Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

అబ్బురపరిచే అత్యద్భుత సాంకేతికత ‘కల్కి 2898 ఏ.డీ’

[‘కల్కి 2898 ఏ.డీ’ సినిమాని సమీక్షిస్తున్నారు డా. రాయపెద్ది వివేకానంద్.]

ల్కి చిత్రం గూర్చి చాలా నకారత్మక దృక్పథంతో వెళ్ళాను వాస్తవానికి. ఫేస్‌బుక్‌లో నేను చదివిన రివ్యూలు, కామెంట్లు ఈ చిత్రం పట్ల ఒక రకమైన నిరాసక్తతని కలిగించాయి.

ఫేస్‌బుక్‌లో నేను ఇష్టపడే చాలామంది ఈ చిత్రం గూర్చి ఎందుకు నెగెటివ్‌గా వ్రాశారో నాకైతే అర్థం కాలేదు.

తెలుగులో ఇటువంటి చిత్రం ఇప్పటి దాకా రాలేదు. నాకైతే నచ్చింది.

3డీ ఎఫెక్టులు మనల్ని భలే థ్రిల్‌కి గురి చేస్తాయి.

ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా మాత్రమే కాదు, అస్సలు బాగుండదు అనుకుని మరీ వెళ్ళండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది.

మా అబ్బాయి శశాంక్ శేఖర్‌కి ఈ వ్యాసం ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.

“వాళ్ళూ వీళ్ళు ఏదో చెప్పారని మిస్ అవద్దు నాన్నా, పెద్ద తెరపై చూడాలి, త్రీడీలో చూడాలి. నీ అనుభూతి నీకు ముఖ్యం. నాకు చాలా నచ్చింది. నీకు అమ్మకి చూపాలి అని ఆ రోజే డిసైడ్ అయ్యాను. తప్పక చూడండి” అని బలవంత పెట్టి చూపాడు.

***

కృష్ణ  నిర్యాణానంతరం ఆరువేల ఏళ్ళకి కల్కి అవతారంలో శ్రీ మహా విష్ణువు తిరిగి భూమ్మీదకి వచ్చి ధర్మాన్ని పునరుద్ధరిస్తాడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీ కృష్ణుడి పాత్ర ద్వారా అశ్వత్థామతో ప్రారంభ సన్నివేశంలో చెప్పిస్తాడు. గర్భస్థ శిశువుగా ఉన్న కల్కిని క్షేమంగా ప్రసవం అయ్యే వరకు కలిపురుషుడి బారి నుంచి కాపాడవలసిన ధర్మం కూడా అశ్వత్థామ భుజ స్కందాల మీద పెడతాడు పరమాత్ముడు.

అది ప్రారంభం.

ఇక కథలోకి వస్తే,

కలిపురుషుడి ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండి ధర్మం అనే మాటే లేకుండా ప్రవర్తిస్తుంటారు మానవులు. గంగా నదిలో సైతం చుక్క నీరు లేకుండా ఎండిపోయి ఉంటుంది.

చుక్క నీళ్ళు కూడా ఉచితంగా ఎవ్వరూ ఇవ్వరు. డబ్బు, డబ్బు అని అల్లాడుతూ ఉంటారు. ఎక్కడ చూసినా హింస, కరువు కాటకాలు, అధర్మం కనిపిస్తూ ఉంటాయి.

ఈ దశలో కాంప్లెక్స్ అనే ఒక దేశంలో యాస్కిన్ అనే నిరంకుశుడైన ఒక వ్యక్తి తనను తాను సుప్రీంగా ప్రకటించుకుని, ఎక్కడ స్త్రీలు కనించినా, ఆడపిల్లలు కనిపించినా బంధించి ఉంచుతాడు. వాళ్ళలో యవ్వనవతులకి సాంకేతికత సాయంతో గర్భం వచ్చేలా చేసి, వాళ్ళ గర్భస్థ శిశువుల సీరం సేకరించి గర్భంతో ఉన్న ఆ తల్లిని, అగ్నిగుండంలో వేసి హతమారుస్తూ ఉంటాడు. కృష్ణుడి మేనమామ కంసుడి ప్రవర్తన గుర్తు వస్తుంది ఇక్కడ.

కొందరు శంబలా అనే ప్రాంతంలో ధర్మాన్ని పునరుద్ధరించటానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఈ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాలలో తిరుగుతూ అక్కడ మంచి సమాజం ఏర్పాటు చేయటానికి ప్రయత్నాలు చేస్తూ బలి అవుతూ ఉంటారు.

వీళ్ళు ఎప్పటికైనా ఒక మంచి రోజు వస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ‘రేపటి కోసం’ అనే నినాదం చేస్తూ వారు కల్కి రాకకై ఎదురు చూస్తూ ఉంటారు. ఈ శంబల రాజ్యానికి అధినేత మరియం. ఆవిడ బలంగా విశ్వసిస్తుంది కల్కి వస్తాడు అని.

