Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కళ్ళు తెరవాల్సిన వేళ

[శ్రీ ఆకెళ్ళ సూర్యనారాయణ మూర్తి గారు రచించిన ‘కళ్ళు తెరవాల్సిన వేళ’ అనే కవితని అందిస్తున్నాము. సంచిక నిర్వహించిన లవ్ జిహాద్ కవితలో పోటీలో బహుమతి పొందిన కవిత.]


~
ఒకటి: మొదలు
అది ఎప్పుడూ ‘ప్రేమ’ అనే మాటతోనే మొదలవుతుంది.
చూడగానే పుట్టే ప్రేమ కాదు,
చూసి, వెంటాడి, పథకం వేసి పుట్టించే ప్రేమ.
కాలేజీ గేటు బయట ఒక బైకు.
ఒక హెల్మెట్. ఒక చిరునవ్వు.
‘ఇంటి దగ్గర దింపుతా’ అనే సాయం.
సాయం కాస్తా స్నేహం అవుతుంది.
స్నేహం కాస్తా ప్రేమ అవుతుంది.
ప్రేమ కాస్తా ఒక ఒప్పందం అవుతుంది.
‘నన్ను నమ్ము’ అనే ఒక్క మాట మీద జరిగే ఒప్పందం.

రెండు: పద్ధతి
ఎందుకు ఆ ప్రేమకు ఒకే రకమైన ముఖం ఉంటుంది?
ఎందుకు ఆ ప్రేమకు ఒకే రకమైన లక్ష్యం ఉంటుంది?
ఆఫీసులో కొత్తగా చేరిన అమ్మాయి.
తనకి తోడుగా కాఫీ తాగే అబ్బాయి.
‘నీ బాధ నాకు అర్థమైంది’ అంటాడు.
‘నీ ఇంట్లో నిన్ను ఎవరూ అర్థం చేసుకోరు’ అంటాడు.
ఇంట్లో గొడవ. ఆఫీసులో ఓదార్పు.
క్రమంగా ఇల్లు శత్రువు అవుతుంది.
అతను దేవుడు అవుతాడు.
ఇది యాదృచ్ఛికం అనుకుంటున్నావా?
వందల కథల్లో ఒకే స్క్రిప్టు.
ఒకే డైలాగులు. ఒకే ముగింపు.
ఇది ప్రేమ కాదు. ఇది శిక్షణ.

మూడు: ఇంటి నిశ్శబ్దం
మన ఇళ్ళు పెద్దవి అయ్యాయి.
గదులు ఎక్కువయ్యాయి.
మనుషుల మధ్య దూరం పెరిగింది.
అమ్మ తన పనిలో, నాన్న తన ప్రవాహంలో.
పిల్ల ఫోన్‌లో.
ఎవరి ప్రపంచం వారిది.
ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక మెసేజ్.
‘గుడ్ మార్నింగ్’. ‘భోజనం చేశావా?’.
‘ఏం చేస్తున్నావ్?’.
ఇంట్లో అడగని ప్రశ్నలు, బయట వాడు అడుగుతాడు.
కడుపు నింపని ప్రేమను, మాటలతో నింపుతాడు.
ఆకలితో ఉన్న మనసు ఆ మాటలకు లొంగుతుంది.
తప్పు ఎవరిది? వాడిదా? మనదా?

నాలుగు: వల(పుల)లో విలవిల
బస్సులో పక్క సీటు.
రైల్లో ఎదురు బెర్తు.
షాపింగ్ మాల్‌లో తగిలిన చెయ్యి.
ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్.
ఇన్‌స్టాలో పడిన లైక్.
ఆన్‌లైన్ గేమ్‌లో తగిలిన టీమ్‌మేట్.
కోచింగ్ సెంటర్ మెట్ల మీద.
ఆసుపత్రి వరండాలో.
గుడి మెట్ల మీద.
ట్యూషన్ చెప్పే గదిలో.
ఇంటికి వచ్చే కొరియర్ బాయ్.
కరెంటు బిల్లు వసూలుకు వచ్చే వ్యక్తి.
ఆటో, కాబ్, నడిపే డ్రైవర్.
కూరగాయలు అమ్మేవాడు.
చోటు ముఖ్యం కాదు. చొరబడటం ముఖ్యం.
సందర్భం ముఖ్యం కాదు. స్నేహం నటించడం ముఖ్యం.
‘ఎక్కడ’ అని వెతకకు. ‘ఎలా’ అని గమనించు.
ఎందుకంటే వాడి కళ్ళు ఎప్పుడూ వెతుకుతూనే ఉంటాయి.
బలహీన క్షణం కోసం. ఒంటరి నిమిషం కోసం.
ఒక చిన్న తలుపు తెరిస్తే చాలు,
పూర్తి ఇంటిని ఆక్రమించేస్తాడు.
కాబట్టి ‘ఫలానా చోటుకి వెళ్ళవద్దు’ అని చెప్పడం కాదు.
‘ఫలానా మనిషిని గుర్తుపట్టు’ అని నేర్పాలి.
మాటల్లో విషాన్ని, నవ్వులో నటనను,
సాయంలో స్వార్థాన్ని పసిగట్టడం నేర్పాలి.
ఎందుకంటే వేదిక మారవచ్చు.
నాటకం మాత్రం ఒకటే.

