరు వైపు ఒక మిల్లులో ఉద్యోగం దొరికి అక్కడికే వెళ్లి సెటిలైపొయ్యారన్నా. ఈ సంవత్సరం ఏం నాటకమన్నా వెయ్యబోతున్నాం? తేయాద నిలవా (కరగని చంద్రుడా), పచ్చై వయలా (పచ్చని పైరా)?”

“రెండూ వద్దు సోమూ. వీటినే కదా ప్రతి సంవత్సరమూ మార్చి మార్చి వేస్తున్నాం! ఈ సంవత్సరం మనం ఒక కొత్త నాటకం వేద్దాం. దానికోసమే కొత్తగా ఒక స్క్రిప్ట్ రాశాను.”

“కొత్తదా? ఏం పేరన్నా?”

అన్న తన చేతిసంచిలో నుండి బైండింగ్ చేసిన ఒక నోటుపుస్తకాన్ని తీసి బల్లమీద పెట్టారు. మొదటిపేజీ మధ్యలో పెద్ద పెద్ద అక్షరాలతో కణవు మలర్‌న్దదు (కల వికసించింది) అని రాయబడి ఉంది.

కణవు మలర్‌న్దదు, కణవు మలర్‌న్దదు అని మళ్లీమళ్లీ మనసులో చెప్పుకున్నాను. ఏదో ఆకర్షణీయమైన శక్తి ఆ పేరులో ఉండటాన్ని గ్రహించాను.

“కణవు మలర్‌న్దదు పేరు చాలా బాగుందన్నా.”

“మంచి సబ్జెక్ట్ సోమూ ఇది. నాటకంలో మూడు ముఖ్యమైన పాత్రలు. ముగ్గురికీ జీవితం గురించి వేర్వేరు కలలుంటాయి. ఆ కలలకేసి ప్రయాణించి వెళ్లే పయనంలో వాళ్లకు ఎదురైన అనుభవాలే నాటకం.”

“నాకు మామూలుగా ఒక చిన్నరోల్ చాలన్నా. మర్చిపోకండి.”

“నువ్వు లేని నాటకమా సోమూ. సెకండ్ హీరో పాత్రకు మన లోకనాథన్‌ను వేసేద్దాం. తర్వాత ఒక బలమైన పాత్ర ఉంది. దానికి గురుస్వామి పేరును మనసులో ఉంచుకున్నాను. స్త్రీ పాత్రకే ఇప్పుడు మనకొక మంచివ్యక్తి కావాలి. నీ మనసులో ఎవరి గురించైనా అనిపిస్తోందా?”

“విళిప్పురం మాడప్పురా ట్రూపు’ లో దేవికా అని ఒక మేడమ్ నటిస్తుండేవారు. ఊళ్లో సరైన ఆదరణ లేదని ఇప్పుడు ఆ ట్రూపే చెదిరిపోయింది. ఆమెను అడుగుదామన్నా.”

“ఎక్కడుంటారు ఆమె?”

“రైల్వే కాలనీలో.”

“సరే, ఒక మార్పు ఏర్పాటుగా ఇంకో వ్యక్తినీ ఆలోచించి పెట్టుకుందాం.”

“మన త్యాగరాజుకు బంధువు ఒకమ్మాయి కండమంగలం ఎలిమెంటరీ స్కూల్లో టీచరుగా పనిచేస్తోందన్నా. ఆమె పాండిచ్చేరి రేడియోస్టేషన్లో అప్పుడప్పుడూ నాటకాల్లో నటించటం కద్దని చెప్పిన జ్ఞాపకముంది. కావాలంటే అతని ద్వారా ఆమెను ప్రయత్నిద్దాం.”

“పాట రాసేందుకూ?”

“మామూలుగా మన తమిళ్ సార్ ఆర్ముగమే రాసే అలవాటు. ఆయన్నే అడుగుదాం.”

“ఆయనకు రెండు పాటలిద్దాం. ఇంకో రెండు పాటలకు వేరే కొత్తగా ఎవరైనా దొరికితే మంచిది.”

“రామలింగం అని ఒక కవి. బేకరీ అంగడి పెట్టుకోనున్నాడన్నా. ఈ సంవత్సరం పొంగల్ కవిసమ్మేళనంలో కూడా కవిత చదివారు. ఆయన్ను అడిగి చూద్దామా?”

“రెండే రోజుల్లో అన్ని ఏర్పాట్లనూ ముగించాలి సోమూ. ఆ తర్వాత రీడింగ్ ఉంటుంది, రిహార్సల్స్ ఉంటుంది. చాలా పనులు.”

