[వేలూరి శారద గారు రచించిన ‘కలసి ఉంటే కలదు లాభం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]
కొత్త పరిసరాలను పరిశీలనగా చూస్తూ వస్తున్న జోగారావు చూసి,
“రండి! రండి! చాలాకాలం అయింది, మిమ్మల్ని చూసి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నాం! ఇప్పటికి తీరికైందన్న మాట” అన్నాడు ప్రకాశం.
ఇంతలో బిలబిల్లాడుతూ, ధర్మరావు, కృష్ణమూర్తి, అంజయ్య వచ్చారు.
అంతమందిని ఒకేసారి చూడ్డంతో జోగారావుకి ఆశ్చర్యంగా ఉంది.
“ఏమిటి? అందరూ ఒకే చోట సమావేశం అయ్యారు? విశేషం ఏమిటి?” అన్నాడు అందరి కేసి పరిశీలనగా చూస్తూ.
“మీరు వస్తున్నారనే అందరం ఒకచోట చేరాం” అన్నారు అంజయ్య.
‘ఓహ్! ఇది వరకు లేని ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? అయినా ఇప్పుడేవీ వినాయక చవితి కాదే! చందాల కోసం వచ్చారనుకోవడానికి, అయినా వీళ్లు గుడి కమిటీ మెంబర్లు కూడా కాదు. చూద్దాం వీళ్ళ ఉద్దేశాలు ఏమిటో’ అనుకుంటూ,
ముఖాన్ని నవ్వు పులుముకుని, “ఓ! నా కోసం వచ్చారా! థాంక్యూ!” అన్నాడు జోగారావు.
వాతావరణం అంతా ఆహ్లాదంగా ఉంది. మంద్రస్వరంతో ఎక్కడ నుంచో సంగీతం వినిపిస్తోంది. అందరూ హడావిడిగా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు.
ఇదంతా కొత్తగా ఉంది జోగారావుకి.
***
ఎవరో ఒక ఆవిడ వచ్చి, అంజయ్యని పలకరించింది. అంజయ్య మెలికలు తిరుగుతూ మాట్లాడుతున్నాడు! అంజయ్యకి ‘ఆడపిచ్చి’ ఎక్కువ. ‘ఇంత వయసు వచ్చిన ఇంకా ఈ బుద్ధి పోలేదు’ అనుకున్నాడు జోగారావు.
ఇంతలో ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు వచ్చి, ప్రకాశంతో ఏదో మాట్లాడుతున్నారు. ప్రకాశం తల అడ్డంగా ఊపుతున్నాడు.
ఏమై ఉంటుంది? ఎక్కడికైనా రమ్మంటున్నారా?! రానని చెబుతున్నాడా?! ఎన్నో ప్రశ్నలు.
‘అయినా తినబోతూ రుచి ఎందుకని విషయం అంతా చెప్తాడుగా’ అనుకున్నాడు జోగారావు.
కాఫీ, టీలు ఆఫర్ చెయ్యరా! నిలబెట్టే మాట్లాడేస్తున్నారు.
కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి.
ఇహ లాభం లేదు అనుకుని,
“ఏం ప్రకాశం కనీసం కాఫీలాంటి ద్రవాలు ఏమీ లేవా?” అన్నాడు హాస్యంగా.
“నీకు తెలియదు కదూ! ఇక్కడ ఇవేమీ ఉండవు. మాకు ఆకలి, దప్పికలు ఉండవు. అందుకని నీకు ఏమి ఇవ్వలేకపోతున్నాను. అయినా నీకు ఆకలి వేయడం ఏమిటి? ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరికీ ఆకలి ఉండదే! అయినా మీ పిల్లలు నీకు పెడతారు కదా!” అన్నాడు ప్రకాశం.
“మా పిల్లలు పెట్టడం ఏమిటి? ఇక్కడ ఆకలి లేకపోవడం ఏంటి? ఏదో లోకంలోకి వచ్చినట్టు మాట్లాడుతున్నావ్! నాకు అంతా అయోమయంగా ఉంది. నా కాళ్లు నేల మీద అనట్లేదు ఏమిటి ఇదంతా?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు.
“ఓ ఇంకా తెలియట్లేదు కదూ! నువ్వు చచ్చిపోయి పై లోకానికి వచ్చావు. నువ్వు వస్తున్నావని ఈరోజు నీతో గడుపుదామని మాకు వేసే శిక్షలని రేపటికి మార్పించాము. మా పిల్లలు ప్రతి సంవత్సరము మాకు ఆబ్దీకం పెడతారు కాబట్టి మాకు ఆకలి ఉండదు. నీ పిల్లలు నీకు పెట్టరా!?” అన్నాడు ప్రకాశం.
‘అయ్యో నేను చచ్చిపోయానా! నాకు తెలియకుండా ఎలా జరిగింది? అవును గుర్తుకొస్తోంది. రాత్రి నిద్రలోనే ఇక్కడికి వచ్చేసాను. నాకు ఆకలి వేస్తోంది. ఇప్పుడు ఎలాగా? కడుపులో పేగులు నకనకలాడుతున్నాయి.
