Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కలగంటినే చెలీ-7

శ్రీ సన్నిహిత్ వ్రాసిన ‘కలగంటినే చెలీ’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.

దివారం బద్ధకంగా తెల్లారింది. కాంపౌండ్‌‌లో మనుషుల సందడి మొదలైంది!

బ్రహ్మం సురేష్ రూములో సెటిలయ్యాడు. కళ్యాణి వచ్చినట్టుంది. నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ బ్రేక్‌‌ఫాస్ట్‌ చేస్తున్నారు. సూర్యం మొహం కడుక్కుని పుస్తకాలు ముందేసుకున్నాడు. నిన్నటి రాత్రి అనుభవం గుర్తొచ్చి సన్నగా వణికాడు. ‘ఏమవుతున్నాడు తను.. ఎటువైపు పోతున్నాడు? … ఇందుకోసమేనా తండ్రితో గొడవపడి వైజాగ్‌ వచ్చింది?’ అతనిలో ఆత్మ పరిశీలన ప్రారంభమైంది. పోనీ ఈ వాతావరణం నుండి దూరంగా పోవడానికి రూము మారదామంటే అంత ఆర్థిక స్తోమత అతని దగ్గర లేదు. అందుకే దేన్నీ పట్టించుకోకుండా చదువు మీద దృష్టి పెట్టాలి అనుకున్నాడు

“ఏరా.. టిఫిన్‌ తిందువు గాని రా” అన్నాడు బ్రహ్మం వచ్చి.

“సరే అన్నా ..” అంటూ సురేష్ రూముకి వెళ్ళాడు. కళ్యాణి బ్రేక్‌ఫాస్ట్‌ తయారు చేసింది. ఒక ప్లేట్లో రెండు దోశెలు, చట్నీ వేసి పెట్టింది. మొహమాటంగా తిన్నాడు సూర్యం. మంచి నీళ్ళు తాగి

“అన్నా.. నేను మన రూముకి వెళ్తున్నా” అని చెప్పి వచ్చేసాడు. పుస్తకాలు తీసి ఫిజిక్స్‌ చదువుకోవడం మొదలుపెట్టాడు. ఇంతలో కింద ఏదో గొడవ అవుతున్న శబ్దం వినపడింది. రూము బయటకొచ్చి కిందికి చూసాడు.

రాధ ఎవరో అమ్మాయితో “ఏంటే… నీకు నా అన్నయ్య తప్ప ఇంక ఎవ్వరూ దొరకలేదా.. జాగ్రత్త… నీకు ముందే చెప్తున్నాను” అని వార్నింగ్‌ ఇస్తోంది.

ఆ అమ్మాయి కోపంగా చూసి “నీకేంటే మధ్యలో… మా ఇష్టం..” అని ఎదురు తిరిగింది. సూర్యానికి ఆ గొడవ పట్ల క్యూరియాసిటీ పెరిగింది. అతడు చదువుతున్న ఫిజిక్స్‌ పుస్తకం పేజీలు రెప రెప లాడుతున్నాయి. ..ఈ గొడవకి ఇంట్లో నుండి బయటకు వచ్చాడు రాధ అన్నయ్య పరమేష్. “ఏంటి గొడవ.. అందరూ వెళ్ళండి” అని గట్టిగా అరుస్తున్నాడు. ఆ అమ్మాయి వైపు తిరిగి “హేమా.. ఎందుకు గొడవ… నేను వస్తాను.. నువ్వు పద” అన్నాడు.

హేమ “నీ చెల్లెలు పెద్ద పతివ్రతలాగ మాట్లాడుతోంది. ఆమె యవ్వారాలు నాకు తెలీదనుకుంటుందేమో.. జాగ్రత్తగా ఉండమను” అంది

“అబ్బ.. దానితో నీకెందుకు… వస్తానని చెప్పాను కదా.. పో” అంటూ ఆమెను కాంపౌండ్‌ బయటకు పంపించేసాడు. సూర్యం రూములోకొచ్చి మళ్ళీ పుస్తకాల ముందు కూర్చున్నాడు. కానీ దృష్టి నిలవడం లేదు. జరిగిన గొడవ గురించి ఆలోచిస్తోంది. ఎన్నిసార్లు తనకు తాను అతను చెప్పుకున్నా మనసు మాత్రం కోతిలా వేరే విషయాల్లోకి పరుగెడుతోంది. బ్రహ్మం రూములో ఉంటూ తప్పుచేస్తున్నానేమో అని ఒక్క క్షణం బాధపడ్డాడు. అయినా లక్ష్యం మీద గురి ఉంటే ఇంకేవీ కనపడకూడదు కదా.. అర్జునుడికి పక్షి కన్ను మాత్రమే కనపడినట్టు తనకు ఎంసెట్‌ బాగా వ్రాయడం మాత్రమే కనపడాలి అనుకున్నాడు. నిశ్శబ్దంగా చదువుకోసాగాడు .