“బుల్లెట్ తీసుకుని ఒక రౌండ్ వెళ్లొస్తే, పనులు పూర్తవుతాయన్నా. మీరు దిగులుపడకండి. ప్రతి సంవత్సరం ఉత్సవం నాటకం కోసమే మీరు బెంగుళూరు నుండి వస్తున్నారు. ఇక్కడుండి దీన్ని కూడా నేను చెయ్యకపోతే ఎలాగన్నా?”

వడలను తిని ముగించి టీ కూడా తాగాక గ్లాసును పక్కన పెట్టాడు అన్న.

“మీరు సినిమాల్లోకి దూరి ఒక జర్క్ ఇచ్చి ఉండాలన్నా. అదే నాకు పెద్ద లోటు. మీరు ఈ పక్కనే మరుగున ఉండిపొయ్యారు.”

అన్న ఒక్కక్షణం నన్ను తలెత్తి చూశారు. “సోమూ, ఆవు దూడనే ఈనటానికి వీలవుతుంది. ఏనుగుపిల్లను ఈనటానికి వీలవుతుందా? ఒక్కొక్కదానికీ ఒక లెక్కుంది. అర్థం చేసుకో. ఈ జీవితంలో మనకు నాటకం ఒకటి చాలు. ఎదిగేకొద్దీ ఎగిరినా గువ్వ గ్రద్ద కాలేందు. అలాగే అంటారు.”

“ఏం చెప్పినా మీరిలాగే ఏదో ఒక సామెతను చెప్పి నోరు ముయ్యించేస్తారు.”

“సామెతలేం ఆకాశం నుండి నేరుగా ఊడిపడ్డాయా? ఎవడికి వాడు జీవించి, చెడిపోయి తిరిగిన తర్వాతే చెప్పి పెట్టి పోతాడు.”

“సినిమా అంటే లక్షలాదిమంది చూసే ప్రపంచమన్నా. మీ టాలెంట్‌ను ఆ ప్రపంచం తెలుసుకోవద్దా? ఒట్టి వళవనూరు మనుషులు చూసి మెచ్చుకుంటే సరిపోతుందా? మా అన్న కేవలం యాభైమంది నూరుమంది మధ్యన మాత్రమే చక్కగా నటించే మనిషిగా ఉండటం చాలదన్న అసహనమే అన్నా నాకు.”

“సోమూ, నాటకమంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు నిలబడి ఆడి గెలిచే చోటు. సినిమా అంటే పెద్ద కురుక్షేత్రం. ఒట్టి అయిదుమంది గెలవటానికి పదకొండు అక్షౌహిణి సేనలు చావాలి. అదంతా అవసరమా సోమూ.”

“అన్నీ మీరే ఊహించుకుంటారన్నా.”

“నాటకమన్నది నేను గెలిచే చోటు సోమూ. అది స్పష్టంగా నాకు తెలుసు. సినిమాలో ఆ స్పష్టత లేదు.”

గుమ్మంలో ఎవరిదో నీడ పడటంతో తిరిగాను. “శెట్టిగారు పంపించారు.” అని నమస్కరించి ఒకవ్యక్తి వచ్చి తలుపు పక్కన నిలబడ్డాడు.

“రండి, లోపలికి రండి.” అన్నాను. ఆయన లోపలికొచ్చి “డబ్బిచ్చి పంపారండి. మీరు జమ చేసుకుని ఈ పుస్తకంలో రాసివ్వండి.” అన్నాడు. ఆయనిచ్చిన డబ్బును ఎంచి డ్రాయర్లో పెట్టి అంగడి లెడ్జర్లో నోట్ చేసుకుని ఆయనిచ్చిన నోటు పుస్తకంలోనూ రాసిచ్చాను. ఆయన దాన్ని తీసుకోవటానికి ముందు అన్నను మళ్లీ మళ్లీ చూస్తూనే ఉన్నాడు.

“ఏం చూస్తున్నారు? ఎవరో తెలుస్తోందా?”

“ప్రతి సంవత్సరమూ డ్రామాలో చూస్తాను, వీరిని మర్చిపోగలనా? పోయిన సంవత్సరం కూడా నాటకంలో ‘వరుగ వరుగ నిలవే, తరుగ తరుగ ఒళియే’ (రమ్ము రమ్ము జాబిలీ, ఇవ్వు ఇవ్వు కాంతినీ) పాటలన్నీ పాడి నటించారే, నాకు బాగా గుర్తుంది.”

అన్న ముఖంలో ఆనందం కలిసిన భావన కలగటం చూశాను.

“పర్వాలేదే, మంచి జ్ఞాపకశక్తి కలిగిన వ్యక్తినే గుమస్తాగా పెట్టుకోనున్నారు శెట్టిగారు.”