మా పిల్లలు నాకు పెట్టడానికి, నేను మా నాన్నకి పెట్టలేదు. డబ్బులు దండుగ, ఇక్కడ పెడితే అక్కడ వాళ్లకి కడుపు నిండుతుందా! అనుకున్నాను. అసలు నేను ఆబ్దీకం పెడితే కదా, నా కొడుక్కి తెలిసేది. ఇలా ఆకలితో అలమటించి పోవలసినదేనా? ఓరి దేవుడోయ్! ఎంత పొరపాటు చేశాను. పాపం మా నాన్న ఆకలితో అలమటించిపోయి ఉంటాడు. డబ్బుకి కక్కుర్తి పడి ఎంత పొరపాటు చేశాను.’ అనుకుని,
“ఇంతకీ మా నాన్నని చూసావా? ఎక్కడ ఉన్నారు?” అన్నాడు జోగారావు.
“మీ నాన్నగారు, తాతగారు పెద్దవాళ్ళు కదా! వాళ్లు ఎప్పుడో ఇక్కడికి వచ్చారు కదా! అందుకని వాళ్లు ఇంకా పైన ఉంటారు. తీసుకువెళ్తాను రా!” అంటూ ఇంకా పైలోకంలోకి తీసుకు వెళ్ళాడు.
అక్కడ జోగారావు నాన్న, ప్రకాశం నాన్న కబుర్లు చెప్పుకుంటున్నారు.
జోగారావుని చూసి వాళ్ళ నాన్న, “ఒరేయ్ జోగా! అప్పుడే వచ్చేసావ్! నన్ను చూడాలని వచ్చావా? నేను గుర్తుకొస్తున్నానా? పూర్తిగా మర్చిపోయావ్ రా!” అంటూ కంటతడి పెట్టుకున్నాడు.
తండ్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. దృష్టి అంతా ఆకలి మీదే ఉంది.
‘అయ్యో నాన్నకు నేను ఆబ్దీకం పెట్టట్లేదు కదా! అందుకని ఆకలిస్తోందేమో!’ అనుకుని, “నాన్న నన్ను క్షమించు, నువ్వు బ్రతికున్నప్పుడు ఏవో రెండు ముద్దలు పెట్టేవాడిని. అవి కూడా దండుగ అనుకునేవాడిని. నువ్వు పోయిన తర్వాత ఇక ఆ అవసరం లేదని మానేశాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆకలి విలువ తెలిసింది. నువ్వెలా ఉన్నావ్ నాన్నా?” అన్నాడు కళ్ళ నీళ్లు పెట్టుకుని జోగారావు.
“ఈ ముసలి ప్రాణానికి ఇంత ముద్ద పెట్టడానికి నీ మనసు ఒప్పుకోలేదు కానీ, నా దగ్గర వారాలు చేసుకున్న కుర్రాడు రామకృష్ణ నన్ను తండ్రిలా అనుకునేవాడు. నేను పోయిన విషయం తెలిసిన వెంటనే, నా శవం దగ్గరకు వచ్చి ఎంతో ఏడ్చాడు. ఆ పిల్లాడే నాకు ప్రతి సంవత్సరం ఆబ్దీకం పెడుతున్నాడు. ఆ ముద్దే నాకు కడుపు నింపుతోంది”. అన్నాడు బాధగా.
“నన్ను క్షమించు నాన్న! ఇప్పుడు అవకాశం వస్తే నేను నీకు అన్నం పెడతాను. కానీ అది అసాధ్యం అయిపోయింది.” అన్నాడు జోగారావు.
“జోగా! అందరినీ కలుపుకుని పోవడానికే రా! ప్రతి సంవత్సరం పెద్దలకు పెట్టడం అనే తంతు. మామూలుగా అయితే అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు పని మానుకుని పొరుగూరి నుంచి వస్తారా? ఎవరి పనులు వాళ్ళవి. ఇదివరకు అయితే ఎక్కువ మంది పిల్లలు ఉండేవారు కాబట్టి, పెళ్లిళ్లు, పేరంటాలు అంటూ కలిసేవారు. ఇప్పుడు ఒకళ్ళు, తప్పితే ఇద్దరు పిల్లలు. వారి పెళ్లిళ్లు అయిన తర్వాత ఇంకా ఎలా కలుసుకుంటారు? ఈ రూపేణా పెద్దలకి పెట్టి, వాళ్ళని తలుచుకుంటూ, అందరూ కలిసి భోజనాలు చేసి, కష్టసుఖాలు మాట్లాడుకుంటే, ‘నా వాళ్ళు ఉన్నారు నాకు’ అనే భరోసా ఉంటుంది రా! అప్పుడు ఏ కష్టం వచ్చినా నా అన్న వాళ్లతో చెప్పుకోవచ్చు. వాళ్లు మంచి సలహా ఇస్తారు అనే ధైర్యం ఉంటుంది. అందుకని ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు.. వెళ్లి,.. అక్క చెల్లెళ్లని అందరినీ పిలు. మమ్మల్ని తలచుకోండి. మా ఆశీర్వాదం పొందండి” అంటూ ఒక తోపు తోసాడు.
