Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కళాకారులు

[బాలబాలికల కోసం ‘కళాకారులు’ అనే చిన్న కథని అందిస్తున్నారు డా. నీరజ అమరవాది.]

దయ్, శ్యామ్ పార్క్‌లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ల మాటలు అక్కడే పుస్తకం చదువుతూ, కూర్చున్న మహంత్‌కి వినిపిస్తున్నాయి.

ఉదయ్ “నేను  చెప్పిన కథని నాకు ఇచ్చేయ్” అని అడుగుతున్నాడు.

శ్యాం “విన్న కథని ఎవరైనా ఎలా ఇస్తారు. కావాలంటే నేను ఈ కథని మర్చిపోతాను” అన్నాడు. నా కథ నాకు కావాలని ఉదయ్ గట్టిగా అడుగుతున్నాడు. అప్పుడు శ్యాం “దీపావళి పండగరోజు మా ఇంటిని పూలతో అలంకరించాము. ఆ పరిమళాలని పీల్చావుగా. అది నాకిచ్చేయి. అప్పుడు నీ కథను నీకు ఇస్తాను” అని చెప్పాడు.

వీళ్ల మాటలు వింటున్న మహంత్‌కి వీళ్లిధ్దరు కొంత అమాయకులు, కొంత తెలివి తక్కువవాళ్లు అని అర్థమయింది. మహంత్ వీళ్ల ఆలోచనలో మార్పు ఏ విధంగా తీసుకురావచ్చో అని కొంతసేపు ఆలోచించాడు. కొంతసేపు తరువాత వాళ్ల కోసం చూస్తే, ఇంకా వాళ్లిద్దరూ అక్కడే కూర్చుని వాదించుకుంటూ ఉన్నారు.

మహంత్ వాళ్ల దగ్గరికి వెళ్లి, మీకు పనికి వచ్చే ఒక సలహా చెప్పాలనుకుంటున్నానన్నాడు. సరే చెప్పండి అంటూ ఉత్సాహంగా అడిగారు. మీరు ఎప్పుడైనా ఎవరైనా కథనిగాని, ఉపన్యాసాన్ని చెబుతుంటే విన్నారనుకోండి. విన్న వెంటనే చప్పట్లు కొట్టండి. అప్పుడు వాళ్లకి మీరు విన్నది ఇచ్చినట్లవుతుంది. అలాగే ఎవరైనా మండపాలని, సభావేదికలను పూలతో అలంకరిస్తే మీరు ఆ పూలపరిమళాలని పీల్చిన వెంటనే అక్కడ ఉన్నవారికి నమస్కారం పెట్టండి. అప్పుడు వాళ్లకి ఆ పరిమళాలని వెనక్కి ఇచ్చేసినట్లవుతుందని ఒక ఉచిత సలహా ఇచ్చాడు. అది నిజమే అనుకుని వాళ్లు ఏ సభలకు వెళ్లినా ప్రసంగం అయిపోయిన వెంటనే చప్పట్లు కొట్టేవారు. వచ్చేటప్పుడు సభను అలంకలరించిన పూల పరిమళాలని ఆస్వాదించి, వచ్చేటప్పుడు  అక్కడ ఉన్న నిర్వాహకులకి నమస్కారం పెట్టేవారు. అది చూసిన వారందరు వాళ్లిద్దరికి కళలన్నా, కళాకారులన్నా అభిమానం, గౌరవం అని గ్రహించారు. అప్పటి నుండి ఉదయ్, శ్యామ్‌లను ఏ కార్యక్రమం జరిగినా పిలవటం మొదలుపెట్టారు. కళలని ఆదరించి, చప్పట్లు కొట్టేవాళ్లే నిజమైన కళాకారులని చెబుతూ, ఉదాహరణగా వీళ్లని చూపించేవారు.

Exit mobile version