“నాకు నాటకాలంటే ప్రాణమండి. చుట్టుపక్కల పదిహేను గ్రామాల్లోనూ ఎక్కడ నాటకం జరుగుతున్నా వెళ్లి చూసొస్తానండి. చిన్న వయసునుండి అలాంటి ఒక అలవాటు. ఒకప్పుడు మానాన్న నన్ను భుజమ్మీద ఎత్తుకెళ్లి చూపించి  అలవాటు చెయ్యించారు. ఇప్పుడు వదల్లేకపోతున్నాను.”

“మీది ఏ ఊరు?”

“ఇక్కడే నండి, పక్కనే. సిరువందాడు. ఊళ్లో ఇప్పుడంతా నాటకాలు లేవండి. రెండుమూడు సంవత్సరాలుగా రికార్డు డ్యాన్సే. ఒక్కొక్కతీ టింగు టింటుమంటూ ఎగురుతుంది. దాన్ని ఏమని చూస్తాం చెప్పండి. ఈ ఊళ్లోనే ఇంకా నాటకం ఉంది. అందుకనీ రాత్రి ఉండి చూసే వెళతాను. తమరి నటన, డైలాగులన్నీ నాకు బాగా నచ్చుతాయి.”

ఆయన తన సంతోషాన్ని నియsత్రించుకోవటం తెలియక మాట్లాడుతూనే ఉన్నాడు.

“తమరి గొంతు నాకు బాగా నచ్చుతుంది. చక్కని కంచు కంఠం. అంత స్పష్టం. కచ్చితం. నడకలో కూడా ఎన్ని రకాలనీ. శోకంలో ఒక నడక. సంతోషంలో ఒక నడక. విషాదంలో ఒక నడక. నేనుంటే ఇలాగే ఏవేవో వాగుతూనే ఉంటాను. బయలుదేరుతానండి. చెప్పేకొద్దీ వస్తూనే ఉంది.”

ఆయన చేతులు జోడించి నమస్కరించి బయలుదేరాడు. నవ్వు ముఖంతో ఆయనచెప్పే మాటల్ని వింటూ

ఉండిపోయాడు అన్న. ఉన్నట్టుండి, “సోమూ, ఆయన్ను కాస్త పిలువు. మన నాటకంలో ఆయనకొక రోలిద్దాం.” అన్నాడు. అప్పుడే ఆయన మెట్లు దిగి అంగడి వాకిలిని దాటుకుని కరెంటు స్తంభం పక్కన నిలిపిన సైకిలు దగ్గరికెళ్లాడు. ఆయన పేరు గుర్తుకు రాలేదు. చటుక్కున చేతుల్ని చరిచి శబ్దం చేశాను. అది వినగానే ఆయన తిరిగి చూశాడు. ‘నన్నా?’ అన్నట్టుగా చాతీపైన బొటనవేలు పెట్టి సైగచేస్తూ అడిగాడు. “రండి, మిమ్మల్నే” అని పిలిచాను. ఆయన వేగంగా మెట్లెక్కి వచ్చాడు.

“ఒక చిన్న రోల్ ఇస్తాను. మీరు చేస్తారా?” అని ఆయన్ను అడిగాడు అన్న. ఆయనకు మొదట ఏమీ అర్థంకాలేదు. అర్థంకాగానే ఆనందంతో తడబడ్డాడు. “నాకు ముందూ వెనకా మాట్లాడి అలవాటు లేదే.” అన్నాడు.

“అవన్నీ నేను నేర్పిస్తాను. మీరు చేస్తారా? రెండు సీన్లే!”

ఆయన జంకూ, ఆనందమూ కలిసిన స్థితిలో తలూపాడు.

“సరే, సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్తున్నప్పుడు ఇక్కడికి రండి. డైలాగులేమిటో చెబుతాను.”

ఆయన మళ్లీ చేతులు జోడించి నమస్కరించి వెళ్లాడు.

“ఏంటన్నా ఠక్కున ఈయన్ను పట్టేసుకున్నారు?”

“ఇలాంటి ఒక ఉత్సాహవంతుడైన మనిషినే మనం ఉపయోగించుకోవాలి సోమూ.”

ఒక ఎద్దులబండి గుమ్మం ముందుకొచ్చి ఆగింది. బండిని తోలుకొచ్చిన వ్యక్తి ఒక్కో మూటగా ఎత్తుకొచ్చి లోపల తీసుకెళ్లి పెట్టాడు. ఐదు మూటలను దించాక, పంచె కట్టుకుని వచ్చిన వ్యక్తి సంచిలోనుండి డబ్బుతీసి సోమూకిచ్చి “బియ్యం వేరు, తవుడు వేరేగా వేర్వేరు గోతాల్లో కట్టి పెట్టమని చెప్పండి. మన బండోడికి గానుగమిల్లుకు వెళ్లే పనుంది. తిరిగొచ్చేటప్పుడు తీసుకుంటాడు.” అన్నాడు.