గబుక్కున మంచం మీద నుంచి కింద పడ్డాడు జోగారావు. వెంటనే మెలకువ వచ్చింది. ‘ఇదంతా కలా?, అంటే అందర్నీ కలుపుకు పొమ్మని నాన్న నాకు పరోక్షంగా చెబుతున్నారన్నమాట’ అనుకున్నాడు.
***
మధ్యాహ్నం పంచాంగం తీసుకుంటే భార్య జలజ, “ఇప్పుడు ఎందుకు ఇది తీస్తున్నారు? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా?” అని అడిగింది.
“లేదే మా నాన్న ఆబ్దికం ఎప్పుడొచ్చిందా అని చూస్తున్నాను ఈసారి పెడతాను. మా వాళ్ళని అందర్నీ పిలుస్తాను!” అన్నాడు.
“మంచి మాట చెప్పారు! మీరు ఎప్పుడూ పెట్టరు. ఈసారి మళ్లీ మీ వాళ్లను కూడా పిలుస్తున్నానంటున్నారు. ఏమిటి విశేషం” అంది జలజ కుతూహలంగా.
జోగారావు తనకి వచ్చిన కల విషయం చెప్పకుండా, “నాకు అందర్నీ పిలిచి పెట్టాలని ఉంది. మా అక్కలని చూసి ఎన్నోఏళ్లయింది. ఈ రూపేణా వాళ్ళని చూసినట్టు ఉంటుందని. చెల్లెలు అయితే అప్పుడప్పుడు కలుస్తుంది అనుకో! వాళ్లకి మంచి మంచి చీరలు కొంటాను. నాలుగు రోజులు ముందుగానే రమ్మని ఫోన్ చేస్తాను. సరదాగా వాళ్లతో చిన్ననాటి కబుర్లు చెప్తాను.” అంటూ ఉత్సాహంగా చెప్పుకొస్తున్న భర్తను చూసి ఆశ్చర్యపోయింది.
పిల్లికి బిచ్చం పెట్టని భర్త ఈ విధంగా మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది.
‘పోనీలే ఇప్పటికైనా మారేడు’ అనుకుని, “మంచి పని చేస్తున్నారు. వదిన గార్లు మన ఇంటికి వచ్చి ఎన్నో ఏళ్లయింది. ఈ విధంగానైనా అందరం కలుసుకుంటాం. ‘కలసి ఉంటే కలదు సుఖం’ అని మనం అందర్నీ పిలిచి ఆదరిస్తే, రేపు మన పిల్లలకి కూడా పద్ధతులు తెలుస్తాయి. మనమే ఆచరించనప్పుడు ఇహ వాళ్ళకేం చెబుతాం. నలుగురు అక్కచెల్లెళ్లలో ఒక్క నలుసుగా పుట్టారు. మీరు ఒక్కరేనని వాళ్ళు ఎంత గారంగా చూసేవారు మిమ్మల్ని. అటువంటిది ‘పిల్లికి బిచ్చం పెట్టకుండా’, ‘ఒంఠికాయ శొంఠి కొమ్ములా’ తయారయ్యారు..
మొన్నటికి మొన్న బాబిగాడు బండి మీద నుంచి పడిపోయి కాలికి ఆపరేషన్ అయితే ఒక్కరికీ చెప్పలేదు, చెబితే ఎక్కడ అందరూ వచ్చేస్తారోనని, మనం బిక్కుబిక్కుమంటూ ఒక్కళ్ళమే ఉండి ఎంత టెన్షన్ పడ్డాం! చుట్టుపక్కల వాళ్ళు కూడా అడిగారు, ‘ఇంత జరిగినా చుట్టాలు ఎవరూ చూడటానికి రాలేదేం?’ అని. అదే నలుగురితో చెబితే, వాళ్లు వస్తే, మనకి ఎంతో ధైర్యంగా, సహాయంగా ఉండేది. అనాథల్లా హాస్పటల్లో మనం ఇద్దరమే ఉన్నాం!
పోనీలెండి ఎప్పటికైనా మీరు మారారు. నాకు అదే సంతోషం. అందరం వసుధైక కుటుంబంలా ఉండాలి. అప్పటిలా ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా అవసరానికి, ఆదుకోవడానికి ‘నా’ అన్న వాళ్ళు నలుగురైన ఉండాలి” అంటూ సుతిమెత్తగా చివాట్లు పెట్టింది.
కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా కలిసికట్టుగా ఉంటే ఎలాంటి సమస్యనైనా సులభంగా జయించవచ్చు. ఐకమత్యంతో, ప్రేమతో ఆత్మీయుల మధ్య కలిసి జీవించడంలోనే జీవితంలో నిజమైన ఆనందం, ప్రశాంతత దొరుకుతాయి.