ఇక కాంప్లెక్స్ లోకి వెళ్ళి స్థిరపడాలని కలలు కంటూ ఉండే యువకుడు భైరవ. ఇతను కాంప్లెక్స్‌కి కూతవేటు దూరంలో ఉండే కాశీ నగరంలో నివసిస్తూ ఉంటాడు.

కాంప్లెక్స్ లో బంధింపబడ్డ సుమతి అనే అమ్మాయి గర్భంతో ఉంటుంది. శంబలకి చెందిన గూఢచరులు ఈమెని కాంప్లెక్స్ నుంచి తప్పించి శంబలకి చేర్చే ప్రయత్నం చేస్తారు.

ఆ తరువాత ఏమైంది అనేది మీరు తెరపై చూడాల్సిందే.

***

అత్యద్భుత సాంకేతికత మనల్ని అబ్బురపరుస్తుంది. ఒక తెలుగు వాడిగా మీ గుండె ఉప్పొంగుతుంది.

ఈ సినిమా నచ్చలేదు అని చెపుతున్న వాళ్ళ కారణాలు మనకి తెలియదు.

మీరు నిరభ్యంతరంగా వెళ్ళి చూడొచ్చు.

కాకపోతే ఒక గమనిక. ఏదో మామూలు రొటీన్ చిత్రానికి వెళుతున్నాం అనే ఉద్దేశంతో కాక ఇదొక డిఫరెంట్ చిత్రం, నచ్చదేమో అని అనుకుని వెళ్ళండి. మైండ్‌సెట్ ప్రధానం ఈ చిత్రం చూడటానికి.

ఇలాంటి చిత్రం తెలుగులో తీయటానికి దర్శకుడికి ఎంతో గుండె ధైర్యం కావాలి, నిర్మాతలకి కూడా.

చిన్న చిన్న లోపాలు ఎక్కడైనా ఉంటాయి. సినిమా ఆద్యంతం కాస్త చీకటిగా ఉంటుంది.

ఈ సినిమా సింబాలిక్‌గా తీయబడింది.

కాంప్లెక్స్‌ని నేటి అమెరికా సమాజంతో సరిపోల్చుకోవచ్చు. కలి ప్రభావం ఇప్పటికే ఉంది అని మనకు అనిపింపజేయటంలో దర్శకుడు కృతకృత్యుడు అయ్యాడు.

భైరవ పాత్రతో వినోదం పంచాడు.

ఈ సినిమాలో కనిపించినంత మంది ప్రముఖులు ఇటీవల మనకి ఏ చిత్రంలో కనిపించి ఉండరు.

***

కర్ణుడిని పొగిడారు దర్శకుడు అని కొంతమంది విమర్శిస్తున్నారు. నాకనిపించిది చెబుతాను.

కృష్ణుడు అర్జునుడితో అంటాడు

“కర్ణుడు ముమ్మాటికి నీకన్నా గొప్ప వీరుడే. నీ రథాన్ని పవన పుత్రుడు జండాపై ఉండి కాపాడుతున్నాడు, త్రిజగాలకి అధిపతిని నేను నీ దగ్గర ఉండి కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నాను. ఈ లెక్కన చూసుకుంటే నీ రథం బరువు ముల్లోకాలకి సమానం. అలాంటి రథాన్ని కర్ణుడు ఒక బాణం దెబ్బకి రెండు అడుగులు వెనక్కి తోయగలిగాడు అంటే అర్థం చేసుకో, కర్ణుడు సామాన్యుడు కాదు. అతనికి సూర్యదేవుని అండ ఉంది”

ఈ డైలాగులో సనాతన ధర్మానికి వ్యతిరేక వ్యాఖ్య ఏముందో నాకు అర్థం కాలేదు.

“కర్ణుడు ఎంత బలవంతుడైనా, ఒకటో అరో దేవతల ఆశీస్సులు అతనికున్నా పరమాత్ముడి అండ లేనిదే అతని విద్యలు వ్యర్థం. అతనిచర్యలు ధర్మబద్ధంగా లేకుంటే అతన్ని ఏ శక్తి కాపాడలేదు. ధర్మో రక్షతి రక్షితః” అని అర్థం చేసుకోవచ్చు.

ఇంతకి మించి ఈ సినిమాలో హిందూ మతాన్ని కించపరిచే అంశం ఏదీ లేదు.

ఇక శంబలా నగరం గూర్చి. అక్కడ ప్రపంచంలోని అన్ని మతాలవారు ధర్మపరులు ఉన్నారు అని చూపటానికి క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, యూరోపియన్లు, ఆఫ్రికన్లు కూడా కనిపిస్తారు.

ఆమె మరియా ఏమిటి అని కొందరు విమర్శించారు. దర్శకుడి తార్కికతని మనం విస్మరించరాదు.

ఏది ఏమైనా వాళ్ళూ వీళ్ళు చెప్పారని చూడడం ఆపొద్దు.

Exit mobile version