బయలుదేరుతున్నప్పుడు అన్నవైపు చూస్తూ.. “తమ్ముడూ మీరు నాటకాలేస్తారు కదూ?” అని అడిగాడు. “ఔను!” అనగానే “డ్రామా గుంపు దిగితేనే ఉత్సవాలకు ఒక కళ వస్తుంది. మన ఇంటి ఆడవాళ్లకు మీ డ్రామాలంటేనే చాలా ఇష్టం. పోయిన సంవత్సరం వేసిన డ్రామా డైలాగుల్ని అప్పుడప్పుడూ చెబుతూనే ఉంటారు. ఏంటో ‘నెలా..’ (చంద్రుడు..) అన్న ఒక నాటకం వేశారే, అందులో వచ్చే పాటలన్నీ వాళ్లకు కంఠోపాటంగా తెలుసు. వాటిని పాడుకుంటూనే దినమూ చెత్త ఊడవటమూ, కాయగూరలు తరగటమూ చేస్తారు. మిమ్మల్ని చూశానని ఇంట్లో చెప్పానంటే, అందరూ సంతోషిస్తారు.” అని చెప్పి వెళ్లారు.

కొంతసేపయ్యాక “మీ అవ్వ నన్ను చూసినప్పుడల్లా ఒక విషయం చెప్పేదన్నా!” అని మాటలను కొనసాగించాను.

“ఏంటో చెప్పూ.”

“మీరు కోపగించుకోనంటే చెబుతాను. లేకపోతే ఆ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టేస్తాను.”

“ఏంటి సోమూ పొడుపుకథ వేస్తున్నావు? చెప్పూ. ఎందుకు నీళ్లు నములుతున్నావు?”

“అవ్వా, తాతా ఇక్కడున్నారు. మీరు బెంగుళూరులో ఒంటరిగా ఉంటున్నారు. మీరు ఇక్కడికి రాలేరు. వాళ్లు అక్కడికి రావటానికి వీలుకాదు. మీకు ఒక తోడును చూసి ముడి పెట్టేస్తే ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నారు. ఆ విషయాన్ని ఎత్తగానే మీరు టాట్‌బూట్ అంటూ కేకలేస్తారట. అందుకే అవ్వ నన్ను మాట్లాడమని చెప్పింది.” ఒక విధంగా నేనూ సాగదీసి సాగదీసి ఎలాగో ముగించాను.

ఒక్కక్షణం ఆగి అన్న, “నాకు నీమీదా కోపం లేదు. వాళ్లమీదా కోపం లేదు సోమూ. ఇప్పటికే వాళ్లే ఒక తోడును చూసి ముడిపెట్టారు. ‘మంగళం’లాంటి ఒక స్త్రీని ప్రపంచంలోనే చూడలేము. నిజం చెప్పాలంటే నాకు నిదానాన్ని, ఓపికనూ, సహించే గుణాన్నీ చెప్పించి పరిపక్వత కలిగించిందంతా మంగళమే. ఆమె లేదంటే నేను ఒట్టి గులకరాయిలా పడుండేవాణ్ణి. నా తలరాతో, నా దురదృష్టమో, ప్రసవ సమయంలో ఆమె వెళ్లిపోయింది, ఆమెతోపాటు బిడ్డా పోయింది. మంగళానికిచ్చిన స్థానాన్ని ఇంకో మనిషికి నేనెలా ఇవ్వగలను, చెప్పు! ఒకడికి ఒక జీవితంలో ఒక భార్యే సోమూ. రెండవ భార్య అన్న మాటకే తావులేదు. ఏదో అభిమానంతో అవ్వ చెప్పిందని నేను తప్పు చెయ్యటానికి వీలవుతుందా?”

బొంగురు కంఠంతో అన్న చెప్పిన ఒక్కొక్క మాటా ఆయన ఆలోచనను గ్రహింపచేసింది. ఆయనను, ఆ ఆలోచనలను ఇలాగే పొడిగించటం ఆయనను మరింత బాధకు గురిచేస్తుందేమోనన్న భయం కలిగింది. ఆయనను బయటపడవేసే విధంగా, “విళిప్పురంలో దేవికా అని ఒక ఆర్టిస్టు గురించి చెప్పానే, వెళ్లి కలిసొస్తామా అన్నా?” అన్నాను. అన్న ముఖం వెంటనే వికసించింది.