లంచ్‌ టైము అయింది. నాన్‌ వెజ్‌ వంటకాల ఘుమఘుమలు ముక్కుపుటాలకు సోకుతున్నాయి. ఆ వాసనకి కడుపులో అలారం కొట్టింది. బ్రహ్మం సురేష్ రూములోనే ఉన్నాడు. అతను ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూడసాగాడు సూర్యం.

కాసేపటి తర్వాత బ్రహ్మం ఒక ప్లేట్లో అన్నం.. చికెన్‌ కూర తెచ్చి సూర్యానికి ఇచ్చి “నువ్వు ఇక్కడే తినరా.. అక్కడ మాకు మందు పార్టీ జరుగుతోంది..” అని చెప్పి ” …భోంచేసాక కొంచెం నా బట్టలు ఉతికెయ్‌” అని తూలుకుంటూ వెళ్ళిపోయాడు. గబ గబా తినసాగాడు. చూస్తుంటే బ్రహ్మం తనని ఒక బానిసలా మార్చేలా ఉన్నాడని భయం వేసింది అతనికి. కానీ తప్పదు. అతని పరిస్థితి అలాంటిది. సర్దుకుపోవాలి. తిన్నాక ఒక అరగంట కూర్చున్నాడు.

బకెట్‌లో బట్టలు వేసుకుని బావి దగ్గరకు వెళ్ళాడు సూర్యం. బట్టలు ఉతుకుతుండగా వచ్చింది రాధ.

“సూర్యం.. భోంచేసావా?” ప్రేమగా అడిగింది.

“ఆ.. తిన్నాను” అన్నాడు ముక్తసరిగా

“పొద్దున్న చూసావా ఎంత గొడవ అయిందో.. నాతో పెట్టుకుంటే అంతే” గర్వంగా చెప్పింది.

సూర్యం ఏమీ మాట్లాడలేదు. తనే చెప్పసాగింది.

“అసలు దాని సంగతి నీకు తెలీదు. చాలా కంత్రీది” అంది

సూర్యం బట్టలు ఉతకడం మీద దృష్టి పెడుతున్నట్టు నటించసాగాడు. ఆమె అవేమీ పట్టించుకోకుండా స్టొరీ చెప్పడం కొనసాగించింది.

రాధ చెప్పిన హేమ కథ –

“హేమది వైజాగ్‌ దగ్గర్లో ఉన్న ఒక పల్లెటూరు. చాలా చిన్న వయసులోనే పెళ్ళి చేసేసారు ఆమె తల్లిదండ్రులు. కాపురానికి భర్తతో పాటూ వైజాగ్‌ వచ్చింది. ఆమె భర్త ఏదో కంపెనీలో జాబ్‌ చేస్తూ ఉంటాడు. కొంచెం ఇన్నోసెంట్‌ టైపు అతను. కానీ హేమ చాలా హుషారు. పాటలు చాలా బాగా పాడుతుంది. ఒక గొప్ప గాయని కావాలని చిన్నప్పటి నుండీ కలలు కనేది. పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో ఏం చెయ్యాలో తెలీక సంసారం కొనసాగిస్తూ అవకాశం కోసం ఎదురు చూడసాగింది. ఒక పెళ్ళిలో ఆమె పాడుతున్నప్పుడు చూసాడు రాధ అన్నయ్య పరమేష్. ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇద్దరి అభిరుచులూ కలిసాయి. కాలక్రమేణా అది ప్రేమగా మారింది. శారీరక సంబంధం ఏర్పడింది. కానీ వచ్చిన సమస్యల్లా ఎక్కడ కలుసుకోవాలి అన్నది.

ఒకరోజు అతని కౌగిలిలో సేద తీరుతూ హేమ “ఎన్నాళ్ళిలా దొంగతనంగా కలుసుకుంటాము. నాకు నా మొగుడు కావాలి. నువ్వూ కావాలి. ఎవరికీ అనుమానం రాకుండా మనం కలిసేలా ఏదైనా ఏర్పాటు చెయ్‌” అంది.

ఆలోచనలో పడ్డాడు పరమేష్. హేమ చెప్పేది కూడా కరెక్టే. ఇలా దొంగతనంగా కలుసుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే! అందుకే ఒక చక్కటి మార్గం చూడాలి అనుకున్నాడు. ఒక రోజు ఆమె భర్తను వాళ్ళ ఇంటి దగ్గర కలిసాడు.

