[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘కలం సాయం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆదమరిచి నిద్దరపోతున్న
కలాన్ని కదిపి కుదిపి నిద్రలేపాను
ముసుగు తీసేస్తూ మెల్లగా అడిగాను
కాగితం మీద కదిలేంత సత్తువుందా నీలో
నా మనసును చెప్పుకోవాలనుకుంటే
లోకం ముందు దానిని విప్పుకోవాలనుకుంటే
చిరునవ్వు నవ్వింది
చిన్నగా సర్దుకుంది తనను తాను
నిలకడగా నాలో భావాలు
నింపుతూ ఉండు నీవు చాలు
ఒంపుతుంటాను ఒకింత ఒద్దికగా
సిరా చుక్కలను సున్నితంగా జారుస్తూ
అక్షరాలుగా పదాలుగా పంక్తులుగా మారుస్తూ
అందంగా అర్థవంతంగా అనంతంగా
తెల్లని ఈ కాగితపు ఖాళీ మైదానంపై
నల్లని నా నడకలతో ముందుకు సాగుతూ
అంటూ నాతో
అనునయంగా చెప్పింది
క్షణాలు గడిచాయి
భావనల నేపథ్యంలో కదలాడుతున్న
భావాలు అన్నీ కవితగా రూపుదాల్చి
ముందుకు నడిచాయి మెరుస్తూ, కాగితంపై
సాయం చేసిన కలం
సంతకం కూడా చేసింది కాగితం చివరన
చౌడారపు శ్రీధర్ చక్కని కవి. దీర్ఘ కవితలు వెలయించటంలో దిట్ట.