“ఇప్పుడే వెళదాం సోమూ. నేనే నిన్ను ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను.”

నేను మిల్లులోకెళ్లి పనివాళ్లకు పనులను అప్పగించి, కొట్టంలో ఆపి వున్న బుల్లెట్‌ను బయటికి తీసుకొచ్చి నిలిపి, గుడ్డతో తుడిచాను. చాలినంత పెట్రోలు ఉందా అని ఒకసారి ట్యాంకర్ మూతను తీసి చూశాను.

“స్క్రిప్ట్ ఎందుకన్నా?”

“చేతిలో ఉండనీ. దాన్ని చూస్తే ఆమెకూ ఒక నమ్మకం కలుగుతుంది కదా?”

బండి బయలుదేరింది. నేను ఆ క్షణమే ఆ నాటకం స్టేజీమీద ప్రదర్శించబోతున్నట్టుగా ఊహించుకున్నాను. నాకు ఇవ్వబోయే చిన్నపాత్రను సరిగ్గాచేసి అన్న దగ్గర మంచిపేరు తేవాలని అనుకున్నాను. తర్వాత అమ్మకూ భార్యకూ నచ్చే విధంగా ఉండాలికదా అన్న ఆదుర్దా ఆ క్షణమే ఉదయించింది.

రైల్వేకాలనీలో ఆరు వీధులున్నాయి. చాలాచోట్ల విచారించాక రోడ్డుపక్కన ఇస్త్రీచేసే బండిని నిలబెట్టున్న ఒక వ్యక్తి దారి చెప్పాడు. అది ఆంగ్లో ఇండియన్ కుటుంబాలు నివసించే చోటు. వాళ్లు తమ ఇండ్లను రెండు భాగాలుగా చేసి, ఒక భాగాన్ని అద్దెకు ఇచ్చున్నారు. దేవికా ఇల్లు ఆ ప్రాంతంలో ఉండేందుకు అవకాశం లేదని అనుకోవటంతో మేము మొదట్లో అక్కడ విచారించకుండా వెళ్లిపోయాము.

మేము బండిని ఆ ఇంటి ముందు ఆపుతున్నప్పుడు, ఒక అవ్వ వాకిట్లో మునగాకును గిల్లుతోంది. ఈజీచెయిర్లో ఒక తాత కూర్చొని ఉన్నాడు.

“ఇక్కడ ఆర్టిస్టు దేవికా అనీ..” అంటూ సాగదీశాను.

“ఈ ఇల్లే. మీరూ?” అని అడిగింది అవ్వ. మా ఇద్దరినీ మార్చిమార్చి చూసింది.

“మేము వళవనూరు నుండి వస్తున్నామమ్మా. నేను పద్మావతి రైసుమిల్లు ఓనర్ని. ఒక నాటకం విషయంగా ఆర్టిస్టును కలవాలి.”

ఈలోపు మా మాటల శబ్దం విని ఒక స్త్రీ బయటికొచ్చింది. ముప్పై ఐదేళ్లుంటాయి. మంచి ఆకర్షణీయమైన ముఖ వర్చస్సు. “ఎవరండీ?” అని అడిగింది.

మేము సంక్షిప్తంగా మమ్మల్ని పరిచయం చేసుకున్నాం. అన్న నుండి నాటక ప్రతిని తీసుకుని ఒకసారి తిప్పి చూసింది.

“మాడప్పురాక్కళ్ ట్రూపును ఎందుకు మూసేశారు?” ఒక సంభాషణను ప్రారంభించే విధంగా నేను ఆమెను అడిగాను.

“తానుగా మూసుకుపోయింది సార్. అన్నీ సినిమా మయంగా మారిపొయాయి. రోజుకు నాలుగు సినిమాలు చూపించినా జనాలు చూడటానికి తయారుగా ఉన్నారు. అయితే ఒకే ఒకగంట సమయం నాటకం చూడ్డానికి ఎవరూ తయారుగా లేరు. తానుగా ఎండిపోయే బావిలాగా నాటకమూ ఎండిపోయింది.”

“కణవు మలర్‌న్దదు’ నాటకంలో సుగుణా అన్న ఒక క్యారెక్టర్ రోలును మీరు చేస్తే బాగుంటుంది. మంచి లీడ్ రోల్. నటించటానికి మంచి స్కోపున్న రోల్. కచ్చితంగా మీరొచ్చి నటించాలి.”

“విళిప్పురంలోనే ఉంటే పర్వాలేదు. చంటిబిడ్డ ఉంది. విళిప్పురానికి బయటంటే నాకు కష్టం.”

