Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కళ్ళల్లో వత్తులేసుకుని

[శ్రీ అక్షరం ప్రభాకర్ మానుకోట రచించిన ‘కళ్ళల్లో వత్తులేసుకుని’ అనే గేయం పాఠకులకు అందిస్తున్నాము.]


ఒక్క ఘడియ ఇంట్లో
ఇల్లాలు లేకుంటే
ఇల్లు ఇల్లంతా
విశాల శూన్యమై
దిగ్భ్రాంతిని
కలిగిస్తుంది
శుచి శుభ్రత
ఆదమరిచి
నిర్లక్ష్యంగా
నిదురోతున్నాయి
మమ్మల్ని వెంటనే ఆదుకోవాలని
పరిసరాలన్నీ
ధర్నా చేస్తున్నాయి
మానవత్వమా
నీ జాడ యాడనీ!?
ఒక్క ఘడియకే
ఓర్చుకోలేక
ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి

తెల్లవారకముందే
ఆమె పాదాలు
నా వదనమును తాకనందుకు
నేను
పొక్కిలై పోతున్నాననీ
వాకిలి
పొగిలి పొగిలి
ఒకటే
కుములుతుంది

అక్షయ పాత్ర లాంటి
వంట పాత్రలు
ముఖం మీద రుమాలు అడ్డం పెట్టుకుని రోదిస్తున్నాయి
ఆమె స్పర్శతాకనీ
రోజు అంధకార బంధమే
మా బతుకులనీ

పౌర్ణమి నాటి
పిండి వెన్నెల వంటి బియ్యప్పిండితో
వాకిలి నిండా ముగ్గేసేది
ఆ ముగ్గు ముత్యాల్లా మెరిసిపోయేది
ఆ ముత్యాల కోసం చీమ తల్లులు
ఎక్కడినుంచో పరిగెత్తుకుంటూ
పిల్లాజల్లతో వచ్చి పలహారాల
వరహాలను
పట్టుకెళ్లేవి
ఇప్పుడు
చుట్టుపక్కల ఎక్కడా
ఆమె
పలుకు వినపడలేదనీ,
పస్తులతో
కుస్తీ బడుతున్నాయి

మా విశ్వాస మిత్ర బృందం కళ్ళల్లో
వత్తులేసుకొని ఎదురుచూస్తున్నయి
ఏ దిక్కు నుండి వస్తుందోనని
వచ్చిపోయే
దారి వెంట
సెంట్రీ కాస్తున్నాయి

ఇంటి ముందు
చెట్టు మీద కొత్తగా వచ్చిన పిచ్చుకల జంట
ఆమె దివ్యదర్శనం
సూర్యోదయంతో పాటు జరగలేదని
దిగులుగా,
అలక పాన్పు
ఎక్కాయీ..!

ఇంట్లో పిల్లలతోపాటు అల్లుకున్న
ఆట బొమ్మలు సైతం
మూగబోయి గుండె పగిలి తల్లడిల్లుతున్నాయి

వాన వచ్చే ముందు అప్పుడప్పుడు
మెరిసే మెరుపుతీగ లాగా
‘అతిధి’ లా వచ్చే
ఆమె కోపం
భలే గమ్మత్తుగా
ఉంటుందని
అత్యవసర కమిటీలోని సభ్యులన్నీ
హుటాహుటినా సమావేశమై
గుర్తు చేసుకుంటున్నాయి

కరెంటు బల్బులోని
సగం రాలిపోయిన ఫిల్మెంటులా
ఉంటుందీ ఆ.. కోపం
అంటుండగా కొన్ని

కొన్ని కొన్ని
ఇష్టం లేని సంభాషణల
సందర్భాలలో..
ఆ.. మాటలకు అర్థాలే వేరూ
అవీ..
ఏ నిఘంటువులకు లొంగనివీ,
ఏ వ్యాకరణ సూత్రాలకు అందనివి
ఆ.. చమత్కార
చలోక్తుల విందులు,
అవి అర్ధమయ్యి,
అర్థం కానట్టే ఉండి ఎన్నటికీ,
వ్యర్థము కానే కాదు
ఆ దేవి
ఆలోచనామృతం
అంటూ కొన్ని
పొగడ్తల్లో ముంచేస్తున్నాయి

అసెంబ్లీలోనో పార్లమెంటులోనూ
అవకాశం రాని
సభ్యుల్లాగా!
అధ్యక్షా! అధ్యక్షా!
ఏమిటి ఈ వివక్ష!
అంటూ ఇంకా
ఏవేవో..
మనసు విప్పి
వినిపిస్తూనే ఉన్నాయి

దండెం
మీది
విధి లేక విసిరేసినట్లు
విడిచిన బట్టలు
అతీ గతీ లేని
అనాథల్లాగా
మమ్మల్ని అంటరానివాళ్లను
చేసి అవమానిస్తున్నారని
వెక్కెక్కి
ఏడుస్తున్నాయి

మేఘసందేశం అందుకున్నదేమో కాబోలు..
ఆ.. తల్లి
ఇంతలో
ఇల్లు చేరింది
మెల్లగా
అంతే
ఆనందంలో
యాహు
యురేకా
అంటూ
గంతులేస్తూ
కొండంత భరోస
వచ్చిందంటూ
ఆవేదన చెందినవన్నీ
ముచ్చటగా
మురిసిపోతున్నాయి

Exit mobile version