[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]
మమకారం
మనం మమకారం పెంచుకున్న మనుషులే శాశ్వతం కాదు ఇక ప్రాణం లేని వస్తువుల మీద మమకారం ఏమిటి?
కానీ.. పెంచుకుంటూనే వుంటాము. పైగా వాటికి ఓ పరిమితి కూడా వుండదు. ఇంకా ఏవో కావాలనే ఆరాటం. రోజులు గడిచేకొలదీ, సంపాదనలు పెరిగే కొలదీ.. ఈ ఆశ కూడా పెరిగిపోతూనే వుంటుంది. రకరకాల వస్తువులు, అవసరానికైతై కొన్నే చాలు.. కానీ ఇంకా ఏదో కావాలనే ఆరాటం, పక్కవారికి వుంది.. అది నాకూ కావాలనే ఆకాంక్ష. ఇలా పెంచుకుంటూ పోతాము.
ఉదాహరణకు చెప్పుకోవడానికి, మొదట్లో రేడియో తోనే సరిపెట్టుకున్నాము. ఆ తర్వాత టీవీ, మళ్లీ దాంట్లో తర్వాత కలర్ టీవీ.. ఆ తర్వాత స్లిమ్ గా వుండే టీవీ, ఆ తర్వాత దాంట్లోనే బోలెడన్ని ఫీచర్స్.. ఆ తర్వాత హోమ్ థియేటర్.. ఇలా ఒకదాని తర్వాత మరోటి మన కోరికలు రూపాంతరం చెందుతూ వుంటాయి.
అలాగే ఇంట్లో వస్తువులన్నీ ఆధునీకరణకు నోచుకుంటూనే వుంటాయి. వాటి మీద కూడా మమకారం పెంచుకుంటూనే వుంటాము.
చూసినదల్లా కావాలనే ఆరాటం. ఎక్కడికి, వెళ్ళినా అక్కడ కనపడిన వాటినల్లా కొనేయడం.. ఇంటి నిండా పేర్చడం చాలా మందికి అలవాటైపోయింది. తర్వాత కాళ్ళకీ చేతులకీ అవన్నీ అడ్డు రావడం.
వంటింటి సామాగ్రి పెంచేసుకోవడం చాలా మంది ఆడవారికి తగని మక్కువ. ఈ మధ్య మార్కెట్లో వచ్చే కొత్త కొత్త ఎలక్ట్రికికల్ వస్తువుల మీద మోజుతో కొనేయడం అవుతుంది కానీ.. వాడకం మాట మాత్రం ఎత్తరు. వాటిని పూర్తిగా వినియోగించేవారు నూటికి ఒకరో, ఇద్దరో వుంటారంతే. ఇలాంటివన్నీ ఇంటి నిండా పేర్చడం ఒక స్టాటస్ సింబల్ అయిపోయింది.
ఇలా కొత్తగా కొనే వాటి మాట అటుంచండి.. మన తండ్రుల దగ్గర నుండో తాతల దగ్గర నుండో వచ్చినవి కూడా వుంటాయి కదా! అప్పట్లో వాళ్ళు కూడా ఆ కాలాన్ని బట్టో, అవసరాన్ని బట్టో, ఏవో కొనేవుంటారు కదా.. వాళ్ళు లేకపోయినప్పటికీ.. వాళ్ళ సామాన్లు మాత్రం వుంటాయి. తాతగారి పడక్కుర్చీ, బామ్మగారి పందిరి పట్టె మంచం, నాన్న ఇచ్చిన బర్మా టేకు భోజనాల బల్ల, అమ్మ పుట్టింటి దగ్గర నుంచి తెచ్చుకున్న నగిషీలు చెక్కిన టేకు బట్టల బీరువా, పూజా మందిరం.. ఇంకా ఇత్తడి సామాన్లు ఇలా ఏవో మనకి ఇచ్చే వెళ్ళిపోయారు కదా!