“మీరు మాత్రమే సుగుణా రోల్‌ను బాగా చెయ్యగలరు మేడమ్. నాటకం పూర్తికాగానే కణవు మలర్‌న్దదు హీరోయిన్ అంటూ మీకు పేరొస్తుంది.”

ఆమె కొంతసేపు ఆలోచించింది. సన్నని చిరునవ్వు ఆమె పెదాలపై పడి మరుగైంది. “అమ్మా, ఏమంటారు? పాపం, ఇల్లు వెతుక్కుని వచ్చి ఇంతగా అడుగుతున్నారు, ఏం చెప్పమంటారు?” అని ఆకును గిల్లుతున్న అవ్వను అడిగింది. “వెళ్లి రావే. బిడ్డను నేను చూసుకుంటాను. ఎన్నాళ్లని నువ్వూ పొయ్యినీ, గోడనూ మొరిచి మొరిచి చూస్తుంటావు?” అంది అవ్వ. ఆ మాటలు విని దేవికా ముఖం వికసించింది.

“రేపు ఉదయం రీడింగ్ పెట్టుకుందాం మేడమ్. బస్టాండులో దిగి పద్మా రైస్‌మిల్లని అడిగితే ఎవరైనా చెబుతారు. ఒక వంద మీటర్ల దూరమే.”

“సరే, వస్తాను. అయితే రోజూ రాలేను. రేపే నా డైలాగుల్ని ఒక క్యాసెట్లో రికార్డు చేసి ఇచ్చేశారంటే నేను నేర్చేసుకుంటాను. మీరేమీ భయపడకండి. రిహార్సల్స్ నాటికి మీరే తెలుసుకుంటారు.”

“క్యాసెట్లో రికార్డు చేసి ఇచ్చేద్దామన్నా. మన దగ్గర టేపురికార్డరుంది.” అంటూ అన్నకేసి చూశాను. ఆయనా మౌనంగా తలూపాడు.

“సరే, ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్లారంటే బాగుంటుంది.”

“మేము తొందరలో బయలుదేరటం వల్ల అలాగే వచ్చేశాం మేడమ్. రేపు ఆఫీసుకు వస్తారు కదా. అప్పుడు ఇచ్చేస్తాం మేడమ్.”

“ఒక్క నిమిషం.” అని చెప్పి లోపలికెళ్లిన దేవికా రెండు గ్లాసుల నిండుగా మజ్జిగ తీసుకొచ్చి మాకిచ్చింది. పుదీనా,  ఒక ముక్క పచ్చిమిరపకాయనూ కలిపిన ఐసు మజ్జిగ. మేము వద్దనలేదు. ఎండకు ఆ మజ్జిగ అరువుగా అనిపించింది.

కృతజ్ఞతలు చెప్పి బయటికొచ్చేసరికి ఒక పెద్ద భారం దింపుకున్నట్టుగా అనిపించింది.

“వెళ్లే దార్లో కోలియనూరులో లోకనాథన్నూ కలుసుకుని ఒకమాట చెప్పి వెళ్లిపోదామన్నా. దాంతో ఇటువైపు పనులు పూర్తవుతాయి. కవినీ, గురుస్వామినీ సాయంకాలమో రాత్రికో వెళ్లి కలుద్దాం.”

కోలియనూరులో గుడి పక్కనే లోకనాథన్ ఇల్లుంది. “పోయిన సంవత్సరం వరకూ మన ఊళ్లోనే ఉన్నారు. ఆయన భార్యకు ఈ ఊరు బాల్వాడిలో ఉద్యోగం దొరికింది. అందుకనీ ఇంటిని ఇక్కడికి మార్చుకుని వచ్చేశారు.”

గుమ్మంలో చెప్పుల్ని వదిలిపెట్టి గుడికేసి చూసి నమస్కరించాక ఇంటి తలుపును తట్టాను. “లోకనాథా లోకనాథా..” అని పిలిచి ముగించేలోపు వాడే వచ్చి తలుపు తీశాడు. మా ఇద్దరినీ చూసి వాడు ఆశ్చర్యంలో మునిగిపొయ్యాడు. “రండి రండి, రామలక్ష్మణులు లాగా ఇద్దరుగా వచ్చారు, ఏంటి విషయం?” అని అడిగాడు.

అన్న సంక్షిప్తంగా విషయాన్ని చెప్పాడు. “అన్నా, ఈ మాత్రం దానికి మీరెందుకన్నా వచ్చారు? చెప్పి పంపిస్తే సరిపోదా? ఉదయం పది గంటలకు నేనొస్తానన్నా.” అని సంతోషంగా చెప్పాడు.