“నమస్కారమండీ.. నా పేరు పరమేష్. ఈవెంట్‌ మేనేజర్‌ని” అని పరిచయం చేసుకున్నాడు.

అమాయకంగా చూసాడు హేమ భర్త. అర్థం కాక “చెప్పండి” అన్నాడు.

“మీ భార్య హేమ గారు మంచి సింగర్‌. ఒక ఈవెంట్‌లో ఆమె పాడుతున్నప్పుడు చూసాను. మంచి భవిష్యత్తు ఉంది. కాకపోతే ప్రతీ రోజు ప్రాక్టీసు కావాలి. పది మందికి తెలియాలి. నా కంట్రోల్‌లో ఒక ఆర్కెష్ట్రా టీము ఉంది. మిగతా టీములు కూడా నాకు టచ్‌లో ఉంటాయి. ప్రతీ రోజు వచ్చి కొంత సేపు మా దగ్గర ప్రాక్టీసు చేస్తే మంచిది. అవకాశాలు అవే వస్తాయి. మీకు కూడా ఆర్థికంగా కొంత వెసులుబాటు ఉంటుంది” అని చెప్పాడు.

హేమ భర్త ఈ ప్రపోజల్‌కి సంతోషపడ్డాడు. చివరి వాక్యాలు అతనికి నచ్చాయి. కాకపోతే నిర్ణయం తీసుకునేంత సీన్‌ లేదతనికి. “హేమా..” అని పిలిచాడు. “ఏంటండీ..” అంటూ లోపలి నుండి వచ్చింది.

హేమ భర్త – పరమేష్‌ని చూపిస్తూ “ఈయన ఒక ఈవెంట్‌ మేనేజర్‌.. పేరు పరమేష్ గారు.. నిన్ను గాయనిగా పది మందికి పరిచయం చేస్తానంటున్నారు” అని చెప్పాడు

“నమస్కారమండీ” అంది వస్తున్న నవ్వును బిగబట్టి.

“నమస్కారం మేడం.. మీ భర్తకి అన్నీ చెప్పాను. మీరు చెయ్యాల్సిందల్లా ప్రతీ రోజు కొంత సమయం మా టీముతో పాటూ పాటలు ప్రాక్టీసు చేస్తూ ఉండాలి.. అంతే” అన్నాడు.

ఆమె మనసు ఆనందంతో గంతులేసింది. కానీ బయటపడకుండా “అలాగేనండీ.. తప్పకుండా” అని చెప్పి నమస్కరించింది.

“సరే.. ఇక సెలవు.. ఇదే నా ఎడ్రస్‌” అని చెప్పి అక్కడి నుండి వచ్చేసాడు పరమేష్.

నిజానికి పరమేష్ వాళ్ళు అద్దెకున్న ఇంటి కాంపౌండ్‌ లోనే ఒక ఆర్కెష్ట్రా టీము వాళ్ళు కూడా గది అద్దెకు తీసుకున్నారు. ప్రతీ రోజు కొంత సమయం ప్రాక్టీసు చేస్తూ ఉంటారు. ప్రోగ్రామ్స్‌ ఉన్నప్పుడు వెళ్ళి పెర్ఫార్మెన్స్‌ ఇస్తుంటారు. వాళ్ళతో హేమ గురించి అప్పటికే మాట్లాడి పెట్టుకున్నాడు పరమేష్. వాళ్ళకి కూడా ఒక ఫిమేల్‌ సింగర్‌ కావాలి కాబట్టి హేమను తమ టీము లోకి తీసుకుంటామన్నారు. ఆ విధంగా మార్గం సుగమం అయింది. ఆ రూము తాలూకు తాళం చెవులు పరమేష్ దగ్గరే ఇచ్చి వెళుతుంటారు.

ప్రతీ రోజు హేమ నీట్‌గా రడీ అయి ప్రాక్టీసు కోసం ఒక గంట ముందుగా వస్తుంది. ఆ గంట టైము పరమేష్‌తో కలిసి సద్వినియోగం చేసుకుంటుంది. ఆ తర్వాత మిగతా టీము వాళ్ళు అంటే తబలా, కీ బోర్డ్‌, గిటార్‌, డ్రంస్‌.. మొదలైన ఆర్టిస్ట్‌లు ఒక్కరొక్కరుగా వస్తారు. అప్పుడు నిజమైన ప్రాక్టీసు మొదలవుతుంది. కొన్నాళ్ళ వరకు పరమేష్, హేమ కలిసి చేసే రొమాంటిక్‌ ప్రాక్టీసు ఎవరికీ తెలీలేదు కానీ ఒక రోజు రాధ కంటపడింది. అప్పుడు హేమ భయపడింది. కానీ పరమేష్ – తన చెల్లి రాధకి బ్రహ్మంతో ఉన్న సీక్రెట్‌ ప్రాక్టీసు గురించి ఆమె చెప్పి భయం తగ్గించాడు. ఈ విధంగా పిల్లి కళ్ళు మూసుకుని పాలు తగినట్టు ఎవరి ఆనందం వాళ్ళు చూసుకోసాగారు. కానీ నెమ్మదిగా హేమ రాధ మీద పెత్తనం చెయ్యసాగింది. అది భరించలేక రాధ ఆమెతో తగువు పెట్టుకుంది.” అదీ కథ.