మరి వాటన్నటిలో ఏ ఒకటైనా మనం వుంచుకున్నామా? వుంచుకో గలిగామా? లేదు వుంచుకోము.. ఎందుకంటే మొదట మనం చెప్పేది.. మా ఇంట్లో చోటులేదంటాము. తర్వాత, అబ్బే.. ఇవన్నీ ఓల్డ్ మోడల్ సామాను. ఇప్పుడు ఇవి ఎవరు వాడతారూ? కొత్త ఫ్యాషన్‌కి తగ్గట్టుగా కొత్త సామాన్లు కొంటాము కానీ.. అవేమీ వాడము. ఏ పనివాళ్ళకో ఇచ్చేయడమో, సెకండ్ హ్యాండ్‌కి అమ్మేయడమో చేస్తాము. క్రమేపీ మన పెద్దవాళ్ళ గుర్తులన్నీ కాలక్రమంలో కలిసిపోతాయి.
ఇప్పుడు కొందరు ‘ఏంటిక్ పీస్’ అంటూ పాత సామాను మీద మోజు పడుతున్నారనుకోండి. అయినా అలాంటివారికి కూడా, తాతల తండ్రుల గుర్తుగా వదిలిపోయిన సామాను వద్దు.. లక్షలు లక్షలు ఖర్చు పెట్టి, ఇటువంటి పాత పురాతన సామాన్లు, ఏంటిక్ పీస్.. ఇవంతే ఖరీదులు వుంటాయి అని సమర్థించుకుంటూ కొనుక్కుంటున్నారు.
మరి ఇంత కష్టపడి, మోజుపడి, ఏరికోరి కొనుక్కునే మన వస్తువులు కూడా రేపు ఇంతేగా?
ఈ తరం పిల్లలు ఎక్కువ శాతం విదేశాలలో స్ధిరపడిపోతున్నారు. వాళ్ళకా ఈ పాత చింతకాయ పచ్చడి సామాన్లు ఏ మాత్రం అవసరం వుండదు. తీసుకోరు. తీసుకెళ్ళరు. వద్దు పొమ్మనే అంటారు.
మరి మనకి ఎందుకింత ప్రయాస? మన తర్వాత మన పిల్లలకి అవసరం లేనప్పుడు.. మనం వుండగానే వాటిని వదిలించుకోవడం ఎంతైనా మంచిది. మన తర్వాత వాళ్ళకీ ఇవన్నీ పంచడమో, పారేయడమో అనే సమస్య తప్పుతుంది. వాళ్ళా.. గట్టిగా ఆ పదిరోజులు ఇక్కడ వుండడమే గొప్ప. ఆ కాస్త సమయంలో వాళ్ళు మాత్రం ఎన్ని పనులు చూసుకోగలరు? ఓ పక్కన ఆస్తులు పాస్తులే చూసుకుంటారా? ఈ గిన్నెలు, కప్పులు, కుర్చీలు, సోఫాలు చూసుకుంటారా? అందుకనే మనమే కొంచెం వ్యామోహం తగ్గించుకుని.. మనం వుండగానే, మనకి సరిపడా, కావలిసినవి వుంచుకువి తతిమా వన్నీ ఎవరికి అవసరమైతే వారికి ఉదారంగా ఇచ్చివేయడమే మంచిది.
ఆడవారికి చీరల మోజు అంతా ఇంతా కాదు. చూసిన కొత్త రకమల్లా బీరువాలోకి చేరాల్సిందే. కొత్త మోజులో పాతవి ఇక తాకను కూడా తాకము. ఆ తర్వాత పంచిపెట్టడానికి, కూతుళ్ళకి, కోడళ్ళకీ ఇబ్బంది లేకుండా.. మనకి కావలిసినంత వరకూ వుంచుకుని, తతిమావన్నీ ఎవరికైతే అవసరం వుంటాయో వారందరికీ పంచి పెట్టడం ఉత్తమమైన పని. మన పేరు చెప్పుకుని పాపం వాళ్ళు వాడుకుంటారు. పేవ్‌మెంట్ల మీద, నిరాశ్రయులెందరో కనపడుతూ వుంటారు. దుప్పట్లు, చీరలు, గిన్నెలు, కంచాల వంటివి మనకి ఎక్కువ అయిపోయినవి వారందరికీ పంచిపెట్టి వచ్చేస్తే.. విలువ కట్టలేనంత ఆత్మ సంతృప్తి మిగులుతుంది.
అందుకే అప్పుడప్పుడు మమకారం వదుల్చుకోవాలి.
కలవల గిరిజా రాణి.
హాస్య కథా రచయిత్రి