మిల్లుకు తిరిగొచ్చేసరికి గంట ఒకటిన్నర అయ్యింది. అన్నను మేజా పక్కన కూర్చోబెట్టి లోపలికెళ్లి పనివాళ్లను అంగడి విషయాలను అడిగి తెలుసుకున్నాను. అన్న తనచేతిలో ఉన్న చేతిరాత ప్రతిని తిప్పుతున్నాడు.

“సోమూ, ఈ స్క్రిప్టును చూసి కార్బన్‌పేపరు పెట్టి ఎవరైనా రాసి ఇవ్వగలరా? చేతిలో రెండుమూడు ప్రతులుంటే మంచిదే కదా? ఆ దేవికా అమ్మాయికి క్యాసెట్లో రికార్డు చేసి ఇచ్చేదానికన్నా పుస్తకంగానే ఇచ్చేద్దాం.”

“మన రామదాసు అయ్యర్ అమ్మాయి టైపురైటింగ్ ఇన్‌స్టిట్యూట్ నడుపుతోందన్నా. అక్కడ అడిగి చూస్తాను. అందంగా టైపు చేసేద్దాం. కొందరి చేతిరాత కొందరికి అర్థమవుతుంది. కొందరికి అర్థం కాదు. ఎందుకా సమస్య?”

“సాయంకాలం ఏటి ఒడ్డు వైపుకు వెళ్తున్నప్పుడు అడిగేద్దామా?”

“సరే అన్నా. రాత్రి భోజనం మనింట్లోనే పెట్టుకుందామన్నా. అవ్వతో చెప్పేయండి. సరేనా?”

“అదంతా ఎందుకు సోమూ?”

“మీరు ఊరుకోండన్నా. మీరొచ్చి మా ఇంట్లో భోంచెయ్యటం మాకెంతో గౌరవమన్నా.”

“సరే, సరే. వస్తాను.”

మాటల్లో పడి నేనొక క్షణం గుమ్మం వైపు చూడ్డం మరిచిపోయాను. సోమూ సోమూ అంటూ మెట్లెక్కి లోపలికొచ్చాకే నేను ఆయన్ను చూశాను. గుడి ధర్మకర్త.

“రండ్రండి.” అని లేచి ఆహ్వానించాను. “ఏంటి సోమూ, గుడివైపు రావటమే లేదు.” అన్నారాయన.

“ఉదయం అన్నొచ్చారు. నాటకం విషయంగా పార్టీని కలుసుకుని మాట్లాడటం కోసం విళిప్పురం దాకా వెళ్లి ఇప్పుడే వచ్చాం.”

ఆయన అప్పుడే నా పక్కన కూర్చోనున్న వేలాయుథం అన్నను చూశారు. “అరరే, వేలాయుథమా, ఎప్పుడయ్యా వచ్చావు బెంగుళూరు నుండి? బాగున్నావా అయ్యా?” అని క్షేమం విచారించారు. “కళ్లు కాస్త మసకబారాయి. ఎండలో నుండి లోపలికి రాగానే ఏమీ కనిపించలేదు. నువ్వు కూర్చోనుండటం గమనించలేదు.” అన్నారు.

“పర్వాలేదు సార్. గుడి పనులన్నీ ఎలా జరుగుతున్నాయి?”

“ఈరోజే సున్నం కొట్టటం మొదలుపెట్టారు. చందాలకు వేరే పోవాలి. ఈ ఎండ కూడా తలను మాడ్చేస్తోంది. ఏం చేద్దాం?” అంటూ పైగుడ్డను తీసి మెడనూ ముఖాన్నీ తుడుచుకున్నారు.

“సోమూ, కాస్త ఇలా రా!” అంటూ మెట్లు దిగి గుమ్మంవైపు వెళ్లారు ధర్మకర్త. “ఒక్క నిమిషం.” అని అన్నకు చూపుడువేలును చూపించి నేనూ ఆయన వెనకే నడిచాను.

తలుపును దాటగానే అక్కడున్న బుల్లెట్ మీద చేతిని పెట్టుకుని, “ఏంటి సోమూ, మనమింకా ఏదేది ఏఏ తేదీలలో జరగాలో తేదీలు కూడా నిర్ణయించలేదు. అంతలోపే ఆ తమ్ముణ్ణి రప్పించేశారే.” అని విసుక్కున్నారు.

“తేదీల్లో ఏం మార్పులు రాబోతాయి తలైవరే (నాయకా). ఒకటీ రెండైనా శుక్రవారంగా ఉంటుంది. లేదూ  మూడవ శుక్రవారంగా ఉంటుంది. అంతేకదా?”