బుర్ర వేడెక్కిపోయింది సూర్యానికి. అనవసరంగా రాధతో మాట్లాడుతున్ననని పశ్చాత్తాప్పడ్డాడు. గబ గబా బట్టలు ఉతకడం ముగించి రూముకి పారిపోయాడు.

“ఏం కుర్రాడో.. కోరి దగ్గరకు వస్తుంటే పారిపోతున్నాడు” అని నిట్టూర్చి ఇంట్లోకి వెళ్ళిపోయింది రాధ.

***

రాఘవ!

కోచింగ్‌ సెంటర్‌లో సూర్యంతో పాటూ చదువుకుంటున్న విద్యార్థి. లావుగా బొద్దుగా ఉంటాడు. ఒక పల్లెటూరి బేక్‌గ్రౌండ్‌ నుండి వచ్చి చదువులో ప్రతిభ చూపిస్తున్న సూర్యం అంటే అతనికి చిన్నపాటి ఆరాధనా భావం. ఎప్పుడూ సూర్యంతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు కానీ మొదటి నుండీ గమనిస్తూ ఉన్నాడు. కోచింగ్‌ జాయిన్‌ అయిన కొత్తల్లో సూర్యానికి ప్రతీ టెస్ట్‌ లోనూ మంచి మార్కులు వస్తుండేవి. కానీ ఈ మధ్య మార్కులు బాగా తగ్గిపోవడం గమనించాడు. తను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటున్న సూర్యం

ఒక్కసారిగా ఇలా ఎందుకు దిగజారిపోతున్నాడో అతనికి అర్థం కాలేదు. అందుకే సూర్యంతో ఒకసారి ఇంటెరాక్ట్‌ కావాలనుకున్నాడు. ఒక రోజు.. క్లాసుల మధ్య బ్రేక్‌ టైములో..

“హాయ్‌ సూర్యం..” అని విష్ చేసాడు రాఘవ.

ఆశ్చర్యపోతూ చూసి “హాయ్‌…” అన్నాడు సూర్యం.

“ఎలా చదువుతున్నావు సూర్యం” అని అడిగాడు.

“బాగానే చదువుతున్నాను… నువ్వు”

“ఓకే.. పర్వాలేదు. అయినా నీ లాంటి టాపర్స్‌కే మార్కులు తక్కువ వస్తుంటే నాకు భయం వేస్తోంది.. మా పరిస్థితి ఏంటని?”

“అలా ఏం కాదు.. అందరం ఒకటే” అని సరిదిద్దాడు సూర్యం.

రాఘవ లోకల్‌ కేండిడేట్‌. అతని ఇల్లు వైజాగ్‌ లోనే. రోజూ కోచింగ్‌కి ఇంటి నుండి హోండా ఏక్టివాపై వస్తాడు. కొంచెం రిచ్‌. సూర్యంకి అలాంటి వాళ్ళతో పరిచయమంటే బెరుకు.. వాళ్ళ రేంజ్‌ వేరని. కానీ రాఘవకు సూర్యం అంటే చాలా ఇష్టం. మట్టిలో నుండి వచ్చిన మాణిక్యంలా అనిపిస్తాడు.

“సూర్యం… ఎక్కడుంటున్నావు” అడిగాడు.

“ఆర్టీసీ కాంప్లెక్స్‌ వెనకాల ఉన్న కాలనీలో అద్దెకుంటున్నాను.” అని ఎడ్రస్‌ చెప్పాడు.

“ఆహా.. అలాగా” అని “ఒకసారి నీ రూముకొస్తాను సూర్యం.. కొన్ని డౌట్స్‌ డిస్కస్‌ చెయ్యాలి” అన్నాడు.