ఐదు: అంతిమ దశ
పెళ్లి పేరుతో పేరు మార్పు. ఊరు మార్పు.
కొన్ని నెలలకు అసలు రూపం.
‘నా మతం గొప్పది, నీది కాదు’ అంటాడు.
‘నా వాళ్ళు మనుషులు, నీ వాళ్ళు కాదు’ అంటాడు.
కొట్టడం, తిట్టడం, అమ్మేయడం.
కొన్నిసార్లు సూట్‌కేసులో శవం.
పేపర్లో చిన్న వార్త.
‘పరువు హత్య’ అని ఒక ముద్ర.
‘ప్రేమ విఫలం’ అని మరో ముద్ర.
అసలు నిజం మాత్రం బయటకు రాదు.
పరువు కోసం ప్రాణం ఇస్తుంది.
ప్రాణం కోసం మతం మారుతుంది.
మతం మారాక మనిషిగా మిగలదు.
అది ఒక లెక్క. ఒక నంబరు. ఒక టార్గెట్.

ఆరు: ప్రశ్నలు
ఎందుకు ప్రేమ ఎప్పుడూ ఒకవైపు నుంచే వస్తుంది?
ఎందుకు ఆ ప్రేమ ఎప్పుడూ మతం మార్చమంటుంది?
ఎందుకు ఆ ప్రేమకు కుటుంబం శత్రువు అవుతుంది?
ఎందుకు ఆ ప్రేమ దేశం దాటిస్తుంది?
‘ప్రేమకు మతం లేదు’ అంటారు.
నిజమే. కానీ ‘మతం కోసం ప్రేమ’ ఎందుకు ఉంది?
ఈ ప్రశ్న వేసుకో.
నీ కూతుర్ని వేయమను.
నీ చెల్లిని వేయమను.

ఏడు: మేల్కొలుపు
ఇక కళ్ళు మూసుకుంటే కుదరదు.
‘మా పిల్ల కాదు’ అంటే సరిపోదు.
ఎందుకంటే పక్కింట్లో జరిగితే, రేపు మన ఇంట్లో జరుగుతుంది.
మాట్లాడండి. రోజూ మాట్లాడండి.
భయం కొద్దీ కాదు, ప్రేమ కొద్దీ మాట్లాడండి.
‘ఎవరితో మాట్లాడుతున్నావ్?’ అని కాదు,
‘ఏమైనా సమస్య ఉందా?’ అని అడగండి.
‘ఫోన్ ఇవ్వు’ అని లాక్కోకండి,
‘నమ్మకం ఇస్తా’ అని దగ్గరకు తీయండి.
పాఠశాలలో పాఠంతో పాటు,
ఇంట్లో ఈ పాఠం చెప్పండి.
‘ప్రశ్నించు’. ‘ఆలోచించు’. ‘తొందరపడకు’.
ఒక ఆడపిల్ల బతికితే, ఒక ఇల్లు బతుకుతుంది.
ఒక ఇల్లు బతికితే, ఒక వంశం నిలబడుతుంది.
ఒక వంశం నిలబడితే, ఒక ధర్మం నిలబడుతుంది.
ఈ పోరాటం తుపాకీతో కాదు.
ఈ పోరాటం మాటలతో! అవగాహనతో! ప్రేమతో!
ఇది నీ ఇంటి పోరాటం. నా ఇంటి పోరాటం.
మనందరి పోరాటం.
ఇకనైనా కళ్ళు తెరుద్దాం.
కళ్ళు తెరిపిద్దాం.

Exit mobile version