“ఏమైనప్పటికీ నిర్ణయం తీసుకోకుండా ఆ తమ్ముడికి ఎలా సమాచారం వెళ్లింది?”

“చిత్రి(చైత్రం) నెలలో ఉత్సవాలని ఆయనకు తెలియదా ఏంటీ? నేనేమీ చెప్పలేదు నాయకా. ఆయనే వచ్చారు!”

“ఆ తమ్ముడు రానీ సోమూ. నేను వద్దని చెప్పలేదు. ఆ తమ్ముడు నాటకం వేసే ఆలోచనతోనే కదా వచ్చుంటాడు.”

“ఔను నాయకా. ఈ ఉత్సవం కోసమే అన్న కొత్తగా ఒక నాటకం కూడా రాసున్నారు. ‘కల వికసించింది.”

“అదే నేను చెప్పదలచుకున్న విషయం. మోట్టు వీధి మనుషులు నాటకం వద్దని ఒంటికాలిమీద నిలబడుతున్నారు. పోయిన సంవత్సరమే వాళ్ల మనుషులొచ్చి నాతో మాట్లాడారు. నేనూ ఏదో కథచెప్పి ఆ మాటను అట్టే అణిచేశాను. అయితే ఈసారి వాళ్లు అలా విడిచిపెట్టేట్టు లేరు. మొండిగా ఉన్నారు. నా వల్ల వాళ్లను ఎదిరించి మాట్లాడ్డానికి వీలుకాలేదు. మన గుడి ప్రాంతంలో అయిదుగురు వార్డు మెంబర్లున్నారు. అందులో నలుగురు నాటకం వద్దంటున్నారు. నేనేం చెయ్యగలను? నువ్వే చెప్పూ?”

“నాటకం వద్దనా?”

“నాటకానికి బదులుగా రికార్డు డ్యాన్స్ పెట్టండని చెబుతున్నారు. చుట్టుపక్కలున్న పద్దెనిమిది గ్రామాల్లోనూ రికార్డు డ్యాన్సే జరుగుతున్నాయట. ఆ విధంగానే ఇక్కడా జరపండని ఒంటి కాలిమీద నిలబడుతున్నారు.”

నాకు ఒళ్లు వణకటం మొదలైంది. “ఇలా అంటే ఎలా నాయకా. అన్న ఎంతో నమ్మకంతో కొత్త నాటకం రాసి తీసుకొచ్చారు..”

“నేనేం చెయ్యగలను చెప్పూ. నేను ఒంటి మనిషిని. వాళ్ల ముందు నేను మాట్లాడలేకపొయ్యాను. ఎవరో వనజానో గిరిజానో నొట్టపాక్కం వాసియట, ఆమెకు అడ్వాన్స్ ఇచ్చేసి వస్తామని చెప్పి బయలుదేరి వెళ్లిపోయారు.”

“అయితే అన్న?”

“నువ్వే ఏదైనా చెప్పి వెనక్కి పంపే పని చూడు. నేను బయలుదేరుతాను. ఆ పెయింట్ కొట్టేవాడు ఇంకా కొంచెం సున్నం కావాలని అడిగాడు.”

ధర్మకర్త వేగంగా తిరిగి వెళ్లి గోడకు ఆనించి పెట్టిన సైకిలుమీదకెక్కి వేగంగా వెళ్లటాన్ని అయోమయంగా చూస్తూ నిలబడటంతో సమయం గడిచిందే తెలియలేదు. అన్నకి ఎలా చెప్పాలా అని అర్థంకాని తడబాటుతో మెట్లకేసి తిరిగిన క్షణంలో అన్న మెట్లపై నుండి కిందికి దిగుతున్నారు. ధర్మకర్త మాటలు ఆయనకు వినిపించి ఉంటాయి అనటంలో నాకు అనుమానం లేదు.

“అన్నా..”

నా గొంతు పూడుకుపోతున్నట్టుగా అనిపించింది. మాటలు పెగల్లేదు. నేను చాపిన చేతులను అన్న పట్టుకున్నారు. కళ్ల కొసల్లో ఒక బొట్టు కన్నీరు తిరుగుతుంటే మళ్లీ “అన్నా..” అన్నాను.

అన్న ఒక కథనాయకుడికి తగ్గ సామర్థ్యమైన నవ్వుతో చేతుల్ని విడిపించుకుని వెనుతిరిగారు. కొంచెం నీరసించినట్టున్న ఆయన నడకను చూస్తూ అలాగే నిలబడిపోయాను నేను.

తమిళ మూలం: పావణ్ణన్
అనువాదం: జిల్లేళ్ళ బాలాజీ

Exit mobile version