“సరే.. అలాగే” అన్నాడు సూర్యం. క్లాసులవగానే తన ఏక్టివా మీద సూర్యాన్ని ఎక్కించుకుని అతని రూముకి వచ్చాడు రాఘవ. వాళ్ళ రూము చూడగానే మొదటిగా కలిగిన భావం – అసలు ఇక్కడ చదువుకునే వాతావరణం ఏమైనా ఉందా? – అని. ఆ కాంపౌండ్‌లో అందరూ చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే దిగువ మధ్యతరగతి వాళ్ళే. రోజు గడవడానికి ఏదో కష్టం చేసి సంపాదించుకుంటూ… జీవితం నుండి వీలైనంత ఆనందాన్ని జుర్రుకోవాలని తపిస్తున్న వాళ్ళే! సమస్య ఈ వాతావరణమే అని అర్థమైంది రాఘవకి.

“అలా బయటకు వెళ్దాం సూర్యం” అన్నాడు రాఘవ. ఇద్దరూ ఏక్టివాపై బయలు దేరారు. అలా డ్రైవ్‌ చేస్తూ రాఘవేంద్ర స్వామి టెంపుల్‌ దగ్గర ఆపాడు రాఘవ. అతను రాఘవేంద్ర స్వామి భక్తుడు. అప్పుడప్పుడు ఆ టెంపుల్‌కి వస్తుంటాడు. బండి పార్క్‌ చేసి చెప్పులు బయట విడిచి లోనికి వెళ్ళారు ఇద్దరూ. సూర్యం విశాలమైన ఆ టెంపుల్‌ని కళ్ళు విప్పార్చి చూస్తున్నాడు. ఒక పవిత్రమైన భావన అతని మనసులో కదలాడింది. గర్భగుడిలో ఉన్న దేవుడికి దండం  పెట్టుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. పంతులు గారు శఠగోపం పెట్టి ఆశీర్వదించారు. ఆయన ఇచ్చిన పువ్వుని కళ్ళ కద్దుకుని  చెవిలో పెట్టుకున్నాడు. తర్వాత ఇద్దరూ గుడి ప్రాంగణం లోనే కాసేపు కూర్చున్నారు.

సాయంకాలపు గాలులు చల్లగా వీస్తున్నాయి. ప్రశాంతమైన భక్తి పూరిత వాతావరణం. గుడి గంట మోగుతున్న శబ్దం అప్పుడప్పుడు వినిపిస్తోంది. మాటలు కదిపాడు రాఘవ.

“సూర్యం.. నేనొక మాట చెబుతాను.. చనువు తీసుకుంటున్నాను అనుకోకు. ఎక్కడో పల్లెటూరి నుండి వచ్చి ఇక్కడ కోచింగ్‌ తీసుకుంటున్నావు. నిన్ను చూసి నేను ఇన్‌స్పైర్‌ అయ్యాను. కానీ ఈ మధ్య నీ పెర్ఫార్మెన్స్‌ బాగా తగ్గిపోయింది. బహుశా నీ చుట్టుపక్కల వాతావరణంతో డిస్టర్బ్‌ అవుతున్నట్టున్నావు. మా ఇల్లు ఇక్కడే.. నువ్వు మా ఇంటికి వచ్చెయ్‌..” అన్నాడు.

ఆలోచనలో పడ్డాడు సూర్యం. రాఘవ చెబుతున్నది కరెక్టే. తన మనసులో కూడా అదే ఫీలింగ్‌ ఉంది కానీ వేరే దారి లేక బ్రహ్మం రూములో ఉన్నాడు. ఇప్పుడు రాఘవ దేవుడిలా వచ్చి తనని ఆదుకుంటానన్నప్పుడు కాదనడం ఎంతవరకు మంచిది? కాకపోతే రాఘవ ఇంటిలో కూడా వాతావరణం ఎలా ఉంటుందో? అదే చిన్న సందేహం.. లేకపోతే వెంటనే ఓకే అనేవాడు.

రాఘవకు సూర్యం మనసు అర్థమైంది.

“నువ్వేమీ డౌట్‌ పడకు సూర్యం. నీకు ఎటువంటి డిస్టర్బెన్స్‌ మా ఇంటిలో ఉండదు. నాక్కూడా నువ్వు తోడు ఉంటే సబ్జెక్ట్‌లో డౌట్స్‌ క్లారిఫై అవుతాయి. ఇద్దరం కష్టపడి చదువుదాం. మంచి రేంక్‌ తెచ్చుకుందాం.. ప్లీజ్‌” అన్నాడు

“అలాగే రాఘవ.. థేంక్స్‌” అన్నాడు సూర్యం.

ఇద్దరూ సంతృప్తిగా అక్కడి నుండి వచ్చేసారు.

(సశేషం)

Exit mobile version